అవినీతి సరఫరా
- పనిని బట్టి రేటు నిర్ణయం
- దాడులు చేసినా అంతా గోప్యం
- కేసులు పెట్టడం.. డబ్బులు గుంజడం నిత్యకృత్యం
- అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉన్నతాధికారులు
విశాఖ రూరల్ : పౌర సరఫరాల శాఖ అవినీతిమయమైంది. కాసులు దండుకునే పనిలో నిమగ్నమైంది. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు మామూళ్ల మత్తలో జోగుతున్నారు. ఒక్కో పనికి ఒక్కో ధరను వసూలు చేస్తూ వ్యాపారులు, డీలర్లను పీల్చుకుతింటున్నారు. నెలకు రూ.5 నుంచి రూ.10 లక్షలు వరకు వసూలు చేసి పంపకాలు చేసుకుంటున్నారన్న వాదన వ్యక్తమవుతోంది.
జిల్లాలో ఆహారధాన్యాలు, వాటి ఉత్పత్తుల వ్యాపారాలు చేయాలంటే విధిగా పౌర సరఫరా శాఖ అధికారుల నుంచి అనుమతి ఉండాలి. ఈ లెసైన్సుల మంజూరు కోసం భారీగా పౌర సరఫరా అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎఫ్‌జీఎల్ లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారులను రోజుల తరబడి తిప్పడం, చివరకు వ్యాపార పెట్టుబడిని బట్టి మామూళ్లు వసూలు పరిపాటిగా మారింది.
సకాలంలో లెసైన్సు మంజూరుకు చిన్న వ్యాపారానికి రూ.3,500 నుంచి రూ.6 వేలు, పెద్ద వ్యాపారానికి రూ.15 వేలు నుంచి రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే అమావాస్య, పున్నమికి ఒకసారి దాడులు నిర్వహించే సమయంలో ఈ వ్యాపారాలు సక్రమంగా లేవని తేలినా, స్టాకు నిల్వల్లో తేడాలున్నా అధికారుల పంట పడినట్టే. 6ఏ కేసు పెట్టకుండా ఉండడానికి వ్యాపారుల గల్లా పెట్టెలు ఊడ్చేస్తున్నారు.
డీలర్లను పిండేస్తున్నారు... జిల్లాలో కార్డుదారులందరికీ సక్రమంగా నిత్యావసరాలు సరఫరా అవుతున్నాయో లేదో చూడాల్సిన అధికారులు ఆ విషయాన్ని పక్కనపెడుతున్నారు. భారీగా సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు. కొంత మంది డీలర్లు ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకోని అధికారులు మామూళ్ల విషయంలో కచ్చితంగా ఉంటున్నారు.
ముఖ్యంగా చెకింగ్ ఇన్స్‌పెక్టర్ల ద్వారా ప్రతీ నెలా డీలర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యం. వెయ్యి నుంచి 1500 వరకు కార్డులున్న ఒక్కో షాపు నుంచి రూ.1500 నుంచి రూ.2 వేలు దండుకుంటున్నారు. అలాగే అధికంగా ఫిర్యాదులు వస్తే మాత్రం దాడులు చేసినట్లు చేసి 6ఏ కేసులు పెడతామని బెదిరించి చివరకు కార్డులను బట్టి వారి నుంచి రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో 14 కిరోసిన్ హోల్‌సేల్ డీలర్లు ఉన్నారు. రికార్డుల ప్రకారం వీరు ప్రతీ నెలా కిరోసిన్ సరఫరా చేస్తున్నట్లు చూపిస్తున్నారు.
అయితే ఈ చౌక కిరోసిన్ అధికంగా బయట మార్కెట్‌కు తరలిపోతున్న విషయం అనేక సార్లు బహిర్గతమైంది. దీనిని పట్టించుకోని అధికారులు ఒక్కో డీలర్ నుంచి ప్రతీ నెలా రూ.5వేలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే గ్యాస్ డీలర్లు, పెట్రోల్ బంక్‌ల నుంచి కూడా రూ.లక్ష నుంచి రూ.1.75 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పౌర సరఫరాల శాఖలో అంతా గోప్యమే. నెలసరి మామూళ్లు రావడంతో దాడులు జరగడమే గగనం. ఉన్నతాధికారులు ఆదేశాలతో అప్పుడు దాడులు చేసినా ఆ విషయం బయటకు పొక్కనీయడం లేదు. కేసులు పెట్టడం తరువాత డబ్బులు వసూలు చేసి చర్యలు తీసుకోకుండా వదిలేడయం సర్వ సాధారణమైపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.