కుప్పలు.. తిప్పలు | Millers grain purchases Gunny Bags Telangana Govt | Sakshi
Sakshi News home page

కుప్పలు.. తిప్పలు

Published Thu, May 12 2022 4:12 AM | Last Updated on Thu, May 12 2022 4:12 AM

Millers grain purchases Gunny Bags Telangana Govt - Sakshi

నిజామాబాద్‌ జిల్లాలోని ఓ కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం నిల్వలు

10 కేజీలు తరుగు తీస్తూ.. 
ధాన్యం అంతా కొనుగోలు కేంద్రంలో ఉంది. మబ్బులు కమ్మి ఉన్నాయి. కనీసం పట్టాలను కూడా సరఫరా చేయలేదు. వానొస్తే కష్టమంతా నీటి పాలవుతుంది. కొనుగోలు కేంద్రాల వద్ద 5 కేజీలు తరుగు తీసేందుకు ఒప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా 10 కేజీల తరుగు తీస్తామంటున్నారు. ఇది రైతులను నిలువు దోపిడీ చేయడమే. ప్రభుత్వం, అధికారులు కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతోంది. 
– గడుపుడి వెంకటేశ్వర్లు, రైతు, అనాసాగరం,నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యానికి నిదర్శనమిది. రాష్ట్రవ్యాప్తంగా వరికోతలు సాగుతూ ధాన్యం కేంద్రాలకు పోటెత్తుతున్నా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. పలుచోట్ల గన్నీ బ్యా గుల కొరత, ఇతర సౌకర్యాలు సరిగా లేకపోవడం, ఇటీవలి అకాల వర్షాలతో ధాన్యం తడిసి తేమ శాతం పెరగడం, రంగు మారడం, అధికారుల అలసత్వం, మిల్లర్ల కొర్రీలు కలిసి కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు వడ్ల కుప్పలతో నిండిపోతున్నాయి. 

సంచులు, లారీల కొరత.. మిల్లర్ల కొర్రీలు 
రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఓవైపు గన్నీ సంచులకు, ధాన్యాన్ని మిల్లులకు తరలించే లారీలకు కొరత.. మరోవైపు సన్నరకాలే తీసుకుంటామంటూ, తరుగు తీస్తూ మిల్లర్లు పెడుతున్న కొర్రీలు సమస్యగా మారాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి ఇదే కారణమని కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు.  
► ఇటీవలి అకాల వర్షానికి యాదాద్రి, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, కరీంనగర్, వరంగల్, మెదక్, సంగారెడ్డి మొదలైన జిల్లాల్లో పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోయింది. ఆ ధాన్యాన్ని ఆరబెట్టినా కొనుగోలు చేసేందుకు సెంటర్లలో కొర్రీలు పెడుతున్నట్టు విమర్శలున్నాయి. వేస వి ఎండలు మండిపోతున్న పరిస్థితుల్లో తేమ శాతం ఎక్కువనే సమస్య లేకపోయినా.. ధా న్యం రంగుమారి నల్లబడిందని, ఇసుక చేరింద నే సాకులు చెప్తున్నట్టు రైతులు వాపోతున్నారు. 
► సరిపడిన మేర గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. గన్నీ బ్యాగులు లేక కొనుగోళ్లు చేయలేకపోతున్నామని కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. 
► అనేక ప్రాంతాల్లో హమాలీల సమస్య కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తోంది.  
► చాలాచోట్ల సెంటర్లలో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే లారీల కొరత కూడా వేధిస్తోంది. పెద్దపల్లి, కరీంనగర్‌ వంటి కొన్ని జిల్లాల్లో విక్రయించిన ధాన్యాన్ని రైతులే ట్రాక్టర్లను సమకూర్చుకొని మిల్లింగ్‌కు తరలించే పరిస్థితి ఉంది. 
► సన్నరకాల ధాన్యం అయితేనే తీసుకుంటామని, ఆ ధాన్యాన్నే ముందుగా పంపాలంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై మిల్లర్లు ఒత్తిడితెస్తున్నారు. దొడ్డు రకాల ధాన్యాన్ని తూకం వేసి పంపితే.. దాన్ని దింపుకోకుండా ఆలస్యం చేస్తున్నారు. లేకుంటే ఎక్కువ తరుగుకు ఒప్పుకొంటేనే ధాన్యం తీసుకుంటామంటూ కొర్రీ పెడుతున్నారు. ఇలా లారీలు రోజుల తరబడి నిలిచిపోవడం కూడా కొనుగోళ్లలో జాప్యానికి కారణమవుతోంది. 
► ఇక ఎఫ్‌సీఐ మిల్లుల్లో ప్రత్యక్ష తనిఖీలు చేపడుతుండటం, వానాకాలంలో సేకరించిన ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రస్తుత ధాన్యాన్ని తీసుకోలేక పోతున్నామని కొందరు మిల్లర్లు అంటున్నారు. 

మిల్లింగ్‌ నష్టం తేలక! 
యాసంగిలో రాష్ట్రం నుంచి 40.20 లక్షల టన్నుల బియ్యం తీసుకుంటామని.. అందులో 37.60 లక్షల టన్నులు రారైస్, 2.60 లక్షల టన్నులు ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ సూచించింది. తర్వాత మరింత ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ తీసుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు యాసంగి ధాన్యాన్ని రారైస్‌ (ముడిబియ్యం) చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే యాసంగి ధాన్యాన్ని రారైస్‌ (ముడి బియ్యం)గా మార్చితే నూకలు ఎక్కువ అవుతాయని, ఈ మేర కు ప్రభుత్వం నష్టాన్ని భరించాలని మిల్లర్లు డి మాండ్‌ చేస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం దీనిపై సీఎస్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ టెస్ట్‌ మిల్లింగ్‌ ఎప్పుడు పూర్తిచే స్తుంది, నష్టాన్ని ఇంకెప్పుడు నిర్ధారిస్తుందని మిల్ల ర్లు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల కూడా మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవడంలో వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారని అధికారవర్గాలే చెప్తున్నాయి. ∙రాష్ట్రంలో ఇప్పటివరకు ఆదిలాబాద్, వికారా బాద్‌ మినహా 30జిల్లాల్లో 5,883 కొనుగోలు కేంద్రాలను తెరిచినట్టు పౌరసరఫరాల శాఖ చెప్తున్నా.. 28 జిల్లాల్లోని 4,068 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్ల ప్రక్రియ మొదలైంది. 

► ప్రస్తుత సీజన్‌లో బుధవారం నాటికి 11,20,916 టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం సేకరించింది. గత (2020–21) యాసంగితో పోలిస్తే ఇది మూడో వంతు మాత్రమే కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి 31.22 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించడం విశేషం. 

ఎక్కడ చూసినా వరి కుప్పలే.. 
► మెదక్‌ జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలరోజులు గడిస్తున్నా పూర్తి స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ మొదలుకాలేదు. ఈసారి జిల్లాలో 3.77 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటివరకు 329 సెంటర్లు ఏర్పాటు చేసి 13,274 టన్నులే కొనడం గమనార్హం. జిల్లాకు కోటి గన్నీ బ్యాగులు కావాల్సి ఉండగా.. 20 లక్షల బస్తాలే వచ్చాయని అధికారులు చెప్తున్నారు. ఇక సన్నరకాల ధాన్యం అయితేనే తీసుకొంటామంటూ రైస్‌మిల్లర్లు మెలిక పెట్టడం వల్ల కూడా కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. 
► కరీంనగర్‌ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 95 వేల టన్నుల ధాన్యం సేకరించగా.. ఈసారి ఇంకా 49,911 టన్నులే కొనుగోలు చేశారు. జిల్లాలో 346 కేంద్రాలు ప్రారంభించినా.. 291 చోట్ల మాత్రమే, అదీ మందకొడిగా కొనుగోళ్లు సాగుతున్నాయి. ధాన్యం కుప్పలు పేరుకుపోతోంది. మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి కొర్రీలు పెడుతున్నారు. 
► రాష్ట్రం మొత్తంలో నిజామాబాద్‌ జిల్లాలోనే ఓ మోస్తరుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా యి. 449 కొనుగోలు కేంద్రాల్లో కలిపి మూడున్నర లక్షల టన్నుల మేర ధాన్యం సేకరించారు. అయితే వరికోతలు దాదాపు పూర్తవడంతో.. ధాన్యం రాశులుగా పోసి కనిపిస్తోంది. 
► మహబూబాబాద్‌ జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలనే ప్రారంభించారు. ఇప్పటివరకు కొన్న ధాన్యం 13 వేల టన్నులే. మిల్లర్లు కొర్రీలు పెడుతూ ప్రతిబస్తాకు 3 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. తీవ్ర జాప్యం జరుగుతుండటంతో.. రైతులు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లకు నేరుగా అమ్ముకుంటున్నారు. వ్యాపారులు కల్లాల వద్దే కాంటాలు పెట్టి ధాన్యం కొంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement