వానాకాలం వరి కోతలు ఇప్పటికే మొదలయ్యాయి. దీంతోపాటే రైతులకు, అధికారులకు సమస్యలూ ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. అయితే భారీయెత్తున ధాన్యం సేకరణకు పెద్ద సంఖ్యలో గోనె సంచులు కూడా అవసరం. కేంద్రానికి ఇండెంట్ పెట్టడంతో పాటు పాత సంచుల సేకరణకు రాష్ట్ర అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ సంచుల కొరత తీవ్రంగా ఉండటం ఓ సమస్యగా మారింది. ఇటు రైతు విషయానికొస్తే.. డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో వరి కోసే యంత్రాల అద్దెలూ పెరగడంతో ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ధాన్యంలో తరుగు తీయవద్దంటూ తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అన్నదాతకు కొంతమేర ఉపశమనం కలిగించనున్నాయి.
సాక్షి , హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమ య్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరందుకోగా, నిజామా బాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. కోసిన పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించినా.. ధాన్యం సేకరించేందుకు అవసరమైన గోనె సంచులు (గన్నీ బ్యాగులు) పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఈసారి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని భావి స్తున్న పౌర సరఫరాల శాఖకు 25 కోట్ల వరకు గన్నీ బ్యాగులు అవసర మవుతాయి. పంట కొను గోళ్ల సీజన్‌లో గన్నీ బ్యాగుల సమస్య ఎదురవు తున్నా పౌర సరఫరాల శాఖ ముందస్తు చర్యలు చేపట్ట డం లేదు. దీంతో ఈసారి ధాన్యం దిగుబడి భారీగా పెరగడంతో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే సూచనలు కన్పిస్తున్నాయి.
అందుబాటులో ఉన్న కొత్త బ్యాగులు 5.41 కోట్లే
వానాకాలంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 16.73 లక్షల హెక్టార్లు కాగా.. సమృద్ధిగా కురిసిన వర్షాలు, భూగర్భ జలాల కారణంగా రికార్డు స్థాయిలో దాదాపు 25 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. తద్వారా 1.33 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని పౌరసరఫరాల శాఖ లెక్కలు కట్టింది. రైతుల ఆహార అవసరాలు, మిల్లర్ల కొనుగోళ్లు, విత్తనాల కోసం పోగా 1.01 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం 25.36 కోట్ల బ్యాగులు (సంచికి 40 కిలోల ధాన్యం చొప్పున నింపితే) అవసరం అవుతాయని పౌరసరఫరాల శాఖ అంచనా వేసి కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖకు వివరాలు పంపింది.
ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద కొత్త గన్నీ బ్యాగులు 5.41 కోట్లు అందుబాటులో ఉండగా, ఒకసారి వాడిన బ్యాగులు 49 లక్షలు ఉన్నాయి. మరో 54 లక్షలు చౌకధరల దుకాణదారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. అలాగే రైస్ మిల్లర్ల వద్ద ఒకసారి ఉపయోగించిన గన్నీ బ్యాగులు 1.38 కోట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో ఉన్న పాత గన్నీ బ్యాగులు కలిపి మొత్తంగా 8.06 కోట్ల గన్నీ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇంకా సుమారు 17.30 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని పౌరసరఫరాల శాఖ నిర్ధారించింది.
బెంగాల్, ఏపీల్లో ఉత్పత్తిపైనే ఆధారం
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కేంద్ర జౌళి శాఖకు ఇండెంట్ పెట్టినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. తదనుగుణంగా చెల్లించిన డీడీల ఆధారంగా పశ్చిమ బెంగాల్, ఏపీలోని ఏలూరు, విజయనగరం జిల్లాల్లో అందుబాటులో ఉన్న గన్నీ బ్యాగులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. దేశం మొత్తానికి పశ్చిమబెంగాల్, ఏపీల నుంచే గన్నీ బ్యాగులు సరఫరా కావలసిన నేపథ్యంలో లభ్యత ఆధారంగా సరఫరా జరుగుతుందని ఆ అధికారి తెలిపారు. అయితే వానాకాలం పంటలో తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున , కోతలు కోసినా ఆరబెట్టి మార్కెట్‌కు తెచ్చేందుకు సమయం పడుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది తలెత్తక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
గోనె సంచుల సమస్య ఉత్పన్నం కాదు
రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యం ఎంతైనా ప్రభుత్వమే కొంటుంది. సంచుల సమస్య ఉత్పన్నం కాదు. గన్నీ బ్యాగుల ఉత్పత్తిని బట్టి కేంద్రం ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పంపిస్తుంది. ఇప్పటికే కేంద్ర జౌళి శాఖకు పంపిన ఇండెంట్ ఆధారంగా సప్లై జరుగుతుందని భావిస్తున్నాం. గన్నీ బ్యాగులతో పాటు కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఆదేశాలు జారీ చేశాం.
– గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment