
శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట కేశవరావు స్వస్థలం
ఆర్‌ఎస్‌యూ సభ్యుడి నుంచి సుప్రీం కమాండర్‌గా ఎదిగిన నంబాల
35 ఏళ్లపాటు మిలటరీ ఆపరేషన్ల నిర్వహణ బాధ్యతలు
‘అలిపిరి’ సహా అనేక దాడులకు బాధ్యుడు, వ్యూహకర్త
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్‌గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్‌కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు.
విద్యార్థి దశ నుంచే..
కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్‌ఎస్‌లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.
కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్‌లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.
మలుపు తిప్పినఎంటెక్..
ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్‌లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్‌గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.
ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..
కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్‌ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.
ఎల్‌టీటీఈ ద్వారా శిక్షణ
1990లో కేశవరావు పీపుల్స్‌వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్‌లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్‌టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు.
దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం
పీపుల్స్‌వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్‌వార్ 7వ కాంగ్రెస్‌లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్‌వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.
2016లో సుప్రీం కమాండర్‌గా..
పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు.
గెరిల్లా వార్‌ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్‌వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు.
అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు
2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్‌లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్‌పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే.
ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.
నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ
గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.
ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు.
ఒక్కసారి చిక్కినా విదిలించుకుని..
నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్‌ఎస్‌యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది.
పోలీసు శాఖ మోస్ట్‌వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది.