![YSRCP MP Mithun Reddy on Margadarsi Chit Fund Case at Parliament](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/MITHUN-REDDY.jpg.webp?itok=HPJ4vPMn)
ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణంపై ఈడీ ఎందుకు విచారణ జరపట్లేదు?
మున్ముందు మార్గదర్శిపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం
లక్షలాది డిపాజిటర్లకు న్యాయం జరిగేలా చూస్తాం
లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కారణమైన మార్గదర్శిని ఎందుకు వదిలేశారు? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నారు. మార్గదర్శికి ఒక మీడియా సంస్థ ఉన్నందున విడిచిపెట్టాల్సిన అవసరమేంటన్నారు. సోమవారం లోక్‌సభలో 2025–26 కేంద్ర బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.2,600 కోట్లు డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన మార్గదర్శి, ఆర్‌బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ నిధులను దారి మళ్లించిందన్నారు.
ఈ రకంగా నిధులు సేకరించడం తప్పని ఆర్‌బీఐ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఆదాయ పన్ను విభాగం మార్గదర్శికి రూ.1000 కోట్ల జరిమానా విధించడంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. లక్షలాది మంది డిపాజిటర్లకు న్యాయం జరిగేలా రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మార్గదర్శి కుంభకోణంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం జరిగితే ఈడీ ఎందుకు విచారణ జరపట్లేదని ప్రశ్నించారు.
17 మెడికల్ కాలేజీల పనుల నిలిపివేశారు
వచ్చే ఐదేళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లను అందుబాటులోకి తెస్తామని బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. ఏపీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొందని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే తమకు కేటాయించిన మెడికల్ సీట్లను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మెడికల్ కమిషన్ కు లేఖ రాశారని లోక్‌సభ దృష్టికి తెచ్చారు. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించారని, అయితే ఇప్పుడు ఆ పనులన్నింటినీ ప్ర స్తుత ప్రభుత్వం ఆపేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చే శారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి జోక్యం చేసుకుని నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
⇒ మిథున్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ పురందేశ్వరి అడ్డుపడే ప్రయత్నం చేశారు.. పురందేశ్వరి భౌతికంగా బీజేపీలో ఉన్నా.. ఆమె మనస్సు మాత్రం టీడీపీలోనే ఉందని మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు. విపక్షాలు ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించని పురందేశ్వరి.. చంద్రబాబు గురించి మాట్లాడగానే స్పందిస్తున్నారని విమర్శించారు.
⇒ బడ్జెట్‌లో పోలవరం ఎత్తు తగ్గించమని ఎవరు అడిగారంటూ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. 41.15 మీటర్లకు ఎత్తు తగ్గించడం వల్ల పోలవరం సామర్థ్యం తగ్గిపోతుందని.. జాతీయ ప్రాజెక్టుకు రావాల్సిన రూ.60 వేల కోట్లలో కేవలం రూ.30 వేల కోట్లు ఇస్తే, మిగతా రూ.30 వేల కోట్ల పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు.
⇒ రైల్వేజోన్‌ను 10 ఏళ్ల తర్వాత ఇచ్చినా వాల్తేర్ డివిజన్‌ను రెండుగా విభజించి ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా మొత్తం వాల్తేర్ డివిజన్‌ను కొత్త రైల్వే జోన్‌లోకి కలపాలని డిమాండ్ చేశారు.
⇒ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోందని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment