మార్గదర్శి కేసులో ఆర్‌బీఐ తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి
వీలైనంత త్వరగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది
కౌంటర్లు వేయడానికి ప్రతీసారి వాయిదాలు కోరడం సమంజసం కాదు
రెండు వారాలు గడువు ఇవ్వలేం.. వారంలో అదనపు అఫిడవిట్ వేయండి
ఆర్‌బీఐని ఆదేశించిన ద్విసభ్య ధర్మాసనం.. విచారణ 14కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్సియర్స్ భారీ ఆర్థిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయడంలో కాలయాపన సరికాదని తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అందరి వాదనలు విని వీలైనంత త్వరగా తీర్పు వెల్లడించాలని సుప్రీంకోర్టు(Supreme Court) సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. అదనపు కౌంటర్ అఫిడవిట్(Counter Affidavit) దాఖలుకు రెండు వారాలు గడువు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కోరడం సరికాదంది. అంత సమయం ఇవ్వలేమని, వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇకపై ప్రతి శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తను పేరును కాజ్ లిస్టులో చేర్చాలని అక్టోబర్‌లో రిజిస్ట్రీని ఆదేశించినా అది అమలు కావడం లేదని కోర్టు సహాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్(Undavalli Arunkumar) ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో మరోసారి ధర్మాసనం రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ
చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఆ తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఆర్‌బీఐ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వర్చువల్‌గా.. ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్‌రావు నేరుగా విచారణకు హాజరయ్యారు. కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు కావాలని ఆర్‌బీఐ కోరిందని ఎల్.రవిచందర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అంత గడువు ఇవ్వలేమని, వారంలో దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ 14కు వాయిదా వేసింది.
విచారణ 18 సార్లు వాయిదా
సుప్రీంకోర్టు ఆదేశాలతో గత జూన్ 25న తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. తొలుత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వీలైనంత త్వరగా వాదనలు వినిపించాలని, వాయిదాలు కోరవద్దని పలుమార్లు ధర్మాసనం న్యాయవాదులకు సూచించింది. అయినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయడంతో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి.
ఎట్టకేలకు గత నెలలో కౌంటర్లు దాఖలు చేశాయి. ఇదే క్రమంలో తీరా వాదనలు ప్రారంభమయ్యే సమయంలో రామోజీరావు మరణించినందున కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి అఫిడవిట్ వేసింది. దీనిపై కూడా వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ సుజోయ్‌పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల్లో ఉండటంతో విచారణ జస్టిస్ శ్యామ్‌కోషి ధర్మాసనానికి బదిలీ అయ్యింది.
జనవరి 31న కేసు లిస్టయినా.. విచారణ నుంచి జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు తప్పుకుంటున్నారు. శుక్రవారం జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఆర్‌బీఐ అదనపు కౌంటర్ దాఖలుకు సమయం కోరడంతో వాయిదా పడింది. ఇలా దాదాపు ఏడున్నర నెలల్లో ఇప్పటి వరకు 18 సార్లు విచారణ వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment