Paddy procurement
-
ధాన్యం కొనుగోలులో దళారీలు వచ్చేసారు..
-
బాబు పాలనలో ధాన్యం సేకరణ, మద్దతు ధర రెండూ లేవు
-
ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం
నెల్లూరు (బారకాసు): ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని సీఎం చంద్రబాబు చెబితే... ఈ రోజు కొన్ని పత్రికలు మాత్రం మాట మార్చి ‘అవకతవకలు, తప్పులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ, అవి గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల..’ అంటూ వారి చేతకానితనాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా రూ.13,500కు బదులు రూ.20 వేలు ఇస్తామన్న హామీ ఇప్పటివరకు అమలు చేయలేదు. వారు చెప్పిన అన్నదాత సుఖీభవ అనేది చివరికి చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా మారింది. మద్దతు ధర దక్కకపోవడానికి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పిన మీ మాటలే నిజమైతే... ఈ ఆరు నెలలు ప్రక్షాళన చేయకుండా గాడిదలు కాస్తున్నారా? రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకి లేకపోవడం వల్లే సమస్యలు పునరావృతం అవుతున్నాయి. ఆ నెపాన్ని గత ప్రభుత్వం, అధికారులపై నెట్టివేసి పబ్బం గడుపుతున్నారు.వైఎస్ జగన్ హయాంలోనే రైతులకు గిట్టుబాటు ధర లభించిందని టీడీపీ సానుభూతిపరులు కూడా అంగీకరించారు. అప్పట్లో ధాన్యం సేకరణ విధానాలు బాగున్నాయని వారు చెప్పారు. రైతుల ఇబ్బందులపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించారు. చిత్తశుద్ధితో పని చేసిన సీఎం జగన్ అయితే... ప్రెస్మీట్లు పెట్టి ఏమీ చేయకుండానే ఆహా.. ఓహో.. అని తన భుజాలను తానే తట్టుకునే సీఎం చంద్రబాబు’ అని కాకాణి అన్నారు.ఇవిగో వాస్తవ గణాంకాలు...‘జగన్మోహన్రెడ్డి హయాంలో 2019–24 మధ్య ధాన్యం కొనుగోళ్లు 18 లక్షల టన్నులు తగ్గిందని చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారు. కానీ, వాస్తవాలు చూస్తే ధాన్యం సేకరణ నుంచి అమ్మకం వరకు అన్ని విభాగాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెరుగ్గా పని చేసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 17.94 లక్షల మంది రైతుల నుంచి 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, వారికి రూ.40,236 కోట్లు చెల్లించారు.అదే 2019–23 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 37.70 లక్షల మంది రైతుల నుంచి 3,40,24,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.65,255 కోట్లు చెల్లించాం.’ అని కాకాణి వివరించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల వాస్తవ పరిస్థితిని గుర్తించి, సజావుగా జరిగేలా చూడాలి. రైతులకు తప్పనిసరిగా కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేసి అన్ని జిల్లాల కలెక్టరేట్లకు వెళ్లి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు. -
మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న
సాక్షి, అమరావతి: అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొని ఆదుకోండి మహాప్రభో.. అంటూ ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కంకులతోనే నిరసనలకు దిగారు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయల ఎదుటే సోమవారం పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. తుపాను ప్రభావంతో కురిసిన వరా్షలకు తడిసి ముద్దయిన ధాన్యం రాసుల వద్దే నిరసనలతో తమ ధైన్య స్థితిని తెలియజేశారు. తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలని, వర్షాల వల్ల రంగుమారిన, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనాలని, ధాన్యం సొమ్ము 48 గంటల్లోనే ఖాతాల్లో జమ చేయాలని, జీఎల్టీ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలంటూ నినాదాలు చేశారు. ధర్నాలు చేసిన తర్వాత మండల తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.గింజ ధాన్యానికి కూడా పూర్తి మద్దతు ధర దక్కలేదురాష్ట్రంలో ఏ ఒక్క రైతు నుంచి కనీస మద్దతు ధరకు గింజ కూడా ఈ ప్రభుత్వం కొనలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గింజా కనీస మద్దతు ధరకు కొంటామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని మండిపడ్డారు. ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఈ నిరసనలు మిన్నంటాయి. పెద్ద సంఖ్యలో రైతులు, కౌలు రైతులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దళారులు, మిల్లర్లు తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాధికారులు కూడా దళారుల అవతారమెత్తి రైతులను నిలువు దోపిడి చేస్తున్నారంటూ ఆరోపించారు. 25 శాతం తేమ ఉన్నా కొంటామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు పత్తా లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోలేదంటూ మండిపాటుతుపాను వస్తుందని ముందుగానే తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. కళ్లాలపై ఉన్న పంటను కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. తేమ శాతం పేరుతో ముప్పతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తాకు రూ.1,725 ఇవ్వాల్సి ఉండగా, రైతు సేవా కేంద్రంలోనే రూ.1,450కు మించి రాదని చెబుతున్నారని తెలిపారు. పైగా తరుగు రూపంలో 15 నుంచి 20 బస్తాలు తగ్గించి రశీదులిస్తున్నారని, ఎందుకిలా కోత విధిస్తున్నారని అడిగితే సమాధానం చెప్పే నాధుడే లేరని చెప్పారు. గతంలో రైతు భరోసా కేంద్ర (ఆర్బీకే) – మిల్లులకు మధ్య మ్యాపింగ్ ఉండేదని, ప్రస్తుతం పొరుగు జిల్లాలకు కూడా ఇష్టమొచ్చినట్టు తోలుతున్నారని ఆరోపించారు. రవాణా చార్జీల భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాల్సి ఉండగా, దానినీ రైతుల నెత్తిన వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే సరఫరా చేసిన ఎంటీయూ 1262 రకం విత్తనాన్ని సాగు చేస్తే, ఆ ధాన్యాన్ని ఇప్పుడు ఎవరూ కొనడంలేదని వాపోయారు. బీపీటీ, ముతకలు మాత్రమే కొనమని చెప్పారని, మధ్యస్తంగా ఉండే ఎంటీయూ 1262 కొనలేమని చెబుతున్నారని, దీంతో దళారులకు 75 కేజీల బస్తా రూ.1,250 నుంచి రూ.1,350కు అమ్ముకోవల్సి వస్తోందని వాపోయారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి ఆర్బీకే పరిధిలో ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయిందని, ఇక మీదట కొనేది లేదంటూ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సగం కూడా కొనకుండానే లక్ష్యం పూర్తయిందని చెప్పడంలో అర్థం ఏమిటని మండిపడుతున్నారు.గింజ కొనే వారు లేరు..కృష్ణా జిల్లా మొవ్వ మండలం అవురుపూడికి చెందిన ఈ రైతు పేరు ఎం.హరిబాబు. 5.30 ఎకరాల్లో వరి సాగు చేసి గత నెల 24న కోసి 25న నూర్చారు. 29న రైతు సేవా కేంద్రానికి వెళితే 24 శాతం తేమ వచ్చింది. 30 కాటా వేశారు. తేమ 25 శాతం ఉన్నా మద్దతు ధరకు కొంటామని 4 రోజుల క్రితం మంత్రి మనోహర్ చెప్పారు. నిన్నటికి నిన్న తేమ 17శాతం కంటే ఎక్కువ ఉంటే బస్తాకు 5 కిలోల తరుగుతో ధాన్యం తెనాలిలో చెప్పారు. ఆ లెక్కనైనా అదనంగా ఉన్న తేమ శాతానికి తరుగు మినహాయించుకొని మద్దతు ధర లెక్కగట్టి ఇవ్వాలని అడుగుతుంటే.. మిల్లర్లు రూ.1,450కు మించి ఇవ్వబోమంటున్నారని అధికారులు చెబుతున్నారని హరిబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పంట కోసి ఆరబెట్టేందుకు కూలీలకు రూ.3 వేలు, టార్పాలిన్ల అద్దె రూ. 8 వేలు ఖర్చయిందని తెలిపారు. ధాన్యం తరలించకపోతే మొలకలొస్తాయని మొత్తుకుంటున్నా అధికారులు స్పందించడంలేదని, తూర్పు గోదావరి నుంచి లారీలు వస్తే పంపిస్తామని అంటున్నారే తప్ప ఎంత రేటుకు కొంటారో చెప్పడం లేదని హరిబాబు వాపోతున్నారు.ఇదేనా 48 గంటల్లో డబ్బులేయడమంటే..ఈ రైతు పేరు వేమూరి నాగేశ్వరరావు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామం. ఒకటిన్నర ఎకరాల్లో వరి పంటను కోసి గతనెల 20న కాటా వేశారు. 40 కిలోల చొప్పున 96 బస్తాలు రైతుసేవా కేంద్రం ద్వారా బాలాజీ రైస్ మిల్లుకు ఈ నెల 21వ తేదీన పంపారు. అదే రోజున ఎఫ్‌టీవో 906200015240005 జనరేట్ అయ్యింది. కానీ 81 బస్తాలకే రశీదు ఇచ్చారు. 24న రూ.74,520 రైతు ఖాతాలో జమైనట్టుగా మెసేజ్ వచ్చింది. బ్యాంకులో చూసుకుంటే సొమ్ములు పడలేదు. రైతు సేవా కేంద్రానికి వెళ్లి అడిగితే బ్యాంక్ ఖాతాకు మీ ఆధార్ లింక్ అయి ఉండకపోవచ్చని చెప్పారు. రెండ్రోజులు పనులు మానుకొని బ్యాంకు చుట్టూ తిరిగి ఆధార్ లింక్ చేశారు. 26 నుంచి రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు రాలేదు. అడిగితే కంగారెందుకు.. నాలుగు రోజులాగండంటూ చిరాకు పడుతున్నారని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా 96 బస్తాలకుగాను 81 బస్తాలకే రశీదు ఇచ్చారని వాపోయారు. గతంలో ఇటువంటి పరిస్థితులు లేవని చెప్పారు. -
టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్నదాతలను టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది. తుపాను హెచ్చరికలున్నా ముందుస్తు చర్యలు చేపట్టకుండా వారిని నడిరోడ్డుపై వదిలేసింది. కోసిన పంటను కొనుగోలు చేసే దిక్కులేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాలకు కళ్లెదుటే తడిసిపోతున్న ధాన్యాన్ని కాపాడుకోలేక నిస్సహాయ స్థితిలో కుంగిపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన తిండి గింజలను అమ్ముకోవడానికి హీనమైన దుస్థితి అనుభవిస్తున్నారు. వాస్తవానికి.. ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ప్రారంభం నుంచే దళారులు, మిల్లర్ల దందాకు టీడీపీ కూటమి ప్రభుత్వం గేట్లు తెరిచింది. ఫలితంగా గ్రామాల్లో రైతుసేవా కేంద్రాలకు వెళ్లిన కర్షకులకు నిరాశ తప్ప భరోసా దక్కట్లేదు. వర్షాల సాకుతో మద్దతు ధరలో మరింత కోత పెట్టేందుకు వారు కుట్రలు చేస్తున్నా సర్కారు కళ్లుండీ కబోదిలా వ్యవహరిస్తోంది. దీంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా పరిస్థితి తయారైంది. ఫలితంగా మిల్లర్లు, దళారులు ధాన్యం కొనడం నిలిపేశారు. రైతులు బతిమాలితే నామమాత్రపు ధర ఇచ్చి సరిపెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడచూసినా ఇలాంటి దోపిడీయే సాక్షాత్కరిస్తోంది. 75 కిలోలకు మద్దతు ధరలో కోత పెట్టడంతో పాటు అదనంగా మరో కేజీ దండుకుంటూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. మరోవైపు.. అకాల వర్షానికి ధాన్యాన్ని కాపాడుకోలేక.. రంగు మారుతుందన్న భయంతో.. మొలక వస్తుందన్న దిగులుతో రోడ్లపైనే ధాన్యం రాశుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా సాధారణ రకం ధాన్యానికి రూ.2,300, ఏ–గ్రేడ్‌కు రూ.2,320గా మద్దతు ధర ప్రకటించింది. ఇందులో 75 కిలోల బస్తాకు సాధారణ రకం రూ.1,725, ఏ–గ్రేడ్‌కు రూ.1,740 గిట్టుబాటు ధర ఇవ్వాలి. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు 75 కేజీల బస్తాకు రూ.300 నుంచి రూ.400కి పైగా నష్టపోతున్నాడు. ఇలా ఎకరాకు సుమారు రూ.8 వేల నుంచి రూ.9 వేలకు పైగా మద్దతు ధరను దళారులు, మిల్లర్లు దోచేస్తున్నారు.రైతుకు అన్యాయం జరుగుతోంది..‘‘నేను టీడీపీ కార్యకర్తను. శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడి (నీటి సంఘాలు)గా పనిచేశా. కిందటేడాది మద్దతు ధరకు తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం అమ్ముకున్నాం. ఇప్పుడు రైతుకు అన్యాయం జరుగుతోంది. తేమ శాతం పేరుతో మిల్లర్లు దగా చేస్తున్నారు. నేను 20 ఎకరాలు సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను. తొమ్మిది ఎకరాల్లో ‘1061’ రకం సాగుచేశా. ధాన్యాన్ని రూ.1,500 (76 కిలోల బస్తా) అమ్ముకున్నా. ఇక్కడే ఒక బస్తాకు రూ.23 నష్టపోతున్నాను. మరో పదెకరాల్లో ‘1262’ రకాన్ని సాగుచేశా. ఇప్పుడు కోసి ఆరబెట్టా. దీనిని కొనేవాడు లేడు. సంచులు కూడా ఇవ్వట్లేదు. కేవలం రూ.1,400 అయితే కొంటామని బేరగాళ్లు చెబుతున్నారు. అలా అమ్ముకోవడానికి ఇష్టంలేక కాపాడుకోవడానికి నానా యాతన పడుతున్నాను’’.. ..ఇదీ కృష్ణాజిల్లా శ్రీకాకుళం గ్రామానికి చెందిన రైతు దోనేపూడి గోపీకృష్ణ ఆవేదన. రైతుగా తనకు జరుగుతున్న నష్టాన్ని ఆయన వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తు్తన్నారు.మాఫియాకే ‘మద్దతు’!రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం మాఫియాను తలదన్నేలా జరుగుతోంది. పేరుకే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తోంది. నిజానికి.. ప్రభుత్వమే రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తే పూర్తిగా మేలు జరుగుతుంది. కానీ, పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వం దగ్గరకు రైతు వెళ్తే.. ‘సంచుల్లేవు.. కూలీల్లేరు.. ఇప్పుడు కొనలేం’.. అంటూ నిరుత్సాహపరిచే సమాధానాలు ఎదురవుతున్నాయి. పోనీ బయట అమ్ముకుందామంటే మిల్లర్లు, దళారులు మొత్తం సిండికేట్ అయిపోయారు. వారి ఆజ్ఞలేనిదే రైతుకు సంచులు, హమాలీలు వచ్చే పరిస్థితిలేదు. సంచులు వస్తేనే పంటను బస్తాల్లో నింపుకుని తరలించేందుకు వీలుంటుంది. వీటన్నింటివల్ల రైతులు నిస్సహాయ స్థితిలో గతిలేక దళారులు, మిల్లర్లు చెప్పిన రేటుకే పంటను అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది. పైగా తేమ శాతం పేరుతో కోత కూడా విధిస్తున్నారు. దళారులు మాత్రం రైతుల పేరుతోనే ప్రభుత్వానికి విక్రయించి పూర్తి మద్దతు ధరను సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు.. రైతుసేవా కేంద్రంలో తేమ శాతం సక్రమంగా ఉన్నప్పటికీ పూర్తి మద్దతు ధర వస్తుందన్న గ్యారంటీ లేదు. పక్క జిల్లాల మిల్లులకు తీసుకెళ్లండిఇదిలా ఉంటే.. ఫెంగల్ తుపాను దెబ్బకు కోస్తాలో అకాల వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కృష్ణాజిల్లాలోని రైతాంగం కుదేలైంది. కోసిన పంట వర్షానికి తడిసిపోగా.. కోతకొచ్చిన పంట నేలవాలిపోయింది. తుపాను హెచ్చరికలకు వారానికి ముందు కోసిన పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. విజయవాడ నగర శివారు నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారికి ఇరువైపుల సుమారు 60 కిలోమీటర్ల మేర వర్షంలో తడుస్తున్న ధాన్యపు రాశులే దర్శమిస్తున్నాయి. ఇక్కడ యుద్ధప్రాతిపదికన పంటను తరలించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. మరోవైపు. కొన్న అరకొర ధాన్యం కాస్తా మిల్లుల బయట రోజుల తరబడి వాహనాల్లో నానుతోంది. దీంతో రైతులను తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమలోని మిల్లులకు ధాన్యాన్ని తరలించుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. వ్యయ ప్రయాసలు కోర్చి అలా తరలించినా అక్కడ అన్‌లోడింగ్‌కు రోజులు తరబడి సమయంపడుతోంది. సుమారు 100 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు లోడును తీసుకెళ్తే రవాణ ఖర్చు తడిసిమోపుడు అవుతోందని రైతులు వాపోతున్నారు. అక్కడ వెంటనే దిగుమతి చేయకుంటే వాహనానికి వెయిటింగ్ చార్జీలు గుదిబండలా మారుతాయని భయపడుతున్నారు. ఇలా పక్క జిల్లా మిల్లులకు తరలించుకుంటే నష్టం తప్ప పైసా లాభంలేదని వారు పెదవి విరుస్తున్నారు. ఇక కృష్ణాజిల్లాలో ధాన్యం తరలింపునకు ప్రభుత్వం అసలు కాంట్రాక్టరునే నియమించలేదని తెలుస్తోంది. ఫలితంగా రైతులు సొంతంగా లోడును తరలించుకోలేక.. మిల్లరు వాహనం పంపిస్తే.. వాళ్లు చెప్పిన ధరకే పంటను విక్రయించాల్సి వస్తోంది.గతంలో ఎంతో మేలు..గతంలో ప్రభుత్వం గోనె సంచులు, హమాలీలు, రవాణా నిమిత్తం రైతుకు జీఎల్టీ చెల్లించేంది. సొంత వాహనాలున్న రైతులు హాయిగా తమకు ట్యాగ్ చేసిన మిల్లులకు లోడును తీసుకెళ్లే వారు. వాహనాల్లేని రైతుల కోసం ప్రభుత్వం రవాణా సౌకర్యం ఏర్పాటుచేసేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం తల్లకిందులైంది. రైతే సొంతంగా మిల్లుకు ధాన్యాన్ని తోలుకుంటే జీఎల్టీ రాకపోగా పూర్తి మద్దతు ధర కూడా దక్కడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 39 లక్షల మంది రైతుల నుంచి రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకు సేకరించారు.‘హాయ్’ అన్నా పలకని ప్రభుత్వం..పౌరసరఫరాల సంస్థలో వాట్సాప్ ద్వారా రైతులు ‘హాయ్’ అని సందేశం పంపి వివరాలు నమోదుచేస్తే గంటల వ్యవధిలోనే ధాన్యం కొనుగోలు చేస్తామంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ఆర్భాటంగా ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ, రైతులు ‘హాయ్’ అంటుంటే అటు నుంచి కనీస స్పందన కరువైంది. పైగా.. తమ గోడు చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రయత్నించినా ఉలుకూ.. పలుకూ ఉండట్లేదని రైతులు వాపోతున్నారు.11,157 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలుఅత్యధికంగా 10,426 ఎకరాల్లో వరిపంటకే నష్టంఆ తర్వాత వేరుశనగ, అపరాలకు.. అంచనా వేసిన వ్యవసాయశాఖఫెంగల్ తుపాను ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం 11,157 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంట్లో 10,426 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్లు గుర్తించారు. 501 ఎకరాల్లో వేరుశనగ, 180 ఎకరాల్లో మినుము, 50 ఎకరాలల్లో కంది, పెసర, మొక్కజొన్న పంటలు ముంపునకు గుర్యయాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 9,612 ఎకరాలు, నెల్లూరులో 643 ఎకరాలు, చిత్తూరులో 522 ఎకరాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.భయమేస్తోంది..నేను కౌలుకు సాగుచేస్తున్నా. 40 ఎకరాల్లో వరి వేశా. ఇప్పుడు 20 ఎకరాల్లో కోత కోశాను. వర్షాలు పడుతుండడంతో పంటను మిల్లులకు తరలించా. ఇంకా 20 ఎకరాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. రెండ్రోజులుగా తుపానుతో వీస్తున్న గాలులకు పంట నేలవాలింది. ఇంకా వర్షం అధికంగా వస్తుందని చెబుతున్నారు. నేలవాలిన పంటను కోత కోయడానికి ఎకరాకు పదివేల వరకు అడుగుతున్నారు. కనీసం పెట్టుబడి చేతికి రాకపోగా నష్టం వస్తుందేమోనని భయమేస్తోంది. – యనమదల వెంకటేశ్వరరావు, కౌలు రైతు, మద్దూరు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా కొనేవారు కరువయ్యారు.. ‘1318’ రకం ధాన్యం సాగుచేశాను. ఐదెకరాలకు పైగా పంటను కోశాను. ధాన్యం కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇంతలో వర్షం రావడంతో తడిసిపోయింది. మిల్లర్లు కూడా స్పందించట్లేదు. రైతుసేవా కేంద్రాల దగ్గరకు వెళ్తే సంచులిస్తాం.. లారీలో మండపేటకు తీసుకెళ్లమని చెబుతున్నారు. పచ్చి ధాన్యం సంచుల్లో నింపితే రంగుమారి, మొలకలు వస్తాయి. రూ.1,400కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎవ్వరూ కొనట్లేదు. – వీరంకి చెన్నకేశవులు, జుజ్జువరం, పామర్రు మండలం, కృష్ణాజిల్లాఅన్ని విధాలా నష్టపోయాం.. పంట కోతకు రావడంతో కోసేశాం. ఇంతలో తుపాను వచ్చింది. వడ్లను ఆరబెట్టుకునేలోగా తడిసిపోయాయి. పంటను తీసుకెళ్లే దారి లేకపోవడంతో రోడ్ల పక్కనే టార్పాలిన్లు కప్పి ఉంచాం. ఆవిరికి రంగుమారి చెడిపోయే ప్రమాదం ఉంది. ఏంచేయాలో దిక్కుతోచట్లేదు. కౌలుకు చేసుకుంటున్న మేం అన్ని విధాలా నష్టపోయాం. – నాంచారమ్మ, జుజ్జువరం, పామర్రు మండలం, కృష్ణాజిల్లాగతంలో ఇలా ఇబ్బంది పడలేదు పండించిన పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వ అధికారులు సంచులు కూడా ఇవ్వలేదు. వర్షం వస్తోందని తెలిసి మిల్లరు దగ్గరకు వెళ్తే సంచులు ఇచ్చాడు. ఇప్పుడు సరుకు అక్కడికి తీసుకెళ్తేగాని రేటు చెప్పరు. ఇక తేమ ఎక్కువగా ఉంది.. ఆరబెట్టుకోండని రైతుసేవా కేంద్రంలో చెప్పారు. ఈ వర్షాల్లో ధాన్యాన్ని ఎక్కడ ఆరబోసుకుంటాం. ఒక్కరోజు ఆలస్యమైతే రంగుమారి పోతుంది. గతంలో మాకెప్పుడూ ఇబ్బందిలేదు. ఇప్పుడు తక్కువకు అడుగుతున్నారు. మద్దతు ధర రాకపోయినా.. అమ్ముకోక తప్పదు. మద్దతు ధర వచ్చినా రాకపోయినా కౌలు పూర్తిగా చెల్లించాలి కదా?. – పి. వెంకటేశ్వరరావు, రామరాజుపాలెం, గూడూరు మండలం, కృష్ణాజిల్లా -
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా సాఫీగా జరిగేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రాధాన్యతాంశంగా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంపై సీఎం సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వార్తా కథనాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. కాగా ఉమ్మడి జిల్లాలకు గతంలో నియమించిన ప్రత్యేకాధికారులకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1న ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. జిల్లాల ప్రత్యేకాధికారులు వీరే: ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల : కృష్ణ ఆదిత్య కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల : ఆర్వీ కర్ణన్ నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట : అనితా రామచంద్రన్ నిజామాబాద్, కామారెడ్డి : డాక్టర్ ఎ.శరత్ రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి : డి.దివ్య మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ : ధరావత్ రవి వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ : టి.వినయ కృష్ణారెడ్డి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట : హరిచందన దాసరి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం : కె.సురేంద్ర మోహన్ -
మిల్లర్ల కతలు.. రైతుల వెతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు రైస్‌మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న ప్రకటించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ పాలసీ తమను నష్టాల పాలు చేస్తుందని వారు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీనితో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడింది. కొనుగోలు కేంద్రాల్లోనే భారీగా ధాన్యం పోగుపడుతోంది. అకాల వర్షాలతో ఆ ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఏం చేయాలో పాలుపోక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. మిల్లర్ల విజ్ఞప్తులను తోసిపుచ్చడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎంఆర్ పాలసీ విషయంలో మిల్లర్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలున్నాయి. సన్న ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయడానికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ‘ఔటర్న్’ను సవరించాలని మిల్లర్లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనితోపాటు మిల్లులు తమకు కేటాయించే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ముడి బియ్యం మిల్లర్లు పోరుబాట పట్టారు. నిజానికి ధాన్యం సేకరణ పాలసీ ప్రకటించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల మొదటి వారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పరిశీలన జరిపిన ఉప సంఘం గత నెలాఖరులో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో ధాన్యం సేకరణ, రైతులకు బోనస్, అధికారుల బాధ్యతలను పేర్కొన్న సర్కారు.. మిల్లర్ల డిమాండ్లను పట్టించుకోలేదు. ‘ఔటర్న్’ తగ్గించాలనే డిమాండ్.. ఒక క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు వచ్చే బియ్యం, నూకల లెక్కను ‘ఔటర్న్’ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఔటర్న్ ప్రకారం.. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విధానం కింద మిల్లర్లకు చేరే ప్రతి 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాల నేపథ్యంలో.. బియ్యం తక్కువగా వస్తుందని, నూకలు ఎక్కువగా వస్తాయని మిల్లర్లు చెప్తున్నారు. చాలా జిల్లాల్లో ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే.. 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు కలిపి 67 కిలోలు వస్తాయని వారు ప్రభుత్వంతో చర్చల సందర్భంగా వివరించారు. తమకు నష్టం కలిగించే ఈ ఔటర్న్ లెక్కను సరిదిద్దాలని కోరారు. మధ్యేమార్గంగా 62 కిలోల ఔటర్న్ నిర్ణయిస్తే.. నూకలను విక్రయించి, బియ్యన్నే అదనంగా ఎఫ్‌సీఐకి ఇస్తామని చెప్పారు. కానీ మిల్లర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. బ్యాంకు గ్యారంటీలపై విముఖత గతంలో ప్రభుత్వం మిల్లులకు నేరుగా ధాన్యాన్ని కేటాయించి, వారి నుంచి బియ్యాన్ని తీసుకునేది. ధాన్యం ఇచ్చినందుకు ఎలాంటి గ్యారంటీ అడిగేది కాదు. అయితే 2022–23 రబీలో మిల్లర్లు ధాన్యం మిల్లింగ్ చేయలేదంటూ సీఎంఆర్ బియ్యాన్ని పూర్తిగా అప్పగించలేదు. సుమారు రూ.7 వేల కోట్ల విలువైన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రికవరీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు సంస్థలకు టెండర్లు ఇచ్చింది. అయినా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లేదా ఆ మేర విలువను మాత్రమే రికవరీ చేయగలిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ధాన్యం కేటాయింపుకోసం మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం తప్పనిసరి అని కొత్త పాలసీలో పొందుపరిచింది. ఇందులో కూడా నాలుగు కేటగిరీలను నిర్ణయించింది. గడువులోగా సీఎంఆర్ అప్పగిస్తూ, ఇప్పటివరకు డీఫాల్ట్ కాని మిల్లర్లకు కేటాయించే ధాన్యం విలువలో 10 శాతం బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటారు. అలాంటి మిల్లులు అతి తక్కువని సమాచారం. ఇక డీఫాల్ట్ అయి పెనాల్టీతో సహా సీఎంఆర్ అప్పగించిన మిల్లర్ల నుంచి 20శాతం, పెనాల్టీ పెండింగ్‌లో ఉన్న మిల్లర్ల నుంచి 25శాతం బ్యాంక్ గ్యారంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకుంటారు. మిల్లుల్లో ధాన్యం లేని, సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లను నాలుగో కేటగిరీగా నిర్ణయించి.. ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాలుగో కేటగిరీలో సుమారు 300 మంది మిల్లర్లు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ బ్యాంకు గ్యారంటీ షరతులకు ముడి బియ్యం మిల్లర్లు అంగీకరించడం లేదు. దీనితో అధికారులు ఇప్పటికిప్పుడు కాకపోయినా 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని మిల్లర్ల నుంచి ‘అండర్ టేకింగ్’ తీసుకుంటూ ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లర్లు తర్వాత తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి మిల్లర్లు ముందుకురావడం లేదని తెలిసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో అధికారులు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గోదాములకు పంపిస్తున్నారు. మిల్లింగ్ చార్జీల పెంపుపైనా అసంతృప్తి.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కస్టమ్ మిల్లింగ్ చార్జీలు క్వింటాల్‌కు రూ.110 నుంచి రూ.200 వరకు ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దొడ్డురకాలకు రూ.40, సన్నరకాలకు రూ.50కి మాత్రమే చార్జీలు పెంచిందని మిల్లర్లు అంటున్నారు. ఈ చార్జీలను కూడా సకాలంలో ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇచ్చిన బియ్యానికి మాత్రమే లెక్కకట్టి ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. ఇచ్చే అరకొర చార్జీలకు కూడా కోతలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.