తిరుపతిలో నిర్వహించిన వేడుకల్లో వైఎస్ జగన్ చిత్రపటాలతో వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు
పలు చోట్ల భారీ రక్తదాన శిబిరాలు, అన్నదానాలు
పేదలకు వస్త్రాలు, ఆస్పత్రుల్లో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ సారథి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకొన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 26 జిల్లాల్లో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో కేక్‌లు కట్ చేశారు. వీధులు, కూడళ్లలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యువత ర్యాలీలు చేశారు. పేదలు, అనాథలకు వస్త్ర దానాలు చేశారు. భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 14 దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలను అభిమానులు వైభవంగా నిర్వహించారు.
⇒ శ్రీకాకుళం జిల్లా పొందూరులో శివాలయం, మెలియాపుట్టిలోని వేణుగోపాలస్వామి ఆలయం, పాతపట్నంలోని నీలమణి దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టెక్కలి నియోజకవర్గంలో పేద విద్యార్థులకు దుప్పట్లు పంపిణి చేసి, రక్త దాన శిబిరం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాంలోని సన్ రైజ్ హాస్పిటల్ వద్ద పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు రక్తదానం చేశారు. విజయనగరం పైడితల్లి ఆలయంలో విశేష పూజలు చేశారు. భోగాపురం మండలం ఎ రావివలసలో 52 కిలోల కేక్ కట్ చేసి, అన్నదానం చేశారు.
⇒ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో అనాధాశ్రమంలో అన్నదానం చేశారు. కురుపాం నియోజకవర్గంలో పేద మహిళకు చీరలు పంపిణీ చేశారు. పాలకొండ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
⇒ అనకాపల్లి జిల్లా చోడవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో పలు చోట్ల అన్నదానం చేశారు. ఆసుపత్రులలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సహా నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.
⇒ తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం ఎర్నగూడెంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాజమండ్రిలో రక్తదాన శిబిరంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్, దంత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరిజిల్లా ఉండి నియోజకవర్గంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
⇒ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద 60 కిలోల కేక్ కట్ చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో 500 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.
⇒ గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.
⇒ కర్నూలు జిల్లాలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు.
⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీæ చేశారు.
⇒ వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. బద్వేల్ నియోజకవర్గంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కమలాపురంలోని అనాథ∙క్షేత్రాలయంలో అనాథ బాలల మధ్య కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు. కడపలో జిల్లా పరిషత్ సర్కిల్ వద్ద పేదలకు అన్నదానం చేశారు. జమ్మలమడుగులో రక్తదాన శిబిరం నిర్వహించారు.
హైదరాబాద్‌లో మెగా రక్తదాన శిబిరం
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం వైఎస్ జగనన్న అభిమాన సంఘం కేపీహెచ్‌బీ కాలనీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రమ్య గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ నేతలు వై.శివరామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, వేంపల్లి సతీష్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి, పోసింరెడ్డి సునీల్, ఎస్‌వీఎస్ రెడ్డి, శ్యామల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. మెగా రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు ఐదు వేల మందికి అన్నదానం చేశారు.
చెవిరెడ్డి ఆధ్వర్యంలో భారీగా పేదలకు దుస్తుల పంపిణీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేలాది మంది మహిళలు, కార్యకర్తలకు దుస్తులు పంపిణీ చేశారు. వేలాదిగా తరలివచి్చన అభిమానులకు అన్నదానం చేశారు. ఒంగోలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదానం శిబిరంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రక్తదానం చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సింగరాయకొండలో అన్నదానం చేశారు.
చెన్నైలో ఘనంగా..
సాక్షి, చెన్నై: వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను చెన్నైలో శనివారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పెరంబూరు, అంబత్తూరు, షొళింగనల్లూరు, తండలం తదితర ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని చోట్లా కేక్‌లు కట్ చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
వైఎస్ జగన్ ఆయురారోగ్యాలను, విజయాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలకు బిర్యానీ పంపిణీ చేశారు. వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. షొళింగనల్లూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. చెన్నై శివారులోని తండలంలో బ్రహ్మాండ వేడుకగా బర్త్‌డే కార్యక్రమాన్ని సేవాదళ్ వర్గాలు నిర్వహించాయి. అధ్యక్షుడు జహీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, అధికార ప్రతినిధులు సాయి సింహారెడ్డి, కీర్తి, నేతలు శరవణన్, శరత్‌కుమార్ రెడ్డి, భాను తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్దసంఖ్యలో మహిళలు, యువత, విద్యార్థులు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment