అన్నదాత ఆగమాగం | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆగమాగం

Published Thu, May 16 2024 4:52 AM

Severe delay in procurement of grain in Yadadri district

యాదాద్రి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం 

ఒకవేళ కొన్నా మిల్లులకు తరలించరు  

కొన్ని లారీల్లో తరలించినా అన్‌లోడింగ్‌ కాదు

తేమ, తరుగు పేరుతో తప్పని కోతలు  

అకాల వర్షాలతో ఇప్పటికే తడిసి మొలకెత్తుతున్న ధాన్యం 

తడిసిన ధాన్యం కొనుగోళ్లు ఏవీ?

సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు లక్ష్యం 4,16,600 మెట్రిక్‌ టన్నులు కాగా ఇప్పటివరకు 2,20,7 98 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పటికే తడిసిన ధాన్యం కొనుగోలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సహనం నశించి వారం రోజులుగా భువనగిరి జిల్లాలో అక్కడక్కడ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తుతోంది. పొరుగున ఉన్న నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో «కొనుగోళ్లు పూర్తి కావొస్తున్నా ఇక్కడ మాత్రం ఇంకా ఆలస్యమవుతున్నాయి. 

మిల్లుల్లో జాగా లేదని... 
ఖాళీ స్థలం లేదని చెప్పి మిల్లర్లు ధాన్యం లారీలను మిల్లుల్లో అన్‌లోడింగ్‌ చేసుకోవడం లేదు. 2022–23 యాసంగి, వానాకాలం, 2024 యాసంగి సీఎంఆర్‌ 3.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంతోపాటు, ప్రభుత్వం ఈ సంవత్సరం టెండర్లతో విక్రయించిన 1.30 లక్షల «మెట్రిక్‌ టన్నులు మిల్లుల్లోనే ఉన్నాయి. 

వాస్తవానికి ఈనెల 23వ తేదీలోగా మిల్లుల్లో నుంచి ధాన్యాన్ని కాంట్రాక్టర్‌ ఖాళీ చేయాలి. ఇంతవరకు ఒక్క క్వింటా ధాన్యం కూడా బయటకెళ్లలేదు. దీంతో ప్రైవేట్‌కు కొందరు రైతులు అమ్ముకున్నారు. అయినా ఇంకా జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జిల్లవ్యాప్తగా ఆయా మిల్లుల్లో 5.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ ఉంది.  

రోడ్డెక్కుతున్న రైతులు  
ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం బీబీనగర్‌ మండలం గూడూరులో హైదరాబాద్‌– వరంగల్‌ జాతీయ రహదారిపై రైతులు ధాన్యం బస్తాలు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కొనుగోలు కేంద్రానికి 120 మంది రైతులు ధాన్యం తీసుకొచ్చారు.

8 రోజుల క్రితం 40 మంది రైతుల ధాన్యం కాంటా వేసి మిల్లులకు పంపించారు. అక్కడ ఇంకా దిగుమతి కాలేదు. ఇంకా 30 వేల బస్తాల ధాన్యం కాంటా వేసి ఉంచారు. ఇంకా 60 మంది రైతులు కాంటా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో కడుపు మండిన రైతులు రాస్తారోకోకు దిగారు. రెండు గంటల పాటు రైతులు రహదారిపై బైఠాయించడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  

∙భువనగిరి మండలం ఆకుతోటబావికి చెందిన రైతులు తడిసి మొలకెత్తిన ధాన్యంతో మంగళవారం కలెక్టరేట్‌ ఎదు ట ధర్నాకు దిగారు. ∙అడ్డగూడూరు మండలం చౌళ్లరామా రం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతులు జాతీయ రహదారిపై ధాన్యం పోసి నిరసన తెలిపారు.  ∙పోలింగ్‌ రోజు భూ దాన్‌ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ రైతులు తడిసిన ధా న్యం కొనుగోలు చేస్తేనే ఓట్లు వేస్తామని ఆందోళనకు దిగా రు. ∙ఆలేరు మండలం కొలనుపాకలో ధర్నా చేశారు.  

ఆయా జిల్లాల్లో ఇలా  
∙సంగారెడ్డి జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్‌ టన్నులు టార్గెట్‌ కాగా, ఇప్పటివరకు 63,400 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో ప్రతి 40 కిలోల బస్తాకు రెండున్నర కిలోలు కోత విధిస్తున్నారు. ఇది చాలదన్నట్టు తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వచ్చే లారీల సిబ్బంది రైతుల నుంచి డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ. రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు.  

వరంగల్‌ జిల్లా లో ఈనెల 12న గాలివాన భీభత్సం సృష్టించడంతో కొనుగో లు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. వడ్ల గింజలు చా లా వరకు వరదలో కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యాన్ని రైతులు కల్లాలు, రోడ్లపై ఆరబోసుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కేంద్రాల్లో కొనుగోలు చేయకపోవడంతో రైతులు అందోళనలో ఉన్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు.  

మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. 1.76 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 76,437 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించకపోవడం, మిల్లులకు వెళ్లిన లారీలు రోజుల తరబడి అక్కడే ఉండడం, అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారు. తాలు, తప్ప ఉందని తిరకాసుతో బస్తాకు మూడు నాలుగు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి.  

నెలరోజులు అవుతోంది
కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు అవుతోంది. వెంట వెంటనే కాంటాలు వేయడం లేదు. వారం రోజుల క్రితం 3 వేల బస్తాలు కాంటా వేసినా మిల్లుకు తరలించలేదు. దీంతో వానకు తడిసి ఎండకు ఎండిపోయాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగుతున్నాం.      – మాధవరెడ్డి, గూడూరు 

కొనుగోలు వేగవంతం చేస్తాం 
కొనుగోళ్లు వేగవంతం చేస్తాం. మిల్లుల్లో వడ్లు దించుకోవడానికి స్థలం లేనందున జాప్యం జరుగుతోంది. టెండర్‌ ధాన్యం, సీఎంఆర్‌ ధాన్యం ఇంకా మిల్లుల్లో ఉంది అయితే జనగామ, హనుమకొండలకు 20 మెట్రిక్‌ టన్నుల ధాన్యం పంపించడానికి చర్యలు తీసుకున్నాం.   – గోపీకృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా పౌరసరఫరాల అధికారి  

Advertisement
 
Advertisement
 
Advertisement