రూ.500 బోనస్, రేషన్‌షాపులకు సన్న బియ్యం ఎలా? రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రైతులు రాష్ట్రంలో భారీ ఎత్తున సన్నరకాల వరి సాగు చేశారని వ్యవసాయ శాఖ ప్రకటించింది. రైతుల సొంత అవసరాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించే ధాన్యం పోగా.. కొనుగోలు కేంద్రాలకు ఏకంగా 50 లక్షల టన్నుల సన్నధాన్యం, 30 లక్షల టన్నుల వరకు దొడ్డు ధాన్యం వస్తుందని పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, ఆ సన్న బియ్యాన్ని జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. అలా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న ధాన్యానికి సంబంధించి క్వింటాల్‌కు రూ.500 చొప్పున రైతులకు నేరుగా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా. అయితే కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం రాకపోవడం, మిల్లర్ల లొల్లి నేపథ్యంలో.. రైతులకు బోనస్ అందడం, రేషన్‌షాపుల్లో సన్న బియ్యం సరఫరా పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారాయి.రేపు రైస్ మిల్లర్ల భేటీ ఖరీఫ్ ధాన్యం మిల్లింగ్ సమస్యల విషయంలో చర్చించేందుకు రైస్ మిల్లర్లు మంగళవారం రోజున సమావేశం కానున్నారు. యాదాద్రి జిల్లా ఘట్కేసర్లో నిర్వహించే ఈ భేటీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రా, బాయిల్డ్ రైస్‌మిల్లుల నిర్వాహకులు హాజరుకావాలని రా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని తెలిపారు. నామమాత్రంగానే కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లు బాగా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు కేవలం 20వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. అంతేకాదు ఇది కూడా దొడ్డురకం ధాన్యమేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. సన్నరకాల ధాన్యం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. కొనుగోళ్లు సరిగా లేక రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతున్నాయి. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక పడిగాపులు పడుతున్నారు. ఇటీవలి అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. -
రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసే మిల్లర్లు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారి నైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతు లను గోల్మాల్ చేసే మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తాగు నీటి సరఫరాపై.. శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధర పొందాలి కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్న ట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల రైతు లు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆర బెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకట్రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధరపొందా లన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు యార్డుల్లోనే ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ధాన్యం దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లను అధికారులు పర్యవేక్షించాలి ‘అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని మార్కె ట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రి యను రాష్ట్ర స్థాయిలో సీఎస్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఏరోజు కారోజు పర్యవేక్షించాలి. తాగునీటి సరఫరాపై ఉమ్మడి జిల్లాల వారీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు, ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలి. అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల సమయం కావటంతో కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశ పూర్వక కథనాలు వస్తున్నాయి. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి..’ అని సీఎం సూచించారు. వచ్చే రెండు నెలలు కీలకం ‘రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదు. భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలు కీలకం. ఫిర్యాదు వచ్చిన వెంటనే తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఏ రోజుకారోజు సీఎస్ సారథ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలి. జిల్లాలకు ఇన్చార్జిలుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్‌లు తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, డిమాండ్ మరింత పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్‌కు తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. సింగూరు నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి..’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవారిపై చర్యలు హైదరాబాద్‌లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిన అంశం దృష్టికి రాగా సీఎం వెంటనే స్పందించారు. విచారణ జరిపించి ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
జిల్లాల్లో 211 పునరావాస శిబిరాలు ఏర్పాటు
-
అకాల వర్షంతో అల్లాడుతున్న రైతులకు అండగా ఏపీ సర్కార్
-
అన్నదాతకు భరోసా.. తక్షణమే ఆదుకోవాలంటూ సీఎం వైఎస్ జగన్ ఆదేశం
కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే వేళ కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారులు, స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. ప్రచారానికి దూరంగా, పనికి ప్రాధాన్యత ఇస్తూ చేపట్టాల్సిన చర్యలన్నీ వెనువెంటనే తీసుకుంటూ ధాన్యం కొనుగోలుకు ఉపక్రమించి, రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా ప్రభుత్వమే గన్నీ సంచులు, లేబర్, రవాణా చార్జీల కోసం నిధులు విడుదల చేయడం ద్వారా మరో అడుగు ముందుకు వేసి ఆదుకుంటోంది. ఈ వాస్తవాలను స్థానికంగా రైతులు నిర్ధారిస్తున్నప్పటికీ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాత్రం ఎప్పటిలాగే అబద్ధాలతో కూడిన ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రచారం కోసం పాకులాడుతున్నారు. ఆయన హయాంలో గన్నీ సంచుల కోసం, రవాణా కోసం, లేబర్ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించిన పాపాన పోలేదు. ఈ విషయాన్ని దాచిపెట్టి.. ‘నేనొచ్చే వరకు గోతాలకూ దిక్కులేద’ని రైతులను రెచ్చగొట్టి.. రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుత సహాయ కార్యక్రమాల్లో గత చంద్రబాబు ప్రభుత్వంలా ప్రచారార్భాటం లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టడం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. తక్షణ స్పందన రాష్ట్రంలో రబీలో 54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సకాలంలో విత్తనాలు, సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉంచడంతో రైతులు సాగు వేళ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. గత రబీ కంటే మిన్నగా 86.64 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. ముఖ్యంగా ధాన్యం 54.23 లక్షల టన్నులు, మొక్కజొన్న 18.44 లక్షల టన్నులు, జొన్నలు 2.02 లక్షల టన్నులు వస్తాయని లెక్కలేశారు. కోతలు మొదలయ్యే సమయంలో.. దాదాపు రాష్ట్రమంతా 40 శాతం మాసూళ్లు కూడా పూర్తవని దశలో అనూహ్యంగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు రైతులను ఆందోళనకు గురిచేశాయి. రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లోని టోల్ ఫ్రీ నంబర్ 155251తో పాటు ధాన్యం కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ 1967ను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తూనే ఎవరు ఫోన్ చేసినా, క్షణాల్లో స్పందించేలా ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ దిశా నిర్ధేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంఓ, వ్యవసాయ ఉన్నతాధికారులతో రోజువారీ సమీక్షించడమే కాకుండా, ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో ప్రత్యేకాధికారులతో పాటు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా రంగంలోకి దిగారు. శాస్త్రవేత్తలు, సంబంధిత అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు గ్రామ స్థాయిలో పర్యటిస్తూ పంట నష్టం తీవ్రతను తగ్గించేందుకు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. వాట్సప్ గ్రూపుల ద్వారా చిన్న చిన్న వీడియో సందేశాలను పంపిస్తూ పంటను ఏ విధంగా కాపాడుకోవాలో అర్థమయ్యే రీతిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాకొక ఐఏఎస్ అధికారి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాకో సీనియర్ ఐఎఎస్ అధికారిని నియమించగా, వారంతా గత మూడు రోజులుగా ఆయా జిల్లాల్లో మకాం వేశారు. ముంపు ప్రభావం ఉన్న గ్రామాల్లో పర్యటిçస్తూ రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టారు. మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పల్లెల్లో పర్యటిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. కల్లాల్లోని ధాన్యం రవాణాలో సమస్య రాకుండా జిల్లాకు రూ.కోటి చొప్పున కార్పస్ ఫండ్‌ను విడుదల చేశారు. ప్రభావిత జిల్లాల్లో ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గన్నీ బ్యాగ్స్‌ను ముంపు ప్రభావిత జిల్లాలకు తరలించారు. ఇప్పటికే 40–50 శాతం మేర వరి కోతలు పూర్తి కాగా, మిగిలింది పంటపై ఉంది. జొన్న, మొక్కజొన్నలు కూడా 50–60 శాతం వరకు కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంటను మిషన్లపై కోసేలా అవగాహన కల్పిస్తున్నారు. 3 రోజుల్లో 80 వేల టన్నుల కొనుగోలు రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా 2,636 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 66 వేల మంది రైతుల నుంచి రూ.1315 కోట్ల విలువైన 6.18 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్ రకాలుగా గుర్తించి మద్దతు ధర కల్పిస్తున్నారు. ఇప్పటికే కోతలు పూర్తయి పంటలో 70 శాతం సేకరించగా మిగిలింది రెండ్రోజుల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గత మూడు రోజుల్లో సుమారు 80 వేల టన్నులు సేకరించారు. మొలక 7–10 శాతం ఉన్నా సరే.. మార్చిలో కురిసిన వర్షాలు, ఏప్రిల్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల అధిక తేమ శాతం, గింజ విరుగుడు సమస్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల బారిన పడి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పెద్ద ఎత్తున ధాన్యం రాశులు తడిచిపోయాయి. రైతులు వాటిని ఆరబెట్టు కోలేని పరిస్థితుల నేపథ్యంలో నేరుగా ఆఫ్‌లైన్‌లో (వాస్తవానికి పూర్తిగా ఆన్లైన్లో) కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్ రకంగా పరిగణించి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నారు. సాధారణంగా 5 శాతం మొలక ధాన్యానికి మినహాయింపు ఉంటుంది. వర్షాల వల్ల ప్రస్తుతం మొలక శాతం 7–10 వరకు ఉంటోంది. అయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అవసరమైన చోట్ల ఉపాధి కూలీలతో పంట పొలాల్లో నిలిచిపోయిన ముంపు నీరు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. మరో వైపు తేమ, నూక శాతం తగ్గించేందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నూర్పిడులు పూర్తిగా మిషన్లపై చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మండలానికో మినీ మొబైల్ మిల్లు నూక శాతం పేరుతో మిల్లర్లు రైతులను దోపిడీ చేయకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మండలానికి ఒకటి చొప్పున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, గోదావరి జిల్లాల్లో మొబైల్ మినీ మిల్లులు ఏర్పాటు చేశారు. మండల వ్యవసాయశాఖాధికారి, టెక్నికల్ అసిస్టెంట్లు వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ మినీ మిల్లుల ద్వారా మిల్లరు, రైతుల ఎదుటే ధాన్యాన్ని మరాడించి ఎంత శాతం నూక వస్తుందో పరిశీలిస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ అధికారులను కస్టోడియన్ ఆఫీసర్లుగా మిల్లుల వద్ద నియమించి రైతులకు సమస్య రాకుండా చూస్తున్నారు. ఆర్బీకేలో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత. ఆ తర్వాత మిల్లర్లు పిలిచినా వెళ్లనవసరం లేదని రైతులకు స్పష్టం చేస్తున్నారు. ఏ మిల్లర్ అయినా íపిలిస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. రైతులను ఇబ్బందిపెట్టిన కారణంగా ఇప్పటికే 39 రైస్ మిల్లులపై చర్యలు తీసుకున్నారు. రంగంలోకి మార్క్‌ఫెడ్ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న మొక్క జొన్న రైతులను ఆదుకుందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపారు. 66 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొక్క జొన్న ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లోని 3,330 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటికే 5,036 మంది రైతులు సీఎం యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరి నుంచి కనీస మద్దుత ధర రూ.1,962 చొప్పున ఫైన్ వెరైటీ మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 60 శాతం పంట కోతలు పూర్తయ్యాయి. బాపట్ల, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లో 17–18.5 శాతం తేమ ఉన్నట్టుగా గుర్తించారు. తేమ శాతాన్ని 14 శాతానికి తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు ఇలా.. జిల్లా రైతుల సంఖ్య సేకరించిన ధాన్యం (టన్నుల్లో) పశ్చిమగోదావరి 28,650 2,62,711 ఏలూరు 11,423 1,34,543 తూర్పుగోదావరి 12,998 1,19,748 కోనసీమ 5,975 46,669 కాకినాడ 2,481 18,357 కృష్ణా 2,598 15,298 బాపట్ల 1968 12,014 నెల్లూరు 281 4257 ప్రకాశం 411 2577 ఎన్టీఆర్ 113 1456 ––––– వేగంగా స్పందించి కొన్నారు నేను 4 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరానికి 45 బస్తాల దిగుబడి వచ్చింది. అకాల వర్షాలు భయపెట్టాయి. ధాన్యం తడిసిపోయి 48 గంటలు దాటకుండానే ప్రభుత్వం ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసింది. 75 కిలోల బస్తాకు రూ.1,530 చొప్పున ఇచ్చారు. 6 రోజుల్లోనే బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించడం ఎన్నడూ చూడలేదు. – కుసుమ శివప్రసాద్, ఈదరాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వం వల్లే ధాన్యం అమ్మగలిగా రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. మిషన్‌తో కోయించా. వర్షానికి తడిసిపోయిందని తక్కువ రేటుకు అడిగారు. ఏం చేయాలో పాలుపోలేదు. శుక్రవారం కలెక్టర్, అధికారులు మా గ్రామానికి వచ్చినప్పుడు చూపించా. కలెక్టర్ ఆదేశాలతో ఆర్బీకే సిబ్బంది సంచులిచ్చి, దగ్గరుండి కాటా వేయించి, ట్రాక్టర్‌తో రైసు మిల్లుకు తీసుకెళ్లారు. మద్దతు ధరకు కొంటామని చెప్పడంతో గట్టెక్కగలిగాను. లేకపోతే అయినకాడకు అమ్ముకోవాల్సి వచ్చేది. ప్రభుత్వం చాలా వేగంగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. – పేపకాయల వెంకటరమణ, కౌలురైతు, కరప, కాకినాడ జిల్లా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నాం జిల్లా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాం. రైతుల వద్ద ఉన్న తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. తుపాన్‌ను దృష్టిలో పెట్టుకొని రైతుల వద్ద కోత కోసిన ధాన్యాన్ని సేకరించేందుకు ఆదేశాలిచ్చాం. అలాగే చేలల్లో నీరు నిల్వ ఉన్న చోట్ల బయటకు పంపేందుకు చర్యలు చేపట్టాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ, స్పెషలాఫీసర్, పశ్చిమగోదావరి జిల్లా వేగంగా ధాన్యం తరలింపు అకాల వర్షాలతో రైతుల ధాన్యం తడిచింది. ఎక్కడా ఆరబెట్టుకోలేని పరిస్థితి. రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. అందుకు చాలా వరకు నిబంధనల్లో సడలింపులు ఇచ్చాం. తడిచిన, మొలకొచ్చిన ధాన్యాన్ని సైతం తీసుకుంటున్నాం. వాటిని బాయిల్డ్ రకాల జాబితాలో కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నాం. కోసిన పంట కోసినట్టు ఆఫ్‌లైన్‌లో నమోదు చేసి సేకరిస్తున్నాం. ప్రత్యేక అధికారుల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్లు, జేసీలు, పౌర సరఫరాల సంస్థ డీఎంలు, తహసీల్దార్లు, ఏవోలు, ఆర్బీకే సిబ్బంది ఇలా నిరంతరం రైతులకు అందుబాటులో ఉన్నారు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ రబీ సీజన్లో టీడీపీ హయాంలో కొనుగోళ్లు ఇలా.. సంవత్సరం టన్నులు 2014–15 18,91,106 2015–16 20,70,540 2016–17 16,95,341 2017–18 18,12,994 2018–19 16,47,193 (మార్చి 31 వరకు) మొత్తం 91,17,174 –––– వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2018–19 11,05,578 (ఏప్రిల్ 1నుంచి) 2019–20 34,73,827 2020–21 37,23,522 2021–22 26,22,386 2022–23 6,17,761 (మే 6వ తేదీ వరకు) 1,15,43,074 ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక అధికారులు జిల్లా ఐఏఎస్ అధికారి అల్లూరి సీతారామరాజు ప్రవీణ్‌కుమార్, ఎండీ ఎపీఐఐసీ అనకాపల్లి జే.నివాస్, కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ బాపట్ల కాటమనేని భాస్కర్, కమిషనర్, స్కూల్ ఎడ్యుకేషన్ (ఇన్ఫ్రా) తూర్పు గోదావరి వివేక్‌యాదవ్, కమిషనర్ సీఆర్డీఎ ఏలూరు శశిభూషణ్‌కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ, జలవనరుల శాఖ గుంటూరు ఎండీ ఇంతియాజ్, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, సెర్ప్ కాకినాడ పీఎస్ ప్రద్యుమ్న, ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్లు, భవనాల శాఖ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వీరపాండ్యన్, ఎండీ ఏపీఎస్సీఎస్సీఎల్ కృష్ణా లక్ష్మీశా, ఎండీ, ఎపీఎస్‌హెచ్‌సీఎల్ ఎన్టీఆర్ గిరిజా శంకర్, కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ ఎస్పీఎస్ నెల్లూరు చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ పల్నాడు సూర్యకుమారి, కమిషనర్, పంచాయతీరాజ్ పార్వతీపురం మన్యం ముద్దాడ రవిచంద్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకాశం ఎం.టీ.కృష్ణబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ శ్రీకాకుళం సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విజయనగరం సురేష్ కుమార్, కమిషనర్, పాఠశాల విద్య పశ్చిమగోదావరి కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ అనంతపురం ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గొల్లవిల్లి గ్రామానికి చెందిన సలాది లక్ష్మణబాబు.. రబీలో రెండున్నర ఎకరాల్లో ఎంటీయూ–3626 (జయ) రకం ధాన్యం సాగు చేశాడు. ఎకరాకు రూ.25 వేలు ఖర్చు చేశాడు. తెగుళ్ల బెడద లేకపోవడంతో దిగుబడి బాగా వచ్చింది. కోతలు కోసి కుప్పనూర్చాడు. అయితే తెల్లారేసరికి కుండపోత వర్షాలు. వారం పాటు ధాన్యాన్ని ఎలా రక్షించుకోవాలా అని ఆందోళన చెందాడు. కళ్లెదుటే ధాన్యంలో కొంత మేర మొలకలొచ్చేశాయి. కనీసం పెట్టుబడి అయినా దక్కుతుందో లేదోనని భయపడ్డాడు. అంతలో ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించడం.. సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో కలెక్టర్ సహా అధికారులంతా ఆ గ్రామానికి వచ్చారు. మొలకెత్తిన ధాన్యాన్ని చూశారు. వెంటనే బస్తాలకు ఎక్కించి మిల్లుకు తరలించారు. ‘ఆందోళన చెందకండి.. కనీస మద్దతు ధరకు మీ ధాన్యం కొనుగోలు చేస్తాం’ అని అభయమిచ్చారు. దీంతో లక్ష్మణబాబు ఆందోళన మాయమైంది. కాకినాడ జిల్లా పత్తిగొందికి చెందిన సేలం శ్రీనివాసరావు 10 ఎకరాల్లో వరివేశాడు. మాసూళ్లు ప్రారంభించే సరికి కురిసిన భారీ వర్షాలతో 4 ఎకరాల్లో పంట పూర్తిగా ముంపునకు గురైంది. ఆర్బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి తీవ్ర నష్టం జరగకుండా చూశారు. ముంపునకు గురైన వరిచేలలో నీటిని ఉపాధి కూలీల సాయంతో అధికారులు బయటకు పోయేలా చర్యలు చేపట్టారు. వరి పనలు మొలకెత్తకుండా శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఉప్పునీటి ద్రావణం చల్లాడు. తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు భరోసా ఇవ్వడంతో ఇతనికి ఊరట కలిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడిన ప్రతి చోటా ప్రభుత్వం రైతుల వెన్నంటి ఉంటూ అండగా నిలుస్తోంది. -
ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే సహించం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, మిల్లర్లతో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని పౌర సరఫరాల సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి అంశాన్నయినా ఉపేక్షించబోమని, కఠినచర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. రాష్ట్రం ధాన్యం సేకరణలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని, 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ స్థాయి నుంచి కోటి 41 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పౌర సరఫరాల సంస్థ మేనేజర్లు, ఉద్యోగులతో మంత్రి సోమవారం హైదరాబాద్‌లోని కార్పొరేషన్ భవన్లో సమావేశమయ్యారు. ఉద్యోగుల డైరీని ఆవిష్కరించి, వారికి హెల్త్‌కార్డులు అందజేశారు. -
ధాన్యం రైతులకు రూ.1,611కోట్లు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు సంపూర్ణ మద్దతు అందిస్తూ అండగా నిలుస్తోంది. పౌరసరఫరాల సంస్థ తాజాగా గురువారం రూ.1,611.27 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ధాన్యం రైతులకు మొత్తం రూ.6,483.97 కోట్లు అంటే సుమారు 96.29 శాతం మేర నిర్ణీత వ్యవధిలోగా చెల్లింపులు చేయడం విశేషం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ రవాణా ఖర్చులను కూడా అందిస్తోంది. గోనె సంచులు, హమాలీ, రవాణా చార్జీల కింద రూ.79.68 కోట్లను రైతులకు చెల్లించింది. 2022 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 6,01,147 మంది రైతుల నుంచి రూ.6,734.02 కోట్ల విలువైన 32,97,735 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఉత్తరాంధ్రలో వారంలోగా.. ధాన్యం సేకరణలో భాగంగా పౌరసరఫరాల సంస్థ జిల్లాల వారీగా తాత్కాలిక అంచనాలు రూపొందించింది. దీని ప్రకారం చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో ఇంకా మిగిలి ఉన్న ధాన్యాన్ని లెక్కించి కొనుగోళ్లకు అనుమతులిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో వారంలోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్దేశించారు. కృష్ణా, గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పంట కోతలు, నూర్పిడులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. అందువల్ల అక్కడ వచ్చే నెల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరగనున్నాయి. -
ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ పూర్తయిందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా, రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి రైస్‌మిల్లులకు తరలించిందన్నారు. ఆలస్యంగా వరి నాట్లేయడం వల్ల ఎక్కడైనా రైతుల వద్ద ధాన్యం మిగిలి ఉంటే ఈ నెల 24 వరకూ సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. శనివారం ఇక్కడ మంత్రి గంగుల ఆ శాఖ అధికారులతో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం దిగుబడి ఏయేటికాయేడు పెరుగుతోందన్నారు. ఈసారి రికార్డుస్థాయిలో 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. అక్టోబర్ 21 నుంచి మొదలైన వానాకాలం పంట సేకరణ మూడునెలలకు పైగా నిరంతరాయంగా సాగిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల రైతులకు అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 7,024 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.13,570 కోట్ల విలువైన 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 9.76 లక్షలమంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతుల్లో ఓపీఎంఎస్లో నమోదైన రైతులకు రూ.12,700 కోట్లు చెల్లించామని చెప్పారు. పంజాబ్ తరువాత తెలంగాణనే.. దేశంలో పంజాబ్ తరువాత తెలంగాణ నుంచే అత్యధిక ధాన్యం సేకరణ జరుగుతోందని మంత్రి గంగుల తెలిపారు. రాష్ట్రంలో 2014–15లో 11.04 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న వానాకాలం ధాన్యం సేకరణ గతేడాది 70.44 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు. ఈ ఏడు బహిరంగ మార్కెట్లలో అత్యధిక ధర లభించడంతో రైతులు లాభసాటిగా ప్రైవేటుగా ధాన్యం విక్రయించుకోవడం సంతోషకర పరిణామమని అన్నారు. ఈ సీజన్లో అత్యధికంగా నిజామాబాద్‌లో 5.86 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 4.75, నల్లగొండలో 4.13, మెదక్‌లో 3.95, జగిత్యాలలో 3.79 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 2,264 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు. కాగా, ఈ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ ప్రక్రియను సైతం వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ ఉషారాణి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టాప్.. నిజామాబాద్ ఆఖరున ఆదిలాబాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్లో 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు 63.20 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. బహిరంగ మార్కెట్లో డిమాండ్ కారణంగా.. దాదాపు 65 లక్షల టన్నులకు మించి సేకరణ జరిగే అవకాశం కనిపించడం లేదు. ముప్పావువంతుకుపైగా జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించగా, అతితక్కువ సేకరణలో ఆదిలాబాద్ నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 7,015 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 6,100 కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 20 వరకు కొంత మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. రెండు, మూడు స్థానాల్లో కామారెడ్డి, నల్లగొండ రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రూ.1,204.36 కోట్ల విలువైన 5,85,661 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. మూడేళ్లుగా పౌరసరఫరాల సంస్థ నిజామాబాద్‌లోనే అత్యధికంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఆ తరువాత స్థానాల్లో 4,75,082 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లతో రెండోస్థానంలో కామారెడ్డి జిల్లా ఉండగా, 4,11,827 మెట్రిక్ టన్నులతో మూడోస్థానంలో నల్లగొండ జిల్లా ఉంది. 2,198 మెట్రిక్ టన్నులతో ఆఖరున ఆదిలాబాద్ జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో వరిసాగు అతితక్కువగా ఉండడమే అందుకు కారణం. ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం రాష్ట్రంలో ధాన్యం సేకరణకు పట్టాదారు పాస్‌పుస్తకంతోపాటు ఆధార్, ఫోన్ నంబర్ అనుసంధానం చేయడంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఆలస్యమైంది. ఈ పరిస్థితుల్లో చాలా జిల్లాల్లో రైతులు ధాన్యాన్ని ప్రైవేటు మిల్లర్లకు, వ్యాపారులకు విక్రయించుకున్నారు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, జగిత్యాల, పెద్దపల్లి, నారాయణపేట వంటి జిల్లాల్లో నాణ్యమైన సన్న ధాన్యాన్ని మిల్లర్లు కల్లాల మీదే కొనుగోలు చేసి, బియ్యంగా మరపట్టించి విక్రయించారు. అగ్గువకో, సగ్గువకో తక్షణమే నగదు వస్తుండటంతో రైతులు కూడా ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు భారీ ఎత్తున విక్రయించారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు రావలసిన ధాన్యం తగ్గింది. 30 లక్షల టన్నులకు పైగా ధాన్యం ప్రైవేటు వ్యాపారుల ద్వారా బహిరంగ మార్కెట్‌కు తరలినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.13 వేల కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని సేకరించగా, రూ.12,430 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
వేగంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఆయన జిల్లాల వారీగా కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణిలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో శుక్రవారం నాటికి 6.42 లక్షల మంది రైతుల నుంచి 38.06 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ)ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటివరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామన్నారు. గత సీజన్లో నవంబర్ ఆఖరు నాటికి 25.84 ఎల్ఎంటీ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలు, అన్ని ప్రాంతాలకు అందుతున్న పుష్కలమైన నీటితో ఈసారి ధాన్యం నాణ్యత మరింత పెరిగిందని చెప్పారు. దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు. బహిరంగ మార్కెట్లో సైతం కనీస మద్దతు ధర కన్నా అధిక ధరతో రైతులు ధాన్యాన్ని విక్రయిస్తుండటం శుభపరిణామమన్నారు. కోతలకు అనుగుణంగా ధాన్యం సేకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 729 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి రాష్ట్రంలో 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 38.06 ఎల్ఎంటీ ధాన్యంలో 36.87 ఎల్‌ఎంటీని మిల్లులకు తరలించినట్లు గంగుల తెలిపారు. దీని విలువ రూ.7,837 కోట్లు కాగా, రైతుల ఖాతాల్లోకి ఇప్పటివరకు 4,780 కోట్లు జమచేసినట్లు చెప్పారు. ధాన్యం సేకరణకు 9.52 లక్షల గన్నీ బ్యాగులను వినియోగించగా, ఇంకా 9.16 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. కొనుగోళ్లు పూర్తయిన 729 కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు. నిజామాబాద్ టాప్ వానాకాలానికి సంబంధించిన ధాన్యం సేకరణలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఇప్పటివరకు ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38,06,469 మె ట్రిక్ టన్నుల సేకరణ పూర్తికాగా నిజామా బాద్ జిల్లాలో 5,38,354 మెట్రిక్ టన్నుల సేకరణ అయింది. తరువాత కామారెడ్డి జిల్లాలో 3,98,818 మెట్రిక్ టన్నులు, నల్లగొండ జిల్లాలో 3,22,634 మెట్రిక్ టన్నులు, మెదక్ జిల్లాలో 3,22,047 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయింది. సన్నాలకు డిమాండ్‌తో... జై శ్రీరాం, బీపీటీ, హెచ్ఎంటీ లాంటి సన్న రకం వడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉండటంతో మిల్లర్లు, వ్యాపారులు సన్నధాన్యాన్ని వివిధ జిల్లాలతోపాటు నిజామాబాద్ జిల్లాలో భారీగా సేకరించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాపారులు నిజామాబాద్ జిల్లాలో సన్న రకం ధాన్యాన్ని పెద్దఎత్తున సేకరించారు. రైతులకు క్వింటాకు రూ.100 ఎక్కువగా చెల్లించి మరీ సేకరించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. దీంతో దొడ్డు రకం ధాన్యమే కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా వస్తోంది. -
ధాన్యం కొనుగోలులో చరిత్ర సృష్టిస్తాం..
సాక్షి, హైదరాబాద్: అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలువనుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్లో సాగైన పంట విస్తీర్ణం ఆధారంగా ఈసారి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణ కోసం ఈసారి 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే... ఇప్పుడు కేవలం తెలంగాణలోనే కోటి టన్నుల ధాన్యం సేకరించే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు. ధాన్యం కోసం అవసరమైన 25 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. -
ఈసారి కోటి టన్నుల ధాన్యం కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరి పంట సాగైన నేపథ్యంలో వానాకాలం సీజన్‌కు సంబంధించి సుమారు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే ప్రతి ధాన్యం గింజను సేకరించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. రాబోయే వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఆయన హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల శాఖతో పాటు వ్యవసాయ, పోలీస్, మార్కెటింగ్, సహకార శాఖలకు చెందిన అధికారులు, అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వానాకాలం ధాన్యం సేకరణపై మంత్రి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండించిన స్థితి నుంచి ఏకంగా కోటీ నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ రైతు ఎదిగాడని ఆయన అన్నారు. ఈ సారి 65 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్ని బ్యాగులు, తేమ కొలిచే మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లతో సహా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 17 జిల్లాల సరిహద్దుల్లో పటిష్ట నిఘా తెలంగాణలోని 17 జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం అక్రమ దిగుమతిని అడ్డుకొనేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడి కొనుగోలు కేంద్రాలలో విక్రయించేందుకు తెచ్చే ధాన్యాన్ని విజిలెన్స్‌తో పాటు పోలీస్ శాఖ అడ్డుకోవాలని ఆదేశించారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ధాన్యం నిల్వకు ఏర్పాట్లు మిల్లర్ల వద్ద ఇప్పటికే దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్న నేపథ్యంలో వానాకాలం సీజన్లో వచ్చే ధాన్యానికి తగిన నిల్వ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని మంత్రి గంగుల ఆదేశించారు. మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వీలైనంత త్వరగా సీఎంఆర్ కింద అప్పగించి, తగినంత స్టోరేజీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు పంటను అమ్ముకున్న తర్వాత మిల్లర్లతో ఎలాంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులు భారత ఆహార సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. -
రుణ బకాయిలు రూ.33,787 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (టీఎస్సీఎస్సీఎల్) బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిలు ఏయేటికాయేడు పెరిగి పోతున్నాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్న కార్పొరేషన్ పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపని కారణంగా అప్పుల భారం పెరిగిపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అప్పటికే ఉన్న బకాయిలతో పాటు ప్రతి ఏటా బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూనే వచ్చింది. ఈ విధంగా 2014 –15 నుంచి 2021–22 వరకు బ్యాంకులకు కార్పొరేషన్ చెల్లించాల్సిన బకాయిలు ఏకంగా రూ.33,787.26 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు లేకనే.. రాష్ట్రం ప్రభుత్వం పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా కనీస మద్దతు ధరతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, సెంట్రల్ పూల్ కింద కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఎఫ్‌సీఐకి అప్పగిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా కార్పొరేషన్ ఏటా వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ధాన్యం కొనుగోలు చేస్తోంది. సీఎంఆర్ తీసుకున్న తరువాత కార్పొరేషన్‌కు ఎఫ్‌సీఐ ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ విధంగా ఎఫ్‌సీఐ తీసుకున్న సీఎంఆర్‌కు అనుగుణంగా కిలోకు రూ.32 చొప్పున రాష్ట్రానికి క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. అయితే సీఎంఆర్ ఆలస్యం అవుతున్న కొద్దీ ఎఫ్‌సీఐ చెల్లింపులు కూడా ఆలస్యంగానే ఉంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంత వడ్డీ భారం పడుతున్నా.. అది కొంతే. కాగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి తీసుకున్న బియ్యానికి గాను చెల్లించాల్సిన మొత్తం చెల్లించక పోవడంతో సంస్థపై భారం అధికంగా పడుతోంది. బ్యాంకులకు రుణ బకాయిలు కట్టడం కష్టమవుతోంది. రూ.4,747 కోట్ల నుంచి పెరుగుతూ.. పీడీఎస్ బియ్యం, హాస్టళ్లు, గురుకులాల వంటి రాష్ట్ర అవసరాల కోసం స్టేట్‌పూల్ కింద ప్రభుత్వం పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచే బియ్యాన్ని తీసుకుంటుంది. అలా తీసుకుంటున్న బియ్యానికి కిలో రూ.32 లెక్కన చెల్లించాలి. ఆ సొమ్ము చెల్లించకపోవడంతో బకాయిలు రూ.