సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచుల అవసరం భారీగా పెరుగుతోంది. అటు రైతుల నుంచి ధాన్యం సేకరణ, ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీకి ఏటా 27 కోట్లకు పైగా గోనె సంచులు అవసరమవుతున్నాయి. రాష్ట్రంలో జనుము సాగు లేకపోవడం, గోనె సంచుల తయారీ పరిశ్రమలు లేకపోవడంతో వీటి కొనుగోలుకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లోని జనపనార పరిశ్రమలు తెలంగాణలో 80 శాతానికి పైగా గోనె సంచుల అవసరాలను తీరుస్తున్నాయి. జనుము సాగుకు పేరొందిన పశ్చిమ బెంగాల్, బిహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో జనపనార దిగుబడి తగ్గినా, అక్కడి పరిశ్రమల్లో సమస్యలు ఏర్పడినా ధాన్యం కొనుగోలు సమయంలో తెలంగాణ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జనుము సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు లాభం కలిగేలా చూడటంతో పాటు, రైతులు పండించే జనపనారను కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో జనపనార పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
జనపనార పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో ఇటీవల కార్యాచరణ సిద్ధం చేసింది.
రూ.887 కోట్లతో మూడు జనపనార పరిశ్రమలు...
దేశవ్యాప్తంగా సుమారు 140కి పైగా జనపనార పరిశ్రమలు ఉండగా, తెలంగాణలో ఒక్క పరిశ్రమ కూడా లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా 38 వేలకు పైగా హెక్టార్లలో జనుము పంట సాగవుతుండగా పశ్చిమ బెంగాల్, బిహార్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనపనార ఉత్పత్తుల రంగంలో స్వయం స్వావలంబన సాధించేందుకు తొలి దశలో జనపనార పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గత నెలలో వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కో జనపనార పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలతో ఇటీవల పరిశ్రమల శాఖ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
రూ.887 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ మూడు పరిశ్రమల ద్వారా 10,448 మందికి ప్రత్యక్ష ఉపాధి, రెండింతల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. జనపనార పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి తెలంగాణ జౌళి, దుస్తుల విధానం కింద ప్రోత్సాహకాలు ఇస్తారు. ఆయా యూనిట్లు తయారు చేసే గోనె సంచులను రాష్ట్ర ప్రభుత్వం 20 ఏళ్లపాటు కొనుగోలు చేస్తుంది. తమకు అవసరమైన ముడి జనపనార కోసం రైతులు జనుము సాగు చేసేలా ఈ కంపెనీలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి.
15 కోట్ల సంచుల ఉత్పత్తి సామర్థ్ద్యం...
రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా ఏర్పడుతున్న మూడు పరిశ్రమలు ఏటా సుమారు 15 కోట్ల గోనె సంచులను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటికి అవసరమైన జనపనారను బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి రవాణా చేసేందుకు అయ్యే మొత్తాన్ని మొదటి ఏడాది వంద శాతం, మరో రెండేళ్లు 50 శాతం, ఆ తర్వాత ఐదేళ్లు 25శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌పోర్ట్ సబ్సిడీ రూపంలో తిరిగి చెల్లిస్తుంది. అదే విధంగా కంపెనీలు తయారుచేసే గోనె సంచులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల కోసం వంద శాతం తిరిగి కొనుగోలు చేస్తుంది.
‘రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని పదేపదే చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆయా పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కూడా పెంపొందించాలని భావిస్తోంది. అందులో భాగంగానే జనపనార పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని జనపనార కంపెనీలు పెట్టుబడులతో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
– ‘సాక్షి’తో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్
Comments
Please login to add a commentAdd a comment