
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, మిల్లర్లతో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని పౌర సరఫరాల సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి అంశాన్నయినా ఉపేక్షించబోమని, కఠినచర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.
రాష్ట్రం ధాన్యం సేకరణలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని, 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ స్థాయి నుంచి కోటి 41 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పౌర సరఫరాల సంస్థ మేనేజర్లు, ఉద్యోగులతో మంత్రి సోమవారం హైదరాబాద్‌లోని కార్పొరేషన్ భవన్‌లో సమావేశమయ్యారు. ఉద్యోగుల డైరీని ఆవిష్కరించి, వారికి హెల్త్‌కార్డులు అందజేశారు.