వరికి ఎసరెందుకు? | Problem Of Paddy Procurement In Telangana | Sakshi
Sakshi News home page

వరికి ఎసరెందుకు?

Published Tue, Nov 23 2021 2:21 AM | Last Updated on Tue, Nov 23 2021 10:16 AM

Problem Of Paddy Procurement In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 25కుపైగా రాష్ట్రాల్లో వరి పండిస్తున్నారు. ఇది కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో వరే ప్రధాన పంట. వరి ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నేరుగా కొనుగోలు చేయకుండా.. కస్టమ్‌ మిల్లింగ్‌ విధానంలో తీసుకుంటుంది. అంటే.. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే కొని రైతులకు డబ్బులు చెల్లిస్తాయి. తర్వాత ఆ ధాన్యాన్ని రైస్‌మిల్లులకు పంపి మిల్లింగ్‌ చేయిస్తాయి. ఇందుకోసం మిల్లులకు డబ్బులు చెల్లిస్తాయి. మిల్లింగ్‌ ద్వారా ఉత్పత్తి అయిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పంపుతాయి.

ఎఫ్‌సీఐ ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తుంది. ఇలా సేకరించిన బియ్యాన్ని ‘డీ సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ సెంట్రల్‌ పూల్‌’ విధానం ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రేషన్‌ డిపోలకు సరఫరా చేస్తుంది. ఎఫ్‌సీఐ ప్రధానంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎక్కువగా బియ్యాన్ని సేకరిస్తుంది. 

దేశవ్యాప్తంగా 2020–21లో 12.23 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా.. ఎఫ్‌సీఐ 25 రాష్ట్రాల నుంచి 5.99 కోట్ల టన్నులు సేకరించింది. ఇందులో ముందుజాగ్రత్త కోసం చేసే నిల్వ (బఫర్‌ స్టాక్‌) 1.35 కోట్ల టన్నులుపోగా.. మిగతా బియ్యాన్ని అవసరమైన రాష్ట్రాలకు పంపుతుంది. 

క్వింటాల్‌ ధాన్యానికి 68 కిలోల బియ్యం వస్తేనే.. 
ఎఫ్‌సీఐ ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసినప్పుడు కనీసం 68 కిలోల బియ్యం రావాలి. కానీ రాష్ట్రంలో యాసంగి ధాన్యం మిల్లింగ్‌ సమయంలో విరిగిపోయి నూకల శాతం పెరుగుతోంది. బియ్యం తగ్గుతున్నాయి. దీనికి ఎఫ్‌సీఐ అంగీకరించదు. అదే ధాన్యాన్ని పారాబాయిల్డ్‌ మిల్లుల్లో ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌)గా మార్చితే ఎఫ్‌సీఐ ప్రమాణాల మేరకు 68కిలోలకుపైగా వస్తున్నాయి.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా బాయిల్డ్‌ రైస్‌ విధానాన్ని ప్రోత్సహిస్తూ, వీలైనంత వరకు ధాన్యం కొనుగోలు చేస్తూ వచ్చింది. అయితే ఎఫ్‌సీఐ ఇకముందు బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని చెప్పడంతో సమస్య మొదలైంది.

♦ గత యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభు త్వం.. రైతులకు రూ.17 వేల కోట్లకుపైగా చెల్లించింది. ఆ ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుటివరకు లక్ష్యంలో 50 శాతమే ఎఫ్‌సీఐకి పంపారు. ఎఫ్‌సీఐ గోడౌన్‌లకు బియ్యం చేరితేనే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు తిరిగి వస్తాయి. 

వరిసాగు భారీగా పెరగడంతో.. 
తెలంగాణలో గతంలో కంటే వరిసాగు భారీగా పెరిగింది. గతంలో సాధారణంగా 26 లక్షల ఎకరాల్లో వరి పండించేవారు. కొన్నాళ్లుగా సాగునీటి సమస్య తీరడం, వాతావర ణం అనుకూలిస్తుండటం, విద్యుత్‌ సరఫరా బాగుండటం తో.. ప్రస్తుతం సాగు 60 లక్షల ఎకరాలకు చేరింది. కొన్నేళ్లలో నే ఇంత భారీగా సాగు, ధాన్యం దిగుబడి పెరగడంతో.. దాని కి అనుగుణంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం పెరిగింది. మరోవైపు.. దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో సేకరణను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కూడా సమస్యకు దారి తీసింది. 

♦ తెలంగాణలో గత యాసంగిలో పెరిగిన పంట విస్తీర్ణంతో ఏకంగా 92.33 లక్షల టన్నుల ధాన్యం దిగుబడిరాగా.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించింది. కానీ కేంద్రం 24.60 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటామని, మిగతా పచ్చి బియ్యంగా ఇవ్వాలని రాష్ట్రానికి లేఖ రాసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో రెండు సీజన్లలో పండిన పంటలో ఉప్పుడు బియ్యం, పచ్చి బియ్యం కలిపి 90 లక్షల టన్నులు సేకరించాలని కోరింది.

దీనికి కూడా అంగీకరించని కేంద్రం.. వానకాలం పంటను పూర్తిగా తీసుకుని, యాసంగిలో 44.75 లక్షల టన్నులే సేకరించేందుకు ఒప్పుకొంది. 2021–22 వానాకాలం (ప్రస్తుత సీజన్‌) పంటలోనూ 40 లక్షల టన్నుల పచ్చి బియ్యం (రా రైస్‌) మాత్రమే సేకరిస్తామని చెప్పింది. భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం కొనబోమని స్పష్టం చేసింది. 
రాష్ట్రం నుంచి కేరళ, తమిళనాడు, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియాలకు సుమారు 30 లక్షల టన్నులు ఉప్పుడు బియ్యం ఎగుమతి అవుతాయని అంచనా. 

వరిలో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడితే.. 
యాసంగిలో రాష్ట్ర రైతులు.. ధాన్యం దిగుబడి అధికంగా ఉండి, చీడపీడలు అంటని రకాలనే సాగుచేస్తారు. ఆయా జిల్లాల వారీగా ఉన్న వాతావరణ పరిస్థితులు, సీడ్‌ కంపెనీల లాబీయింగ్‌ వంటికారణాలతో.. కొన్నేళ్లుగా ఒకే తరహా వంగడాలను సాగుచేస్తున్నారు. యాసంగి సమయంలోనూ మిల్లింగ్‌లో నూకలుగా మారని వంగడాలు ఉన్నా.. ఆ దిశగా రైతులు, సీడ్‌ కంపెనీలు ఆలోచించడం లేదని రైస్‌మిల్లర్ల సంఘం నేత తూడి దేవేందర్‌రెడ్డి చెప్తున్నారు.

ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎంటీ, జైశ్రీరాం, బీపీటీ వంటి వంగడాలు యాసంగిలో కూడా మంచి దిగుబడి వస్తాయని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల కన్నా వరిలోనే ప్రత్యామ్నాయ వంగడాలను ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 

ప్రత్యామ్నాయ పంటలివే.. 
♦ మొక్కజొన్న, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, కందులు, శనగలు, పెసర్లు, ఉలువలు తదితరాలు 
♦ వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్, కుసుమలు, ఆముదం, ఇతర నూనె పంటలు 
♦ ఇతర ఆహార పంటలు, పొగాకు సాగు 

వానాకాలం పంట కొనుగోళ్లూ తక్కువే.. 
రాష్ట్రంలో వానాకాలం పంటను చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కానీ వివిధ కారణాలతో పంట కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇదే సమయంలో అకాల వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిసిపోతోంది. రాష్ట్రంలో ఆదివారం నాటికి 2,34,517 మంది రైతుల నుంచి 14.84 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు మొదలేకాలేదు. రూ.2,415 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా.. రూ.489.6 కోట్లను మాత్రమే జిల్లాలకు విడుదల చేశారు. అయితే ఆలస్యమైనా వానకాలం కొనుగోళ్లకు ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్తుండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి యాసంగిపైనే పడింది. 

ఇతర రాష్ట్రాల్లో ‘బాయిల్డ్‌’ గొడవెందుకు లేదు? 
దేశవ్యాప్తంగా చూస్తే.. కేరళలో మాత్రమే అత్యధికంగా 80 శాతం ఉప్పుడు బియ్యాన్ని వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, హరియాణా, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ యాసంగిలో పండిన ధాన్యాన్ని కొంతమేర ఉప్పుడు బియ్యంగా మారుస్తారు. కానీ మరీ తెలంగాణ స్థాయిలో ఉండదు.

ఆ రాష్ట్రాలలో ఉన్న భూసార పరిస్థితులకు తోడు.. వాటికి ఆనుకొని ఉన్న సముద్రం కారణంగా ఎండాకాలంలోనూ గాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. యాసంగిలో ధాన్యం ఎక్కువగా నూకలు అవదు. కొంతమేర ఉప్పుడు బియ్యం ఉత్పత్తి అయినా అది ఆ రాష్ట్రాల అవసరాలకు సరిపోనుంది. దీనివల్లే కేంద్రం బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని చెప్పినా.. ఆయా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురుకాలేదు.

కేసీఆర్‌ ప్రకటన కోసం ఎదురుచూపులు! 
ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. యాసంగిలో వరి వేయవద్దని హెచ్చరిస్తూనే, ఏ బియ్యం ఎంత మేర కొంటారో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా సాగు విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో ఈనెల 18న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు.

ఆదివారం మంత్రులు, అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్‌.. రెండు రోజులు అక్కడే ఉంటామని, ఉప్పుడు బియ్యం కొనుగోళ్లకు కేంద్రం ఒప్పుకోకపోతే రైతులు యాసంగిలో ఏ పంట వేయాలో సూచిస్తామని తెలిపారు. దీంతో రైతులు ముఖ్యమంత్రి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. 

పచ్చిబియ్యంగా మార్చలేకనే.. 
వానలు సరిగాపడి, నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు రైతులను పంటల కోసం ప్రోత్సాహించాల్సింది పోయి.. వరి పండించకూడదని కేం ద్రం చెప్పడం సరికాదు. రాష్ట్రంలో యాసంగిలో పండే ధాన్యాన్ని పచ్చిబియ్యంగా మారిస్తే.. నూకల శాతం పెరిగి ఎఫ్‌సీఐకి విక్రయించలేని పరిస్థితి. అందుకే కొన్నేళ్లుగా బాయిల్డ్‌ రైస్‌గా ఎఫ్‌సీఐకి ఇస్తున్నాం. యాసంగిలో కూడా బాయిల్డ్‌ రైస్‌ కేంద్రం కొనేందుకు ముందుకు రావాలి. అంతకు మించి ప్రత్నామ్నాయం లేదు.          
- సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు, అఖిల భారత రైతు సంఘం 
 
చట్టం ప్రకారం కేంద్రం కొనాల్సిందే.. 
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం వరి ధాన్యం కొనాల్సిందే. ఆ చట్టం కింద ప్రతీ ఒక్కరికి ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రం వరి తగ్గించాలనుకుంటే.. ఫలానా పంట వేస్తే మద్దతు ధరకు కొంటామని ముందే చెప్పాలి. ప్రతీ గింజ కొంటా మని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎందుకు చెప్పింది? ఏ ఆధారం చేసుకొని కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారు? పచ్చిబియ్యం విషయంలో నూకలు వస్తాయంటున్నారు. ఇది ప్రాసెసింగ్‌ సమస్య. సేకరణ సమస్య కాదు. ఈ విషయంపై మిల్లర్లతో కూర్చొని చర్చించుకోవాలి. 
– డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు 
 
ప్రత్యామ్నాయ పంటలను మద్దతు ధరలకు కొనాలి 
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యామ్నాయ పంటలను మద్దతుధరకు కొనేలా హామీ ఇవ్వాలి. కేరళ తరహాలో బోనస్‌ ఇవ్వాలి. మద్దతు ధరలు లేని ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, ఆముదం, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, జొన్న పంటలు వేయాలని చెప్తోంది. ఇందులో ఆవాలు, ఆముదం పంటలు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల జాబితాలో లేవు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు నిర్ణయించాలి. ఈ యాసంగిలో రైతులు నష్టపోకుండా నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వ సంస్థల నుండే సరఫరా చేయాలి. 
– టి.సాగర్, ప్రధాన కార్యదర్శి,  తెలంగాణ రైతుసంఘం   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement