ఏపీ స్ఫూర్తితో యాప్‌ను అభివృద్ధి చేసిన ఐకార్
తెగుళ్లపై రైతులకు రియల్ టైమ్ సలహాలు, సూచనలు పంట తెగులు ఫొటో తీసి అప్లోడ్ చేస్తే తెగుళ్లు, వైరస్‌ల గుర్తింపు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సత్వర సేవలు
సస్యరక్షణ చర్యలపై సిఫార్సులు
ఏపీ స్ఫూర్తితో కేంద్రం ప్రభుత్వం జాతీయ పురుగు–తెగుళ్ల నిఘా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచి్చంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) సహకారంతో డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ అండ్ స్టోరేజ్ (డీపీపీక్యూఎస్), జాతీయ సమీకృత తెగుళ్ల నిర్వహణ కేంద్రాలు (ఎన్‌సీఐపీఎం) అభివృద్ధి చేసిన నేషనల్ ఫెస్టి సర్వలెన్స్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌ఎస్)ను జాతీయ స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఓ యాప్‌ను అభివృద్ధి చేసింది. – సాక్షి, అమరావతి
ఎలా పనిచేస్తుందంటే
గూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్‌పీఎస్‌ఎస్.డీఏఎస్.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో రెండు రకాల మాడ్యూల్స్‌లో సేవలందుతాయి. తొలుత పెస్ట్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్ కింద రైతులు తమ పంటలకు సోకిన చీడపీడలకు సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేస్తే అవసరమైన సలహాలు, సూచనలు క్షణాల్లో ఫోన్‌లో ప్రత్యక్షమవుతాయి.
రెండోది పెస్ట్ సర్వలెన్స్ మాడ్యూల్ కింద ప్రతి జిల్లాలో స్మార్ట్ ఫోన్ వాడే 10 మంది ఆదర్శ రైతులకు ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. పెస్ట్ సర్వలెన్స్‌లో భాగంగా క్వాలిటీ సర్వలెన్స్ కింద సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్ (సీఐపీఎంసీ) సహకారంతో వ్యవసాయ అధికారులు, ఆదర్శ రైతులు, కేవీకే, యూనివర్సిటీ శాస్త్రవేత్తలకు ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. ఏ పంటలో ఏ తెగులు ఉధృతంగా వ్యాపిస్తుందో రియల్ టైమ్‌లో గుర్తించి, తగిన సలహాలు, సూచనలను రైతులకు చేరవేస్తారు. దీనిని జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు డాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షించేందుకు అవకాశం కల్పించారు.
రైతులకు నేరుగా యాప్ సేవలు
క్వాలిటేటివ్ సర్వలెన్స్ కింద రైతులకు ఎలాంటి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లేకుండా యాప్‌ను వినియోగించుకునేలా శిక్షణ ఇస్తారు. క్షేత్రాలకు వెళ్లి ఫొటో అప్లోడ్ చేసి, వైరస్ ఉధృతి తీవ్రతను తెలియజేస్తే ఏఐ ఆధారితంగా జాతీయ స్థాయిలో 61, ఏపీలో 15 ప్రధాన పంటలు సాగు చేసే రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తారు. ఏదైనా పంటకు ఓ ప్రాంతంలో పెద్దఎత్తున వైరస్ సోకినట్టుగా గుర్తిస్తే వెంటనే సంబంధిత శాఖలను అప్రమత్తం చేస్తారు.
వ్యవసాయ, ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలతో అధ్యయనం చేసి సామూహికంగా చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం, భవిష్యత్‌లో ఈ తెగుళ్లు, వైరస్‌లను తట్టుకునే నూతన వంగడాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన పరిశోధనలు చేసేందుకు చేయూతనిస్తారు.
ఈ వ్యవస్థ ద్వారా సేవలందించేందుకు 60 మంది ఆదర్శ రైతులు, 52 మంది అధికారులను ఎంపిక చేశారు. వీరికి త్వరలో పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఐసీసీ కాల్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు క్రాప్‌లైట్ సిస్టమ్ (సీఎల్‌సీ) యాప్‌ను ఎన్‌పీఎస్‌ఎస్ యాప్‌తో అనుసంధానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐసీసీ ద్వారా సస్యరక్షణ చర్యలు
ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ (ఐసీసీ) ద్వారా గడచిన ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇదే తరహా సేవలందించింది. పంటల వారీగా రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి పంటలకు సోకే తెగుళ్లు, చీడపీడలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సంబంధిత శాస్త్రవేత్తల ద్వారా అవసరమైన సస్యరక్షణ చర్యలపై రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఐసీసీ ద్వారా ఇప్పటికీ అందుతున్నాయి.
తెగుళ్లు, వైరస్‌ల తీవ్రతను బట్టి వ్యవసాయ, ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందాలను రంగంలోకి దింపి అధ్యయనం చేయడం.. ఆర్బీకేల ద్వారా సామూహిక సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇలా ఐదేళ్లుగా ఐసీసీ కాల్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలు సర్వత్రా ప్రశంసలందుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment