
‘మార్గదర్శి’ కేసు సమయం వృథా వ్యవహారం
డిపాజిట్ల వసూలుపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు
ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆర్బీఐ చూసుకుంటుంది
హైకోర్టుకు సూచించిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు లబ్ధి చేకూర్చేలా ఎత్తుగడలు
చట్ట విరుద్ధంగా రూ.వేల కోట్ల డిపాజిట్ల సేకరణ నేరమేనన్న ఆర్బీఐ
క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సిందే
రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్‌దే బాధ్యత
ఆయన మరణించినా కూడా విచారణ తప్పదని స్పష్టీకరణ.. నాడు అక్రమాలు జరగలేదని ఇప్పుడు మాట మారుస్తున్నారు : ఉండవల్లి
మార్చి 7వ తేదీకి విచారణ వాయిదా
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు.. యావద్భారతం ఒక కేస్ స్టడీగా గమనిస్తున్న వ్యవహారం.. ఆర్‌బీఐ యాక్ట్ సెక్షన్ 45 (ఎస్) ఉల్లంఘన జరిగిందా? లేదా? అన్నది ఆరు నెలల్లో తేలా్చలంటూ స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించిన నేరం.. సెక్షన్ 45 (ఎస్)ను ఉల్లంఘిస్తూ, అక్రమ డిపాజిట్ల సేకరణ జరిగిందంటూ స్వయంగా ఆర్‌బీఐ అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితి.. నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది మంది డిపాజిటర్లపై తీవ్ర ప్రభావం చూపే ఆర్థిక లావాదేవీలు.. ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు.. ఇందుకు భిన్నంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు చూసి విశ్లేషకులు, నిపుణులు నివ్వెర పోతున్న పరిస్థితి.. డిపాజిటర్ల వైపు నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు రామోజీ వైపు నిలబడుతున్న వైనం.. ఆర్‌బీఐ మాటలూ బేఖాతర్.. మరోవైపు చనిపోయిన రామోజీపై నేరం నెట్టేసి.. చేతులు దులుపేసుకునే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రయత్నం.. ఇప్పుడు ఈ అంశంపైనే సర్వత్రా ఆసక్తి...
సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు వేల కోట్ల రూపా యల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్‌బీఐ) ఆధారాలతో సహా ఒకవైపు నిరూపిస్తుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం లేదు. పైపెచ్చు మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని ప్రస్తుత కర్త కిరణ్‌ను చట్ట ఉల్లంఘనల నుంచి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను చాలా సూటిగా తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ కర్త రామోజీరావు మరణించిన నేపథ్యంలో, ఈ వ్యాజ్యాలపై విచారణే అవసరం లేదని చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు తేల్చి చెప్పింది. అనవసరమైన విచారణ జరిపి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఏకంగా హైకోర్టుకే సూచించింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆర్బీఐ చూసుకుంటుంది.!: ఏపీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ఫిర్యాదులు ఏవీ లేవని, పత్రికా ప్రకటనలు ఇచ్చిన తరువాత కూడా ఎవరూ ముందుకు రాలేదని, అందువల్ల విచారణ జరిపి ప్రయోజనం లేదని ఏపీ ప్రభుత్వం వివరించింది.
ఒకవేళ తర్వాత ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వారి సంగతి రిజర్వు బ్యాంక్ చూసుకుంటుందని ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే రీతిన వాదనలు వినిపించింది. అయితే కోర్టు తీర్పు మేరకు చర్యలు చేపడతామంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఏ వాదన వినిపిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు లబ్ది చేకూరుతుందో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటి వాదనలే వినిపించాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనల్లో ఎక్కడా మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావుల అక్రమాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం. మార్గదర్శి అక్రమాలకు ఆధారాలున్నా, కనీస స్థాయిలో కూడా వాటి గురించి ప్రస్తావించలేదు.
డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమే: ఆర్‌బీఐ
మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన వైఖరిని పునరుద్ఘాటించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వసూలు చేశారని మరోసారి తేల్చి చెప్పింది. ఇలా చేయడం సెక్షన్ 58బీ(5ఏ) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. రామోజీ లేరు కాబట్టి, పిటిషన్‌ను మూసివేయాలంటూ మార్గదర్శి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును అభ్యరి్థంచింది.
రిజర్వ్ బ్యాంక్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ, రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్ బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదురోవాల్సిందేనని స్పష్టం చేశారు. కేసును మూసేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థన సమర్థనీయం కాదన్నారు. చట్టవిరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించిందని, ఆర్‌బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)ను ఉల్లంఘించిందని ఆయన మరోసారి ధర్మాసనానికి గుర్తు చేశారు. హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావు మరణించినా కూడా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.
అప్పుడు అలా చెప్పి.. ఇప్పుడు ఇలా..: ఉండవల్లి
మరోవైపు ఈ కేసులో కోర్టు సహాయకారిగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, గతంలో అసలు ఎలాంటి అక్రమాలు జరగలేదని మార్గదర్శి ఫైనాన్షియర్స్ బల్లగుద్ది మరీ చెప్పిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ అక్రమాలు ఏవైనా జరిగి ఉంటే అందుకు రామోజీరావే బాధ్యత వహించాల్సి ఉందని ఇప్పుడు చెబుతోందన్నారు. మనిషి మరణించినా కూడా ప్రాసిక్యూషన్ ఆగదన్నారు.
కుటుంబ సభ్యులు బాధ్యులు కారు: మార్గదర్శి
కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను మార్చి 7కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె.సుజనలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఆ రోజున ఉండవల్లి వాదనలు పూర్తిస్థాయిలో వింటామంది. అంతక్రితం మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, రామోజీ మృతి చెందినందున ఆయన నేర చర్యలకు కుటుంబ సభ్యులు బాధ్యులు కారని తెలిపారు. సివిల్ చర్యల విషయంలో వాదనలు వినిపిస్తామన్నారు. రామోజీరావు ఓ కంపెనీ యజమాని అని, ఆ కంపెనీ చర్యలకు యజమానే వహించాల్సి ఉంటుందన్నారు. యజమాని చనిపోయారు కాబట్టి మిగిలిన కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదన్నారు.
నేపథ్యం ఇదీ..
చట్ట నిబంధలను ఉల్లంఘించి ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వసూలు చేసినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ అ«దీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేయాలంటూ మార్గదర్శి, రామోజీరావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజనీ, నాంపల్లి కోర్టులో అధికారి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ 2018, డిసెంబర్ 31న తీర్పునిచ్చారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అన్నీ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, అ«దీకృత అధికారి ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచి్చన తీర్పును తప్పుపట్టింది. ఆ తీర్పును రద్దు చేసింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. దీంతో తెలంగాణ హైకోర్టు 2024, జూన్ నుంచి తన విచారణను ప్రారంభించింది.
అంతా ఆయన చేశారు..: మార్గదర్శి ఫైనాన్షియర్స్
విచారణ కొనసాగుతుండగానే మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన బాధ్యతలను తప్పించుకుని, వివాదాన్ని మరణించిన రామోజీ మీదకు తోసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ఈ మేరకు హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున దాని కర్త రామోజీరావు మాత్రమే బాధ్యడవుతారని, ఇతర కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని ఆ పిటిషన్‌లో పేర్కొంది. దీంతో న్యాయస్థానం తొలుత ఈ అనుబంధ పిటిషన్లపై వాదనలు వినేందుకు సిద్ధమైంది. కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రిజర్వ్ బ్యాంక్‌ను సైతం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు కూడా కౌంటర్లు దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment