తాము ఏ సుద్దులు చెప్పిన... ఏ నీతులు చెప్పిన అవి ఎదుటి వారికే కాని తమకు కాదని ఈనాడు మీడియా గట్టిగా విశ్వసిస్తోంది. అందుకే ఈనాడు వారు తమకు ఇష్టం లేని వారిపై, లేదా తమ రాజకీయ ,వ్యాపార ప్రయోజనాలకు అడ్డం అవుతారని అనుకున్న వారిపై నానా బురద వేస్తుంటారు .పచ్చి అబద్దాలు రాయడానికి కూడా వెనుకాడడం లేదు .తెలుగుదేశం పార్టీకి , సీఎం చంద్రబాబుకు ,తమకు కొమ్ము కాసేవారికి మాత్రం రక్షణగా నిలబడుతుంది.
గత ఐదేళ్లుగా వైఎస్ జగన్ పాలనపై ఎంత విషం చిమ్మిందో చూశాం. అప్పుడే కాదు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం కోల్పోయినా, ఇప్పటికి వారిపైనే చెడరాస్తోంది. పాపాల పుట్టలు అని... అవి అని, ఇవి అని ఇష్టరీతిలో హెడ్గింగ్‌లు పెడుతుంది .అదే తమకు సంబందించిన అక్రమాల గురించి మాత్రం నోరు విప్పితే ఒట్టు.మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సంబందించి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం, అందులో రామోజి సంస్థ అక్రమాలకు పాల్పడిందని , అర్హత లేకపోయినా డిపాజిట్ లు వసూలు చేసిందని ...శిక్షార్హ నేరమని స్పష్టంగా చెప్పినా కనీసం స్పందించ లేకపోయింది.వేలకోట్లకు సంబందించిన దందా అనండి ...స్కామ్ అనండి.. దానిపై నేరుగా వివరణ ఇచ్చే పరిస్థితి కూడా మార్గదర్శి ఫైనాన్శయర్స్ కాని...ఈనాడు మీడియాకు కాని ఉన్నట్లు లేదు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టుదలతో సాగించిన పోరాటంతో ఈ మాత్రం అయినా కదలిక వచ్చింది .లేకుంటే ఈ దేశంలో మీడియాను అడ్డంపెట్టుకుని ... ఎన్ని అరాచకాలకైనా పాల్పడవచ్చని, తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసి...తద్వారా ఎన్ని కైన ప్రభుత్వాల ద్వారా తమ అర్ధిక ప్రయోజనాలకు కాపాడుకోవచ్చని ఏవరైన భావించే పరిస్థితి ఏర్పడింది
.తాజాగా ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించినప్పుడు జరిగిన పరిణామం చూస్తే మార్గదర్శి అనండి...దివంగత రామోజి రావు అనండి లేదా ప్రస్తుత యాజమాన్యం అనండి.. వారికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ఎంత పట్టు ఉన్నది అర్ధం అవుతుంది .
ఏపిలోని చంద్రబాబు ప్రభుత్వం...తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కేసులో జవాబు ఇవ్వడానికే సిద్దం పడకపోవడం విశేషం. చంద్రబాబు అంటే ఏటూ టిడిపి కనుక అయన తోటి ఈనాడుకు ఉన్న సంబంధాల రీత్య అర్ధం చేసుకోవచ్చు. రామోజీ కాంగ్రెస్‌కు అనుకూలం కాదని తెలిసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎలాంటి సమాదానం ఇవ్వకపోవడం గమనించదగ్గ అంశం.బహుశా గురుశిష్యులు ఇద్దరు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవ్వడం మార్గదర్శి సంస్థకు కలిసి వస్తోందని అనుకోవాలి. ఈ రెండు రాష్ట్రాల న్యాయవాదులు మార్గదర్శి కేసు విచారణకు హజరు అయినా పూర్తిగా మాౌనం పాటించారట. దానిని మార్గదర్శి న్యాయవాది లుద్రా అనుకూలంగా మలచుకుని కేసును అలస్యం చేసేందుకు ప్రయత్నాలు ఆరంబించారని మీడియా కధనం. మొత్తం విషయం పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది .రెండు వేల ఆరువందల కోట్ల మేర అక్రమంగా డిపాజిట్‌లు వసూలు చేశారన్నది అభియోగం.
అప్పటి ఎంపీ ఉండవెల్లి చేసిన ఫిర్యాదు వ్యవహరంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుని చివరకు ఈ దశకు చేరింది .మద్యలో ఏదో కారణం చూపి రామోజి ఈ కేసును ఉమ్మడి ఏపి హైకోర్టు విభజనకు ముందు రోజు కోట్టివేయించుకోగలిగారు .ఆ తర్వాత ఎప్పటికో ఈ విషయం తెలిసి ఉండవల్లి సుప్రీం కోర్టుకు వెళ్లి తన పోరాటం కోనసాగించారు . అసలు ఏప్పడో చర్య తీసుకోవాల్సిన ఆర్బిఐ ఇనాళ్లు మౌనంగా ఉండడం కూడా అశ్చర్యం కలిగిస్తోంది .తుదకు కోర్టు ఆదేశాలతో ఒక నివేదికను తయారు చేసి సమర్పించింది.అందులో మార్గదర్శి అక్రమంగానే డిపాజిట్లు వసూలు చేసిందని తేల్చింది .ఆర్బీఐ చట్టం లో సెక్షన్ 45 ఎస్ ను మార్గదర్శి ఉల్లంఘించిందని బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని తెలిపింది .
ఈ కేసులో నేరాభియోగం రుజువు అయితే జైలు శిక్షతో పాటు డిపాజిట్ లుగా వసూలు చేసినదానికి రెండింతులు పెనాల్టి చెల్లించాల్సి ఉంటుంది .దీనితో మార్గదర్శికి, ఈనాడు వారికి మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది .ఒక్క సాక్షి తప్ప మిగిలిన మీడియా ఇంత పెద్ద వార్తను ప్రముఖంగా ఇవ్వకపోవడం కూడా వారి పలుకుబడిని తెలియచేస్తుంది .రామోజి రావు 2008 లో సమర్పించిన అఫడివిట్ ప్రకారం 2610 కోట్లు సేకరించారు .అందులో 1864 కోట్లు తిరిగి చెల్లించామని తెలిపారు .మరి మిగిలిన సుమారు 750 కోట్ల డిపాజిట్‌లు ఏం అయ్యాయి?అవి ఎవరివి అన్న అంశాలను మాత్రం గుట్టుగా ఉంచారు .అంతేకాదు 1864 కోట్లు ఎవరేవరికి చెల్లించారో జాబితా ఇవ్వడానికి రామోజి కుటుంబం సమ్మతించడం లేదని సమాచారం మీడియాలో వచ్చింది.
ఆ వివరాలు వెల్లడిస్తే కొందరు పెద్దలు ...అందులో ముఖ్యంగా టిడిపి వారికి చెందిన నల్లధనం బట్టబయలు అవుతుందని ..బినామి పేరుతో తాము పెట్టిన దందా వెల్లడి అవుతుందని రామోజీ కుటుంబం అందోళన చెందుతున్నట్టు సాక్షి పత్రిక నేరుగా అరోపించింది .ఈనాడు వారు కాని ...మార్గదర్శి వారు కాని ,రామోజి రావు కుమారుడు కిరణ్ , కోడలు శైలజ కాని ఏ మాత్రం విలువలు పాటించేవారైనా, ఖచ్చితంగా వీటికి సమాదానం చెప్పగలగాలి. అలా చెప్పడం లేదంటే దాని అర్దం వారు తప్పు చెసినట్టు అంగీకరించడమే .ఊరందరికి నీతులు చెప్పే ఈనాడు మీడియా ఈ విషయంలో ఉన్న గుట్టుముట్లను ఎందుకు విప్పడం లేదు అంటే ...దీని ఱర్ధం ఈ విషయాలు వెలుగులోకి వస్తే తమ పాపాల పుట్ట బయటపడుతుందా అన్న భయమా అనే సందేహం వస్తే తప్పు ఏముంది.
దేశంలో ఉన్నవారందరని పారదర్శకంగా ఉండాలని నీతులు రాస్తూ ...కథలు చెబుతూ ఉండే ఈనాడు, మార్గదర్శిల యాజమాన్యం ఇప్పటికైనా ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేసినట్టుగా డిపాజిట్ లు ఏవరేవరికి చెల్లించారో వెల్లడించాలి.అలాగే ఎవరికి చెల్లించని 750 కోట్ల డిపాజిట్ ల రహస్యం ఏంటో తెలపాలి.అదంతా నల్లధనం కాదని ,తాము పద్దతిగా వ్యాపారం చేస్తున్నామని చెప్పగలగాలి.అలాగే చంద్రబాబు,రేవంత్ ప్రభుత్వాలు కూడా ఈ డిపాజిట్ లకు సంబందించి వాస్తవాలను తమ అఫడవిట్ ల ద్వారా తెలియచేయాలి.లేకుంటే ఈ రెండు ప్రభుత్వాలకు ఈనాడు మీడియాకు మద్య క్విడ్ ప్రో కో సాగుంతుందని జనం అభిప్రాయపడతారు . అరుణకుమార్ చేసిన విజ్ఞప్తికి రెండు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా?అన్నది డౌటే.ఒకవేళ స్పందించినా, అది మార్గదర్శికి, ఈనాడు వారికి అనుకూలంగానే ఉండవచ్చు.
నిజానికి ఉండవల్లి తన వాదనలో చెప్పినట్టు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యకు దిగితే మొత్తం లోగుట్టులు అన్ని బహిర్గతం అవుతాయి. కాని ఇప్పుడు ఉన్న వాతావరణం గమనిస్తే అది అంత తేలిక కాకపోవచ్చు. పద్దేనిమిది ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహరంలో ఎంతకాలం వీలైతే , అంత కాలం ఈ కేసును సాగదీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కేసుల వల్లే మన వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఏర్పడుతుంది .ప్రజల్లో విశ్వాసం నెలకోనాలంటే కనీసం న్యాయవ్యవస్థ అయినా ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది .అది జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment