Rice mills
-
ఖరీఫ్ నుంచే కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్, : మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా దారి మళ్లించడం, నాణ్యమైన బియ్యం విక్రయించి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖను మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడకుండా మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సోమవారం మంత్రి ఉత్తమ్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమావేశంలో ఈ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు తెలిసింది. కెపాసిటీకి అనుగుణంగా కేటాయింపులు రైస్‌మిల్లులు తమకు కేటాయించిన ధాన్యాన్ని ఏడాదిన్నర వరకు కూడా మిల్లింగ్ పూర్తి చేయకుండా తమ వద్దే నిల్వ ఉంచుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. తద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, ఎఫ్‌సీఐ రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో ఆలస్యం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మిల్లులు సీఎంఆర్ కోసం ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో 16 గంటలు పనిచేయాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ముడి బియ్యం ఇచ్చే రా రైస్ మిల్లులకు వడ్లు కేటాయిస్తే 8 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో రోజుకు 16 గంటలు మిల్లింగ్ చేసి 75 రోజుల్లో కేటాయించిన ధాన్యంలో 67శాతం రా రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లుల కెపాసిటీకి అనుగు ణంగా ధాన్యం కేటాయించనున్నారు. 25 శాతం బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరిమిల్లింగ్ కోసం ధాన్యం తీసుకునే మిల్లర్లు ధాన్యం విలువకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీ తప్ప నిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అను గుణంగా నిబంధనలు సవరించారు. కేటాయించిన ధాన్యం మిల్లింగ్ కెపాసిటీని బట్టి మిల్లింగ్‌కు వచ్చే 15 రోజుల ముందే 25 శాతం బ్యాంక్ గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుంది. లీజు మిల్లుదారుడైతే కేటాయించిన ధాన్యంలో 50 శాతం బ్యాంక్ గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది. లీజు తీసుకున్న మిల్లులో గతంలో ఓనర్ సీఎంఆర్ డెలివరీ పెండింగ్ లేనట్టు డీఎంల నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే మిల్లులకు కేటాయింపులు ఉంటాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలులో ఉన్న మిల్లర్లకు సైతం ధాన్యం కేటాయింపులు ఉండవని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.డిఫాల్టర్లపై ఉక్కుపాదంగతంలో అక్రమాలకు పాల్పడినట్టు తేలిన మిల్లర్లకు, ఫేక్ ట్రక్ షీట్లు సృష్టించి కేసుల్లో ఇరుకున్న వారికి, 6 ఏ ఈసీ యాక్ట్, క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్న వారికి ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కేటాయించకూడదని, వీరికి ఈ సీజన్‌తోపాటు వచ్చే రెండు సీజన్ల వరకు వడ్లు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. డిఫాల్ట్ అయిన మిల్లర్లు బకాయి పడ్డ సీఎంఆర్‌ను అప్పగించి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకుంటేనే కొత్తగా ధాన్యం కేటాయించనున్నారు. మిల్లర్లు లీజు డీడ్ ఇవ్వడంతోపాటు కేటాయించిన ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి కానుంది. కలెక్టర్ల పర్యవేక్షణ...జిల్లాల వారీగా రైస్‌మిల్లుల్లో సాగే సీఎంఆర్‌పై కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించనున్నా రు. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లింగ్ వరకు వారే కీలకం. బాయిల్డ్ రైస్‌మిల్లర్లు ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు డిసెంబర్ 31లోగా ఎఫ్ఆర్కే బ్లెండింగ్, సోర్టెక్స్ మెషీన్లు ఇన్స్టాల్ చేసుకు నేలా ఆయా జిల్లాల కలెక్టర్ చర్యలు తీసు కొని, వారికే ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అర్హత ఉన్న మేరకే ధాన్యం కేటాయించాలి. మిల్లు లను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేటాయించిన ధాన్యం దారిమళ్లినా, ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రైవేట్‌గా విక్రయించినా క్రిమినల్ చర్యలు తప్పనిసరి. -
ఒకే ఒక్క రైస్ మిల్లు... రూ. వంద కోట్ల ధాన్యం దగా
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని కొమరబండంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రభుత్వం సరఫరా చేసిన రూ.100 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లుగా సీఎంఆర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఈ మిల్లుపై మంగళవారం రాష్ట్ర విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ, పోలీస్‌శాఖల అధికారులు 30 మంది బృందంగా ఏర్పడి మూకుమ్మడి దాడి చేశారు. దాడి విషయాన్ని ముందుగానే పసిగట్టిన మిల్లు యజమాని నీలా సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, మిల్లు భాగస్వాములు పరారైనట్లు అధికారులు తెలిపారు. దాడుల నిర్వహిస్తున్న టీమ్‌లకు జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, పోలీస్ అధికారులు సహకారం అందించారు. 3 సీజన్ల నుంచి బియ్యం ఇవ్వడంలేదు. కొమరబండ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండ్రస్ట్రీస్ గత రెండేళ్లుగా, మూడు సీజన్లకు సంబంధించి సుమారు రూ.90 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు. 2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించి 15,628 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 7,067 టన్నులు ఆ మిల్లు ఇచ్చిందనీ, 8,607 టన్నుల బియ్యం బకాయి పడిందని చెప్పారు. ఇక ఇదే సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించి 10,408 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 202 టన్నుల బియ్యం మాత్రమే సదరు మిల్లు నుంచి వచ్చిందని, 10, 206 టన్నులు బకాయి పడిందని వివరించారు. దీంతో పాటు 2023–24 వానాకాలం సీజన్‌కు సంబంధించి 2748 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 261 టన్నులు మాత్రమే వచ్చిందనీ, ఇంకా 2487 టన్నులు బకాయి ఉందని తెలిపారు. ఈ మూడు సీజన్లకు సంబంధించి మొత్తం 21,300 టన్నుల బియ్యం ఇవ్వాలని దీని విలువ రూ.90 కోట్ల వరకు ఉంటుందని, అపరాధ రుసుంతో కలిపితే దాదాపు రూ.100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్ కోదాడకు చెందిన శ్రీ వెంకటేశ్వరరైస్ ఇండ్రస్ట్రీస్ యజమాని నీల సత్యనారాయణ కస్టమ్ మిల్లింగ్ రైస్ సక్రమంగా ఇవ్వకపోవడంతో 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి మిల్లుకు కేటాయించిన 15,237 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర స్థాయిలో వేలం వేశారు. వేలంలో ధాన్యం దక్కించుకున్న వారు మిల్లు వద్దకు ధాన్యం కోసం వెళితే అక్కడ ఆ ధాన్యం లేదని చెప్పి, దాన్ని మర పట్టించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్‌పై పూర్తి నివేదికను రాష్ట్ర కమిషనర్‌కు అందిస్తామని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
ధాన్యం విక్రయ టెండర్లు రద్దు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో మూలుగుతున్న గత యాసంగి నాటి ధాన్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన 10 సంస్థలు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను దక్కించుకున్నాయి. కానీ సగటున క్వింటాల్‌కు రూ.375 నష్టానికి బిడ్లు ఆమోదం పొందడం, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల మేర నష్టం వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ధాన్యం టెండర్లపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ టెండర్ల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో సమాలోచనలు జరిపిన ప్రభుత్వ పెద్దలు.. ఈ టెండర్లను రద్దు చేసి, కొత్తగా బిడ్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి కనీస ధరను కోట్ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం మద్దతు ధరతో సేకరణ రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ.2,060 మద్దతు ధరతో 66.85 లక్షల టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని యథావిధిగా మిల్లులకు తరలించింది. దాన్ని సీఎంఆర్ కింద ముడిబియ్యంగా మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం కోరినా.. అలా చేస్తే నూకల శాతం ఎక్కువై నష్టం వస్తుందని రైస్‌మిల్లులు తేల్చి చెప్పాయి. దీంతో సుమారు 9 నెలలుగా మిల్లుల్లో మూలుగుతున్న ఈ ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్న ధరకన్నా తక్కువకు.. 25 ఎల్ఎంటీ ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి టెండర్లు పిలిస్తే 11 సంస్థలు ముందుకురాగా.. ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తరువాత గురునానక్ అనే సంస్థ తిరస్కరణకు గురైంది. మిగతా 10 సంస్థలకు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను కేటాయించారు. ఈ పది సంస్థలు 25 లాట్లను క్వింటాల్‌కు కనిష్టంగా రూ.1,618 నుంచి గరిష్టంగా రూ.1,732 ధరతో దక్కించుకున్నాయి. సగటున చూస్తే క్వింటాల్ ధర రూ.1,685 మాత్రమే అవుతోంది. ప్రభుత్వం కొన్నధర రూ.2,060తో పోలిస్తే క్వింటాల్‌కు రూ.375 చొప్పున తక్కువ వస్తుంది. మొత్తంగా రూ.925 కోట్ల నష్టమని అంచనా వేశారు. ఇక సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, కమీషన్లు, మిల్లులకు ధాన్యం రవాణా తదితర ఖర్చులన్నీ కలిపితే క్వింటాల్ ధాన్యానికి మరో రూ.100కుపైగా సర్కారు వెచ్చించింది. ఈ ఖర్చునూ కలిపితే.. మొత్తంగా 25 లక్షల టన్నుల ధాన్యం విక్రయంపై రూ.1,200 కోట్లవరకు నష్టం వస్తుందని లెక్కతేలింది. భారీ నష్టం నేపథ్యంలో ప్రస్తుత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
బడా, లోకల్ మిల్లింగ్ కంపెనీలు కొనేలా!
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టెండర్ల ద్వారా రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ బిడ్డింగ్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. ఈ–వేలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి బడా కంపెనీలతో పాటు రాష్ట్రంలోని మిల్లింగ్ కంపెనీలు పాల్గొనేలా సరళమైన విధానాలను టెండర్ నిబంధనల్లో చేర్చారు. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి టెండర్ రాష్ట్రంలోని 2వేలకు పైగా రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న సుమారు 70 ఎల్ఎంటీ ధాన్యం నుంచి తొలి విడతగా 25 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గత నెల 19వ తేదీన విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆసక్తి గల సంస్థలు, వ్యాపారులు దరఖాస్తులు చేసుకోవడంతో ప్రి బిడ్డింగ్ సమావేశాలను సంస్థ నిర్వహించింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విధించిన నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నిబంధనల ద్వారా స్థానిక వ్యాపారులు, మిల్లర్లకు అవకాశం దక్కదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే విడతలో 4లక్షల లేదా 5 లక్షల మెట్రిక్ టన్నుల లాట్లలో ధాన్యం వేలం వేయడం వల్ల బడా కంపెనీలే తప్ప రాష్ట్రంలోని మిల్లర్లు గాని, మిల్లర్ల సిండికేట్ గానీ కొనుగోలు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం నిబంధనల్లో పలు మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రతీ లాట్‌ను ఒక లక్ష టన్నులుగా మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు వేలం వేయాలని తొలుత నిర్ణయించగా... దాన్ని పూర్తిగా కేవలం 6 లాట్స్‌లో «వేలం వేయాలని టెండర్ నోటిఫికేషన్లో పొందుపరిచారు.. ఇందులో ఐదు లాట్స్‌లో 4లక్షల టన్నుల చొప్పున ఉండగా ఒక లాట్లో ఐదు లక్షల టన్నుల ధాన్యం ఉంది. ప్రి బిడ్ మీటింగ్ అనంతరం ఇందులో మార్పులు చేశారు. ప్రతీ లాట్‌ను ఒక లక్ష టన్నులుగా నిర్ణయించారు. అంటే 25 లాట్స్‌లో ధాన్యం వేలం వేయనున్నారు. లక్ష టన్నుల కెపాసిటీ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రతి కంపెనీ ఈ వేలంలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. వార్షిక టర్నోవర్‌లోనూ భారీ మార్పులు తొలుత ప్రకటించిన టెండర్ నిబందనల ప్రకారం టెండర్లలో పాల్గొనే కంపెనీకి గడిచిన మూడేళ్లలో ప్రతిఏటా రూ.వెయ్యి కోట్ల వార్షిక టర్నోవర్‌తో పాటు రూ.100 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అయితే రూ. 1000 కోట్ల టర్నోవర్ ఉన్న బియ్యం కొనుగోలు కంపెనీలు దేశంలో అతి తక్కువగా ఉంటాయన్న వాదనల మేరకు ప్రి బిడ్డింగ్ సమావేశంలో ఈ నిబంధనలు కూడా మార్చారు. రూ. 1,000 కోట్ల టర్నోవర్‌ను రూ.100 కోట్లకు, నెట్‌వర్త్ విలువ ను రూ.100 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు తగ్గించారు. ఇక వేలం తర్వాత ధాన్యం తీసుకెళ్లాల్సిన గడువును 30 రోజుల నుంచి 45 రోజులకు పెంచారు. నిబంధనల్లో మార్పులు చేయడంతో దరఖాస్తు, వేలం తేదీల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దీంతో ఈ నెల 11న జరగాల్సిన వేలం ప్రక్రియను 16వ తేదీకి వాయిదా వేశారు. నిబంధనల్లో మార్పుతో స్థానిక వ్యాపారులు, మిల్లర్లు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం లభించనుంది. నిబంధనల సడలింపుతో ఎక్కువ మంది బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఏర్పడింది. -
అదనపు ధాన్యమంతా ఎగుమతులకే
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని సేకరించకుండా ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటీ పది లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం, నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో ఉందని, ఎఫ్‌సీఐ చర్యలతో ఆహారధాన్యాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని అధికారులు సీఎం దృష్టికి తేవడంతో కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. రానున్న రోజుల్లో అదనంగా వరి దిగుబడి కానున్న పరిస్థితుల్లో రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా రైతులకు మరింత లాభం చేకూరేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి, సీఎంఆర్ అప్పగింత, బియ్యం తిరస్కరణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కొత్త మిల్లుల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ శుక్రవారం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. అదనంగా పండే పంట కోసమే కొత్త మిల్లులు... ‘‘రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలి. అప్పడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతులు లాభాలు గడిస్తారు. అదనంగా పండే పంటను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నూతనంగా అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సటాకె వంటి కంపెనీలతో చర్చించాం. వారితో రేపట్నుంచే ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించాం’’అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులతోపాటు మరికొద్ది రోజుల్లో పూర్తికానున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల వరిధాన్యం దిగుబడి ప్రస్తుతమున్న ఏటా 3 కోట్ల టన్నుల నుంచి 4 కోట్ల టన్నులకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వీరే... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు ఉండగా మరో 2 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా కొత్త మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివిధానాల ఖరారు కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సారథ్యంలో కమిటీని ప్రకటించారు. ఇందులో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, టీఎస్ఐడీసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా ఉండనున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మేద్దాం! రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో ఉన్న ధాన్యంలో 40 లక్షల మెట్రిక్ టన్నులను గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్లు సకాలంలో ధాన్యం మిల్లింగ్ చేయకపోవడంతో మిలు్లల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. నిర్దేశత సమయంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంతో ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతోంది. దాదాపు 1.10 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం, 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో నిల్వల నేపథ్యంలో ధాన్యం విక్రయానికి సీఎం ఆదేశించినట్లు తెలిసింది. -
మిల్లుల్లోనే కోటి మెట్రిక్ టన్నులు!
