Gunny bag
-
కుప్పలు.. తిప్పలు
10 కేజీలు తరుగు తీస్తూ.. ధాన్యం అంతా కొనుగోలు కేంద్రంలో ఉంది. మబ్బులు కమ్మి ఉన్నాయి. కనీసం పట్టాలను కూడా సరఫరా చేయలేదు. వానొస్తే కష్టమంతా నీటి పాలవుతుంది. కొనుగోలు కేంద్రాల వద్ద 5 కేజీలు తరుగు తీసేందుకు ఒప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా 10 కేజీల తరుగు తీస్తామంటున్నారు. ఇది రైతులను నిలువు దోపిడీ చేయడమే. ప్రభుత్వం, అధికారులు కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతోంది. – గడుపుడి వెంకటేశ్వర్లు, రైతు, అనాసాగరం,నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యానికి నిదర్శనమిది. రాష్ట్రవ్యాప్తంగా వరికోతలు సాగుతూ ధాన్యం కేంద్రాలకు పోటెత్తుతున్నా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. పలుచోట్ల గన్నీ బ్యా గుల కొరత, ఇతర సౌకర్యాలు సరిగా లేకపోవడం, ఇటీవలి అకాల వర్షాలతో ధాన్యం తడిసి తేమ శాతం పెరగడం, రంగు మారడం, అధికారుల అలసత్వం, మిల్లర్ల కొర్రీలు కలిసి కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు వడ్ల కుప్పలతో నిండిపోతున్నాయి. సంచులు, లారీల కొరత.. మిల్లర్ల కొర్రీలు రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఓవైపు గన్నీ సంచులకు, ధాన్యాన్ని మిల్లులకు తరలించే లారీలకు కొరత.. మరోవైపు సన్నరకాలే తీసుకుంటామంటూ, తరుగు తీస్తూ మిల్లర్లు పెడుతున్న కొర్రీలు సమస్యగా మారాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి ఇదే కారణమని కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. ► ఇటీవలి అకాల వర్షానికి యాదాద్రి, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, కరీంనగర్, వరంగల్, మెదక్, సంగారెడ్డి మొదలైన జిల్లాల్లో పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోయింది. ఆ ధాన్యాన్ని ఆరబెట్టినా కొనుగోలు చేసేందుకు సెంటర్లలో కొర్రీలు పెడుతున్నట్టు విమర్శలున్నాయి. వేస వి ఎండలు మండిపోతున్న పరిస్థితుల్లో తేమ శాతం ఎక్కువనే సమస్య లేకపోయినా.. ధా న్యం రంగుమారి నల్లబడిందని, ఇసుక చేరింద నే సాకులు చెప్తున్నట్టు రైతులు వాపోతున్నారు. ► సరిపడిన మేర గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. గన్నీ బ్యాగులు లేక కొనుగోళ్లు చేయలేకపోతున్నామని కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. ► అనేక ప్రాంతాల్లో హమాలీల సమస్య కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తోంది. ► చాలాచోట్ల సెంటర్లలో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే లారీల కొరత కూడా వేధిస్తోంది. పెద్దపల్లి, కరీంనగర్ వంటి కొన్ని జిల్లాల్లో విక్రయించిన ధాన్యాన్ని రైతులే ట్రాక్టర్లను సమకూర్చుకొని మిల్లింగ్‌కు తరలించే పరిస్థితి ఉంది. ► సన్నరకాల ధాన్యం అయితేనే తీసుకుంటామని, ఆ ధాన్యాన్నే ముందుగా పంపాలంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై మిల్లర్లు ఒత్తిడితెస్తున్నారు. దొడ్డు రకాల ధాన్యాన్ని తూకం వేసి పంపితే.. దాన్ని దింపుకోకుండా ఆలస్యం చేస్తున్నారు. లేకుంటే ఎక్కువ తరుగుకు ఒప్పుకొంటేనే ధాన్యం తీసుకుంటామంటూ కొర్రీ పెడుతున్నారు. ఇలా లారీలు రోజుల తరబడి నిలిచిపోవడం కూడా కొనుగోళ్లలో జాప్యానికి కారణమవుతోంది. ► ఇక ఎఫ్‌సీఐ మిల్లుల్లో ప్రత్యక్ష తనిఖీలు చేపడుతుండటం, వానాకాలంలో సేకరించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రస్తుత ధాన్యాన్ని తీసుకోలేక పోతున్నామని కొందరు మిల్లర్లు అంటున్నారు. మిల్లింగ్ నష్టం తేలక! యాసంగిలో రాష్ట్రం నుంచి 40.20 లక్షల టన్నుల బియ్యం తీసుకుంటామని.. అందులో 37.60 లక్షల టన్నులు రారైస్, 2.60 లక్షల టన్నులు ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ సూచించింది. తర్వాత మరింత ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు యాసంగి ధాన్యాన్ని రారైస్ (ముడిబియ్యం) చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే యాసంగి ధాన్యాన్ని రారైస్ (ముడి బియ్యం)గా మార్చితే నూకలు ఎక్కువ అవుతాయని, ఈ మేర కు ప్రభుత్వం నష్టాన్ని భరించాలని మిల్లర్లు డి మాండ్ చేస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం దీనిపై సీఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ టెస్ట్ మిల్లింగ్ ఎప్పుడు పూర్తిచే స్తుంది, నష్టాన్ని ఇంకెప్పుడు నిర్ధారిస్తుందని మిల్ల ర్లు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల కూడా మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవడంలో వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారని అధికారవర్గాలే చెప్తున్నాయి. ∙రాష్ట్రంలో ఇప్పటివరకు ఆదిలాబాద్, వికారా బాద్ మినహా 30జిల్లాల్లో 5,883 కొనుగోలు కేంద్రాలను తెరిచినట్టు పౌరసరఫరాల శాఖ చెప్తున్నా.. 28 జిల్లాల్లోని 4,068 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్ల ప్రక్రియ మొదలైంది. ► ప్రస్తుత సీజన్లో బుధవారం నాటికి 11,20,916 టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం సేకరించింది. గత (2020–21) యాసంగితో పోలిస్తే ఇది మూడో వంతు మాత్రమే కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి 31.22 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించడం విశేషం. ఎక్కడ చూసినా వరి కుప్పలే.. ► మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలరోజులు గడిస్తున్నా పూర్తి స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ మొదలుకాలేదు. ఈసారి జిల్లాలో 3.77 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటివరకు 329 సెంటర్లు ఏర్పాటు చేసి 13,274 టన్నులే కొనడం గమనార్హం. జిల్లాకు కోటి గన్నీ బ్యాగులు కావాల్సి ఉండగా.. 20 లక్షల బస్తాలే వచ్చాయని అధికారులు చెప్తున్నారు. ఇక సన్నరకాల ధాన్యం అయితేనే తీసుకొంటామంటూ రైస్‌మిల్లర్లు మెలిక పెట్టడం వల్ల కూడా కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. ► కరీంనగర్ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 95 వేల టన్నుల ధాన్యం సేకరించగా.. ఈసారి ఇంకా 49,911 టన్నులే కొనుగోలు చేశారు. జిల్లాలో 346 కేంద్రాలు ప్రారంభించినా.. 291 చోట్ల మాత్రమే, అదీ మందకొడిగా కొనుగోళ్లు సాగుతున్నాయి. ధాన్యం కుప్పలు పేరుకుపోతోంది. మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి కొర్రీలు పెడుతున్నారు. ► రాష్ట్రం మొత్తంలో నిజామాబాద్ జిల్లాలోనే ఓ మోస్తరుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా యి. 449 కొనుగోలు కేంద్రాల్లో కలిపి మూడున్నర లక్షల టన్నుల మేర ధాన్యం సేకరించారు. అయితే వరికోతలు దాదాపు పూర్తవడంతో.. ధాన్యం రాశులుగా పోసి కనిపిస్తోంది. ► మహబూబాబాద్ జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలనే ప్రారంభించారు. ఇప్పటివరకు కొన్న ధాన్యం 13 వేల టన్నులే. మిల్లర్లు కొర్రీలు పెడుతూ ప్రతిబస్తాకు 3 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. తీవ్ర జాప్యం జరుగుతుండటంతో.. రైతులు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లకు నేరుగా అమ్ముకుంటున్నారు. వ్యాపారులు కల్లాల వద్దే కాంటాలు పెట్టి ధాన్యం కొంటున్నారు. -
పంట చేతికొచ్చేవేళ.. గోనె సంచులేవీ?
వానాకాలం వరి కోతలు ఇప్పటికే మొదలయ్యాయి. దీంతోపాటే రైతులకు, అధికారులకు సమస్యలూ ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. అయితే భారీయెత్తున ధాన్యం సేకరణకు పెద్ద సంఖ్యలో గోనె సంచులు కూడా అవసరం. కేంద్రానికి ఇండెంట్ పెట్టడంతో పాటు పాత సంచుల సేకరణకు రాష్ట్ర అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ సంచుల కొరత తీవ్రంగా ఉండటం ఓ సమస్యగా మారింది. ఇటు రైతు విషయానికొస్తే.. డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో వరి కోసే యంత్రాల అద్దెలూ పెరగడంతో ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ధాన్యంలో తరుగు తీయవద్దంటూ తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అన్నదాతకు కొంతమేర ఉపశమనం కలిగించనున్నాయి. సాక్షి , హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమ య్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరందుకోగా, నిజామా బాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. కోసిన పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించినా.. ధాన్యం సేకరించేందుకు అవసరమైన గోనె సంచులు (గన్నీ బ్యాగులు) పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఈసారి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని భావి స్తున్న పౌర సరఫరాల శాఖకు 25 కోట్ల వరకు గన్నీ బ్యాగులు అవసర మవుతాయి. పంట కొను గోళ్ల సీజన్లో గన్నీ బ్యాగుల సమస్య ఎదురవు తున్నా పౌర సరఫరాల శాఖ ముందస్తు చర్యలు చేపట్ట డం లేదు. దీంతో ఈసారి ధాన్యం దిగుబడి భారీగా పెరగడంతో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. అందుబాటులో ఉన్న కొత్త బ్యాగులు 5.41 కోట్లే వానాకాలంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 16.73 లక్షల హెక్టార్లు కాగా.. సమృద్ధిగా కురిసిన వర్షాలు, భూగర్భ జలాల కారణంగా రికార్డు స్థాయిలో దాదాపు 25 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. తద్వారా 1.33 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని పౌరసరఫరాల శాఖ లెక్కలు కట్టింది. రైతుల ఆహార అవసరాలు, మిల్లర్ల కొనుగోళ్లు, విత్తనాల కోసం పోగా 1.01 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం 25.36 కోట్ల బ్యాగులు (సంచికి 40 కిలోల ధాన్యం చొప్పున నింపితే) అవసరం అవుతాయని పౌరసరఫరాల శాఖ అంచనా వేసి కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖకు వివరాలు పంపింది. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద కొత్త గన్నీ బ్యాగులు 5.41 కోట్లు అందుబాటులో ఉండగా, ఒకసారి వాడిన బ్యాగులు 49 లక్షలు ఉన్నాయి. మరో 54 లక్షలు చౌకధరల దుకాణదారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. అలాగే రైస్ మిల్లర్ల వద్ద ఒకసారి ఉపయోగించిన గన్నీ బ్యాగులు 1.38 కోట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో ఉన్న పాత గన్నీ బ్యాగులు కలిపి మొత్తంగా 8.06 కోట్ల గన్నీ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇంకా సుమారు 17.30 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని పౌరసరఫరాల శాఖ నిర్ధారించింది. బెంగాల్, ఏపీల్లో ఉత్పత్తిపైనే ఆధారం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కేంద్ర జౌళి శాఖకు ఇండెంట్ పెట్టినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. తదనుగుణంగా చెల్లించిన డీడీల ఆధారంగా పశ్చిమ బెంగాల్, ఏపీలోని ఏలూరు, విజయనగరం జిల్లాల్లో అందుబాటులో ఉన్న గన్నీ బ్యాగులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. దేశం మొత్తానికి పశ్చిమబెంగాల్, ఏపీల నుంచే గన్నీ బ్యాగులు సరఫరా కావలసిన నేపథ్యంలో లభ్యత ఆధారంగా సరఫరా జరుగుతుందని ఆ అధికారి తెలిపారు. అయితే వానాకాలం పంటలో తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున , కోతలు కోసినా ఆరబెట్టి మార్కెట్‌కు తెచ్చేందుకు సమయం పడుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది తలెత్తక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు. గోనె సంచుల సమస్య ఉత్పన్నం కాదు రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యం ఎంతైనా ప్రభుత్వమే కొంటుంది. సంచుల సమస్య ఉత్పన్నం కాదు. గన్నీ బ్యాగుల ఉత్పత్తిని బట్టి కేంద్రం ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పంపిస్తుంది. ఇప్పటికే కేంద్ర జౌళి శాఖకు పంపిన ఇండెంట్ ఆధారంగా సప్లై జరుగుతుందని భావిస్తున్నాం. గన్నీ బ్యాగులతో పాటు కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఆదేశాలు జారీ చేశాం. – గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి -
గోనె సంచుల కొరత తీరేలా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచుల అవసరం భారీగా పెరుగుతోంది. అటు రైతుల నుంచి ధాన్యం సేకరణ, ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీకి ఏటా 27 కోట్లకు పైగా గోనె సంచులు అవసరమవుతున్నాయి. రాష్ట్రంలో జనుము సాగు లేకపోవడం, గోనె సంచుల తయారీ పరిశ్రమలు లేకపోవడంతో వీటి కొనుగోలుకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని జనపనార పరిశ్రమలు తెలంగాణలో 80 శాతానికి పైగా గోనె సంచుల అవసరాలను తీరుస్తున్నాయి. జనుము సాగుకు పేరొందిన పశ్చిమ బెంగాల్, బిహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో జనపనార దిగుబడి తగ్గినా, అక్కడి పరిశ్రమల్లో సమస్యలు ఏర్పడినా ధాన్యం కొనుగోలు సమయంలో తెలంగాణ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జనుము సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు లాభం కలిగేలా చూడటంతో పాటు, రైతులు పండించే జనపనారను కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో జనపనార పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జనపనార పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో ఇటీవల కార్యాచరణ సిద్ధం చేసింది. రూ.887 కోట్లతో మూడు జనపనార పరిశ్రమలు... దేశవ్యాప్తంగా సుమారు 140కి పైగా జనపనార పరిశ్రమలు ఉండగా, తెలంగాణలో ఒక్క పరిశ్రమ కూడా లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా 38 వేలకు పైగా హెక్టార్లలో జనుము పంట సాగవుతుండగా పశ్చిమ బెంగాల్, బిహార్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనపనార ఉత్పత్తుల రంగంలో స్వయం స్వావలంబన సాధించేందుకు తొలి దశలో జనపనార పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గత నెలలో వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కో జనపనార పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలతో ఇటీవల పరిశ్రమల శాఖ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.887 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ మూడు పరిశ్రమల ద్వారా 10,448 మందికి ప్రత్యక్ష ఉపాధి, రెండింతల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. జనపనార పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి తెలంగాణ జౌళి, దుస్తుల విధానం కింద ప్రోత్సాహకాలు ఇస్తారు. ఆయా యూనిట్లు తయారు చేసే గోనె సంచులను రాష్ట్ర ప్రభుత్వం 20 ఏళ్లపాటు కొనుగోలు చేస్తుంది. తమకు అవసరమైన ముడి జనపనార కోసం రైతులు జనుము సాగు చేసేలా ఈ కంపెనీలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. 15 కోట్ల సంచుల ఉత్పత్తి సామర్థ్ద్యం... రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా ఏర్పడుతున్న మూడు పరిశ్రమలు ఏటా సుమారు 15 కోట్ల గోనె సంచులను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటికి అవసరమైన జనపనారను బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి రవాణా చేసేందుకు అయ్యే మొత్తాన్ని మొదటి ఏడాది వంద శాతం, మరో రెండేళ్లు 50 శాతం, ఆ తర్వాత ఐదేళ్లు 25శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ రూపంలో తిరిగి చెల్లిస్తుంది. అదే విధంగా కంపెనీలు తయారుచేసే గోనె సంచులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల కోసం వంద శాతం తిరిగి కొనుగోలు చేస్తుంది. ‘రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని పదేపదే చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆయా పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కూడా పెంపొందించాలని భావిస్తోంది. అందులో భాగంగానే జనపనార పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని జనపనార కంపెనీలు పెట్టుబడులతో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. – ‘సాక్షి’తో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ -
ఎడమచేయి, నడుములో లోపం ఉందని..
