తప్పుడు సాక్ష్యాలు.. అసత్య ప్రచారాలు | Drama In The Name Of Searches At The Offices Of Lawyer And Businessman Narreddy Sunil Reddy, More Details Inside | Sakshi
Sakshi News home page

తప్పుడు సాక్ష్యాలు.. అసత్య ప్రచారాలు

Sep 13 2025 4:44 AM | Updated on Sep 14 2025 1:47 PM

సిట్‌ ద్వారా చంద్రబాబు కూటమి ప్రభుత్వ పన్నాగం

ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార కుతంత్రం 

న్యాయవాది, వ్యాపారవేత్త నర్రెడ్డి సునీల్‌రెడ్డి కార్యాలయాల్లో సోదాల పేరుతో హైడ్రామా 

ఆయన తరఫు న్యాయవాదులను నాలుగు గంటలపాటు అడ్డుకున్న సిట్‌ 

తమతోపాటు బ్యాగు తీసుకెళ్లిన సిట్‌ అధికారులు.. సోదాల సమయంలో ఓ ప్రైవేట్‌ వాహనం రాక 

ఆ వాహనంలోంచి కూడా బ్యాగ్‌లు, వస్తువులు కార్యాలయంలోకి చేరవేత! 

ఆ బ్యాగుల్లో సామగ్రి నుంచే తప్పుడు సాక్ష్యాలు సృష్టించే యత్నం.. 

ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే ఈ విఫలయత్నాలు 

సాక్షి, అమరావతి : మద్యం విధానంపై అక్రమ కేసులో కుట్రలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుతంత్రాలకు తెర తీస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు సరికొత్త పన్నాగానికి పదును పెడుతోంది. అందులో తాజా అంకంగానే హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త నర్రెడ్డి సునీల్‌ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాల పేరిట సిట్‌ హైడ్రామా నడిపింది. 

ముందస్తు పన్నాగంతోనే టీడీపీ అనుకూల ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఏకంగా సిట్‌ అధికారుల ద్వారానే తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు యత్నించడం విస్మయ పరిచింది. అయితే చంద్రబాబు ప్రభుత్వ ఈ తాజా కుట్ర కూడా బొల్తా కొట్టింది. కొండను తవి్వనంత హడావుడి చేసిన సిట్‌.. చివరికి అక్కడ ఎలుక కూడా లేదని తెలుసుకుని చేతులెత్తేసింది. వైఎస్‌ జగన్‌పై దు్రష్పచారం చేసేందుకు పన్నిన తాజా కుట్ర వివరాలు ఇలా ఉన్నాయి.   

ప్రైవేట్‌ వాహనం.. అందులో బ్యాగులు, సామగ్రి.. 
మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, వ్యాపార వేత్త నర్రెడ్డి సునీల్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు తెగబడింది. హైదరాబాద్, విశాఖపట్నంలోని ఆయన కార్యాలయాల్లో సిట్‌ అధికారులు సోదాల పేరుతో రాద్ధాంతం చేశారు. సోదాలు నిర్వహించేందుకు ఉన్న నిర్దేశిత ప్రమాణాలను ఉల్లంఘిస్తూ వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారు. సోదాల ముసుగులో తప్పుడు సాక్ష్యాలను సృష్టించేందుకు పక్కా పన్నాగంతో వ్యవహరించారు. 

హైదరాబాద్‌లోని న్యాయవాది సునీల్‌ రెడ్డి కార్యాలయంలో తనిఖీల సమాచారం తెలుసుకుని ఆయన తరఫు న్యాయవాదులు అక్కడికి చేరుకున్నారు. కానీ వారిని సిట్‌ అధికారులు లోపలికి అనుమతించ లేదు. దాదాపు 4 గంటలపాటు వారు కార్యాలయంలోకి వెళ్లకుండా సిట్‌ అధికారులు అడ్డుకోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించేటప్పుడు న్యాయవాదులను అనుమతించాలి. అందుకు భిన్నంగా సిట్‌ అధికారులు వ్యవహరించడం వెనుక తప్పుడు సాక్ష్యాలను సృష్టించే కుతంత్రం ఉన్నట్లు స్పష్టమైంది. 

కార్యాలయంలోకి వెళ్లేటపుడే సిట్‌ అధికారులు తమతో పాటు ఓ బ్యాగును లోనికి తీసుకువెళ్లారు.  సోదాలు జరుగుతున్న సమయంలో ఓ ప్రైవేట్‌ వాహనం అక్కడికి చేరుకుంది. ఆ వాహనంలో కొన్ని బ్యాగ్‌లు, ఇతర వస్తువులు ఉండటాన్ని చూసి సునీల్‌రెడ్డి తరఫు న్యాయవాదులు గేటువద్ద అడ్డుకున్నారు. ఆ వాహనాన్ని ఎందుకు లోపలకు తీసుకువెళ్తున్నారని నిలదీసినా.. సిట్‌ అధికారులు సరైన సమాధానం చెప్పలేదు. 

ముందు ఒక బ్యాగ్‌ను తమతోపాటు లోనికి తీసుకువెళ్లిన అధికారులు ఆ తర్వాత ఈ వాహనంలోని మరికొన్ని బ్యాగ్‌లను, ఇతర వస్తువులను, ఎలక్ట్రానిక్‌ పరికరాలను లోపలికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. వీటిని సోదాల సమయంలో సునీల్‌రెడ్డి కార్యాలయంలో గుర్తించినట్లుగా కట్టు కథ వినిపించాలన్నది సిట్‌ అధికారుల ఉద్దేశం. ఆ వాహనంలోనే సిట్‌కు సంబంధం లేని ఓ ప్రైవేట్‌ వ్యక్తి ఉండటం గమనార్హం. ఇవన్నీ చూస్తుంటే ఈ అక్రమ కేసులో సిట్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో దు్రష్పచారానికి పాల్పడుతున్నారన్నది స్పష్టంగా వెల్లడవుతోంది.   

సన్నిహితులంటే ఎలా ఉంటారంటే... 
» న్యాయవాది, వ్యాపారవేత్త సునీల్‌ రెడ్డి నివాసంలో సోదాల పేరుతో హైడ్రామా సాగించిన సిట్‌ అధికారికంగా మాత్రం ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కానీ తమకు అలవాటైన రీతిలో టీడీపీ అనుకూల ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చింది. ఆ వెంటనే అవాస్తవాలు, అభూత కల్పనలతో ఎల్లో మీడియా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా అసత్య కథనాలు ప్రచురించింది. 

»  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఓ సాధారణ పరిచయస్తుడైన న్యాయవాది, వ్యాపారవేత్త సునీల్‌రెడ్డిని పట్టుకుని ఆయనకు అత్యంత సన్నిహితుడని.. మద్యం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని అవాస్తవ కథనాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు దు్రష్పచారానికి తెగబడింది. అసలు అత్యంత సన్నిహితుడని ఎవర్ని అంటారో ఈనాడుకుగానీ, ఇతర టీడీపీ ఎల్లో మీడియాకు గానీ తెలుసా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  

»  అత్యంత సన్నిహితులు అంటే ఎలా ఉంటారు అంటే.. చంద్రబాబు–ఈనాడు ఎండీ కిరణ్, ఆంధ్రజ్యోతి–ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ 5 చానల్‌ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఉన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే వారు చంద్రబాబును తరచూ కలుస్తూ ఉంటారు. టీడీపీ అక్రమాలకు వత్తాసు పలుకుతారు.. చంద్రబాబు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. చంద్రబాబుకు చిన్న సమస్య రాగానే జాకీలెత్తి మోస్తుంటారు. జీవితకాలం మా బాబుగారే సీఎంగా ఉండాలంటూ భజన చేస్తుంటారు.. బాబుగారు క్వాంటం కంప్యూటింగ్‌ అన్నా, ఏఐ అన్నా, బుల్లెట్‌ రైలు అన్నా ఆహా ఓహో అని కీర్తిస్తుంటారు.. 

»  న్యాయవాది అయిన సునీల్‌ రెడ్డి వ్యాపారవేత్తగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గత పదేళ్లలో ఆయన ఆంధ్రప్రదేశ్‌కు నాలుగైదుసార్లు కూడా రాలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కూడా ఆయన ఏనాడూ రాజధానివైపు రానే లేదు. వైఎస్‌ జగన్‌ను కలిసిందీ కూడా లేదు. మరి సునీల్‌ రెడ్డి వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడని టీడీపీ అనుకూల ఎల్లో మీడియా ఎలా సూత్రీకరిస్తుందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  

»   టీడీపీ కూటమి ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు సిట్‌ ద్వారా డైవర్షన్‌ పాలిటిక్స్‌ సాగిస్తున్నారని, అందుకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతూ బురద చల్లుతోందన్నది స్పష్టమవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement