సాక్షి, హైదరాబాద్: ఎప్పటికప్పుడు గడువు పెంచుతున్నప్పటికీ.. రాష్ట్రంలోని రైస్ మిల్లుల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఎఫ్‌సీఐ గోడౌన్‌లకు చేరడం ఆలస్యమవుతోంది. ప్రస్తుతం మిల్లర్ల వద్ద ఇప్పటికే ఏకంగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్టు పౌర సరఫరాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 2020–21 యాసంగి మొదలు 2021–22 వానాకాలం, యాసంగి సీజన్‌లకు సంబంధించి సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉంది.
తాజాగా 2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి సేకరించిన 40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యం కూడా మిల్లులకు చేరింది. దీంతో రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్‌మిల్లులు ధాన్యం నిల్వలతో నిండిపోయినట్లు తెలుస్తోంది. ఇలావుండగా జనవరి నెలాఖరులోగా మరో 50 ఎల్‌ఎంటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
సజావుగా సాగని మిల్లింగ్..
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపించేటప్పుడే 45 రోజుల్లోగా కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాలని పౌరసరఫరాల శాఖ మిల్లర్లతో ఒప్పందం చేసుకుంటుంది. అయితే మిల్లర్లు ఏనాడూ 45 రోజుల్లో మిల్లింగ్ పూర్తి చేసిన దాఖలాల్లేవు. ఇక గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో మిల్లింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ఎంతగా అంటే 2020–21 సంవత్సరపు యాసంగి ధాన్యం 2.03 ఎల్‌ఎంటీలను ఇక మిల్లింగ్ చేయలేమని మూడు నెలల క్రితం చేతులెత్తేసేంత వరకు.
ప్రస్తుత వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతుండగా, 2021–22 వానాకాలం ధాన్యం 70.22 ఎల్‌ఎంటీల్లో 20.83 ఎల్‌ఎంటీలు మిల్లింగ్ చేయాల్సి ఉంది. ఇక అదే ఏడాది యాసంగికి సంబంధించిన 50.39 ఎల్‌ఎంటీల ధాన్యంలో ఇప్పటివరకు కేవలం 13 ఎల్‌ఎంటీలు మాత్రమే మిల్లింగ్ జరిగింది. ఇంకా 36.93 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. ఇలా గత మూడు సీజన్లకు సంబంధించి 59.79 ఎల్‌ఎంటీల ధాన్యం అంటే సుమారు 40 ఎల్‌ఎంటీల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది.
ఐదు నెలల్లో 34 ఎల్‌ఎంటీలే మిల్లింగ్!
సీఎంఆర్ విషయంలో మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు, సీఎంఆర్ అప్పగింతలో ఆలస్యంపై కేంద్రం గత జూలైలో సీరియస్ అయింది. సీఎంఆర్ తీసుకునేది లేదని రాష్ట్రానికి అల్టిమేటం ఇచ్చింది. అప్పటికి రాష్ట్రంలో మూడు సీజన్లకు సంబంధించి 93.76 ఎల్‌ఎంటీల ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ లెక్కలు కట్టింది.
మొత్తం మీద ఆగస్టు నుంచి తిరిగి సీఎంఆర్ తీసుకునేందుకు ఎఫ్‌సీఐ ముందుకు వచ్చింది. దీంతో మిల్లింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మిల్లింగ్ చేస్తున్నప్పటికీ.. ఐదు నెలల్లో లెవీ కింద ఎఫ్‌సీఐకి అప్పగించిన బియ్యం 34 ఎల్‌ఎంటీలే కావడం గమనార్హం. అంటే నెలకు 10 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని కూడా మిల్లింగ్ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
ఈ సీజన్‌లో 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా
రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి నేపథ్యంలో ఈ సీజన్‌లో కొనుగోలు కేంద్రాలకు 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 6.85 లక్షల మంది రైతుల నుంచి 40.06 ఎల్‌ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. వచ్చే జనవరి నాటికి మరో 50 ఎల్‌ఎంటీల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిల్లుల్లోని ధాన్యాన్ని సీఎంఆర్ కింద ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ దిశగా అధికార యంత్రాంగం మిల్లర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment