grain purchase
-
అన్నీ కోతలే.. కొన్నది ఏదీ!
అవనిగడ్డ/సాక్షి ప్రతినిధి, బాపట్ల/బండి ఆత్మకూరు: రాష్ట్రంలో ధాన్యం రైతుల విషయంలో ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. వాస్తవంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది మరొకటి. ఏ ఒక్క రైతుకూ పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వమే ధాన్యం దళారీగా మారి.. రైతులకు, మిల్లర్లకు మధ్య మధ్యవర్తిత్వం నడుపుతుంటే అన్నదాతలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మిల్లర్లు చెప్పిన ధరకే ధాన్యం ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకు రావడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా.. అని రైతులు మండిపడుతున్నారు. రెండు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ‘మొన్నటి ఇబ్బందులు చెప్పొద్దు. ఈ రోజే మీ సమస్యను పరిష్కరిస్తాం. ఎన్ని సంచులు కావాలంటే అన్ని... ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీలు పంపిస్తాం. దళారులకు ధాన్యం అమ్మొద్దు. ఈ రోజు సాయంత్రానికే మీ ధాన్యం కొనుగోలు చేసి తీరతాం’ అని మంత్రి మనోహర్ బుధవారం అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మాజేరు, లంకపల్లి, లక్ష్మీపురం, చల్లపల్లి, కప్తానుపాలెం, పెదప్రోలు గ్రామాల్లో ధాన్యం రాశులను పరిశీలించి రైతులకు హామీ ఇచ్చారు.గురువారం రాత్రి వరకు కూడా అటు వైపు ఏ అధికారీ కన్నెత్తి చూడక పోవడం గమనార్హం. చేత కానప్పుడు ఇలాంటి వాగ్దానాలు చేయకూడదని రైతులు హితవు పలుకుతున్నారు. ‘15 రోజుల క్రితం కోత కోయించి ధాన్యం తీసుకొచ్చి రోడ్డు పక్కన ఆరబెట్టుకుంటున్నాం. వర్షం వచ్చి ధాన్యం తడిస్తే ఎందుకూ పనికిరావు. ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని చేతులెత్తి మంత్రిని వేడుకున్నా. బుధవారం సాయంత్రానికి కొనేస్తామన్నారు. గురువారం సాయంత్రం వరకు ఎవరూ పత్తాలేరు. రైతులపై కనీస కనికరం లేదు’ అని లంకపల్లికి చెందిన మోటుపల్లి జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. బిత్తరపోయిన మంత్రులుబాపట్ల జిల్లా కొల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించేందుకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా దోపిడీకి గురవుతున్న తీరును స్థానిక రైతులు ఏకరువు పెట్టారు. ‘ఏం బాబూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయా’ అని మంత్రి కొలుసు పార్థసారథి ఆరా తీశారు. దీనికి కౌలు రైతు ప్రసాదరావు సమాధానమిస్తూ.. ‘ఏంటండీ కొనేది? పండించిన పంటను కొనడానికి ముప్ప తిప్పలు పెడుతున్నారు. మిల్లర్లే దళారులుగా మారి తక్కువ ధరకు ధాన్యం తీసుకుని రైతులను నట్టేట ముంచుతున్నారు. కొల్లూరులో 6 ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని మిల్లుకు తెచ్చాం. ధాన్యం కొనాలని కోరుతూ తిరగని రోజు లేదు. ఈకేవైసీ చేయించిన పత్రాలు చూపెట్టా. తేమ శాతం 21 ఉన్నా.. మిల్లర్లు వారి కింద పనిచేసే బ్రోకర్లను అడ్డం పెట్టుకుని బస్తా (75 కిలోలు) రూ.1,200కే అడుగుతున్నారు’ అని అవస్థలను ఏకరువు పెట్టాడు. దీంతో బిత్తరపోయిన మంత్రులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు గురువారం నంద్యాల జిల్లా సంతజూటూరు గ్రామంలో రోడ్డెక్కారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజశేఖర్, రైతు సంఘం నాయకులు వెంకట కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సన్న రకం వడ్లు బస్తా రూ.1,300 నుంచి రూ.1,400 ధర పలుకుతోందని, గత ప్రభుత్వం క్వింటాకు రూ.2,600 మద్దతు ధర ప్రకటించడంతో రూ. 2,500 నుండి రూ.2,900 వరకు ధర పలికిందన్నారు. గత ప్రభుత్వంలోనే మేలు జరిగిందని గుర్తు చేశారు. -
రైతులను ఇబ్బంది పెడితే అధికారులపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై గురువారం తన నివాసం నుంచి కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతు ఏ మిల్లుకైనా ధాన్యం తీసుకెళ్లవచ్చన్నారు. అధికారులు మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 1.51 లక్షల మంది రైతుల నుంచి 10.59 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చెప్పారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు రూ.2,331 కోట్లను చెల్లించామని చెప్పారు. సంచుల కొరత రానివ్వొద్దు ధాన్యం సంచుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ మిల్లు యజమాని అయినా రైతులను ఇబ్బంది పెట్టినా.. ప్రభుత్వానికి సహకరించకపోయినా వారిపై చర్యలకు వెనుకాడొద్దని కలెక్టర్లకు సూచించారు. ఎక్కడైనా సమస్య ఉందని తెలిస్తే తానే స్వయంగా ఆ ప్రాంతానికి వెళతానని, అక్కడి నుంచే అధికారుల వివరణ కోరతానని అన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్, స్మగ్లింగ్ అనేది పెద్ద మాఫియాగా మారిపోయిందని, ఈ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని కోరారు. వల్లూరిపాలెం రైతుల ఆందోళనపై సీఎం ఆరా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కృష్ణా జిల్లా వల్లూరిపాలెం రైతుల ఆందోళనపై కలెక్టర్‌తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. రైతుల ఆందోళనకు అధికారుల నిర్లక్ష్యం కారణమైతే విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన నూతన విధానాలను పక్కాగా అమలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విశాఖ పర్యటనలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడి కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి పాల్గొన్నారు. -
మాయమాటలు చెప్పి తప్పించుకున్న నాదెండ్ల.. ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళన
-
రైతులకు ప్రభుత్వం సహకరించడం లేదు
గుడ్లవల్లేరు/పామర్రు/గూడూరు(పెడన)/గుడివాడ రూరల్: ధాన్యం కొనుగోళ్లపై సమస్యలు తెలుసుకునేందుకు గురువారం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణాజిల్లాలోని పలు మండలాల్లో పర్యటించగా రైతులు సమస్యలను ఏకరవు పెట్టారు. తుపాను గండం నుంచి బయటపడాలని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళితే... అక్కడ గోనె సంచులు లేవని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, మిల్లర్లు తేమ శాతం ఎంత చెబితే... అంతమేరకు కట్ చేసి తమకు రావాల్సిన ధాన్యం సొమ్ములో కోత విధిస్తున్నారని గుడ్లవల్లేరు మండలంలోని రైతులు ఫిర్యాదు చేశారు. ఎంటీయూ 1262 రకం ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదని పామర్రు మండలంలోని కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాల్లోని రైతులు ఫిర్యాదు చేశారు. ధాన్యం విక్రయించడంలో తమకు ప్రభుత్వం సహకరించడం లేదని గూడూరు మండలం, తరకటూరు రైతులు మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీకి చెందిన మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాట్రగడ్డ కృష్ణ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో ప్రభుత్వం రైతులకు సహకరించడం లేదని, తాను కూడా బస్తా రూ.1400 చొప్పున మిల్లర్లకు విక్రయించాల్సి వచ్చిందని చెప్పారు.ప్రభుత్వం తరఫున రైతుల దగ్గరకు ఏ అధికారీ రాలేదని, తనతో పాటుగా ఇక్కడి రైతులంతా బస్తా రూ.1300 నుంచి రూ.1400కు దళారులకు అమ్ముకున్నట్టు తెలిపారు. మరో రైతు అయ్యప్ప మాట్లాడుతూ.. తనకు 20 ఎకరాల పొలం ఉందని, పంట కోశాక రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్లినా ఫలితం లేదని, ఆర్ఎస్కేలో సాంకేతిక సిబ్బంది లేరంటూ పంట వెనక్కి పంపారని, గత్యంతరం లేక పది ఎకరాల్లోని పంట దళారులకు బస్తా రూ.1400 చొప్పున అమ్మినట్టు మంత్రికి వివరించారు. మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల దృష్ట్యా 40 రోజుల్లో చేపట్టాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను 4 రోజుల్లో చేపట్టేలా చర్యలు తీసుకున్నామని, 24 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా రైస్ మిల్లరను ఆదేశించినట్లు తెలిపారు. -
గత ప్రభుత్వంలోనే రైతులకు మేలు
కంకిపాడు: ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు జరిగింది. 75 కిలోల బస్తా రూ.1,600 ఉంటే రైతుకి రూ.1,550 వరకు గిట్టుబాటు అయ్యింది. ఇప్పుడు 75 కిలోల బస్తా రూ.1,720 ఉన్నా రైతుకి రూ.1,420కి మించి దక్కడం లేదు. గత ప్రభుత్వంలో 25 నుంచి 27 తేమ శాతం ఉన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొన్నారు. తుపాను భయంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. ఈ పరిస్థితిలో మేముంటే 22 శాతం లోపు తేమ ఉంటేనే కొంటామని ప్రభుత్వం చెప్పడం దారుణం. 1,262 విత్తనం ధాన్యాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకున్నాం. ఇప్పుడు మాత్రం నూక అవుతుందని అధికారులు సాకు చెబుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. మా పరిస్థితి ఏమిటి’ అని రైతులు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను నిలదీశారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కనీసం సమస్య అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు, కోలవెన్ను, దావులూరుల్లో మంగళవారం మంత్రి మనోహర్ పర్యటించారు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులు, సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలను పరిశీలించారు. పంట అమ్మకంలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంచులు, రవాణా వాహనాలు లేక ఎక్కడి ధాన్యం అక్కడే ఉంటుందని రైతులు వాపోయారు. కోలవెన్నులో మనోహర్‌ను రైతులు, కౌలు రైతులు చుట్టుముట్టారు. నాలుగు రోజులుగా ధాన్యం రాశులుగా పోసి ఉంచామని, తుపాను భయంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంచులు, లారీలు కావాలని రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నామని.. రైతుగా పుట్టడమే తమ దౌర్భాగ్యం అంటూ ఆవేదన వెలిబుచ్చారు. రైతులకు నచ్చజెప్పిన మంత్రి మనోహర్ 48 గంటల్లో కల్లాలు, రోడ్లపైన పోసి ఉన్న ధాన్యాన్ని వేగంగా రైతులు కోరుకున్న మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సంచులు, లారీలు సమకూర్చాలని సూచించారు. జీపీఎస్‌తో సంబంధం లేకుండా ప్రైవేటు వాహనాలను అందుబాటులోకి తెచ్చి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రూ.1,100 కోట్లు రైతులకు అందించామన్నారు. -
21.73 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 20.6 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు చేయగా, ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటికే 21.73 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌర సరపరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని ఇప్పటివరకు రూ.5,040.01 కోట్ల విలువైన వడ్లు కొనుగోలు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నుంచి ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 8 వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. గతంలో కంటే 2,447 కేంద్రాలను అధికంగా ప్రారంభించామన్నారు. మొత్తం 16.06 ఎల్ఎంటీల దొడ్డు, 5.67 ఎల్ఎంటీల సన్నాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సన్నాలకు సంబంధించి రూ.283.25 కోట్ల బోనస్ ఇవ్వాల్సి ఉండగా.. రూ.8.17 కోట్లు చెల్లించామని తెలిపారు. చెల్లింపుల్లో గత ప్రభుత్వం కంటే ముందంజలో ఉన్నామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో వానాకాలం సీజన్లో రూ.2,414.23 కోట్లు చెల్లిస్తే.. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు తాము రూ.2,760.22 కోట్లు చెల్లించామన్నారు. రికార్డు స్థాయిలో దిగుబడి ఉమ్మడి ఏపీలో కూడా రాని దిగుబడి ఈ సారి తెలంగాణలో వచ్చిందని ఉత్తమ్చెప్పారు. 66.07 లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులు 153 ఎల్ఎంటీల ధాన్యాన్ని పండించారని, ఇది భారతదేశంలోనే రికార్డు సృష్టిస్తుందని అన్నారు. కాళేశ్వరం కింద మూడు బరాజ్‌లు పని చేయకున్నా.. రికార్డు స్థాయిలో ఉత్పత్తి రావడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, జనవరి 10వ తేదీ వరకు కొనుగోళ్లు సాగుతాయని మంత్రి చెప్పారు. రైతులు తొందరపడి దళారులకు అమ్ముకోవద్దని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందన్నారు. ధాన్యం ఎప్పటికప్పుడు తరలించాలిఅధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం హుజూర్నగర్ రూరల్: కొనుగోలుకేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని వేపలసింగారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. యంత్రం ద్వారా ధాన్యం తేమను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతోందని, లారీలు సకా లంలో రావడం లేదని రైతులు చెప్పారు. దీంతో మంత్రి వెంటనే అధికారులతో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
మాటల సీఎం.. చేతలు శూన్యం
సాక్షి, హైదరాబాద్/ సిద్దిపేటరూరల్: సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కాని... చేతలు దాటడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం రాఘవాపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులతో మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ . గొప్పలకు పోయిన రేవంత్‌రెడ్డి నేటికి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటివి అందించలేదని, బోనస్ కాస్త బోగస్ చేసి రైతులను మోసం చేశాడన్నారు. మంత్రి ఉత్తమ్ రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని చెప్పారన్నారు. కానీ ఇప్పటికే 30 శాతం ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. చదువుకునేందుకు వెళితే ప్రాణాలు పోతున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు వెళుతున్న విద్యార్థుల ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల్లో ‘విష పూరిత ఆహారం’ఘటనలు చోటు చేసుకోవడంపై బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటన మరువకముందే.. మరో ఘటన జరగటం దారుణమని పేర్కొన్నారు. మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు అస్వస్తతకు గురై ఆస్పత్రి పాలుకావడం బాధాకరమని చెప్పారు. విషపూరిత ఆహారం ఘటనలు పదేపదే జరుగుతున్నా.. ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని, గురుకుల విద్యాసంస్థల్లో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. -
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా సాఫీగా జరిగేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రాధాన్యతాంశంగా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంపై సీఎం సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వార్తా కథనాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. కాగా ఉమ్మడి జిల్లాలకు గతంలో నియమించిన ప్రత్యేకాధికారులకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1న ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. జిల్లాల ప్రత్యేకాధికారులు వీరే: ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల : కృష్ణ ఆదిత్య కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల : ఆర్వీ కర్ణన్ నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట : అనితా రామచంద్రన్ నిజామాబాద్, కామారెడ్డి : డాక్టర్ ఎ.శరత్ రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి : డి.దివ్య మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ : ధరావత్ రవి వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ : టి.వినయ కృష్ణారెడ్డి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట : హరిచందన దాసరి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం : కె.సురేంద్ర మోహన్ -
అన్నదాత ఆగమాగం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు లక్ష్యం 4,16,600 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకు 2,20,7 98 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పటికే తడిసిన ధాన్యం కొనుగోలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సహనం నశించి వారం రోజులుగా భువనగిరి జిల్లాలో అక్కడక్కడ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తుతోంది. పొరుగున ఉన్న నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో «కొనుగోళ్లు పూర్తి కావొస్తున్నా ఇక్కడ మాత్రం ఇంకా ఆలస్యమవుతున్నాయి. మిల్లుల్లో జాగా లేదని... ఖాళీ స్థలం లేదని చెప్పి మిల్లర్లు ధాన్యం లారీలను మిల్లుల్లో అన్లోడింగ్ చేసుకోవడం లేదు. 2022–23 యాసంగి, వానాకాలం, 2024 యాసంగి సీఎంఆర్ 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంతోపాటు, ప్రభుత్వం ఈ సంవత్సరం టెండర్లతో విక్రయించిన 1.30 లక్షల «మెట్రిక్ టన్నులు మిల్లుల్లోనే ఉన్నాయి. వాస్తవానికి ఈనెల 23వ తేదీలోగా మిల్లుల్లో నుంచి ధాన్యాన్ని కాంట్రాక్టర్ ఖాళీ చేయాలి. ఇంతవరకు ఒక్క క్వింటా ధాన్యం కూడా బయటకెళ్లలేదు. దీంతో ప్రైవేట్‌కు కొందరు రైతులు అమ్ముకున్నారు. అయినా ఇంకా జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జిల్లవ్యాప్తగా ఆయా మిల్లుల్లో 5.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. రోడ్డెక్కుతున్న రైతులు ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం బీబీనగర్ మండలం గూడూరులో హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ధాన్యం బస్తాలు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కొనుగోలు కేంద్రానికి 120 మంది రైతులు ధాన్యం తీసుకొచ్చారు.8 రోజుల క్రితం 40 మంది రైతుల ధాన్యం కాంటా వేసి మిల్లులకు పంపించారు. అక్కడ ఇంకా దిగుమతి కాలేదు. ఇంకా 30 వేల బస్తాల ధాన్యం కాంటా వేసి ఉంచారు. ఇంకా 60 మంది రైతులు కాంటా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో కడుపు మండిన రైతులు రాస్తారోకోకు దిగారు. రెండు గంటల పాటు రైతులు రహదారిపై బైఠాయించడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ∙భువనగిరి మండలం ఆకుతోటబావికి చెందిన రైతులు తడిసి మొలకెత్తిన ధాన్యంతో మంగళవారం కలెక్టరేట్ ఎదు ట ధర్నాకు దిగారు. ∙అడ్డగూడూరు మండలం చౌళ్లరామా రం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతులు జాతీయ రహదారిపై ధాన్యం పోసి నిరసన తెలిపారు. ∙పోలింగ్ రోజు భూ దాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ రైతులు తడిసిన ధా న్యం కొనుగోలు చేస్తేనే ఓట్లు వేస్తామని ఆందోళనకు దిగా రు. ∙ఆలేరు మండలం కొలనుపాకలో ధర్నా చేశారు. ఆయా జిల్లాల్లో ఇలా ∙సంగారెడ్డి జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ కాగా, ఇప్పటివరకు 63,400 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో ప్రతి 40 కిలోల బస్తాకు రెండున్నర కిలోలు కోత విధిస్తున్నారు. ఇది చాలదన్నట్టు తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వచ్చే లారీల సిబ్బంది రైతుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ. రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా లో ఈనెల 12న గాలివాన భీభత్సం సృష్టించడంతో కొనుగో లు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. వడ్ల గింజలు చా లా వరకు వరదలో కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యాన్ని రైతులు కల్లాలు, రోడ్లపై ఆరబోసుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కేంద్రాల్లో కొనుగోలు చేయకపోవడంతో రైతులు అందోళనలో ఉన్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. 1.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 76,437 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించకపోవడం, మిల్లులకు వెళ్లిన లారీలు రోజుల తరబడి అక్కడే ఉండడం, అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారు. తాలు, తప్ప ఉందని తిరకాసుతో బస్తాకు మూడు నాలుగు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెలరోజులు అవుతోందికొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు అవుతోంది. వెంట వెంటనే కాంటాలు వేయడం లేదు. వారం రోజుల క్రితం 3 వేల బస్తాలు కాంటా వేసినా మిల్లుకు తరలించలేదు. దీంతో వానకు తడిసి ఎండకు ఎండిపోయాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగుతున్నాం. – మాధవరెడ్డి, గూడూరు కొనుగోలు వేగవంతం చేస్తాం కొనుగోళ్లు వేగవంతం చేస్తాం. మిల్లుల్లో వడ్లు దించుకోవడానికి స్థలం లేనందున జాప్యం జరుగుతోంది. టెండర్ ధాన్యం, సీఎంఆర్ ధాన్యం ఇంకా మిల్లుల్లో ఉంది అయితే జనగామ, హనుమకొండలకు 20 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపించడానికి చర్యలు తీసుకున్నాం. – గోపీకృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా పౌరసరఫరాల అధికారి -
రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసే మిల్లర్లు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారి నైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతు లను గోల్మాల్ చేసే మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తాగు నీటి సరఫరాపై.. శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధర పొందాలి కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్న ట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల రైతు లు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆర బెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకట్రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధరపొందా లన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు యార్డుల్లోనే ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ధాన్యం దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లను అధికారులు పర్యవేక్షించాలి ‘అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని మార్కె ట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రి యను రాష్ట్ర స్థాయిలో సీఎస్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఏరోజు కారోజు పర్యవేక్షించాలి. తాగునీటి సరఫరాపై ఉమ్మడి జిల్లాల వారీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు, ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలి. అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల సమయం కావటంతో కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశ పూర్వక కథనాలు వస్తున్నాయి. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి..’ అని సీఎం సూచించారు. వచ్చే రెండు నెలలు కీలకం ‘రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదు. భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలు కీలకం. ఫిర్యాదు వచ్చిన వెంటనే తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఏ రోజుకారోజు సీఎస్ సారథ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలి. జిల్లాలకు ఇన్చార్జిలుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్‌లు తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, డిమాండ్ మరింత పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్‌కు తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. సింగూరు నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి..’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవారిపై చర్యలు హైదరాబాద్‌లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిన అంశం దృష్టికి రాగా సీఎం వెంటనే స్పందించారు. విచారణ జరిపించి ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ధాన్యం..దళారుల దోపిడీ
సాక్షి, హైదరాబాద్: వరికోతలు మొదలైనా, ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో రైతులు దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వరికోతలు పదిహేను రోజుల క్రితమే మొదలు కాగా, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కూడా కోతలు మొదలయ్యాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని గ్రామాల రైతులు కోసిన పచ్చి ధాన్యాన్నే నేరుగా మిల్లులకు తీసుకొని వెళ్లి, వారిచ్చిన ధరకు అమ్ముకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని మండలాల్లో రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం రైతులు దళారులనే నమ్ముకుంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్ధిపేట జిల్లాల్లో కూడా కోతలు షురూ అయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్‌లో 4.16 లక్షల ఎకరాల్లో వరిసాగు ఉమ్మడినిజామాబాద్ జిల్లాలో యాసంగి సీజన్లో 4.16లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. 11.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాలకు నాణ్యమైన ధాన్యం రైస్‌మిల్లర్లు కొనుగోలు చేయగా, మిగతా 6 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్, సిరికొండ, మోపాల్, ధర్పల్లి, డిచ్పల్లి, చాలా మండలాల్లో కోతలు ముమ్మరం అయ్యాయి. మిల్లర్లు, వ్యాపారులు సన్నరకం ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1,900 నుంచి రూ.2,300 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్‌లోని నాణ్యమైన ధాన్యాన్ని నల్లగొండ, మిర్యాలగూడ, ఏపీకి చెందిన మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. పది రోజుల క్రితం క్వింటాలు ధాన్యానికి రూ. 2,500 ధర చెల్లించిన దళారులు ఇప్పుడు రూ.1,900 కే కొంటున్నారు. మిర్యాలగూడలోని 75 మిల్లులకు ధాన్యం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మిర్యాలగూడ రైస్ మిల్లులకు «ధాన్యం భారీగా వస్తోంది. మిర్యాలగూడలోని 87 రైస్‌మిల్లులు ఉండగా, ప్రస్తుతం 75 మిల్లుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటీవల మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు ఆంక్షలు విధించగా, మంత్రి కోమటిరెడ్డి మిల్లుకు వచ్చిన ప్రతిరైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే తొలుత వ్యాపారులు మొదట క్వింటాల్‌కు రూ.2600 నుంచి రూ.2700 వరకు చెల్లించగా, ధాన్యం రాక పెరగడంతో వ్యాపారులు ధర తగ్గించారు. పెరిగిన ఎండల ధాటికి ట్రాక్టర్లతో ధాన్యం తెచ్చిన రైతుల నుంచి కొనుగోలు చేయకుండా సాయంత్రం వరకు వేచి ఉండేలా చేసి క్వింటాల్‌కు రూ.2100 నుంచి రూ.2,400 వరకు మాత్రమే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మెట్రిక్ టçన్నుల ధాన్యం కొనుగోలు చేశామ మిల్లర్లు చెబుతున్నారు. ప్రతి ఏడాది 4 నుంచి 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, ఈసారి పంట దిగుబడి ఆశించినంత రాకపోవడంతో 3లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్టు చెబుతున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ కొనుగోళ్లు యాసంగి సీజన్‌కు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 75.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేస్తే దళారుల బాధ తగ్గేదని, మిల్లర్ల ఇష్టారాజ్యానికి చెక్ పడేదని రైతులు అంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ.2,203, ‘బి’ గ్రేడ్ కు రూ. 2,183 ధర వస్తుందని, మిల్లర్లు, దళారుల వల్ల కనీస మద్దతు ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దళారులు తరుగు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి. ధాన్యానికి డబ్బులు చెల్లించేటప్పుడు లక్ష రూపాయలకు రూ.1,000 చొప్పున కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అన్నదాతల్లో ఆనందం
సాక్షి, అమరావతి: ఎంతో శ్రమించి పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజులోనే చెల్లింపులు జరపడంతో అన్నదాతల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ వైఎస్ జగన్ ప్రభుత్వం మంగళవారం రూ.815 కోట్లు చెల్లించింది. దీంతో ఖరీఫ్‌లో సేకరించిన రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,514.59 కోట్లు చెల్లించినట్లయ్యింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన మిగిలిన స్వల్ప మొత్తాన్ని కూడా పౌరసరఫరాల సంస్థ డీఎం అనుమతి రాగానే రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దళారులు, మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను రక్షిస్తూ ఆర్బీకే స్థాయిలోనే సంపూర్ణ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేస్తోంది. ఖరీఫ్ సీజన్లో 29.93 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. 4.96 లక్షల మంది రైతులకు మద్దతు ధరను అందించింది. ఇలా ఈ ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించింది. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తోంది. పెరిగిన ధాన్యం సేకరణ.. గత చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏడాదికి సగటున 56 లక్షల టన్నులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. అదే సగటు ప్రస్తుత ప్రభుత్వంలో 77 లక్షల టన్నులుగా ఉంది. దీనికి తోడు ఆర్బీకే పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారి కల్లాల వద్దనే ధాన్యం సేకరణ చేపట్టింది. ఆర్బీకేల్లో.. ధాన్యం సేకరణకు అవసరమైన శాశ్వత ఏర్పాట్లు చేసింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వంలో అదనంగా దాదాపు 20 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధర దక్కింది. తడిచిన ధాన్యమూ కొనుగోలు.. అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జయ రకం(బొండాలు/దుడ్డు బియ్యం) ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో జయ రకం పండించే రైతులు చాలా లాభపడ్డారు. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని తెచ్చిన రైతులకు సైతం అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కనపెట్టి తడిచిన ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో సేకరించి మరీ రైతులకు మద్దతు ధర అందించడంలో రికార్డు నెలకొల్పింది. ఆఫ్‌లైన్‌లో సేకరించిన ధాన్యాన్ని దూరాభారాలు చూడకుండా డ్రయ్యర్ సౌకర్యం, డ్రయ్యర్ ప్లాట్‌ఫాం ఉన్న మిల్లులకు తరలించి ఆరబోసి మరీ కొనుగోలు చేసింది. జగన్ ప్రభుత్వం అదనపు భారాన్నైనా మోసింది గానీ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. బాబు హయాంలో బకాయిలు.. చంద్రబాబు హయాంలో రైతులు ధాన్యం డబ్బుల కోసం అహోరాత్రులు ఎదురు చూడాల్సి వచ్చేది. రైతులు తాము కష్టపడి పండించిన పంటను ప్రభుత్వంపై నమ్మకంతో విక్రయిస్తే.. వారికి చెల్లించాల్సిన డబ్బులను సైతం చంద్రబాబు పక్కదారి పట్టించారు. ఇలా 2019 ఎన్నికలకు ముందు పౌరసరఫరాల సంస్థకు చెందిన రూ.4,838.03 కోట్లను వేరే కార్యక్రమాలకు మళ్లించి రైతులను నట్టేట ముంచారు. చివరకు సీఎం పదవి నుంచి దిగిపోతూ రూ.960 కోట్లు చెల్లించకుండా రైతులను మోసం చేశారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలోని బకాయిలను కూడా తీర్చి.. పారదర్శక ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చారు. అదనంగా టన్నుకు రూ.2,523 గత ప్రభుత్వం పేరుకే ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. వారంతా రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ–క్రాప్ డేటా ఆధారంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరిస్తోంది. దీంతో మిల్లర్లు, దళారుల దందాకు చెక్‌పడింది. అలాగే రైతులపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రతి టన్ను ధాన్యం కొనుగోలులో రవాణా, హమాలీ, గోనె సంచుల వినియోగం నిమిత్తం రైతులకు రూ.2,523 అందిస్తోంది. గతంలో రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే.. వాటిని ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్టు రికార్డుల్లో నమోదు చేసి టీడీపీ నాయకులే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా మింగేశారు. -
దండిగా ధాన్యం.. నిండుగా నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం రైతులకు బాసటగా నిలుస్తోంది. ధాన్యం కొనుగోలులో సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు.. దేశంలోనే తొలిసారిగా రైతులకు గన్నీ, హమాలీ, రవాణా (జీఎల్టి) చార్జీల కింద టన్నుకు రూ.2523 అదనంగా చెల్లిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఖరీఫ్ 2023–24లో 4.97లక్షల మంది రైతుల నుంచి రూ.6,538 కోట్ల విలువైన 29.91లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. వీటిల్లో 4.36లక్షల మంది రైతులకు రూ.5700 కోట్ల మద్దతు ధర చెల్లించింది. మిగిలిన 61 వేల మంది రైతులకు రూ.838 కోట్లు అందించేందుకు వీలుగా నిధులను సమీకరించింది. ఆర్బీకేల్లో షెడ్యూల్ చేసిన వివరాల ప్రకారం వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో మద్దతు ధర మొత్తాన్ని జమ చేయనుంది. తద్వారా ఖరీఫ్ కొనుగోళ్లలో సంపూర్ణ చెల్లింపులను చేయనుంది. ఇక రబీ సేకరణకు సమాయత్తం ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తవడంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి రబీ కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ సమాయత్తం అవుతోంది. రబీ సీజన్లో 25లక్షల టన్నులకుపైగా ధాన్యం వస్తుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా గోనె సంచులు, హమాలీలు, రవాణా సదుపాయాలను కల్పించేలా క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. గోదావరి జిల్లాల్లో రబీలో సాగు చేసే జయరకం (దుడ్డు బియ్యం)ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు సేకరించనుంది. గతేడాది జయ రకం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించగా కేవలం 90వేల టన్నులు మాత్రమే వచ్చి ంది. ఈసారి 3లక్షల టన్నులు సేకరించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే జయరకం ధాన్యాన్ని ప్రభుత్వం స్వయంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటం రైతులకు లాభసాటిగా మారింది. ఈ రకం ధాన్యం వినియోగం స్థానికంగా చాలా తక్కువ. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దుడ్డు బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో గతంలో ప్రైవేటు వ్యాపారులు ఇచ్చి న రేటు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వ జోక్యంతో ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి దుడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 37.68 లక్షల మంది రైతులకు మద్దతు టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, సీఎం జగన్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. అంటే టీడీపీ హయాంలో కంటే 20లక్షల మంది రైతులకు అదనంగా సీఎం జగన్ ప్రభుత్వం మద్దతు ధర అందించింది. మొబైల్ బృందాలతో పరిశీలన.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దళారీ, మిల్లర్ల వ్యవస్థకు చెక్‌పెడుతూ ఆర్బీకేల కేంద్రంగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరణ చేసి వాస్తవ రైతుకు సంపూర్ణ మద్దతు ధరను అందిచే పటిష్ట వ్యవస్థను తీసుకొచ్చారు. క్షేత్ర స్థాయికి ఆర్బీకే అసిస్టెంట్ వెళ్లి నాణ్యతను పరిశీలించడం, ఆన్లైన్లో ధాన్యం రైతు వివరాలు నమోదు, ట్రక్ షీట్ జనరేట్, చివరికి ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమేటిగ్గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చారు. లోడు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్‌ను సైతం అమర్చారు. మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారులను నియమించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మండలానికి ఒక ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించేలా దృష్టి సారించారు. ప్రభుత్వ కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. దిగుబడిలో 60 శాతం కొనుగోలు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా బీపీటీ, నెల్లూరు, స్వర్ణ రకాలను పండిస్తున్నారు. వీటికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంటుంది. ఇవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయటకు వెళ్లిపోతాయి. మిగిలిన రకాల ధాన్యా న్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇలా.. ఏపీలో ధాన్యం దిగుబడుల్లో రైతుల అవసరాలకు నిల్వ చేసిన తర్వాత 60 శాతం పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. బాబు హయాంలో బకాయిలే! గతంలో రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టేవారు. పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యక్షంగా రైతులు నష్టపోయేవారు. పైగా అప్పటి ఎన్నికల ముందు రైతులకు చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల ధాన్యం డబ్బులను చంద్రబాబు ప్రచార పథకాలకు మళ్లించడంతో సమయానికి డబ్బులు అందక రైతులు అల్లాడిపోయారు. చివరికి చంద్రబాబు దిగిపోతూ ఇంకా రూ.960 కోట్లు బకాయిలు పెట్టారు. వీటిని కూడా సీఎం జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: ‘మిచాంగ్’ తుపాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులకు ఇబ్బంది లేకుండా యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి తక్షణమే తరలించేలా ఏర్పాట్లు చేసింది. నూర్పిడులు చేసి ఆరబోతకు వచ్చిన ప్రతి ధాన్యం గింజను శరవేగంగా కొనుగోలు చేయనుంది. తుపాను ప్రభావంతో కొద్దిరోజులు ఆన్లైన్ విధానానికి బదులుగా ఆఫ్‌లైన్‌లో ప్రత్యేక ఎంట్రీల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు నిర్ణయించింది. తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సుమారు 2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో అవసరమైన గోనె సంచులు, రవాణా వాహనాలు, సిబ్బందిని సమకూరుస్తోంది. గంటల్లోనే సేకరణ తుపాను ముప్పు పొంచి ఉండటంతో వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్‌ను తప్పించి, ఆఫ్‌లైన్‌లో ధాన్యం ఉత్పత్తుల కొనుగోలుకు వెసులుబాటు కల్పించాలని కోరుతూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ప్రతిస్పందన వచ్చేలోగా రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముందస్తు ఆఫ్‌లైన్ సేకరణకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ ధాన్యాన్ని సేకరించి సమీపంలోని మిల్లులకు తరలించనుంది. తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యాన్ని సైతం సేకరించి డ్రయర్ సౌకర్యం కలిగిన మిల్లులకు రవాణా చేయనుంది. సదరు జిల్లాల్లోని మిల్లుల్లో డ్రయర్లు లేకుంటే ఆ ధాన్యాన్ని పొరుగు జిల్లాలకు పంపించనుంది. అందుకయ్యే అదనపు రవాణా ఖర్చులను సైతం ప్రభుత్వమే భరించనుంది. అయితే.. నెల్లూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనే ఎక్కువ డ్రయర్ సౌకర్యం మిల్లులున్నాయి. క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి డ్రయర్ మిల్లులకు తరలించేలోగా వర్షాలు పడితే ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలోనే పౌర సరఫరాల సంస్థ తొలుత రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుని వ్యవసాయ మార్కెట్ యార్డులు, గోడౌన్లు అనుబంధంగా ఉన్న మిల్లుల్లో స్టోర్ చేయనుంది. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో సగటున ఒక్కోచోట 30వేల టన్నుల ధాన్యం ఆరబోత, లోడింగ్ దశల్లో ఉంది. రానున్న 24–36 గంటల్లోగా ఈ మొత్తం ధాన్యం తరలింపు ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇప్పటివరకు 4.66 లక్షల టన్నుల సేకరణ ఇప్పటివరకు 67,837 మంది రైతుల నుంచి రూ.1,017.77 కోట్ల విలువైన 4.66 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రవాణా, కూలి, గోనె సంచుల ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో రైతులపై ఆర్థిక భారం తగ్గింది. దీంతో రైతులెవరూ ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించట్లేదు. దీనిని గమనించిన వ్యాపారులు తేమ శాతంతో సంబంధం లేకుండా మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందొద్దు రైతులెవరూ అధైర్యపడొద్దు. వీలైనంత వేగంగా ఆఫ్‌లైన్‌లో ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ధాన్యాన్ని బస్తాల్లో నింపి వాహనంలో లోడింగ్ చేసి ట్రాక్ïÙట్ జనరేట్ చేసిన తర్వాత సమీపంలోని మిల్లులకు తరలించేలా సిబ్బందికి ఆదేశాలిచ్చాం. సోమవారం నాటికి అందుబాటులోని మొత్తం ధాన్యం సేకరించేలా సమాయత్తం అవుతున్నాం. ఆలస్యమైతే వర్షాలు కురిసి ధాన్యం తడిసి రంగు మారే ప్రమాదం ఉంది. మరోవైపు ఎఫ్‌టీవోలో చూపించిన మద్దతు ధర మొత్తం రైతుల ఖాతాల్లో తప్పకుండా జమవుతుంది. ఎవరూ కూడా మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేదు. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ రోడ్లపై ధాన్యాన్ని వదిలేయొద్దు ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లు, జేసీలు, పౌరసరఫరాల సంస్థ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రైతులెవరూ కోసిన ధాన్యాన్ని పట్టాలు కప్పి రోడ్లపై ఉంచొద్దు. వెంటనే ఆర్బీకేలోని ధాన్యం సేకరణ కేంద్రాలకు అప్పగించాలి. – వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
ధాన్యం విక్రయ టెండర్లు రద్దు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో మూలుగుతున్న గత యాసంగి నాటి ధాన్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన 10 సంస్థలు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను దక్కించుకున్నాయి. కానీ సగటున క్వింటాల్‌కు రూ.375 నష్టానికి బిడ్లు ఆమోదం పొందడం, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల మేర నష్టం వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ధాన్యం టెండర్లపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ టెండర్ల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో సమాలోచనలు జరిపిన ప్రభుత్వ పెద్దలు.. ఈ టెండర్లను రద్దు చేసి, కొత్తగా బిడ్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి కనీస ధరను కోట్ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం మద్దతు ధరతో సేకరణ రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ.2,060 మద్దతు ధరతో 66.85 లక్షల టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని యథావిధిగా మిల్లులకు తరలించింది. దాన్ని సీఎంఆర్ కింద ముడిబియ్యంగా మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం కోరినా.. అలా చేస్తే నూకల శాతం ఎక్కువై నష్టం వస్తుందని రైస్‌మిల్లులు తేల్చి చెప్పాయి. దీంతో సుమారు 9 నెలలుగా మిల్లుల్లో మూలుగుతున్న ఈ ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్న ధరకన్నా తక్కువకు.. 25 ఎల్ఎంటీ ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి టెండర్లు పిలిస్తే 11 సంస్థలు ముందుకురాగా.. ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తరువాత గురునానక్ అనే సంస్థ తిరస్కరణకు గురైంది. మిగతా 10 సంస్థలకు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను కేటాయించారు. ఈ పది సంస్థలు 25 లాట్లను క్వింటాల్‌కు కనిష్టంగా రూ.1,618 నుంచి గరిష్టంగా రూ.1,732 ధరతో దక్కించుకున్నాయి. సగటున చూస్తే క్వింటాల్ ధర రూ.1,685 మాత్రమే అవుతోంది. ప్రభుత్వం కొన్నధర రూ.2,060తో పోలిస్తే క్వింటాల్‌కు రూ.375 చొప్పున తక్కువ వస్తుంది. మొత్తంగా రూ.925 కోట్ల నష్టమని అంచనా వేశారు. ఇక సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, కమీషన్లు, మిల్లులకు ధాన్యం రవాణా తదితర ఖర్చులన్నీ కలిపితే క్వింటాల్ ధాన్యానికి మరో రూ.100కుపైగా సర్కారు వెచ్చించింది. ఈ ఖర్చునూ కలిపితే.. మొత్తంగా 25 లక్షల టన్నుల ధాన్యం విక్రయంపై రూ.1,200 కోట్లవరకు నష్టం వస్తుందని లెక్కతేలింది. భారీ నష్టం నేపథ్యంలో ప్రస్తుత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
ధాన్యం కొనుగోలుకు 54 టెండర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన లభించింది. తొలి విడతగా 25 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని విక్రయించాలని భావించిన పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు గత నెలలో టెండర్లను ఆహ్వనించింది. 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి , ప్రతి ఎల్ఎంటీ ఒక లాట్‌గా ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వనించింది. గురువారంతో గడువు ముగియగా, సాయంత్రం 5 గంటలకు అధికారులు టెక్నికల్ బిడ్లు తెరిచారు. 25 లాట్ల కోసం మొత్తం 54 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో 8 లాట్లకు సంబంధించి కేవలం ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైనట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా 17 లాట్ల కోసం 46 సంస్థలు పోటీ పడ్డాయి. యాసంగిలో 66.85 ఎల్ఎంటీల ధాన్యం సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి (2022–23)లో 66.85 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేయగా, అందులో కొంత భాగం అకాల వర్షాల కారణంగా తడిచిపోయింది. తడిచిన ధాన్యంతో పాటు మిగతా ధాన్యాన్ని కూడా ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు నిరాకరించారు. బాయిల్డ్ రైస్‌గా మాత్రమే ఇస్తామని చెప్పినా, కేంద్రం నిబంధనలతో అది సాధ్యం కాలేదు. దీంతో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఏక మొత్తంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్‌కుమార్ ఈ మేరకు నివేదిక రూపొందించగా, తొలి విడత 25 ఎల్ఎంటీలు విక్రయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెలలో ప్రక్రియ ప్రారంభం అయింది. గురువారం గడువు ముగిసే సమయానికి 54 టెక్నికల్ బిడ్లను ధ్రువీకరించారు. ఈ సంస్థల పూర్వాపరాలు పరిశీలించి, అర్హత పొందిన వాటిని ఫైనాన్షియల్ బిడ్లకు ఎంపిక చేస్తారు. ఈనెల 16న ఫైనాన్షియల్ బిడ్లను తెరిచిన అనంతరం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అర్హులైన సంస్థలను ఎంపిక చేయనుంది. -
రైతు దినోత్సవం రసాభాస!
సాక్షి నెట్వర్క్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం చేపట్టిన రైతు దినోత్సవ కార్యక్రమం పలుచోట్ల రసాభాసగా మా రింది. ధాన్యం కొనుగోళ్లు సరిగా చేపట్టక ఇబ్బందుల పాలయ్యామని.. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన వారికి ఇస్తామన్న పరిహారం ఏమైపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా రైతు దినోత్సవ కార్యక్రమాల వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని.. రూ.లక్ష రుణమాఫీ చేయలేదేమని నిలదీశారు. రైతు వేదికపై వడ్లు కుమ్మరించి.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో రైతువేదికపై భిక్షపతి అనే రైతు మొలకెత్తిన వడ్లను కుమ్మరించి నిరసన వ్యక్తం చేశారు. తన ధాన్యాన్ని సమీపంలోని సర్దార్‌నగర్ మార్కెట్‌కు తీసుకెళ్లినా.. కొనుగోలు కేంద్రం తెరుచుకోలేదని, వ్యాపారులు తక్కువ ధరకు అడిగారని వాపోయారు. మరికొందరు రైతులు కూడా అకాల వర్షాలకు పంట నష్టం, పరిహారం అందని తీరు, కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలపై నిలదీశారు. మంత్రి క్యాంపు ఆఫీసు ఎదుట ధాన్యం పోసి.. తేమ, తాలు పేరిట ఇటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అటు మిల్లర్లు దోచుకుంటున్నారన్న ఆవేదనతో జగిత్యాల జిల్లా కమలాపూర్‌కు చెందిన రైతు సట్టంశెట్టి రాజన్న ధర్మపురిలోని మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయం ఎదుట ధాన్యం కుప్పపోసి నిరసన తెలిపాడు. రైతులకు ఏం చేశారని సంబురాలు? యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లి రైతు వేదిక వద్ద కాంగ్రెస్ నేతలు, రైతులు రైతు దినోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా, రైతు రుణమాఫీ పూర్తి చేయకుండా.. ఏం చేశారని రైతు సంబరాలు జరుపుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగాయి. ఎంపీ కవితను నిలదీసిన రైతులు మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండలో రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కవితను పలువురు రైతులు ధాన్యం కొనుగోళ్లపై నిలదీశారు. ఎంపీ ప్రసంగిస్తుండగా లేచి.. కొనుగోళ్లు సరిగా జరగడం లేదని, కొన్నా లారీలు రాక బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయని.. వానలకు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసేదెప్పుడు? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిని రుణమాఫీపై రైతులు నిలదీశారు. ‘రైతుబంధు వస్తోంది కదా..’అని ఎమ్మెల్యే పేర్కొనగా రుణాలపై తాము కట్టే వడ్డీకే ఆ డబ్బులు సరిపోవడం లేదని రైతులు మండిపడ్డారు. ధాన్యం కొ నుగోళ్లలో అక్రమాలనూ ప్రస్తావించారు. దీనితో ఎ మ్మెల్యే అసహనంతో వెళ్లిపోయారు. కార్యక్రమాలను బహిష్కరించి నిరసన ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం, పంట నష్టపరిహారం అందకపోవడానికి నిరసనగా సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల రైతులు నిరసనలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో సభను బహిష్కరించగా, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో రైతువేదికకు తాళం వేశారు. చందుర్తి మండల వ్యాప్తంగా రైతు సభలను బహిష్కరించారు. నష్టపరిహారం అందేదెప్పుడు? వరంగల్ తూర్పుకోటలో జరిగిన కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ప్రసంగిస్తుండగా.. రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంటనష్టంపై పరిహారం ఏదంటూ నిలదీశారు. రైతుబంధు రావట్లేదా? సిగ్గు లేదా? రైతుపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని అబాది జమ్మికుంట రైతు దినోత్సవ కార్యక్రమంలో ఓ రైతుపై ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం ఇస్తామని మూడు నెలలైనా.. ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని బుర్ర కుమార్ అనే రైతు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు రెండు కిలోలు కోత పెడుతున్నారని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన కౌశిక్‌రెడ్డి.. ‘నీకు రైతుబంధు రావడం లేదా? నీకు సిగ్గు, శరం లేదా?’అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
ఆర్బీకే అనేది క్షేత్రస్థాయి వ్యవస్థ: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ: ఏపీలో ధాన్యం కొనుగోళ్లు, ఆర్బీకేపై ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖరీఫ్‌లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు కన్నబాబు. కాగా, ఎమ్మెల్యే కన్నబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్బీకే అనేది క్షేత్రస్థాయి వ్యవస్థ. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. రాష్ట్రంలో 6.45లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. ఖరీఫ్‌లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 99 శాతం చెల్లింపులు జరిగాయి. రైతులు ఇబ్బంది పడకూడదనే వెంటనే చెల్లింపులు చేశాం అని తెలిపారు. ఇది కూడా చదవండి: భారత్ సహా పలు దేశాల నుంచి బ్రిటన్ ఎత్తుకెళ్లిన వస్తువులు.. సంపద ఎంతంటే? -
చంద్రబాబువన్నీ డ్రామాలే..
సాక్షి, అమరావతి/ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు సీరియస్ కామెంట్స్ చేశారు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి కారుమూరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షం కారణంగా రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగానే మేము ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా ధాన్యం సేకరిస్తున్నాం. చంద్రబాబు తణుకులో అడుగుపెట్టడంతో భారీ వర్షం పడింది. చంద్రబాబు పర్యటనలో కార్యకర్తలే తప్ప రైతులు లేరు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అని సీరియస్ అయ్యారు. మరోవైపు ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. ఆయనకు వాస్తవాలు మాట్లాడే అలవాటు లేదు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదు. చంద్రబాబు ఐదేళల్లో సేకరించిన ధాన్యం జగనన్న ప్రభుత్వం మూడేళ్లలోనే సేకరించింది. దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ధాన్యం సేకరించాం. 29,074 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి డబ్బు కూడా చెల్లించాం. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో సాయం చేసిన ఘనత మాది. మాది రైతుకు అండగా ఉండే ప్రభుత్వం. కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లోపే డబ్బులు చెల్లిస్తున్నాం. ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ.. ‘ఈ-క్రాప్ ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. చంద్రబాబువన్నీ డ్రామాలే. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉంది. డ్రామా ఆర్టిస్టులతో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారు’ అంటూ సీరియస్ అయ్యారు. చదవండి: రైతన్నకు అండగా ప్రభుత్వం.. తడిసినా ధాన్యం తీసుకుంటాం -
AP: రైతన్నకు అండగా ప్రభుత్వం.. తడిసినా ధాన్యం తీసుకుంటాం
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద తిరస్కరించకుండా రైతులకు అండగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తొలుత తడిసిన ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో సేకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కొనసాగుతున్న వర్ష సూచనలతో రైతులు బయట ధాన్యాన్ని ఆరబెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. అటువంటి ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో సేకరించి డ్రయర్ సౌకర్యం, డ్రయర్ ప్లాట్‌ఫారమ్ ఉన్న మిల్లులకు తరలిస్తున్నాం. అక్కడ ఆరబోత తర్వాత ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తాం’ అని తెలిపారు. రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు. దీనికి అదనంగా ఆర్బీకేల వద్దకు ధాన్యం తెచ్చే ప్రతి రైతుకూ మద్దతు ధర అందిస్తామన్నారు. ఇప్పటివరకు 5.22 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 55 వేల మంది రైతులకు 21 రోజుల్లోపే రూ.803 కోట్లు చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు. ధాన్యాన్ని వేగంగా కల్లాల నుంచి మిల్లులకు తరలించేందుకు రవాణా కోసం ఐదు గోదావరి జిల్లాలకు కలెక్టర్ కార్పస్ ఫండ్ కింద రూ.కోటి చొప్పున కేటాయించామన్నారు. కోటా పూర్తవగానే తిరిగి నిధులు అందిస్తామన్నారు. గత ఖరీఫ్‌లో 6.40 లక్షల మంది రైతుల నుంచి 35.41 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. దాదాపు రూ.7,208 కోట్లు (99 శాతం) చెల్లింపులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ధాన్యం సేకరణలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే టోల్‌ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయాలని కోరారు. తొలిసారిగా జయ రకానికి మద్దతు ధర తొలిసారిగా రాష్ట్రంలో 5 లక్షల టన్నుల బొండాలు (జయ రకం) ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఫలితంగా బయట మార్కెట్లో జయ రకం ధాన్యానికి మంచి ధర పలుకుతోందన్నారు. వేసవి ప్రారంభంలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ధాన్యంలో నూక శాతం పెరిగినట్లు తెలిపారు. వీటిని బాయిల్డ్ రైస్ కింద కొనుగోలు చేస్తామన్నారు. గోనె సంచులకు కొరత లేదు వర్షాల నేపథ్యంలో నిత్యం ప్రతి జిల్లాలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేగంగా ధాన్యాన్ని తరలిస్తున్నట్లు పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ చెప్పారు. ఎక్కడా గోనె సంచులకు కొరత లేదన్నారు. ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులకు గురి చేసిన 31 మిల్లులపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 8 వరకు వర్షాలు.. తగ్గగానే పంట నష్టం అంచనా వర్షాల కారణంగా పంట దెబ్బతిన్న రైతులను వేగంగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఈ నెల 8వ తేదీ వరకు వర్ష సూచన ఉందన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే పంట నష్టం అంచనాలు, ఆర్బీకేల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేసి రెండు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఎక్కువగా జొన్న, మొక్కజొన్న, వరి పంటలు ముంపునకు గురైనట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మొక్కజొన్నను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. వర్షాల నుంచి పంటలను రక్షించుకునేందుకు శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులుంటే వ్యవసాయశాఖ టోల్ ఫ్రీ నంబర్ 155251కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్‌కు ముందే పరిహారం రెండు నెలల క్రితం మార్చిలో కురిసిన అకాల వర్షాలతో 23,473 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. దాదాపు రూ.34.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే జమ చేస్తామన్నారు. వాటితో పాటే ప్రస్తుతం వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి ఆ పరిహారాన్ని కూడా రైతులకు ఈ నెలాఖరులోగా అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగియక ముందే రైతులకు పరిహారాన్ని చెల్లిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.1,911 కోట్ల మేర పంట నష్టం పరిహారాన్ని అందించినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఆర్టీసీలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయం -
రాష్ట్రవ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలు
కరీంనగర్‌రూరల్: యాసంగి పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7,100 కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, మొగ్దుంపూర్ గ్రా మాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్ సప్లైచైర్మన్ రవీందర్‌సింగ్‌తో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ రెండో పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. యాసంగి పంట ముందుగా కోతకు రావడంతో సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కేంద్రాలను ఏర్పాటు చేయ నున్నామని, ఇప్పటివరకు 420 కేంద్రాలను ఏర్పా టు చేసి రూ.4.15కోట్ల విలువైన 2వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. అవ సరమైన ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభించేందు కు కలెక్టర్లకు ఆదేశాలిచి్చనట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి సురేశ్ పాల్గొన్నారు. మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌లో ఆదివారం కొందరు చిరుతల రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం శ్రీసీతారాముల పట్టాభిõషేకం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మంత్రి గంగుల హాజరై వేదికపైకి చేరుకున్నారు. ఆయనతోపాటు సివిల్ సప్లైచైర్మన్ రవీందర్‌సింగ్ కూడా ఉన్నారు. అయితే అప్పటికే పెద్దసంఖ్యలో మహిళలు వేదికపైకి ఉన్నారు. గంగుల, రవీందర్‌సింగ్‌తోపాటు స్థానిక నాయకులు వేదికపైకి వెళ్లడంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో మంత్రి గంగుల కమలాకర్ ఎడమకాలుకు గాయమైంది. రవీందర్‌సింగ్, జెడ్పీటీసీ లలిత స్వల్పంగా గాయపడ్డారు. పడిపోయిన మంత్రి వెంటనే గన్మెన్లు, నిర్వాహకులు పైకి లేపి ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. -
ధాన్యం కొనుగోలుకు రెడీ..!
సాక్షి, రాజమహేంద్రవరం: రబీ ముందస్తు వరి కోతలు ప్రారంభమయ్యాయి. అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో ఊపందుకుంటున్నాయి. మరో పది రోజుల వ్యవధిలో మరికొన్ని ప్రాంతాల్లో వేగం పుంజుకునే ఆవస్యకత ఉంది. రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసి దన్నుగా నిలవాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. దిగుబడి అందే నాటి కంటే ముందుగానే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసువచ్చేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. సేకరణకు అవసరమైన ఏర్పాట్లలో తలమునకలైంది. కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులు, యంత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ తర్వాత ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 4.55 లక్షల మెట్రిక్ టన్నులే లక్ష్యం జిల్లా వ్యాప్తంగా రబీ సాధారణ సాగు 83,880 హెక్టార్లు. అత్యధికంగా వరి సాగవుతోంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 56,433 హెక్టార్లు కాగా.. 55,095 హెక్టార్లు సాగై 95 శాతానికి పైగా లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఏడాది 5.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో రైతులు, స్థానిక అవసరాలకు మినహాయించగా 4,55,845 మెట్రిక్ టన్నులు కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రైతులకు అనుకూలమైన మద్దతు ధర నిర్ణయించింది. సాధారణ రకం బస్తాకు (75 కిలోల బస్తా) రూ.1530, గ్రేడ్–ఏ రకానికి రూ.1545గా నిర్ణయించింది. 233 ఆర్బీకేల్లో.. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 315 ఆర్బీకేలుండగా 233 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వాటిని 147 మిల్లులకు అనుసంధానం చేశారు. ఆయా కేంద్రాలకు నియమించిన సాంకేతిక సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. సేకరణకు జిల్లా వ్యాప్తంగా 70 లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉందని, ఏ మండలానికి ఎన్ని కావాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఆర్బీకేల వద్ద సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ–క్రాప్, తేమ శాతం నిబంధనల ప్రకారం ధాన్యం సేకరిస్తారు. అనంతరం మొబైల్ యాప్‌లో రైతులకు కూపన్లు ఇస్తారు. కొనుగోళ్లకు మండల వ్యవసాయ అధికారులు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. గ్రామ వలంటీర్లను సైతం భాగస్వాముల్ని చేస్తున్నారు. ధాన్యం రవాణా చేసే వాహనాలపై నిఘా పెడుతున్నారు. రవాణా చార్జీలు ఎవరికి చెల్లించాలనే విషయమై జాగ్రత్తలు తీసు కుంటున్నారు. ఎకరానికి 53 బస్తాల దిగుబడి రబీ ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. ఎకరానికి 52 నుంచి 53 బస్తాల దిగుబడి అందుతోంది. జిల్లాలో అత్యధికంగా ఎంటీయూ–1121 రకం ధాన్యం సేకరించనున్నారు. 3.39 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. 76,000 మెట్రిక్ టన్నులు బోండాలు, 30 వేల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉత్పత్తి అయ్యే సూచనలున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. పెట్టుబడులకు పోను లాభాలు గడించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా దిగుబడులు టాప్.. జిల్లాలో 2021 ఖరీఫ్‌లో 82,695 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ఎకరానికి (75 కిలోల బస్తా) 28 బస్తాల ధాన్యం దిగుబడి వస్తే.. 2022 ఖరీఫ్‌లో 73,606 హెక్టార్లలో వరి సాగయ్యింది. ఎకరానికి 33 బస్తాల దిగుబడి వచ్చింది. ఏడాది వ్యవధిలో ఎకరం పొలానికి 5 బస్తాలు వృద్ధి చెందింది. 2021 ఖరీఫ్‌లో మొత్తం 4,29,990 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అందితే.. 2022లో 4,52,368 మెట్రిక్ టన్నులు.. అంటే 22,378 మెట్రిక్ టన్నులు అదనంగా దిగుబడి వచ్చింది. గత ఐదేళ్లుగా ఇలాంటి దిగుబడులు ఎప్పుడూ నమోదు కాలేదని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇప్పటికే 2321 హెక్టార్లలో కోతలు పూర్తయినట్లు సమాచారం. ప్రతి గింజా కొంటాం:– రబీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేశాం. ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి సేకరణపై అధికారులు, సిబ్బందికి సలహాలు సూచనలు చేశాం. ముందస్తు కోతలు వచ్చే ప్రాంతాల్లో కేంద్రాలు ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నాం. 4.55 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 233 ఆర్బీకేలు సిద్ధం చేస్తున్నాం. వారం రోజుల తర్వాత కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. –ఎన్.తేజ్ భరత్, జాయింట్ కలెక్టర్ -
డిఫాల్ట్ మిల్లర్లకు.. ధాన్యం బంద్
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని (కస్టమ్ మిల్లింగ్ రైస్ –సీఎంఆర్) ఎఫ్‌సీఐకి అప్పగించకుండా సతాయించే మిల్లులపై కొరడా ఝలిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల్లోగా ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉన్నా.. కొందరు మిల్లర్లు ఏడాదిన్నర దాకా జాప్యం చేస్తున్నారు. అప్పటికీ కొన్ని మిల్లుల నుంచి సీఎంఆర్ బియ్యం పెండింగ్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో సకాలంలో బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల సంస్థకు నష్టం కలిగిస్తున్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల మూడో వారం నుంచి మొదలయ్యే యాసంగి సీజన్ నుంచే దీనిని అమలు చేయనుంది. సీఎంఆర్‌లో జాప్యం చేస్తున్న 300కుపైగా మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా అధికారులు ఇప్పటికే గుర్తించి, జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మిల్లులకు ధాన్యం కేటాయింపులను పూర్తిగా నిలిపేసి.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ అధికారులు మంత్రి గంగుల ద్వారా సీఎంకు ప్రతిపాదనలు అందజేసినట్టు సమాచారం. ఆరునెలల్లోగా ఇవ్వాల్సి ఉన్నా.. వచ్చేనెల నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చాక రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయి. మిల్లర్లు ఆ ధాన్యాన్ని తీసుకున్నాక ఆరు నెలల్లోగా మరాడించి బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ మిల్లర్ల నుంచి తగిన సమయంలో సీఎంఆర్ రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐను గడువు పెంచాలని కోరడం ఏటా జరిగే తంతుగా మారింది. 2019–20 యాసంగి సీజన్‌కు సంబంధించి 118 మిల్లులు ఇప్పటివరకు సీఎంఆర్ ఇవ్వలేదు. మూడేళ్లుగా పెనాల్టీతో గడువు పెంచుతున్నా ఇప్పటికీ సీఎంఆర్ పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. గడువు ముగిసిన తరువాత ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకపోతే వాటిని రాష్ట్ర అవసరాలకు మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా సీఎంఆర్ ఆలస్యంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. దీనితో ఇకపై మిల్లర్ల ఆగడాలను ఉపేక్షించొద్దని, ధాన్యం కేటాయింపుల్లో కోత విధించాలని.. 6 నెలల్లో సీఎంఆర్ పూర్తి చేసే కెపాసిటీలోనే కేటాయింపులు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిల్లర్లకు కేటాయించగా మిగిలే ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారానే మిడిల్ పాయింట్ స్టోరేజీ గోడౌన్లకు తరలించి.. ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాలని కూడా యోచిస్తోంది. కొనుగోళ్ల బాధ్యతలు కలెక్టర్లకు.. రాష్ట్రంలో కొన్ని సీజన్లుగా ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ ప్రక్రియ అదనపు కలెక్టర్ల నేతృత్వంలో జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల సంస్థ అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్లో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా కలెక్టర్ల నేతృత్వంలో జరపాలని నిర్ణయించారు. దీనిపై ఏప్రిల్ 10న మంత్రుల సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఎంఆర్‌లో లేని మిల్లులకు ధాన్యం ఇప్పటివరకు సీఎంఆర్‌తో సంబంధం లేకుండా ప్రైవేటుగా ధాన్యం కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి అమ్ముకునే మిల్లులను ఈసారి సీఎంఆర్ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. మిర్యాలగూడ, నిజామాబాద్, నల్లగొండ వంటి కొన్ని ప్రాంతాల్లో 100కుపైగా మిల్లులు పౌరసరఫరాల శాఖ, సీఎంఆర్‌తో సంబంధం లేకుండా పనిచేస్తున్నాయి. వాటిని గుర్తించి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. -
ధాన్యం రైతులకు గుడ్ న్యూస్.. రూ.1,096.52 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: ధాన్యం రైతులకు శుభవార్త! ఆర్బీకేల ద్వారా రైతన్నల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రూ.1,096.52 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 3.29 లక్షల మంది రైతుల నుంచి రూ.3,781 కోట్ల విలువైన 18.52 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. తాజా చెల్లింపుతో మొత్తం 2.84 లక్షల మంది రైతులకు రూ.2,924.53 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లయింది. రైతులకు మద్దతు ధర కల్పించడంతోపాటు ప్రభుత్వం వేగంగా చెల్లింపులు కూడా జరుపుతోంది. 21 రోజుల్లోపు చెల్లించాలని నిర్ణయించినప్పటికీ ధాన్యం కొనుగోలు చేసిన వారం నుంచి పది రోజుల లోపే రైతుల ఖాతాలకు నగదు జమ చేసిన దాఖలాలున్నాయి. కొన్ని చోట్ల మాత్రం సాంకేతిక సమస్యల వల్ల ఒకటి రెండు రోజులు చెల్లింపులు ఆలస్యమయ్యాయి. తొలిసారిగా అదనపు సాయం.. ధాన్యం సేకరణలో తొలిసారిగా తెచ్చిన ఆన్లైన్ విధానంతో రైతులకు పారదర్శకంగా మద్దతు ధర లభిస్తోంది. గోనె సంచులు, రవాణా చార్జీలు, హమాలీ ఖర్చులను సైతం రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తోంది. వీటి కింద ఇప్పటివరకు రూ.45.91 కోట్లు విడుదల చేసింది. ఇందులో దాదాపు 50 శాతం చెల్లింపులను పూర్తి చేసింది. గత సర్కారు హయాంలో ఇవేమీ లేకపోగా రైతులకు ధాన్యం సొమ్ములను నెలలు తరబడి బకాయిలు పెట్టారు. మిల్లర్లు, దళారులకు లబ్ధి చేకూర్చేందుకు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేసింది. ఫలితంగా రైతన్నల్లో ఆందోళన రేకెత్తించి నష్టానికే మధ్యవర్తులకు ధాన్యం విక్రయించుకోవాల్సిన దుస్థితి కల్పించింది. ఇలాంటి వాటిని అరికడుతూ రైతులే తొలి ప్రాధాన్యంగా 21 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ధర జమ చేయాలని నిర్ణయించి సీఎం జగన్ పక్కాగా అమలు చేస్తున్నారు. దీంతో గత సీజన్ల కంటే ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి నాటికి పూర్తి ఖరీఫ్ ధాన్యం సేకరణను సంక్రాంతి నాటికి పూర్తి చేసేలా కృషి చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించాం. ఆన్లైన్ విధానంతో రైతులకు సంపూర్ణ మద్దతు ధర లభిస్తోంది. పండగ సీజన్లను దృష్టిలో పెట్టుకుని నిర్ణీత సమయం ప్రకారం చెల్లింపులు చేస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ, జి.వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
అన్నదాతకు అండ.. గింజగింజకూ మద్దతు
అన్నదాతలు పండించే ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ ఒక్క రైతన్న కూడా ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం లేకుండా పంటల కొనుగోళ్ల సమయంలో వారికి అన్ని విధాలా అండగా నిలవాలి. – అధికార యంత్రాంగానికి సీఎం జగన్ ఆదేశం సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంటనూ ఈ–క్రాపింగ్ చేయడం వల్ల ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారు? ఎంత దిగుబడి వస్తుందనే విషయంలో స్పష్టత వచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో పూర్తి స్థాయిలో పారదర్శకత వచ్చిందన్నారు. పంటల నమోదు నూరు శాతం పూర్తి కాగా, వీఏఏ, వీఆర్వోల ద్వారా ఈ – కేవైసీ 99 శాతం పూర్తైనందున ఈనెల 15వ తేదీలోగా రైతుల ఈ – కేవైసీ (వేలిముద్రలు) పూర్తిచేసి ప్రతి రైతుకు డిజిటల్, ఫిజికల్ రశీదులివ్వాలని సూచించారు. పంటల కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం సోషల్ ఆడిట్ పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో పాటు ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం సమీక్షించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం ఖరీఫ్ సీజన్ దాదాపుగా పూర్తైంది. కోతలు మొదలయ్యేలోగా కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి. కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు. గన్నీ బ్యాగులు, కూలీలు, రవాణా సదుపాయాలను అవసరమైన మేరకు సమకూర్చుకోవాలి. ధాన్యం కొనుగోళ్లపై ఆర్బీకేల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ధాన్యం కొనుగోళ్ల కోసం చేసిన ఏర్పాట్లు, నిబంధనలు, సూచనలు, సలహాలతో ఆర్బీకేల్లో పోస్టర్లు ప్రదర్శించాలి. ఆర్బీకేలకు అనుసంధానించిన వలంటీర్లు ఆర్బీకే మిత్రలుగా, ధాన్యం కొనుగోళ్లలో సహాయం కోసం తీసుకుంటున్న వలంటీర్లు రైతు సహాయకులుగా వ్యవహరించాలి. బియ్యం ఎగుమతులపై దృష్టి రాష్ట్రంలో వరి విస్తారంగా సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపై దృష్టి సారించాలి. దేశీయంగా డిమాండ్ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను పరిశీలించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎగుమతుల రంగంలో ఉన్న వారితో కలిసి పని చేయాలి. బియ్యం ఎగుమతిదారులకు, రైతులకు ఉభయ తారకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రంగు మారిన ధాన్యం, బ్రోకెన్ రైస్ (నూకలు)ఇథనాల్ తయారీకి వినియోగించడంపై దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఇఫ్కో ద్వారా ఒక ప్లాంటు, మహీంద్రా ద్వారా మరో ప్లాంటు నుంచి ఇథనాల్ తయారు కానుంది. సీఎం యాప్‌తో ధరల పర్యవేక్షణ ఎక్కడైనా పంటలకు ఎమ్మెస్పీ కంటే తక్కువ ధర ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే జోక్యం చేసుకుని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. పంట ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు సీఎం యాప్ ద్వారా సమీక్షిస్తుండాలి. ఎక్కడైనా ధర పతనమైనట్లు సీఎం యాప్ ద్వారా గుర్తిస్తే వెంటనే కొనుగోళ్లకు శ్రీకారం చుట్టాలి. ధర పతనమైన సందర్భాల్లో రైతులను ఎలా ఆదుకుంటామనే విషయంలో సర్వీస్ లెవల్ అగ్రిమెంట్ (ఎస్ఎల్ఏ) పకడ్బందీగా ఉండాలి. కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను నిల్వచేసే ప్రాంతంలో జియో ఫెన్సింగ్, ప్రతి ఉత్పత్తికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఉండేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేయాలి. రైతులను ఆదుకునేందుకు మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలి. దీనివల్ల ధరలు పతనం కాకుండా అన్నదాతలకు మేలు జరుగుతుంది. పొగాకు రైతులకు నష్టం జరగకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్‌కు ముందే భూసార పరీక్షలు.. పంటల సంరక్షణకు ప్లాంట్ డాక్టర్ ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు నిర్వహించి పూర్తి వివరాలను సాయిల్ హెల్త్ కార్డుల్లో నమోదు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా పంటల సాగుకు సంబంధించి సిఫార్సులు చేయాలి. ఏ నేలలో ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే అంశంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇందుకోసం ప్రతి ఆర్బీకేలో సాయిల్ టెస్టింగ్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. మధ్యలో ఏవైనా చీడపీడలు, తెగుళ్లు లాంటివి పంటలకు సోకితే ఫోటోలు తీసి శాస్త్రవేత్తల సహకారంతో నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్లాంట్ డాక్టర్ విధానాన్ని తేవాలి. విచ్చలవిడిగా క్రిమి సంహారక మందుల వాడకాన్ని నివారించాలి. ఇలా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తూ సిఫార్సుల మేరకు పంటలను సాగు చేస్తే విచక్షణా రహితంగా ఎరువులు, రసాయనాల వాడకం తగ్గుతుంది. తద్వారా రైతన్నలకు పెట్టుబడి వ్యయం తగ్గడంతోపాటు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించేందుకు దోహదం చేస్తుంది. ఈదఫా 1.15 కోట్ల ఎకరాల్లో సాగు ఖరీప్ సీజన్లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా అక్కడక్కడా వరి నాట్లు కొనసాగుతున్నందున ఈదఫా ఖరీఫ్ సాగు 1.15 కోట్ల ఎకరాలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు సీఎం దృష్టికి తెచ్చారు. మూడేళ్లలో 3.5 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు పెరిగిందని, సాధారణ పంటల నుంచి రైతులు వీటి వైపు మళ్లినట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 14.10 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారని చెప్పారు. నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం 3,423 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మాయిశ్చరైజర్ మీటర్, అనాలసిస్ కిట్, హస్క్ రిమూవర్, పోకర్స్, ఎనామెల్ ప్లేట్స్, జల్లించే పరికరాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. రానున్న రబీ సీజన్లో 57.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేసి 96 లక్షల టన్నుల విత్తనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన పరికరాలు, అద్దెల వివరాలతో ఆర్బీకేల్లో పోస్టర్లను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత సాయాన్ని అక్టోబరు 17న అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భూసార పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు బాంబే, కాన్పూర్ ఐఐటీల సాంకేతిక విధానాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల కమిషనర్లు చేవూరు హరికిరణ్, హెచ్.అరుణ్‌కుమార్, పీఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.