సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బుధవారం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాల్లో గ్రామాల వారీగా నగదు జమ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసింది. మొత్తంగా 17.03 లక్షల రైతుల అకౌంట్లకు ఇవాళ రైతుభరోసా నిధులు జమ కానున్నట్లు సమాచారం.
నాలుగు పథకాల అమలులో భాగంగా.. గణతంత్ర దినోత్సవంనాడు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. అయితే ఆరోజు సెలవు రోజు కావడంతో.. ఆ మరుసటిరోజు రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి తొలి విడతగా రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఆయా గ్రామాల్లో 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని సాగుభూమికి రూ.569 కోట్లను చెల్లించింది.
ఇక భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి రోజున 18,180 కుటుంబాలకు మొదటి విడతగా రూ.6 వేల నగదును వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజున ఆర్థికశాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది. రైతు భరోసా నగదు జమ ఆలస్యం అవుతుండడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment