![YSRCP MP Mithun Reddy in Lok Sabha on Margadarshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/mithun%20reddy.jpg.webp?itok=S16fYHQY)
మార్గదర్శిపై లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణమైన మార్గదర్శి కుంభకోణంపై ఈడీ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. లోక్‌సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ సివిల్ కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబుతో మాట్లాడుకోవాలే తప్ప తమపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టు అని, ఆయన బీజేపీ కోసం పనిచేయడం లేదని చెప్పారు.
మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ప్రసంగానికి ఎంపీ మిథున్‌రెడ్డి అడ్డుపడ్డారు. సీఎం రమేష్ అస్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. అంతకుముందు సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీని 2019–2024 మధ్య మార్చారన్నారు. మద్యం ప్రైవేట్ షాపుల నుంచి ప్రభుత్వ షాపుల వైపు మళ్లిందని, ఐదేళ్లలో మొత్తం రూ.లక్షకోట్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు.
ఈ లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరిగాయని, ఒక్క డిజిటల్ చెల్లింపు లేదని ఆరోపించారు. అన్ని మద్యం షాపుల ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికనే ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం రూ.30 వేలకోట్ల మద్యం కుంభకోణం చేసిందని ఆరోపించారు. ఇది రూ.2,500 కోట్ల ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణమన్నారు.
ఈ ఆరోపణలను ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సీఎం రమేష్ వైఖరిపై మండిపడ్డారు. లోక్‌సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ప్రతీకారంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మిథున్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఆర్గానిక్ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహం
ఏపీలో 2021–22 నుంచి మూడేళ్లలో 21.56 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) కింద కేంద్రం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 2021–22లో 25,006 మెట్రిక్ టన్నులు, 2022–23లో 2,72,572 మెట్రిక్ టన్నులు, 2023–24లో 18,58,652 మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
ఏపీలోని 13,321 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి
కేంద్రం ప్రవేశపెట్టిన ‘స్వామిత్వ’ పథకంలో భాగంగా ఏపీలో 13,321 నోటిఫైడ్ జనావాస గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తిరుపతి జిల్లాలో 1045 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి లోక్‌సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానమిచ్చారు.
స్వామిత్వ పథకం అమలు కోసం 2020 డిసెంబర్ 8న ఉప్పదం కుదుర్చుకుందని, 2025 పిబ్రవరి 11నాటికి రాష్ట్రంలోని 26జిల్లాల్లో ఈ మొత్తం డ్రోన్ సర్వే నిర్వహించామని తెలిపారు. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యకలాపాలు, స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ (ఎస్పీఎంయూ) ఏర్పాటు కోసం రాష్ట్రానికి రూ.26.7 లక్షలు విడుదల చేశామన్నారు. ఆస్తి కార్డు ఫార్మాట్ రాష్ట్రం ద్వారా ఇంకా ఖరారు చేయని కారణంగా..వాటిని ఇంకా తయారు చేయలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment