
కౌంటర్‌లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కర్త రామోజీ మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు
మార్గదర్శి, రామోజీ వాదనలన్నీ శుద్ధ అబద్ధాలే..
చట్టవిరుద్ధ డిపాజిట్ల స్వీకరణపై ఫిర్యాదు అందలేదన్నది అవాస్తవం
మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై మాకు ప్రజలు, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయి
డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమని చెబుతూనే వచ్చాం
సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుందని కూడా చెప్పాం..
డిపాజిట్ల స్వీకరణకు మేం సర్టిఫికెట్ ఇచ్చామనడం అబద్ధం
డిపాజిట్ల వసూలుకు మేం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు
మార్గదర్శి, రామోజీరావుల డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమే
ఇది సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం శిక్షార్హం..
మార్గదర్శి అనుబంధ పిటిషన్‌ను కొట్టేయండి
సాక్షి, అమరావతి: మార్గదర్శి(Margadarshi) ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు(Ramoji Rao)ల చట్ట ఉల్లంఘనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) (ఆర్‌బీఐ) పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ముందుంచింది. తాము వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో ఏ ఒక్క డిపాజిటర్ కూడా తమపై ఫిర్యాదు చేయలేదంటూ ఇన్నేళ్లుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావు చెబుతూ వచ్చిన దాంట్లో వాస్తవం లేదని ఆర్‌బీఐ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది.
డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న మార్గదర్శి, రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో... చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించిన నేపథ్యంలో, తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన వాదనను ఆర్‌బీఐ నిర్ధ్వందంగా తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్‌బీఐ చట్టం సెక్షన్ 45ఎస్‌కి విరుద్ధమని పునరుద్ఘాటించింది.
అంతేకాక ఇలా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం ఆర్‌బీఐ చట్టం సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. కాబట్టి రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. పలు చట్టాల కింద హెచ్‌యూఎఫ్‌ను ప్రత్యేక న్యాయపరమైన సంస్థగా, చట్టపరమైన వ్యక్తిగా గుర్తించడం జరిగిందని వెల్లడించింది. హెచ్‌యూఎఫ్ అనేది చట్టం సృష్టించిన ఓ జీవి అని పేర్కొంది. హెచ్‌యూఎఫ్ కర్త అనేది.. దాని సభ్యుల నుంచి భిన్నమైన, చట్టపర ప్రత్యేక సంస్థ అని తేల్చి చెప్పింది. అందువల్ల మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందేనని ఖరాకండిగా చెప్పింది.
⇒ డిపాజిట్ల వసూలుకు ఎన్నడూ అనుమతించలేదు..
కర్త రామోజీరావు మరణించినంత మాత్రాన మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తనపై మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నట్లు తెలిపింది. ఆ ఆరోపణలన్నీ తప్పుడు, అసత్య, తప్పుదోవ పట్టించేవేనని స్పష్టం చేసింది. మార్గదర్శి హెచ్‌యూఎఫ్ ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి వస్తుందని మొదటి నుంచీ తాము చెబుతూ వస్తున్నామంది. చట్ట ఉల్లంఘనల గురించి, సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుందన్న వాస్తవాన్ని ఎప్పటికప్పుడు మార్గదర్శి దృష్టికి తెస్తూనే ఉన్నామని తెలిపింది.

డిపాజిట్ల స్వీకరణకు అనుమతినిస్తూ తాము సర్టిఫికెట్ జారీ చేశామన్న మార్గదర్శి వాదన శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పింది. డిపాజిట్ల వసూలుకు తాము ఎన్నడూ మార్గదర్శికి అనుమతినివ్వలేదని స్పష్టం చేసింది. రామోజీ మరణించిన నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును ఆర్బీఐ అభ్యర్థించింది. అంతేకాక నాంపల్లి కోర్టులో దాఖలైన ఫిర్యాదును కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సైతం కొట్టేయాలని హైకోర్టును కోరింది. ఈ మేరకు ఆర్‌బీఐ కౌంటర్ దాఖలు చేసింది.