బనశంకరి: బస్టాండ్‌లో పడి ఉన్న గోనె సంచిని ఓ మహిళ ఇంటికి తీసుకెళ్లగా అందులో నుంచి పసికందు బయట పడింది. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కోగిళికుళి గ్రామానికి చెందిన మాదేవి వ్యవసాయ కూలీ. రోజూలానే బుధవారం ఉదయం కూలీ పనులకు వెళ్తూ గౌడళ్లి సమీపంలోని ఖాన్నగర బస్టాండుకు వెళ్లగా గోనె సంచి కనిపించింది.ఎవరో మరిచిపోయి ఉంటారని భావించి ఇంటికి తీసుకెళ్లింది. సంచిని పరిశీలించగా రోజుల వయసున్న మగబిడ్డ కనిపించింది. పోలీసులు, శిరసి సహాయట్రస్ట్ అధ్యక్షుడు సతీశ్శెట్టి వచ్చి పరిశీలించి ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల క్రితం శిశువు జన్మించిందని, బరువు 1.6కిలోలు ఉందని, ఎడమచేయి, నడుములో లోపం ఉందని, ఆరువేళ్లు ఉన్నాయని గుర్తించారు. కార్వార పోలీసులు పసికందు తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. -
హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచి..
టీ.నగర్: నాగర్‌కోవిల్ టౌన్ రైల్వేస్టేషన్లో గోనెసంచిలో దూరి నిద్రిస్తున్న యువకుడు హత్యకు గురైనట్లు వాట్సాప్‌లో వ్యాపించిన సమాచారం సంచలనం రేపింది. మొదటి ప్లాట్‌ఫాంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. రెండో ప్లాట్‌ఫాంలో మాత్రమే రైళ్లు వచ్చి వెళతాయి. ఉదయాన్నే అనేక మంది ఇక్కడికి వాకింగ్‌కు వస్తుంటారు. శనివారం ఉదయం వాకింగ్‌కు రాగా కొంతమంది ఒకటో ప్లాట్‌ఫాం సమీపంలో పసుపురంగు గోనెసంచిలో శరీరమంతా మూసుకుని ఒకరు కనిపించారు. ఉదయం ఎనిమిది గంటలకు అలాగే పడివుండడంతో గోనెసంచిలో యువకుడి శవం అంటూ వాట్సాప్‌లో పలువురు షేర్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, పత్రికా విలేకరులు అక్కడికి చేరుకున్నారు. హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచిన యువకుడు పక్కనున్న పాదరక్షలు వేసుకుని నడిచివెళ్లాడు. దీంతో అక్కడికి వచ్చిన వారు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని నవ్వుకుంటూ వెళ్లారు. వాట్సాప్ సమాచారం ఎంతపని చేస్తాయనుకుంటూ పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. చదవండి: మితిమీరిన కారు వేగం.. తెగిపడిన యువకుడి తల ఇండియా బుక్‌లోకి ‘ఎన్నికల వీరుడు’ -
గోనె సంచుల కొరతకు చెక్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచుల కొరతకు ఇక్కట్లు లేకుండా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. మిల్లర్లు, డీలర్ల నుంచి 3 కోట్ల సంచులు, కాంట్రాక్టర్ల నుంచి మరో 5 కోట్ల వరకు సంచులు వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం వద్ద ఇప్పటికే 8 కోట్ల గోనె సంచులు లభ్యతగా ఉండటంతో ధాన్యం సేకరణకు అడ్డంకులు తొలిగినట్లే. ఈ వారం నుంచి కొనుగోళ్లు మరింత ముమ్మరం కానున్న నేపథ్యంలో.. మొత్తం కొనుగోళ్లకు 20 కోట్ల సంచులు అవసరముండగా, తక్షణం 7 కోట్ల సంచుల వరకు అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మిల్లర్ల వద్ద నుంచి కనీసంగా 3 కోట్ల గోనె సంచులు సేకరించేలా లక్ష్యం పెట్టుకుంది. దీనికి ఒక్కో సంచికి రూ.18 చెల్లించేందుకు సిద్ధ్దమైంది. మిల్లర్ల నుంచి సైతం 3 కోట్లు సంచులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, వీరినుంచి కనీసంగా మరో 1.50 కోట్ల సంచులు వస్తాయని అంచనా వేశారు. మొత్తంగా మిల్లర్లు, డీలర్లు, కాంట్రాక్టర్ల నుంచే 8 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది. రాష్ట్రం వద్ద సైతం మరో 8 కోట్ల వరకు గోనె సంచులు లభ్యతగా ఉన్నాయి. వీటితో ఈ ఏడాది సీజన్‌ను గట్టెక్కించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. -
గోనె సంచులకు బార్ కోడ్..
సాక్షి, హైదరాబాద్: ధాన్యం రవాణా, ప్రజాపంపిణీ రవాణా, బియ్యం సరఫరా వంటి అంశాల్లో వినియోగిస్తున్న గోనె సంచుల విషయంలో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల సంస్థకు చెందిన గోనె సంచులు దుర్వినియోగం కాకుండా ప్రతీ సంచికి బార్‌కోడింగ్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతీ గన్నీ బ్యాగుకు క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ను ఇవ్వనుంది. దీని ద్వారా మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి వీలుకానుంది. ఈ కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేయడం ద్వారా వచ్చిన సమాచారాన్ని సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. ఇది దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అమల్లోకి తెస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌లలో త్వర లో దీనిని ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. మార్చే వీలు లేకుండా.. ఈ క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ను ఉపయోగించడం ద్వారా గోనె సంచుల వివరాలను మార్చడానికి వీలుండదు. సంచులు ఏ గోదాములో, ఏ జిల్లాల్లో ఉన్నాయి, ఏ రేషన్ షాపు వద్ద వీటిని వినియోగిస్తున్నారు వంటి వివరాలు పౌరసరఫరాలశాఖ వద్ద ఉంటాయి. ఈ సంచులను ఒకటి, రెండు సార్లు లేదా మల్టీ యూజ్‌గా ఉపయోగించారా? లేదా? అన్న విషయాలు తెలుసుకునే వీలుంది. ఈ సంచి ఉపయోగించే ప్రతి సందర్భంలోనూ స్కాన్ చేసి దాని వివరాలు అందుబాటులో ఉంచుతారు. ఈ విధానానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీగా నామకరణం చేశారు. ప్రతీ సీజన్లో ధాన్యం కొనుగోలు సమయంలో పౌరసరఫరాలశాఖ గోనెసంచులను కొనుగోలు చేసి మిల్లర్లకు అందజేస్తోంది. మిల్లర్లకు కేటాయిం చిన ధాన్యానికి సరిపడా సంచులు ఇవ్వాల్సిన జిల్లా మేనేజర్లు.. అవసరమైన దానికన్నా ఎక్కువ మొత్తంలో ఇస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారు. పైగా కస్టమ్ మిల్లింగ్ పెండింగ్‌లో ఉండటం, ఇచ్చిన గోనెసంచులు తిరిగి వెనక్కి రాకపోవడం, దీంతో మళ్లీ సీజన్ లో కొత్త బ్యాగులను కొనివ్వాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ విధంగా ఏకంగా ఆరేళ్లలో కొన్ని కోట్ల గోనెసంచులు లెక్కాపత్రం లేకుండా మాయమయ్యాయి. మరోవైపు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం దాదాపు కావాల్సిన 12 కోట్ల గన్నీ సంచులను అందుబాటులో ఉంచారు. ఈ సంచుల్లో అక్రమాలకు తావులేకుండా బార్‌కోడింగ్, క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ను ప్రవేశపెట్టారు. -
సంచి కథ కంచికేనా?
తూర్పుగోదావరి, మండపేట: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడేళ్లుగా సుమారు రూ.18 లక్షల విలువైన గోనె సంచుల గోల్మాల్ వ్యవహారంపై లెక్క తేలడం లేదు. పలుమార్లు విచారణ జరిపిన ఉన్నతాధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో సంచి కథను కంచికి చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విచారణ నివేదిక ఉన్నత స్థాయికి చేరకుండా అడ్డుకుంటున్నట్టు సమాచారం. గోనెసంచుల గల్లంతుతో డ్వాక్రా మహిళలకు అందాల్సిన ధాన్యం కొనుగోలు కమీషన్ దాదాపు రూ.20 లక్షలను పౌర సరఫరా అధికారులు నిలిపివేశారు. 2015–16 ఆర్ధిక సంవత్సరానికిగాను వెలుగు ఆధ్వర్యంలో మండపేట మండలంలోని అర్తమూరు, ద్వారపూడి, మండపేట, జెడ్ మేడపాడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు కోసం పౌర సరఫరాల శాఖ నుంచి దాదాపు 10.46 లక్షల గోనె సంచులు అందజేశారు. ఆయా సంచులను కొనుగోలు కేంద్రాల్లోనే ఉంచాల్సి ఉంది. మద్దతు ధరకు మించి మిల్లర్లు కొనుగోలు చేయడంతో అధిక శాతం మంది రైతులు నేరుగా మిల్లులకే విక్రయించేశారు. ఒక పర్యవేక్షణాధికారి, కొందరు మిల్లర్లు కుమ్మక్కై కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయాలు చేసినట్టు తప్పుడు రికార్డులు సృష్టించడంతోపాటు గోనె సంచులను మిల్లులకు తరలించేసినట్టు తెలుస్తోంది. పౌర సరఫరాల శాఖ రికార్డుల మేరకు 28,400 సంచులు ఉండాల్సి ఉండగా దాదాపు 3,500 సంచులు మాత్రమే ఉన్నట్టు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. సుమారు రూ.18 లక్షల విలువైన సంచులు గల్లంతైనట్టు అధికారులు గుర్తించారు. గోనె సంచుల గల్లంతుపై గతంలో ‘సాక్షి’ దిన పత్రికలో వచ్చిన కథనాలపై అధికారులు స్పందించారు. మే నెలలో ద్వారపూడి మహిళా సమాఖ్య భవనంలో తహసీల్దార్ వి.సీత, పోలీసుల సమక్షంలో అప్పటి డీఆర్డీఏ పీడీ మల్లిబాబు కేంద్రం నిర్వాహకులను, అప్పటి సిబ్బందిని విచారించారు. కేంద్రం నిర్వహణకు సంబంధించిన పాత రికార్డులను పరిశీలించగా ఒక రికార్డులో మూడు పేజీలు లేకపోవడాన్ని గుర్తించారు. అలాగే రికార్డుల కోసం ద్వారపూడి వెలుగు పీపీసీ పేరిట ఒక స్టాంపును మాత్రమే వినియోగించాల్సి ఉండగా ద్వారపూడి వెలుగు ఇన్చార్జి, ద్వారపూడి పీపీసీల పేరుతో స్టాంపులు వేసి ఉండటాన్ని ఆయన గుర్తించారు. ఇష్టారాజ్యంగా స్టాంపులు తయారు చేయించుకుని రికార్డులు నిర్వహించడంపై కేంద్రం నిర్వాహకుల నుంచి స్టేట్మెంట్లు నమోదు చేసుకున్నారు. సీజన్ ప్రారంభం, ముగింపు సందర్భంగా సంచుల ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్‌లలో వ్యత్యాసంపై ఆయన ఆరా తీశారు. ఆ విచారణ మరుగున పడిపోగా తాజాగా నెల రోజుల కిందట మరోమారు డీఆర్డీఏ అధికారులు విచారణ నిర్వహించారు. ఈ నివేదిక ఉన్నతాధికారులకు అందకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు అందని కమీషన్ గోనె సంచుల గల్లంతు నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల ద్వారా డ్వాక్రా సంఘాలకు అందాల్సిన కమీషన్, నిర్వహణకు సంబంధించిన బిల్లులు మొత్తం దాదాపు రూ.25 లక్షలు విడుదల చేయకుండా పౌర సరఫరాల అధికారులు నిలుపు చేశారు. కొందరు అక్రమార్కుల కారణంగా డ్వాక్రా సంఘాలకు అందాల్సిన కమీషన్ ఆగిపోయిందని స్థానికులు మండిపడుతున్నారు. గోనె సంచుల గల్లంతు వ్యవహారానికి సంబంధించి బాధ్యులైన వారి నుంచి రికవరీ చేసి డ్వాక్రా సంఘాల కమీషన్ సొమ్ములు అందజేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక ఏపీఎం సుప్రియను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు. -
మోసాలు.. మోపెడు
అధికార పార్టీ అండ ఉంది. ఏంచేసినా చెల్లుతుందనే నమ్మకముంది. ఇంకేముంది మోపెడ్‌పై సైతం వందలాది క్వింటాళ్ల ధాన్యం తరలించేసినట్లు బిల్లులు సృష్టించి దోచేసుకునే ధైర్యం వారికుంది. పౌర సరఫరాల శాఖలో తప్పుడు రవాణా బిల్లులు సైతం ‘పాస్’ చేయించుకొనే ‘ప్రసన్నాంజనేయుడి’ పవర్ అది. నందిగామ మార్కెట్‌యార్డులో ధాన్యం దోపిడీ తీరు ఇది. సాక్షి, అమరావతిబ్యూరో : టీవీఎస్–ఎక్స్ఎల్ మోపెడ్ వాహనంపై ఎన్ని బస్తాలు తీసుకెళ్లవచ్చు? మహా అయితే 10 బస్తాల వరకు సాధ్యపడవచ్చు. అదే ఆటో రిక్షాలో ఓ 20 బస్తాలు.. ఇక ఇండికా కారు అనుకోండి 30 బస్తాలు సరే. కానీ.. నందిగామ మార్కెట్‌యార్డు నుంచి ఓ టీవీఎస్ మోపెడ్ వాహనంపై ఏకంగా 713 బస్తాలు, టాటా ఇండికా కారులో 463 బస్తాలు, ఆటో రిక్షాలో 537 బస్తాలు సరఫరా చేసినట్లు నిసిగ్గుగా రికార్డులు రాసేశారు. ఇదొక్కటే కాదు ఒక లారీలో ఏకంగా 1203 బస్తాలు సరఫరా చేయడం ఒక్క ‘ప్రసన్నాంజనేయ’ గ్రామైక్య సంఘానికే చెల్లింది. అధికార పార్టీ నాయకుల అండదండలతో పీపీసీ కమిటీ సభ్యురాలు ధాన్యం రవాణా పేరిట చేసిన అడ్డగోలు దోపిడీని చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ఇంత జరిగినా, ప్రభుత్వ సొమ్మును అక్రమంగా లూటీ చేసినా పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లో వెళితే.. రవాణా చేశారిలా.. మార్కెట్ యార్డుల్లో పీపీసీ కమిటీల ద్వారా సేకరించిన చేసిన ధాన్యాన్ని సాధారణంగా పౌరసరఫరాల సంస్థ టెండర్ల ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న ట్రాన్స్పోర్టర్లు సరఫరా చేస్తుంటారు. కాగా, నందిగామ మార్కెట్‌యార్డులో ప్రసన్నాంజనేయ గ్రామైక్య సంఘం పేరిట సేకరించిన ధాన్యాన్ని కూడా టెండరు దక్కించుకున్న అన్నపూర్ణ లారీ ట్రాన్స్‌పోర్టు సరఫరా చేసినట్లు రికార్డుల్లో చూపెట్టారు. కానీ ఇక్కడ ధాన్యం సరఫరా చేసేందుకు లారీలను ఉపయోగించకపోగా నిబంధనలకు విరుద్ధంగా టీవీఎస్ మోపెడ్, ఆటో రిక్షాలు, ఇండికా కారు, రవాణాశాఖ కార్యాలయ చరిత్రలో లేని సీరిస్ నంబర్ల పేరిట ఉన్న లారీల్లో సరఫరా చేసేశారు. ఆ వాహనాల నంబర్ల మీదే బిల్లులురూపొందించారు. లారీల్లో సరఫరా చేసిన ధాన్యం కన్నా ఇతర వాహనాల్లో సరఫరా చేసిన ధాన్యమే ఎక్కువగా ఉండటం గమనార్హం. అయితే ఇవేవీ పౌరసరఫరాల సంస్థ అధికారులకు పట్టలేదు. పైగా వారు రూపొందించిన తప్పుడు రవాణా బిల్లులకు ఆమోదం తెలిపి పరోక్షంగా ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి సహకరించారు. రూ. 33.81లక్షల దోపిడీ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు స్థానికంగా ఉండే పౌరసరఫరాల గోదాములకు తరలిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం లారీల ద్వారానే జరుగుతుంది. కానీ నందిగామ మార్కెట్ యార్డు నుంచి తరలించిన ధాన్యం మాత్రం అధిక భాగం లారీల్లో కాకుండా సాధారణ వాహనాల్లో అది కూడా టీవీఎస్–50, ఆటో రిక్షా, టాటా ఇండికా కారు, ట్రాక్టర్ లాంటి వాటిపై వేలాది బస్తాలను తరలించినట్లు చూపెట్టారు. 1992 మోడల్‌కు చెందిన టీవీఎస్–50ఎక్స్ఎల్( అ్క07 8544) పై 13 ్ర టిప్పులు చొప్పున ∙Ðð ¬త ్తం 7000 బస్తాలను సరఫరా చే సిన ట్లు రి కారు ్డల్లో ^è ప గా.. రవాణా శా ఖ రి కారు ్డల్లో లేని అ్క20 6770 నంబరు గల లారీ ద్వారా 15 ట్రిప్పులు చొప్పున సుమారు 9వేల బస్తాలు, ఏపీఎస్టీ 1234 లారీ ద్వారా 2,500 బస్తాలు సరఫరా చేసినట్లు ప్రసన్నాంజనేయ సంఘం రికార్డుల్లో చూపింది. ఈ రెండు లారీల నంబర్లు రవాణా శాఖ రికార్డుల్లోనే లేకపోవడం విశేషం. ఇలా లేని లారీలు ఉన్నట్లుగా.. రైతుల వద్ద సేకరించని ధాన్యాన్ని సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించి నాలుగేళ్ల వ్యవధిలో రవాణా చార్జీల పేరిట రూ. 33.81 లక్షలు దోచుకున్నారు. గన్నీ బ్యాగ్‌ల డబ్బును వదల్లేదు నందిగామ మార్కెట్‌యార్డు కమిటీలో నాలుగేళ్ల కాలంలో ‘ప్రసన్నాంజనేయ’ పరపతి సంఘం చెబుతున్నవన్నీ దొంగ లెక్కలేనని తేలింది. వారు ధాన్యాన్ని సరఫరా చేసినట్లు చూపుతున్న వాహనాలు కొన్ని లేకపోవడం.కొన్నింటిలో సరఫరా చేయడానికి సాధ్యం కాని వాహనాలు ఉండటం చూస్తే 90 శాతం వరకు ధాన్యాన్ని రైతుల వద్ద కొనుగోలు చేయనేలేదని సుస్పష్టమవుతోంది. అయితే వారు ధాన్యం సేకరించినట్లుగా.. వాటికి కొత్త బ్యాగుల్లో నింపినట్లుగా చూపెట్టారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఒక్కో బ్యాగ్‌కు రూ. 15ల చొప్పున వసూలు చేశారు. వారు చెబుతున్న లెక్కల ప్రకారం మొత్తం 1.53,705.6 క్వింటాళ్లకు గానూ 3,84,262 బ్యాగులు(50 కేజీల బస్తా బ్యాగులు) కొనుగోలు చేయడానికి రూ. 57.63 లక్షల వరకు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపారు. కానీ వారు ఎలాంటి బ్యాగులు కొనకుండా ఆ డబ్బునూ నిసిగ్గుగా నొక్కేశారు. -
వేలాది ఆధార్ కార్డులు అలా...అవాక్కయ్యేలా!
సాక్షి, ముంబై: ఒకవైపు బ్యాంకు ఖాతా, సంక్షేమ పథకాలు సహా పలు రకాలుగా ఆధార్ నంబర్‌ను అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తుండగా ఓ షాకింగ్ ఉదంతం ఒకటి కలకలం రేపింది. ఒక పాడుబడిన బావిలో ఒరిజినల్ ఆధార్ కార్డులు దర్శనమివ్వడం షాకింగ్‌కు గురి చేసింది. మహారాష్త్ర యవత్మాల్లోని షిండేనగర్ ప్రాంతంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..తాగునీటికి తీవ్ర కొరత దృష్ట్యా నీటి వనరులను ఉపయోగించుకునేలా కొంతమంది యువకులు చొరవ చూపారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఒక బావిని బాగు చేసుకునేందుకు రంగంలోకి దిగారు. యవత్మాల్ నగరంలోని యువకుల ప్రయత్నాన్ని అభినందించిన జిల్లా కలెక్టర్ రాజేష్ దేశ్‌ముఖ్‌తోపాటు కొంతమంది ఎన్జీవోలు కూడా బావులు నుంచి చెత్తను తొలగించటానికి ముందుకు వచ్చాయి. ఇక్కడే అందరూ విస్తుపోయేలా సంఘటన.. వేలాది ఒరిజినల్ ఆధార్‌కార్డుల సంచులు వెలుగు చూశాయి. నైలాన్ గోనె సంచుల్లో ప్యాక్ చేసి, రాళ్ళతో కట్టిమరీ పారవేసిన వేలాది ఆధార్ కార్డులను వారు కనుగొన్నారు. దీంతో అవాక్కయైన అధికారులు విచారణకు ఆదేశించారు. దర్యాప్తుకోసం ఒక కమిటినీ ఏర్పాటు చేశామని, పూర్తి నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించారు. మరోవైపు బావిలో ఉన్న ఆధార్‌కార్డుల పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, వివరాలు వివరాలు చదవగలిగేలా ఉన్నాయట. -
మహిళను హత్య చేసి మూటలో పడేశారు
-
గోనె సంచి కలకలం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బూర్కుంట తండాలో ఓ గోనె సంచి కలకలం రేపింది. గ్రామ శివారులోని మర్రిచెట్టుపైన కొమ్మకు వేలాడదీసిన గోనెసంచిని శనివారం ఉదయం స్థానికులు గమనించారు. ఆ సంచి నుంచి ఏదో ద్రావణం చుక్కలుగా కారుతుండటంతో.. గ్రామస్తులు శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు. -
గోనెసంచిలో మృతదేహం
అర్వపల్లి (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా అర్వపల్లి మండలం నాగారం బంగ్లా గ్రామంలోని ఓ పాడుబడిన బావిలో గోనె సంచిలో మూటకట్టిన మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. నాగారం బంగ్లాకు చెందిన జాముల ముత్తయ్య(85) పది రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఎక్కడ గాలించినా ఆచూకీ లభించలేదు. కాగా ఆదివారం ఉదయం పాడుబడిన బావిలో నీటిపై ఒక గోనెసంచి తేలుతుండగా స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మూటను బావి నుంచి వెలికి తీశారు. మూటలో ఉన్న మృతదేహాన్ని ముత్తయ్యదిగా గుర్తించారు. ఎవరో చంపి మూటకట్టి బావిలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గోనెసంచిలో మృతదేహం
పరిగి: గోనెసంచిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన పరిగిలో బుధవారం తీవ్ర కలకలం రేపింది. దుండగులు హత్య చేసి మృతదేహాన్ని పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద యం ఎప్పటిలాగే పరిగి పంచాయతీ కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తున్నారు. పరిగి- హైదరాబాద్ రహదారిలో భవానీ థియేటర్ సమీపంలోని కల్వర్టు కింద చెత్తచెదారం ఎక్కువగా ఉండటంతో కార్మికులు వెళ్లారు. దుర్వాసన రావడంతో పరిశీలించగా ఓ తెల్లని గోనెసంచిలో గొర్రె కళేబరం కనిపించింది. ఇంకొంచెం లోపలికి వెళ్లి చూడగా మరో గోనె సంచిలో సగభాగం లోపల, మిగతా భాగం బయట ఉన్న వ్యక్తి మృతదేహం కనిపించింది. కార్మికుల నుంచి విషయం తెలుసుకున్న పరిగి సర్పంచ్ విజయమాలసురేందర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పరిగి సీఐ ప్రసాద్, ఎస్ఐ షేక్ శంషొద్దీన్‌లు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. మృతుడు చొక్కాపైన బనియన్, నలుపురంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. దాదాపు 35 ఏళ్ల వయసు ఉండొచ్చని భావిస్తున్నారు. గుర్తుతెలియని దుండగులు దాదాపు నాలుగు రోజుల క్రితం అతడిని గొంతునులిమి చంపేసి ఇక్కడ పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే విషయం పక్కదారి పట్టించేందుకే మృతదేహం పక్కనే అదే తరహాలో గోనెసంచిలో కట్టి గొర్రె కళేబరాన్ని పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. వ్యక్తి హత్య విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే కేసును త్వరగా ఛేదించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఇటీవల దుండగులు మహబూబ్‌నగర్ జిల్లాలో హత్యలు చేసి రంగారెడ్డి జిల్లాలో మృతదేహాలు పడేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని చెప్పారు. స్థానికులు హతుడిని గుర్తించలేదు. పోలీసు జాగిలాన్ని రప్పించినా మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో ఫలితం లేకుండా పోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సందర్శించి సీఐ ప్రసాద్ నుంచి వివరాలు సేకరించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.