72 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు
మెదక్ మున్సిపాలిటీ: వరి, మొక్కజొన్న కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని జాయింట్ కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాల్‌లో వరి, మొక్కజొన్న కేంద్రాల కొనుగోలు విషయమై పాయింట్ వర్కర్స్, ఏపీఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ శరత్ మాట్లాడుతూ రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోనే సంబంధిత రైతుల బిల్లులు డీఆర్‌డీఏ కార్యాలయానికి చేరాలని సూచించారు. ఆవిధంగా చర్యలు తీసుకున్నప్పుడే 72గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు.
బిల్లులు సకాలంలో పంపించడంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్య వైఖరి అవలంబించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఒక్కసారిగా ధాన్యం పేరుకుపోకుండా ముందస్తుగానే కేంద్రాలను ప్రారంభించాలన్నారు. వరి కామన్ రకాన్ని క్వింటాల్‌కు రూ.1360, గ్రేడ్ ఏ రాకానికి రూ. 1400, మొక్కజొన్నకు రూ. 1310లు మద్ధతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏ కొనుగోలు కేంద్రాల్లోను ఈ ధర కంటే తక్కువగా చెల్లిస్తే వారి పై కేసులు నమోదు చేయాలని సూచించారు. ధాన్యంలో తేమ 15 శాతం, రంగు మారిన ధాన్యం 5 శాతం, ముడుచుకుపోయిన ధాన్యం 3 శాతం, చెత్త, మట్టి పెడ్డలు 1శాతం కంటే ఎక్కువగా ఉండకూడదన్నారు. ధాన్యం కొనుగోలులో కనీస ప్రమాణాలను పాటించాలన్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన తరువాత రైతుల వద్ద నుంచి సరైన బ్యాంకు ఖాతా నంబరును తీసుకోవాలని, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే కనీసం అందులో రూ.500 ఉండేలా చూడాలని రైతులకు సూచించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఏసురత్నం, డీఎం మార్క్‌ఫెడ్ నాగమల్లిక, డీఎం సివిల్ సప్లయీస్ జయరాం, ఏపీడీ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ విజయలక్ష్మి, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, ఎరియా కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.