ఇప్పుడు ధాన్యానికి గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
మంత్రి మనోహర్‌ను చుట్టుముట్టిన కృష్ణా జిల్లా కోలవెన్ను రైతులు
కంకిపాడు: ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు జరిగింది. 75 కిలోల బస్తా రూ.1,600 ఉంటే రైతుకి రూ.1,550 వరకు గిట్టుబాటు అయ్యింది. ఇప్పుడు 75 కిలోల బస్తా రూ.1,720 ఉన్నా రైతుకి రూ.1,420కి మించి దక్కడం లేదు. గత ప్రభుత్వంలో 25 నుంచి 27 తేమ శాతం ఉన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొన్నారు. తుపాను భయంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. ఈ పరిస్థితిలో మేముంటే 22 శాతం లోపు తేమ ఉంటేనే కొంటామని ప్రభుత్వం చెప్పడం దారుణం. 1,262 విత్తనం ధాన్యాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకున్నాం.
ఇప్పుడు మాత్రం నూక అవుతుందని అధికారులు సాకు చెబుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. మా పరిస్థితి ఏమిటి’ అని రైతులు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను నిలదీశారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కనీసం సమస్య అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు, కోలవెన్ను, దావులూరుల్లో మంగళవారం మంత్రి మనోహర్ పర్యటించారు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులు, సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలను పరిశీలించారు.
పంట అమ్మకంలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంచులు, రవాణా వాహనాలు లేక ఎక్కడి ధాన్యం అక్కడే ఉంటుందని రైతులు వాపోయారు. కోలవెన్నులో మనోహర్‌ను రైతులు, కౌలు రైతులు చుట్టుముట్టారు. నాలుగు రోజులుగా ధాన్యం రాశులుగా పోసి ఉంచామని, తుపాను భయంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంచులు, లారీలు కావాలని రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నామని.. రైతుగా పుట్టడమే తమ దౌర్భాగ్యం అంటూ ఆవేదన వెలిబుచ్చారు.
రైతులకు నచ్చజెప్పిన మంత్రి మనోహర్ 48 గంటల్లో కల్లాలు, రోడ్లపైన పోసి ఉన్న ధాన్యాన్ని వేగంగా రైతులు కోరుకున్న మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సంచులు, లారీలు సమకూర్చాలని సూచించారు. జీపీఎస్‌తో సంబంధం లేకుండా ప్రైవేటు వాహనాలను అందుబాటులోకి తెచ్చి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రూ.1,100 కోట్లు రైతులకు అందించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment