ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు ఇబ్బంది పెడితే చర్యలకు కలెక్టర్లు వెనకాడొద్దు
కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై గురువారం తన నివాసం నుంచి కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతు ఏ మిల్లుకైనా ధాన్యం తీసుకెళ్లవచ్చన్నారు. అధికారులు మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 1.51 లక్షల మంది రైతుల నుంచి 10.59 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చెప్పారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు రూ.2,331 కోట్లను చెల్లించామని చెప్పారు.
సంచుల కొరత రానివ్వొద్దు
ధాన్యం సంచుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ మిల్లు యజమాని అయినా రైతులను ఇబ్బంది పెట్టినా.. ప్రభుత్వానికి సహకరించకపోయినా వారిపై చర్యలకు వెనుకాడొద్దని కలెక్టర్లకు సూచించారు.
ఎక్కడైనా సమస్య ఉందని తెలిస్తే తానే స్వయంగా ఆ ప్రాంతానికి వెళతానని, అక్కడి నుంచే అధికారుల వివరణ కోరతానని అన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్, స్మగ్లింగ్ అనేది పెద్ద మాఫియాగా మారిపోయిందని, ఈ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని కోరారు.
వల్లూరిపాలెం రైతుల ఆందోళనపై సీఎం ఆరా
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కృష్ణా జిల్లా వల్లూరిపాలెం రైతుల ఆందోళనపై కలెక్టర్‌తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. రైతుల ఆందోళనకు అధికారుల నిర్లక్ష్యం కారణమైతే విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన నూతన విధానాలను పక్కాగా అమలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విశాఖ పర్యటనలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడి కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment