
జీవితంలో అత్యంత కఠిన సమయాలు ఎదుర్కొన్నాడు: ఎమ్మెల్సీ కవిత
పవన్ కళ్యాణ్‌ను నేను సీరియస్‌గా తీసుకోవడం లేదు
సాక్షి, హైదరాబాద్: ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన నాయకుడు.. జీవితంలో ఆయన అత్యంత కఠిన సమయాలను ఎదుర్కొన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడే తీరు బాగుంటుంది. ఆయన పోరాట యోధుడు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ 2.0ను చూస్తున్నాం’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వూ్యలో కవిత మాట్లాడుతూ, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి పాడ్‌కాస్ట్‌లో ప్రస్తావన రాగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు.
‘పవన్ కళ్యాణ్‌ను నేను సీరియస్‌గా తీసుకోవడం లేదు. దురదృష్టవశాత్తూ ఆయన పొరుగు రాష్ట్రం ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో ఆయన గురించి అన్నీ ప్రశ్నించాలి్సన అంశాలే. చెగువేరాను ప్రేమించే వ్యక్తి ఏకంగా సనాతన వాదిగా ఎలా మారతాడు. ఆయన ఇచ్చే రాజకీయ ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రేపు తమిళనాడుకు వెళ్లి హిందీని రుద్దకూడదు అని కూడా అంటాడు.
అందుకే పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ప్రశ్నలపై నేను నిజంగా స్పందించాలని అనుకోవడం లేదు. ఆయనను సీరియస్ రాజకీయ నాయకుడిగా పరిగణించడం లేదు’ అని కవిత వ్యాఖ్యానించారు. గతంలో ఏపీ హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కవిత గుర్తు చేశారు. ‘దళిత మహిళ కాబట్టే హోంశాఖ మంత్రి అనితను పక్కన పెట్టి తాను హోంమంత్రిత్వ శాఖ తీసుకుంటాను అన్నాడు. లోకేశ్ హోంమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసేవాడా’ అని కవిత ప్రశ్నించారు.