
ఇది ఊహించని పరిణామమే!. ఎంతటి బలాఢ్యుడైనా ఏదో ఒక రోజు తన తప్పునకు మూల్యం చెల్లించాల్సిందే. డిపాజిట్ల వ్యవహారంలో మార్గదర్శి సంస్థ ఇంతకాలం ఎంతగా బుకాయించినా చివరకు వాస్తవాన్ని పరోక్షంగానైనా అంగీకరించక తప్పలేదు. తెలుగుదేశం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలను మేనేజ్ చేసినా.. మార్గదర్శి అక్రమాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అండగా నిలిచినా చివరికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వాదనే సరైందని తేలింది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమంగా రూ.2610 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ధారించింది. దీనితో ఇంతకాలం ఆ సంస్థ అసలు తప్పు చేయలేదని, తప్పు చేయదని, ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత రామోజీరావుపైనే నిందలు మోపుతారా అని గుండెలు బాదుకుంటూ మాట్లాడిన వారికి జవాబు వచ్చినట్లయింది. కొద్ది రోజుల క్రితం లోక్ సభలో మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసుపై చర్య తీసుకోవాలని YSRCP ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. దానికి ప్రతిగా టీడీపీ ఎంపీలు మార్గదర్శి అధికార ప్రతినిధుల్లా ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను వెనకేసుకొచ్చారు. అంతేకాదు.. సేకరించిన డిపాజిట్లను దాదాపు అందరికి తిరిగి చెల్లించిందని వాదించారు. మిథున్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారానికి ఈనాడు మీడియా ‘‘వార్త రాస్తే విషం చిమ్ముతారా’’ అంటూ టీడీపీ ఎంపీలు ధ్వజమెత్తారని ప్రముఖంగా ప్రచురించారు.
నిజానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఆరోపణలు వస్తే ఈనాడు మీడియాను అడ్డం పెట్టుకుని దబాయించడమే తప్పు. పైగా.. ఈనాడేమో.. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులపై ఇష్టారీతిన అసత్యాలతో కథనాలు వండివార్చవచ్చు. ఈనాడు గ్రూపులోని సంస్థ అవకతవకలకు పాల్పడిందని కూడా ఎవరూ విమర్శించకూడదన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. మార్గదర్శి డిపాజిట్ల అక్రమ సేకరణపై ఇంతకాలం మీడియా బలంతో బుకాయించినప్పటికీ ఆర్‌బీఐ నివేదిక వచ్చాక టీడీపీ ఎంపీలు ఎందుకు సమాధానం ఇవ్వలేదో ఇప్పుడు చెప్పాలి.
మార్గదర్శి చిట్స్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, డిపాజిట్ల సేకరణను రసీదుల రూపంలో కొనసాగించారని, చిట్స్‌లో వందల కోట్ల రూపాయల నల్లధనం ఉందని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ సాక్ష్యాధారాలతో సహా కేసు పెడితే, కూటమి ప్రభుత్వం రాగానే వాటన్నిటిని నీరుకార్చడం ఆరంభించింది. అందులో భాగంగా జప్తు అయిన వేయి కోట్ల మొత్తాన్ని కూడా విడుదల చేశారు. ఇదంతా చూస్తే.. పరస్పర రాజకీయ,వ్యాపార ప్రయోజనాల కోసం టీడీపీ ఈనాడు మీడియాను వాడుకున్నారని పలుమార్లు స్పష్టం అయింది.
ఆర్‌బీఐ తాజాగా తెలంగాణ హైకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని స్పష్టం చేయడంతోపాటు ఈ సంస్థపై తమకు పలువురు ఫిర్యాదు చేశారని కూడా తెలిపింది. రామోజీరావు మరణించినప్పటికీ, ఆ కేసు మూతపడదని, విచారణ కొనసాగించాలన్నదే నిబంధన అని వివరించింది. మరి ఈనాడు మీడియా ఎందుకు దీన్ని ప్రజలకు తెలియజేయడం లేదు. ఆర్‌బీఐ కూడా తమపై విషం చిమ్ముతోందని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎందుకు చెప్పించలేకపోతోంది?. ఆర్‌బీఐకి ఈనాడు మీడియాకు ఏ శత్రుత్వం ఉందని ఆ నివేదిక ఇచ్చింది?.
నిజానికి అఫిడవిట్ ఫైల్ చేయడం వీలైనంత ఆలస్యం చేసేందుకు ఈనాడు మీడియా తనకు ఉన్న పరపతిని వాడి ఉండవచ్చు. తెలంగాణ హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చిన తరువాతే ఆర్‌బీఐ కూడా చట్టంలోని సెక్షన్ 45(ఎస్) గురించి వివరించాల్సి వచ్చింది. దాని ప్రకారం మార్గదర్శి చట్ట విరుద్ద చర్యలకు పాల్పడిందని తేలుతోంది. నేరం నిర్ధారణ అయితే సేకరించిన డిపాజిట్ల మొత్తానికి రెట్టింపు జరిమానా చెల్లించాలి. దీంతో మార్గదర్శి కొత్త వాదన తీసుకువచ్చింది. రామోజీరావు నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా అని అంటోంది. ఈ వాదన రామోజీ నేరం చేసినట్లు పరోక్షంగా అంగీకరించడమే అని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.
రామోజీ తర్వాత హెచ్ యుఫ్ (అవిభాజ్య హిందూ కుటుంబ కర్త)గా ఆయన కుమారుడు కిరణ్ నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన బాధ్యత వహించాలా? లేదా? సంస్థ తరపున జరిమానా చెల్లించవలసిన బాధ్యత ఆయనపై ఉంటుందా? లేదా?అనేది చర్చనీయాంశం అయింది. ఇక్కడ ఇంకో సంగతి గుర్తు చేయాలి.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన కుమారుడిపై కాంగ్రెస్, టీడీపీలు కలిసి అక్రమ కేసులు పెట్టాయి. వైఎస్సార్ చనిపోయిన తరువాత ఆయన పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. అప్పట్లో ఈనాడు మీడియా ఇది కరెక్టేనని ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం భిన్నంగా వాదిస్తోంది. రామోజీ లేరు కనుక, ఆయన కర్తగా ఉన్న సంస్థ ఆక్రమ డిపాజిట్లతో కొడుకుకు సంబంధం లేదంటోంది. కాని ఆ డిపాజిట్ల ద్వారా సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాన్ని మాత్రం అనుభవించవచ్చట.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది ఒక సంస్థ అని, దాని కర్త మరణించినా, చట్టపరంగా సంస్థ బాధ్యత పోదని, వారసులు సైతం తీసుకోవల్సిందేనని చట్టం చెబుతోంది. రామోజీ ఆస్తులకు కిరణ్, ఇతర కుటుంబ సభ్యులు వారసులైనప్పుడు ఆయన చేసిన ఆర్థిక అక్రమాలకు వీరికి బాధ్యత ఉండదా? రామోజీరావు మరణించినందున ఈ కేసు విచారణ కొనసాగించాలా? లేదా? అనేది ఆలోచించాలని ఏపీ ప్రభుత్వం తరపున వేసిన అఫిడవిట్‌లో కోరారు. దానిని అంగీకరిస్తే ఈ కేసు నుంచి బయటపడవచ్చని ప్లాన్ చేశారు. కానీ..
ఆర్బీఐ ఇచ్చిన అఫిడవిట్ తో మార్గదర్శి సంస్థ పరిస్థితి కుడితిలో పడ్డయినట్లయిందని అంటున్నారు. అంతకుముందు అసలు డిపాజిట్ల వసూలులో తప్పు చేయలేదని కొంతకాలం, డిపాజిట్లు తీసుకున్నా తిరిగి చెల్లించేశామని మరికొంతకాలం చెప్పింది ఈనాడు. ఉండవల్లికి తెలియకుండానే ఉమ్మడి ఏపీ హైకోర్టులో కేసు కొట్టివేయించుకున్నారు. కానీ ఆరు నెలల తర్వాత ఆయనకు తెలిసి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ కేసు ఈ దశకు చేరింది.
జగన్ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయిందన్న కోపంతో ఈనాడు మీడియా పచ్చి అబద్ధాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేసింది. ఉండవల్లికి డిపాజిట్ దారుల వివరాలు ఇవ్వకుండా అడ్డుపడడానికి పెద్ద, పెద్ద లాయర్లను నియోగించింది. మొత్తం మీద 18 సంవత్సరాల తర్వాత ఈ కేసు ఒక రూపానికి వచ్చినట్లనిపిస్తుంది. ఆర్థికంగా ,రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంత శక్తిమంతుడైనా న్యాయ వ్యవస్థ కొంత గట్టిగా ఉంటే చట్టానికి ఎవరూ అతీతులుగా ఉండలేరని ఈ ఉదంతం రుజువు చేసింది.
గతంలో సహారా డిపాజిట్ల కేసులో ఆ సంస్థ యజమానిని సుప్రీంకోర్టు జైలులో పెట్టింది. రామోజీరావు ఆ గండం నుంచి తప్పించుకున్నా.. ఆయన మరణం తర్వాత అయినా సత్యం బయటపడిందని అనుకోవాలి. అయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు, ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ అండతో ఈ కేసు ముందుకు సాగకుండా చేసే ప్రయత్నాలు జరగవచ్చన్న అభిప్రాయం లేకపోలేదు.
కాగా ఉండవల్లికి డిపాజిటర్ల వివరాలు ఇవ్వక తప్పలేదు. వాటిని పరిశీలించిన తర్వాత మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావొచ్చు. రామోజీకి అసలు డిపాజిట్లు ఎలా వచ్చాయి? అందరి వివరాలు ఉన్నాయా? అందరికి తిరిగి చెల్లించారా? లేదా? ఆ మొత్తాలకు వడ్డీని కూడా చెల్లించారా? లేదా? ఇలాంటి విషయాలు అన్ని తేలితే అప్పుడు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేం. రామోజీరావు గతంలో ఒక మాట అనేవారు. ‘‘వయలేట్ ద లా లాఫుల్లీ’’ అని. చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని చట్టాన్ని ఉల్లంఘించవచ్చన్నది ఆయన ఫిలాసఫి. అంతే తప్ప చట్టాన్ని అతిక్రమించకూడదన్న సిద్దాంతం కాదన్నమాట. ఆ క్రమంలో ఇలా ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోయే అవకాశం ఉందని ఈ అనుభవం చెబుతోంది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment