
యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు
మార్చి 1న రూ.1,01,628 కోట్లు నమోదు విలువ పరంగా యూపీఐ చరిత్రలో తొలిసారి
సాక్షి, స్పెషల్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ల వాడకంలో, డేటా వినియోగంలోనే కాదు.. డిజిటల్ చెల్లింపుల్లోనూ మనవాళ్లు తగ్గేదేలే అంటున్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారిత చెల్లింపుల్లో తాజాగా సరికొత్త రికార్డు ‘టచ్’ చేశారు. ఒక్కరోజే లక్ష కోట్లకు పైగా చెల్లింపులు జరిపారు.
2025 మార్చి 1న దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ యాప్స్ ద్వారా రూ.1,01,627.92 కోట్ల విలువైన లావాదేవీలు నమోదు చేసి వాడకం మామూలుగా లేదనిపించారు. తొమ్మిదేళ్ల యూపీఐ చరిత్రలో ఈ స్థాయి లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఇక సంఖ్య పరంగా ఈ ఏడాది అత్యధికంగా మార్చి 13న గత రికార్డుకు చేరువగా 64.2 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2024 అక్టోబర్ 31న అత్యధికంగా 64.4 కోట్ల లావాదేవీలు జరిగాయి.

కొనసాగుతున్న రికార్డులు..
యూపీఐ లావాదేవీల విలువ, సంఖ్య విషయంలో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా 2025 మార్చిలో రూ.24,77,221.59 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. లావాదేవీల సంఖ్య గత నెలలో 1,830 కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఒక నెలలో ఇప్పటివరకు ఇవే అత్యధికం. సగటున రోజుకు లావాదేవీల విలువ రూ.79,910 కోట్లకు, లావాదేవీల సంఖ్య 59 కోట్లను తాకింది.
ఇక దేశంలో 661 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్ యాప్స్ యూపీఐ సేవలను అందిస్తున్నాయి. మార్చి నెల విలువలో వ్యక్తుల నుంచి వ్యక్తులకు 73 శాతం, వ్యక్తుల నుంచి వర్తకులకు 27 శాతం లావాదేవీలు జరిగాయి. అలాగే సంఖ్యలో వ్యక్తుల నుంచి వర్తకులకు 63 శాతం, వ్యక్తుల మధ్య 37 శాతం నమోదయ్యాయి.