
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి
ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదు
ఇప్పటికే పెట్టిన ఎన్నో కేసులు వీగిపోయాయి
మద్యం కేసు కూడా అక్రమ కేసేనని తేలుతుంది
లిక్కర్ కేసు చంద్రబాబు రాజకీయ కక్షలో భాగమే
ప్రతి రెండు నెలలకు ఒక స్కాం పేరిట ప్రభుత్వం మాపై నిందలేస్తోంది
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టీకరణ
చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతో పెడుతున్న తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత పెట్టిన ఎన్నో కేసుల్లో ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. అదే రీతిలో ప్రస్తుతం మద్యం విధానంపై పెట్టిన అక్రమ కేసులో ఆరోపణలు కూడా అవాస్తవమేనని త్వరలో నిర్ధారణ అవుతుంది’ అని ఆయన చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణ అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే.. ‘ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం పూర్తి విషయాలు మాట్లాడలేను. చంద్రబాబు ప్రభుత్వం మొదట మదనపల్లిలో ఏదో జరిగిందని రెండు నెలలు రాద్ధాంతం చేసింది. ఆ కేసులో అనుమానితుడిని తీసుకెళ్లి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసి విచారించారు. ఆరోపణలన్నీ కట్టు కథ అని తేలింది. తర్వాత గనుల శాఖలో అవకతవకలు, ఇసుకలో రూ.వేల కోట్లు అవినీతి అని అన్నారు. అది కూడా అవాస్తవ ఆరోపణలు, తప్పుడు కథనమేనని తేలింది. వందల గనులు అన్యాక్రాంతం అని మరో తప్పుడు ఆరోపణలు చేశారు. అవీ నిరూపించలేదు.
మా సొంత భూములను అటవీ భూముల ఆక్రమణ అని కొన్నాళ్లు రాద్ధాంతం చేశారు. దీనిపై మేం కోర్టుకు వెళ్లాం. అవన్నీ అటవీ భూములు కాదని అంతా సక్రమంగానే ఉందని మళ్లీ వాళ్లే కోర్టుకు నివేదిక ఇచ్చారు. తర్వాత భూముల ఆక్రమణ అని మరో తప్పుడు కేసు పెట్టారు. ఏదీ నిరూపించలేకపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అని ఆరోపణ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు రమ్మని సవాల్ విసిరాం. ఒక్కరూ రాలేదు. ప్రతి రెండు నెలలకు కూటమి ప్రభుత్వం ఏదో ఒక స్కాం అంటూ మాపై నిందలు వేస్తోంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే.
ఇప్పుడు లిక్కర్ స్కాం అని మరో ఆరోపణ చేస్తున్నారు. అన్నింటి మాదిరిగానే ఇదీ తప్పుడు కేసని నిర్ధారణ అవుతుంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే. డ్రగ్స్, మానవ అక్రమ రవాణా మినహా అన్ని కేసులను మా పార్టీ నాయకులపై పెట్టి వేధించాలని ప్రయత్నించారు. లిక్కర్ స్కాం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అన్ని వివరాలు చెప్పలేకపోతున్నాను. కోర్టు నిర్ణయం వచ్చిన తరువాత మీడియా ముఖంగా అన్ని వివరాలు చెబుతాను’’ అని పేర్కొన్నారు.