వేల కోట్లలో పేరుకుపోయాయి. తెలంగాణ ఏర్పాటు అయిన 2014–15, ఉమ్మడి రాష్ట్రం నాటి బకాయిలు కలిపి రూ.4,747 కోట్లు ఉండగా, అవి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2019–20లో బ్యాంకు రుణ బకాయిలు రూ.15,302.79 కోట్లు ఉండగా, 2021–22 నాటికి రూ. 33,787.26 కోట్లకు పెరిగిపోయాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు సాగిన ఉచిత బియ్యం పంపిణీ, అదనపు కోటా విడుదల, తదితర కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేసింది. కానీ డబ్బులు చెల్లించలేదు. వడ్డీలకే వేల కోట్లు పౌర సరఫరాల సంస్థ తీసుకున్న అప్పులకు గాను వడ్డీల కింద ఏటా రూ.వేల కోట్లు చెల్లిస్తోంది. 2021–22 లో పౌరసరఫరాల సంస్థ బ్యాంకుల నుంచి రూ. 29,804 కోట్లు అప్పు తీసుకోగా, ఇందుకు చెల్లించాల్సిన వడ్డీ రూ.1, 568 కోట్లు. కాగా బకాయిలకు సంబంధించిన వడ్డీ కూడా కలుపుకొని చెల్లించిన మొత్తం రూ. 2,100.55 కోట్లు. 2014–15లో రూ.146.80 కోట్లు వడ్డీగా చెల్లించిన పౌరసరఫరాల శాఖ 2015–16 లో రూ.1,012.48 కోట్లు చెల్లించింది. ఇలా పెరుగుతూ వచ్చి 2022–23 నాటికి చెల్లించాల్సిన వడ్డీ రూ. 9,222.50 కోట్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.360.68 కోట్లు వడ్డీ కింద కార్పొరేషన్ చెల్లించడం గమనార్హం. -
ఖరీఫ్ వరి సేకరణ లక్ష్యం 5.18 కోట్ల మెట్రిక్ టన్నులు
సాక్షి, న్యూఢిల్లీ: ఖరీఫ్ ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ సీజన్లో 5.18 కోట్ల మెట్రిక్ టన్నుల మేర సేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. గతేడాది సేకరించిన 5.09 కోట్ల టన్నుల కంటే ఇది కాస్త ఎక్కువ. వాస్తవానికి ప్రస్తుత సీజన్లో జూన్‌లో రుతుపవనాల మందగమనం, జూలైలో అసమాన వర్షాల నేపథ్యంలో వరి సాగు తగ్గింది. సాగు తగ్గిన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆగస్టు నెల నుంచి వరినాట్లు పుంజుకోవడంతో దేశవ్యాప్తంగా 3.67 కోట్ల హెక్టార్లలో సాగు జరిగింది. ఇది గత ఏడాది సాగు కన్నా 5.5 శాతం తక్కువగా ఉంది. దిగుబడిలో తగ్గుదల ఉండదని, ఏటా పెరుగుతున్న సగటు సేకరణ దృష్ట్యా ఈ సీజన్లో గత ఏడాది కన్నా కాస్త ఎక్కువే ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. ఇదీ చదవండి: ఇదెక్కడి గొడవ.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డా తగ్గేదేలే..! -
ధాన్యం సేకరణపై స్పందించకుంటే నిలదీస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, బీజేపీ నేతలను గ్రామాల్లో నిలదీస్తామని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. మోదీ కుట్రలను ఛేదించడంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంతుచూస్తామన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే జాజుల సురేందర్‌తో కలిసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వరద తగ్గిన తర్వాత మరమ్మతులు చేసి పంపులను వినియోగంలోకి తెస్తుందని రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. -
బండి సంజయ్.. భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయి
సాక్షి, హైదరాబాద్: రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలం గాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాసంగి వడ్లను కొనిపించే బాధ్యత తనదని, రైతులు వరి వేయాలని కోరిన బండి సంజయ్.. ఆ తరువాత మొహం చాటేశారన్నారు. ఆయన ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన 14 పంటల్లో పొద్దు తిరుగుడు మినహా మరే పంట సాగు చేసినా రైతులకు గిట్టుబాటు కాదని విమర్శించారు. చదవండి👉🏼 ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు! బండి సంజయ్‌కు చేతనైతే గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం సీ+50 ప్రకారం పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని.. లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలని హితవు పలికారు. హైదరాబాద్ కార్పొరే టర్లతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు హైదరాబాద్ అభివృద్ధి కోసం పావలా అయినా తీసుకొచ్చారా? అని నిలదీశారు. చదవండి👉🏼 అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం -
కేంద్రం రైడింగ్‌ల పేరుతో వేధింపులు: హరీశ్
సాక్షి, సిద్దిపేట: బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో రైతుల నుంచి ధాన్యం కొనే పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బందులకు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తోందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేయనివ్వకుండా మిల్లర్లపై కేంద్రప్రభుత్వం రైడింగ్ పేరిట వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. రైతులకు మేలు చేసే నాయకుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక్కరేనని, అందుకే పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ధాన్యాన్ని తెచ్చి తెలంగాణలో కూడా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి పాదయాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈనెల 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రభుత్వాస్పత్రిలో సాధారణ ప్రసవం చేయిస్తే ఆశ కార్యకర్తలు, ఏఎన్ఏం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలకు రూ.3 వేల పారితోషికం అందిస్తామని చెప్పారు. మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు తాగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. త్వరలోనే 1,300 వైద్య ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. -
నిరంతరం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆటంకం లేకుండా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొ న్నారు. మొన్నటి అకాల వర్షాలకు తడిసిన 10 వేల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశా మని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయినపక్షంలో ఆరబెట్టి తీసుకొస్తే కొనుగోలు చేస్తా మని రైతులకు భరోసా ఇచ్చి, ప్రతి ధాన్యం గింజను కొన్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ధాన్యం కొనుగోళ్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై పడే రూ.3 వేల కోట్లకు పైగా భారాన్ని భరిస్తూ సీఎం కేసీఆర్ ధాన్యం సేకరణ చేయిస్తున్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో రూ.5,888 వేల కోట్ల విలువైన 30.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 4.72 లక్షల మంది రైతుల నుండి సేకరించాం..’అని గంగుల వివరించారు. కేంద్రం సహకరించకున్నా.. ‘కొనుగోళ్లు జరుగుతున్నప్పుడే ప్రత్యక్ష తనిఖీల పేరుతో కేంద్రం ఇబ్బందులు పెడుతున్న విష యాన్ని రైతులు గమనిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మే 2 వరకు ఒక్క గన్నీ బ్యాగును రాష్ట్రానికి అందించకున్నా ధాన్యం సేకరణ ఆగలేదు. 6,544 కొనుగోలు కేంద్రాలకు గానూ 500 కేంద్రాల్లో విజయవంతంగా ధాన్యం సేకరణ పూర్తయింది. రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేస్తున్నాం. 11.64 కోట్ల గన్నీ బ్యాగుల్ని సేకరించాం. వీటిలో 7.52 కోట్ల సంచులు వాడగా, ఇంకా 4.12 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఈ బ్యాగులు సరిపోతాయి. మార్కెట్లకు వచ్చిన ధాన్యాన్ని పూర్తిగా సేకరిస్తాం. ఈ ప్రక్రియ నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాలలో మరో వారం రోజుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 10వ తారీఖు వరకు పూర్తవుతుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ధరకు వడ్లు కొనుగోలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కేవలం ఒక్కరిద్దరికే మద్దతు ధర ఇస్తున్నారని, మిగతా వారి నుంచి తక్కువ ధరకే వడ్లు కొంటూ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో షర్మిల మాట్లాడారు. ‘రైతుల నుంచి వడ్లు కొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరి వేసిన రైతులు అతలాకుతలమవుతున్నారు. రైతన్నలు పంట వేయకపోతే మనం అన్నం కాకుండా గడ్డి తినాలా’అని షర్మిల నిలదీశారు. మద్దతు ధర కూడా ఇవ్వని సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాడేందుకు ప్రజాప్రస్థానం పాదయాత్రను సైతం పక్కన పెట్టానన్నారు. పంట బీమానే కాదు.. పంట నష్ట పరిహారం కూడా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు.