అధికార పార్టీ అండ ఉంది. ఏంచేసినా చెల్లుతుందనే నమ్మకముంది. ఇంకేముంది మోపెడ్‌పై సైతం వందలాది క్వింటాళ్ల ధాన్యం తరలించేసినట్లు బిల్లులు సృష్టించి దోచేసుకునే ధైర్యం వారికుంది. పౌర సరఫరాల శాఖలో తప్పుడు రవాణా బిల్లులు సైతం ‘పాస్’ చేయించుకొనే ‘ప్రసన్నాంజనేయుడి’ పవర్ అది. నందిగామ మార్కెట్‌యార్డులో ధాన్యం దోపిడీ తీరు ఇది.
సాక్షి, అమరావతిబ్యూరో : టీవీఎస్–ఎక్స్‌ఎల్ మోపెడ్ వాహనంపై ఎన్ని బస్తాలు తీసుకెళ్లవచ్చు? మహా అయితే 10 బస్తాల వరకు సాధ్యపడవచ్చు. అదే ఆటో రిక్షాలో ఓ 20 బస్తాలు.. ఇక ఇండికా కారు అనుకోండి 30 బస్తాలు సరే. కానీ.. నందిగామ మార్కెట్‌యార్డు నుంచి ఓ టీవీఎస్ మోపెడ్ వాహనంపై ఏకంగా 713 బస్తాలు, టాటా ఇండికా కారులో 463 బస్తాలు, ఆటో రిక్షాలో 537 బస్తాలు సరఫరా చేసినట్లు నిసిగ్గుగా రికార్డులు రాసేశారు. ఇదొక్కటే కాదు ఒక లారీలో ఏకంగా 1203 బస్తాలు సరఫరా చేయడం ఒక్క ‘ప్రసన్నాంజనేయ’ గ్రామైక్య సంఘానికే చెల్లింది. అధికార పార్టీ నాయకుల అండదండలతో పీపీసీ కమిటీ సభ్యురాలు ధాన్యం రవాణా పేరిట చేసిన అడ్డగోలు దోపిడీని చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ఇంత జరిగినా, ప్రభుత్వ సొమ్మును అక్రమంగా లూటీ చేసినా పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లో వెళితే..
రవాణా చేశారిలా..
మార్కెట్ యార్డుల్లో పీపీసీ కమిటీల ద్వారా సేకరించిన చేసిన ధాన్యాన్ని సాధారణంగా పౌరసరఫరాల సంస్థ టెండర్ల ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న ట్రాన్స్‌పోర్టర్లు సరఫరా చేస్తుంటారు. కాగా, నందిగామ మార్కెట్‌యార్డులో ప్రసన్నాంజనేయ గ్రామైక్య సంఘం పేరిట సేకరించిన ధాన్యాన్ని కూడా టెండరు దక్కించుకున్న అన్నపూర్ణ లారీ ట్రాన్స్‌పోర్టు సరఫరా చేసినట్లు రికార్డుల్లో చూపెట్టారు. కానీ ఇక్కడ ధాన్యం సరఫరా చేసేందుకు లారీలను ఉపయోగించకపోగా నిబంధనలకు విరుద్ధంగా టీవీఎస్ మోపెడ్, ఆటో రిక్షాలు, ఇండికా కారు, రవాణాశాఖ కార్యాలయ చరిత్రలో లేని సీరిస్ నంబర్ల పేరిట ఉన్న లారీల్లో సరఫరా చేసేశారు. ఆ వాహనాల నంబర్ల మీదే బిల్లులురూపొందించారు. లారీల్లో సరఫరా చేసిన ధాన్యం కన్నా ఇతర వాహనాల్లో సరఫరా చేసిన ధాన్యమే ఎక్కువగా ఉండటం గమనార్హం. అయితే ఇవేవీ పౌరసరఫరాల సంస్థ అధికారులకు పట్టలేదు. పైగా వారు రూపొందించిన తప్పుడు రవాణా బిల్లులకు ఆమోదం తెలిపి పరోక్షంగా ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి సహకరించారు.
రూ. 33.81లక్షల దోపిడీ
ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు స్థానికంగా ఉండే పౌరసరఫరాల గోదాములకు తరలిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం లారీల ద్వారానే జరుగుతుంది. కానీ నందిగామ మార్కెట్ యార్డు నుంచి తరలించిన ధాన్యం మాత్రం అధిక భాగం లారీల్లో కాకుండా సాధారణ వాహనాల్లో అది కూడా టీవీఎస్–50, ఆటో రిక్షా, టాటా ఇండికా కారు, ట్రాక్టర్ లాంటి వాటిపై వేలాది బస్తాలను తరలించినట్లు చూపెట్టారు. 1992 మోడల్‌కు చెందిన టీవీఎస్–50ఎక్స్‌ఎల్( అ్క07 8544) పై 13 ్ర టిప్పులు చొప్పున ∙Ðð ¬త ్తం 7000 బస్తాలను సరఫరా చే సిన ట్లు రి కారు ్డల్లో ^è ప గా.. రవాణా శా ఖ రి కారు ్డల్లో లేని అ్క20 6770 నంబరు గల లారీ ద్వారా 15 ట్రిప్పులు చొప్పున సుమారు 9వేల బస్తాలు, ఏపీఎస్‌టీ 1234 లారీ ద్వారా 2,500 బస్తాలు సరఫరా చేసినట్లు ప్రసన్నాంజనేయ సంఘం రికార్డుల్లో చూపింది. ఈ రెండు లారీల నంబర్లు రవాణా శాఖ రికార్డుల్లోనే లేకపోవడం విశేషం. ఇలా లేని లారీలు ఉన్నట్లుగా.. రైతుల వద్ద సేకరించని ధాన్యాన్ని సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించి నాలుగేళ్ల వ్యవధిలో రవాణా చార్జీల పేరిట రూ. 33.81 లక్షలు దోచుకున్నారు.
గన్నీ బ్యాగ్‌ల డబ్బును వదల్లేదు
నందిగామ మార్కెట్‌యార్డు కమిటీలో నాలుగేళ్ల కాలంలో ‘ప్రసన్నాంజనేయ’ పరపతి సంఘం చెబుతున్నవన్నీ దొంగ లెక్కలేనని తేలింది. వారు ధాన్యాన్ని సరఫరా చేసినట్లు చూపుతున్న వాహనాలు కొన్ని లేకపోవడం.కొన్నింటిలో సరఫరా చేయడానికి సాధ్యం కాని వాహనాలు ఉండటం చూస్తే 90 శాతం వరకు ధాన్యాన్ని రైతుల వద్ద కొనుగోలు చేయనేలేదని సుస్పష్టమవుతోంది. అయితే వారు ధాన్యం సేకరించినట్లుగా.. వాటికి కొత్త బ్యాగుల్లో నింపినట్లుగా చూపెట్టారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఒక్కో బ్యాగ్‌కు రూ. 15ల చొప్పున వసూలు చేశారు. వారు చెబుతున్న లెక్కల ప్రకారం మొత్తం 1.53,705.6 క్వింటాళ్లకు గానూ 3,84,262 బ్యాగులు(50 కేజీల బస్తా బ్యాగులు) కొనుగోలు చేయడానికి రూ. 57.63 లక్షల వరకు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపారు. కానీ వారు ఎలాంటి బ్యాగులు కొనకుండా ఆ డబ్బునూ నిసిగ్గుగా నొక్కేశారు.
Comments
Please login to add a commentAdd a comment