సాక్షి, హైదరాబాద్: ఎప్పటికప్పుడు గడువు పెంచుతున్నప్పటికీ.. రాష్ట్రంలోని రైస్ మిల్లుల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఎఫ్‌సీఐ గోడౌన్లకు చేరడం ఆలస్యమవుతోంది. ప్రస్తుతం మిల్లర్ల వద్ద ఇప్పటికే ఏకంగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్టు పౌర సరఫరాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 2020–21 యాసంగి మొదలు 2021–22 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉంది. తాజాగా 2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి సేకరించిన 40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కూడా మిల్లులకు చేరింది. దీంతో రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్‌మిల్లులు ధాన్యం నిల్వలతో నిండిపోయినట్లు తెలుస్తోంది. ఇలావుండగా జనవరి నెలాఖరులోగా మరో 50 ఎల్ఎంటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సజావుగా సాగని మిల్లింగ్.. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపించేటప్పుడే 45 రోజుల్లోగా కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాలని పౌరసరఫరాల శాఖ మిల్లర్లతో ఒప్పందం చేసుకుంటుంది. అయితే మిల్లర్లు ఏనాడూ 45 రోజుల్లో మిల్లింగ్ పూర్తి చేసిన దాఖలాల్లేవు. ఇక గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో మిల్లింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ఎంతగా అంటే 2020–21 సంవత్సరపు యాసంగి ధాన్యం 2.03 ఎల్ఎంటీలను ఇక మిల్లింగ్ చేయలేమని మూడు నెలల క్రితం చేతులెత్తేసేంత వరకు. ప్రస్తుత వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతుండగా, 2021–22 వానాకాలం ధాన్యం 70.22 ఎల్‌ఎంటీల్లో 20.83 ఎల్ఎంటీలు మిల్లింగ్ చేయాల్సి ఉంది. ఇక అదే ఏడాది యాసంగికి సంబంధించిన 50.39 ఎల్ఎంటీల ధాన్యంలో ఇప్పటివరకు కేవలం 13 ఎల్ఎంటీలు మాత్రమే మిల్లింగ్ జరిగింది. ఇంకా 36.93 ఎల్ఎంటీల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. ఇలా గత మూడు సీజన్లకు సంబంధించి 59.79 ఎల్ఎంటీల ధాన్యం అంటే సుమారు 40 ఎల్ఎంటీల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. ఐదు నెలల్లో 34 ఎల్‌ఎంటీలే మిల్లింగ్! సీఎంఆర్ విషయంలో మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు, సీఎంఆర్ అప్పగింతలో ఆలస్యంపై కేంద్రం గత జూలైలో సీరియస్ అయింది. సీఎంఆర్ తీసుకునేది లేదని రాష్ట్రానికి అల్టిమేటం ఇచ్చింది. అప్పటికి రాష్ట్రంలో మూడు సీజన్లకు సంబంధించి 93.76 ఎల్ఎంటీల ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ లెక్కలు కట్టింది. మొత్తం మీద ఆగస్టు నుంచి తిరిగి సీఎంఆర్ తీసుకునేందుకు ఎఫ్‌సీఐ ముందుకు వచ్చింది. దీంతో మిల్లింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మిల్లింగ్ చేస్తున్నప్పటికీ.. ఐదు నెలల్లో లెవీ కింద ఎఫ్‌సీఐకి అప్పగించిన బియ్యం 34 ఎల్‌ఎంటీలే కావడం గమనార్హం. అంటే నెలకు 10 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా మిల్లింగ్ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ సీజన్లో 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి నేపథ్యంలో ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాలకు 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 6.85 లక్షల మంది రైతుల నుంచి 40.06 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. వచ్చే జనవరి నాటికి మరో 50 ఎల్ఎంటీల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిల్లుల్లోని ధాన్యాన్ని సీఎంఆర్ కింద ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ దిశగా అధికార యంత్రాంగం మిల్లర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. -
ఫోర్టిఫైడ్ రైస్‌గా తడిసిన ధాన్యం
సాక్షి, హైదరాబాద్: రైస్‌మిల్లుల్లో తడిసిన ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ (పౌష్టికాహార బియ్యం)గా రాష్ట్ర ప్రభుత్వం మార్చనుంది. గత యాసంగిలో సేకరించిన 50.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులు, వాటి ఆవరణల్లో నిల్వ చేయగా అకాల వర్షాలకు భారీఎత్తున ధాన్యం తడిసిపోవడం తెలిసిందే. ప్రాథమిక అంచనా మేరకు 4.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయిందని తేలింది. ఈ ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం సాధ్యం కానందున పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్‌గా మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశా లిచ్చింది. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌కు బదులుగా కొంత మేర ఫోర్టిఫైడ్ రైస్‌ను సెంట్రల్ పూల్ కింద సేకరించేందుకు గతంలోనే ఒప్పుకొంది. రాష్ట్రంలోని కుమురం భీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పేద గిరిజనులకు రేషన్ బియ్యంగా ఫోర్టిఫైడ్ రైస్‌నే పంపిణీ చేస్తున్నందున తడిసిన ధాన్యాన్ని ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఫోర్టిఫైడ్ రైస్‌గా 5 ఎల్ఎంటీ... రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో గత మూడు సీజన్లకు సంబంధించి 90.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం నిల్వలుగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. అందులో 2020–21 యాసంగికి సంబంధించి 4.86 ఎల్ఎంటీ ఉండగా 2021–22 వానకాలానికి సంబంధించి 35.70 ఎల్ఎంటీ, మొన్నటి యాసంగికి సంబంధించి 50.39 ఎల్ఎంటీ ధాన్యం నిల్వలు ఉన్నాయి. ఈ మూడు సీజన్ల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్‌ను మిల్లింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 7.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవగా యాసంగిలో తడిసిన ధాన్యం 4.5 లక్షల మెట్రిక్ టన్నులు పోను మరో 3 లక్షల మెట్రిక్ టన్నులను 2020–21 యాసంగి, 2021–22 వానాకాలం ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్‌గా మిల్లింగ్ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తడిసిన ధాన్యం సమస్య కొంతమేర తీరనుంది. చదవండి: అనగనగా హైదరాబాద్.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం 20 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ కోసం.. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో సేకరించిన ధాన్యం నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫోర్టిఫైడ్ బియ్యంగా సెంట్రల్ పూల్‌కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్రానికి లేఖ రాయడంతోపాటు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను ఢిల్లీకి పంపారు. యాసంగిలో సేకరించిన 50.39 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 34 ఎల్ఎంటీ ముడిబియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వా ల్సి ఉంటుంది. కానీ యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకల శాతమే అధికంగా ఉంటుందని టెస్ట్ మిల్లింగ్ ఫలితాల్లో తేలినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో క్వింటాలు ధాన్యానికి 55 శాతం మాత్రమే బియ్యంగా వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని కేంద్రం 20 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ బియ్యంగా తీసుకుంటే సమస్య ఉండదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్రం నుంచి ఇంకా అనుమతులు రాలేదు. ఈ పరిస్థితుల్లో తమకు అవకాశం ఉన్న 5 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ రైస్ కోసం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ముందుగా కేటాయించింది -
బియ్యంపై కయ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైస్‌మిల్లులు మూతపడి మూడు వారాలు దాటింది. పేదలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఇచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వలేదనే సాకును చూపుతూ రాష్ట్రం నుంచి బియ్యాన్నే సేకరించకూడదనే తీవ్రమైన నిర్ణయం కేంద్రం తీసుకుంది. ఈనెల 7వ తేదీ నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడాన్ని నిలిపివేసింది. దీంతో రాష్ట్రంలోని సుమారు 3,250 రైస్ మిల్లులు మూతపడ్డాయి. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని వేచి చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కనుచూపు మేరలో స్పష్టత కనిపించడం లేదు. సీఎంఆర్ లేకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన సొమ్ము ఆగిపోయింది. మరోవైపు మిల్లుల్లో నిండిపోయిన ధాన్యం నిల్వలు మిల్లింగ్ లేక ముక్కిపోతున్నాయి. మిల్లుల ఆవరణల్లో నిల్వ ఉంచిన సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యంపైన టార్పాలిన్లు కప్పినా, వర్షం, తేమకు మొలకలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ధాన్యాన్ని ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు రాస్తున్న లేఖలకు ఎలాంటి స్పందన లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో కస్టమ్ మిల్లింగ్ అవుతున్న గత వానాకాలం వడ్లు 40 ఎల్ఎంటీలకు తోడు యాసంగిలో సేకరించిన 50 ఎల్ఎంటీల ధాన్యం మిల్లులు, వాటి ఆవరణల్లో పేరుకుపోయాయి. దాదాపు 90 ఎల్ఎంటీల ధాన్యం, కస్టమ్ మిల్లింగ్ అయిన మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లోనే ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. తప్పు దిద్దుకున్నా స్పందించని ఢిల్లీ.... కరోనా ప్రబలిన తరువాత 2021 మార్చి నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత కార్డు (ఎన్ఎఫ్ఎస్సీ)లు కలిగిన వారికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 53.68 లక్షల ఎన్ఎఫ్ఎస్ కార్డులకు గాను 1.92 కోట్ల మందికి ఉచిత బియ్యం పంపిణీ జరుగుతోంది. ఈ క్రమంలోనే గత ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన కోటా 1.90 ఎల్ఎంటీల బియ్యాన్ని పంపిణీ కోసం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సేకరించింది. కానీ ఈ బియ్యాన్ని వివిధ కారణాల వల్ల పంపిణీ చేయలేదు. దీనిపై ఈనెల 7న రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ లేఖ రాసింది. బియ్యం పంపిణీ చేయనందున సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోబోమని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక కారణాలతో ఉచిత బియ్యం పంపిణీ చేయలేదని, ఆ కోటాను ఈనెల 18 నుంచి ఆరునెలల పాటు ప్రతినెలా ఇస్తామని లేఖ రాసింది. ఈ మేరకు 18 నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ ఆ విషయాన్ని కూడా తెలియజేసింది. రాష్ట్రం నుంచి సీఎంఆర్ తీసుకునే విషయంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఢిల్లీకి వెళ్లి మరీ అధికారులను కోరారు. అయినా ఇప్పటివరకు కేంద్రం స్పందించలేదు. రూ.1,700కు కొనేందుకు మిల్లర్లు సిద్ధం రాష్ట్రం నుంచి సీఎంఆర్ తీసుకోకుండా ఎఫ్‌సీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ధాన్యాన్ని వేలం పద్ధతిలో మిల్లర్లకే అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆప్షన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయమై మిల్లర్లు ఇటీవల సమావేశమై ప్రభుత్వం ధాన్యాన్ని తమకు విక్రయిస్తే కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. క్వింటాలు ధాన్యాన్ని రూ.1700 లెక్కన కొనుగోలు చేసి, బాయిల్డ్ రైస్‌గా విక్రయించుకుంటామని కూడా వారు చెప్పినట్లు తెలిసింది. దీనిపై మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలపై కక్ష సాధించడమే.. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి వడ్డీకి అప్పులు తెచ్చి, రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తుంది. కేంద్రం తనకు తోచినప్పుడు ఇచ్చే డబ్బులను బ్యాంకులకు చెల్లిస్తూ, భారమైన వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో బియ్యం తీసుకోకుండా కేంద్రం మొండి వైఖరితో వ్యవహరించడం రాష్ట్ర ప్రజలపై కక్ష సాధించడమే. రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేసే విధానాన్ని తీవ్రంగా ఎండగడతాం. – గంగుల కమలాకర్, మంత్రి, పౌరసరఫరాల శాఖ -
టెస్ట్ మిల్లింగ్‌కు రెండు వంగడాలు
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల వచ్చే నూకల శాతాన్ని పరీక్షించేందుకు మైసూర్‌కు చెందిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) శాస్త్రవేత్తల బృందాలు ఈ నెల 20 నుంచి రంగంలోకి దిగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలు సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, యాదాద్రి భువన గిరి, కామారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, వనపర్తి జిల్లాల్లోని 11 మిల్లులను టెస్ట్ మిల్లింగ్ కోసం శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. మొదటి విడతగా మే 27, 28, 29 తేదీల్లో శాస్త్రవేత్తలు మిల్లులను పరి శీలించి, ఎన్నిరకాల వడ్లు పండిస్తారో తెలుసుకుని వాటి నమూనాలను సేకరించిన విషయం తెలిసిం దే. యాసంగిలో రైతాంగం అత్యధికంగా సాగు చేసే వెయ్యిపది (ఎంటీయూ 1010) రకంతోపాటు మ రో స్థానిక వంగడాన్ని తాజాగా టెస్ట్ మిల్లింగ్ కో సం ఎంపిక చేశారు. ఎంపిక చేసిన 11 మిల్లుల్లో ఈ రెండు రకాల ధాన్యాన్ని ఆయా మిల్లుల సామర్థ్యానికన్నా ఐదు రెట్లు అధికంగా అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20 నుంచి జూలై ఒకటో తేదీ వరకు టెస్ట్ మిల్లింగ్ ప్రక్రియ సాగనుంది. మొదటి, రెండో విడత పరీక్షల ఫలితాలను బేరీజు వేసుకొని నూక శాతాన్ని ప్రకటించనుంది. ఏయే జిల్లాల్లో ఏ రకం ధాన్యం మిల్లింగ్ చేస్తే ఎంతశాతం నూకలు వస్తున్నాయో పరీక్షించి, ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. తదనుగుణంగా ప్రభుత్వం మిల్లులకు పరిహారం ఇవ్వాలని భావిస్తోంది. బాయిల్డ్ రైస్ వద్దనడంతో వచ్చిన చిక్కు తెలంగాణలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే ఎక్కువగా నూక అవుతుందన్న విషయం తెలిసిందే. సాధారణంగా క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం రావాలి. కానీ, యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే కొన్ని జిల్లాల్లో 40 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మిల్లింగ్ చేయడం వల్ల నూక శాతం తగ్గి, ఔటర్న్ రేషియో నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. కానీ, కేంద్రం ఇక నుంచి బాయిల్డ్ రైస్‌ను తీసుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే కష్టనష్టాలను ఓర్చి అయినా యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగానే ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన మిల్లే.. మే నెలలో శాస్త్రవేత్తలు వచ్చి జిల్లాలో వివిధ రకాల వడ్ల శాంపిల్స్‌ను సేకరించారు. మిల్లులను సైతం పరిశీలించారు. శాస్త్రవేత్తలే మిల్లులను ఎంపిక చేసుకున్నారు. టెస్ట్ మిల్లింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా నుంచే టెస్ట్ మిల్లింగ్ ప్రారంభం కానుంది. –హరీశ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, సిద్దిపేట -
మిల్లుల్లోని ధాన్యంపై ఎఫ్‌సీఐకి అధికారం ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చిన్నచిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమని ఎఫ్‌సీఐ లేఖ రాయడంతోనే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తోందని పేర్కొన్నారు. మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు ఎఫ్‌సీఐ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టంచేశారు. బుధవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ ఎఫ్‌సీఐ తీరును తప్పు బట్టారు. మిల్లుల్లోని వడ్లు, బియ్యంపై ఎఫ్‌సీఐ కి ఏం అధికారముందని ప్రశ్నించారు. రాష్ట్రం లోని రైస్ మిల్లుల్లో వడ్లు, బియ్యం నిల్వలపై ఎఫ్‌సీ ఐకి ఎలాంటి అధికారం లేదని మంత్రి చెప్పారు. సీఎం ఆర్ కింద బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చిన తరువాతే వారికి అధికారం వస్తుం దని పేర్కొన్నారు. తనిఖీ ల్లో తేడాలు వచ్చినా చర్యలు తీసుకో లేదని ఆరో పణలు చేస్తున్నారని, మార్చిలో ఆరు జిల్లాల్లోని 40 మిల్లులు తనిఖీ చేస్తే 4,53,896 బ్యాగులు లేవని చెప్పారని, రెండో మారు అవే మిల్లుల్లో తనిఖీ చేస్తే 10 మిల్లుల్లో మాత్రమే తేడా ఉందని అన్నారని పేర్కొన్నారు. ఒక్క గింజ తేడా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఊరుకో దని, మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమి నల్ కేసులు పెట్టిందని తెలిపారు. మరో రెండు మిల్లుల్లో మొత్తం ధాన్యాన్ని రికవరీ చేశామని, మిగతా ఐదు మిల్లులపై చర్యలు తీసుకోవా లని కలెక్టర్లకు లేఖలు రాశామని చెప్పారు. రెండో దశలో 63 మిల్లుల్లో తే డా.. అని ఎఫ్‌సీఐ అధికారులు జూన్ 4న లేఖ రాశారని, దాన్ని కలెక్టర్లకు పంపి పరిశీలించ మని ఆదేశించినట్లు వెల్లడించారు. జూన్ నుంచి నవంబర్ వరకు ఉచిత బియ్యం.. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యా న్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేయ డం లేదని ఎఫ్‌సీఐ చేసిన వ్యాఖ్యలు అర్థర హితమని మంత్రి గంగుల పేర్కొన్నారు. సాం కేతిక కార ణాల వల్ల 2 నెలలు ఉచిత బియ్యం సరఫరాలో ఆలస్యం అయిందని, ఈ జూన్ నుంచి యథాతథంగా సరఫరా చేస్తు న్నామని చెప్పారు. 2020 ఏప్రిల్ నుంచి కేంద్రంతో పాటు ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇచ్చా మని, తద్వారా ప్రభుత్వంపై 8 నెలల పాటు రూ.980 కోట్ల భారం పడిందని తెలిపారు. ఇక 2021 జూన్ నుంచి ఏప్రిల్ 2022 వరకు కూడా ఉచితంగా బియ్యం ఇచ్చామని వివరించారు. 2022 మార్చిలో.. ఏప్రిల్ నుంచి ఆరు నెలల పాటు ఉచిత బియ్యం ఇవ్వాలని కేంద్రం లేఖ రాసిందని, తదనుగుణంగా మూడో దశ కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించిన ప్పటికీ సేకరణ, ఇతర కారణాల వల్ల పంపిణీ ఆలస్యం అయిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 90,46,000 కార్డుల్లో కేవలం 53 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత అందరికీ ఉచితబియ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ జూన్ నుంచి తెల్ల రేషన్‌కార్డు దారులందరికీ రూ.436 కోట్ల భారాన్ని భరించి నవంబర్ వరకు ఆరు కిలోలకు అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 11 కేజీల చొప్పున ఉచితబియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, పెట్రోల్, డీజిల్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు చెప్పామని, స్టాక్ ఉండి కూడా ప్రజలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకపోతే బంకులపై చర్యలు తీసుకొం టామని గంగుల హెచ్చరించారు. . -
రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ తనిఖీలు ఆపాలి: మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్: రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాల తీరుపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) చేస్తున్న దాడులపై తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గుంగుల కమలాకర్ స్పందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఎఫ్‌సీఐ తనిఖీల వెనుక కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమేమిటని ప్రశ్నించారు. రైతుల సజావుగా ధాన్యం అమ్ముకోకుండా చేసే కుట్రలో భాగంగానే ఎఫ్‌సీఐ దాడులంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణలో కొనుగోళ్లు ప్రారంభం కాగానే దాడులు చేస్తున్నారు. రైస్ మిల్లులలో ఉద్దేశ్య పూర్వకంగానే ఎఫ్‌సీఐ తనిఖీలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై దాడి చేయాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొనుగోళ్లు సంజావుగా సాగకూడదని కేంద్రం భావిస్తోంది. రైతులు పండించిన పంట రైస్ మిల్లుల వరకూ చేరకూడదని డబ్బులు అందకుండా చేయాలని కేంద్రం ఉద్దేశ్య పూర్వకంగానే తనిఖీలు చేయిస్తోంది. దానివల్ల రైతులు ఇబ్బందులు పడుతారు. వడ్లు మాయం కావు.. కొనుగోళ్లు పూర్తి అయ్యాక ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని కేంద్రానికి విన్నవిస్తున్నాం. చదవండి: (అక్రమాలపై ఎఫ్‌సీ‘ఐ’) కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ రైస్ మిల్లులలో ఎఫ్‌సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలి. కేంద్రానికి అధికారం ఉంది.. మేము వ్యతిరేకించడం లేదు అయితే ఇప్పుడిప్పుడే కోతలు పూర్తయ్యి ధాన్యం వస్తోంది. కాబట్టి ఇది సమయం, సందర్భం కాదు. దీనివల్ల ధాన్యం సేకరణ ఆగిపోతుంది.. రైతులకు ఇబ్బందులు కలుగుతాయి. ధాన్యం సేకరణ పూర్తయ్యాక తనిఖీలు చేస్తే సహకరిస్తామని' తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. చదవండి: (4.54 లక్షల బస్తాలు మాయం) -
పక్కాగా లెక్క..కేంద్రం ఆదేశాలతో రంగంలోకి ఎఫ్‌సీఐ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో ప్రత్యక్ష తనిఖీలకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) శ్రీకారం చుట్టింది. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో ఎఫ్‌సీఐ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని ప్రతి రైస్‌మిల్లును ప్రత్యక్షంగా తనిఖీ (ఫిజికల్ వెరిఫికేషన్(పీవీ) చేయాలని, ప్రతి బస్తా లెక్క తేల్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తనిఖీ కార్యక్రమం మొదలైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక మిల్లుల్లో తనిఖీలు కొనసాగాయి. ఆయా జిల్లాల పౌరసరఫరా అధికారులతో కలిసి ఎఫ్‌సీఐ అధికారులు బృందాలుగా ఏర్పడి మిల్లుల్లో నిల్వలను, రికార్డులను పరిశీలించారు. పెద్దపల్లి, సూర్యాపేట, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం, బియ్యం బస్తాలను లెక్కించారు. తనిఖీల్లో తేలిన అంశాలతో ఓ నివేదికను త్వరలో ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఎఫ్‌సీఐ అధికారులు తెలిపారు. అక్రమాలపై అనుమానంతోనే.. రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసే విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అనుమానిస్తున్న ఎఫ్‌సీఐ ఇక నుంచి ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాతే బియ్యం సేకరించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ వల్ల కాలయాపన జరిగి, నిర్ణీత సమయంలో సీఎంఆర్ ఇవ్వలేమన్న పౌరసరఫరాల శాఖ వాదనను తోసిపుచ్చిన ఎఫ్‌సీఐ కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రంలోని ఏడు ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయాల పరిధిలోని 33 జిల్లాల్లో ఉన్న అన్ని రైస్ మిల్లుల్లో ఈ తనిఖీలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా వేర్‌హౌసింగ్ గోడౌన్ డిపోల మేనేజర్లు, ఇతర అధికారులతో 62 బృందాలను ఎఫ్‌సీఐ ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఇద్దరేసి అధికారులు ఉన్నారు. వీరు ఆయా జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి తమకు కేటాయించిన డివిజన్లలోని జిల్లాల్లో ఫిజికల్ వెరిఫికేషన్ జరపనున్నారు. రెండు సీజన్ల ధాన్యం తనిఖీ గత ఏడాది (2020–21) యాసంగి సీజన్‌తో పాటు మొన్నటి వానాకాలం (2021–22) సీజన్లకు సంబంధించిన ధాన్యంపై తనిఖీలు సాగుతున్నాయి. గత యాసంగి సీజన్‌కు సంబంధించి 475 మిల్లులు, వానాకాలం సీజన్ ధాన్యంకు సంబంధించి 1,825 మిల్లులను తనిఖీ చేయనున్నారు. తనిఖీలకు అనుగుణంగా ధాన్యం బస్తాలను అందుబాటులో ఉంచాలని ఎఫ్‌సీఐ ఇప్పటికే మిల్లుల యాజమాన్యాలను ఆదేశించింది. కాగా గత మార్చి నెలలో 958 మిల్లుల్లో తనిఖీ నిర్వహించగా, 40 మిల్లుల్లో నిల్వల్లో తేడా ఉన్నట్లు ఎఫ్‌సీఐ అధికారులు గుర్తించారు. 4.54 లక్షల బ్యాగుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. తనిఖీల తర్వాతే వానాకాలం బియ్యం సేకరణ గత యాసంగికి సంబంధించి సీఎంఆర్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఏప్రిల్ నెలాఖరు నాటికి మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. అయితే గడువు ముగియడంతో సీఎంఆర్ గడువును నెలరోజలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై ఇంకా నిర్ణయం రాలేదు. కాగా ఇప్పుడు యాసంగి ధాన్యానికి సంబంధించి తనిఖీలు జరపనున్న 475 మిల్లుల్లో సీఎంఆర్ ఎంతమేర పూర్తయిందో తెలియదు. ఒకవేళ సీఎంఆర్ పూర్తయితే.. యాసంగి సీజన్లో ఆయా మిల్లులకు వచ్చిన ధాన్యం, ఇచ్చిన బియ్యం లెక్కలను, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి బేరీజు వేసుకొని అక్రమాలు జరిగాయో లేదో తేల్చనున్నారు. వానాకాలం సీఎంఆర్ ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయి, అక్రమాలు లేవని తేలేంత వరకు బియ్యాన్ని సేకరించకూడదని ఎఫ్‌సీఐ నిర్ణయించుకుంది. ఇక నుంచి బియ్యం సేకరించేటప్పుడు బియ్యం ఎప్పటివో (ఎంత పాతవో) తేల్చే పరీక్షలు నిర్వహించాలని కూడా అధికారులకు ఎఫ్‌సీఐ ఆదేశాలు ఇచ్చింది. కాగా రైస్ మిల్లుల్లో జరిగే తనిఖీలకు అధికార యంత్రాంగం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు సూచించింది. జిల్లాల్లో తనిఖీలు సాగాయిలా... – ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో 3, ఖమ్మంలో 2, కొణిజర్ల 1, ఖమ్మం రూరల్‌లో 1, వైరాలో 3 మిల్లుల్లో తనిఖీలు జరిగాయి. జిల్లాలో మొత్తం 56 మిల్లులు ఉండగా 10 మిల్లుల నిర్వాహకులు ధాన్యం కేటాయింపునకు అనుగుణంగా సీఎంఆర్ బియ్యం ఇచ్చే సమయంలో ఆలస్యం చేస్తున్నట్టుగా తేలిందని సమాచారం. – మంచిర్యాల జిల్లాలో నస్పూర్, కిష్టంపేట, చెన్నూరు, కత్తెర శాల, ఆస్నాద్ శివారు రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు, మిల్లుల సామర్థ్యం, ట్రక్ షీట్లు తదితర వివరాలు పరిశీలించారు. గత మార్చి నెలలో జరిపిన తనిఖీల్లో జిల్లాలో ఎక్కడా ధాన్యం, బియ్యం సరఫరాలో తేడాలు గుర్తించలేదు. తాజా తనిఖీల్లో మాత్రం కొన్ని మిల్లుల్లో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వలకు సంబంధించి స్వల్ప తేడా గుర్తించినట్లు సమాచారం. – జోగుళాంబ గద్వాల జిల్లా లోని అయిజ పట్టణంలోని రైస్ మిల్లులను ఎఫ్‌సీఐ మేనేజర్లు కృష్ణమోహన్ , వెంకట సాయిరాం సివిల్ సప్లయిస్ అధికారి నరసింహారావు తనిఖీ చేశారు. దీనికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. – మహబూబాబాద్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో నిల్వలను ఎఫ్‌సీఐ అధికారులు భీమ్లా నాయక్, శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. నర్సింహులపేట మండలం పెద్దనాగారం శ్రీ శ్రీ పారాబాయిల్డ్ మిల్లు, మరిపెడ మండలంలోని ఎల్లంపేట లక్ష్మీ పారాబాయిల్డ్ మిల్లులో ఉన్న ధాన్యం, బియ్యం నిల్వలు, ఎఫ్‌సీఐకి పంపాల్సిన సీఎంఆర్ వివరాలు పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. – జగిత్యాల జిల్లాలో నాలుగు బృందాలుగా ఎఫ్‌సీఐ అధికారులు రైస్‌మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నిడమనూరు, నకిరేకల్, చిట్యాలతో పాటు సూర్యాపేట జిల్లా కోదాడలోని పలు మిల్లులో తనిఖీలు కొనసాగాయి. -
బలవర్థక ఆహారమే లక్ష్యం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర పభుత్వాల మధ్య బాయిల్డ్ రైస్‌పై వివాదం ఒకవైపు కొనసాగుతుండగానే ఇప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధకమైన బియ్యం) అంశం తెరపైకి వచ్చింది. గతేడాది రబీకి సంబంధించి సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సిన రైస్ మిల్లర్లు ఇకపై బలవర్థకమైన బియ్యాన్ని కలిపి ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ రైస్ మిల్లులకు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) నిర్ణయం మేరకే ఆదేశాలిచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.89లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్‌తో కూడిన బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. క్వింటాల్‌కు ఒక కిలో.. గత రబీ సీజన్(2020–21)లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించేందుకు రైస్ మిల్లులకు ఇచ్చిన విషయం విధితమే. ఈ బియ్యంలో బలవర్థకమైన బియ్యాన్ని మిలితం చేసి ఇవ్వాలని ఎఫ్‌సీఐ ఆదేశించింది. ఒక్కో క్వింటాల్ బియ్యంలో కిలో బలవర్థక బియ్యాన్ని కలపాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన బలవర్ధక బియ్యాన్ని సీఎంఆర్ బియ్యంలో మిళితం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం వెంటనే మిల్లులు ఈ మిక్చర్ ప్లాంట్లను అమర్చుకోవాలని ఆదేశించింది. బలవర్థక బియ్యంలో వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఈ ఫోర్టిఫైడ్‌రైస్‌ను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
సన్న రకం.. ‘ధర’హాసం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈ ఇద్దరే కాదు.. ఉమ్మడి నల్లగొండలో సన్నరకం ధాన్యాన్ని మిల్లుల్లో విక్రయిస్తున్న రైతులకు ఇప్పుడు మంచి ధర వస్తోంది. ఈ నెల మొదట్లో ఎక్కువ మందికి క్వింటాకు రూ.1,700, కొంతమందికి రైతులకు రూ. 1,960లోపే చెల్లించిన మిల్లర్లు.. ఇప్పుడు సర్కారు మద్దతు ధర రూ. 1,960 కన్నా ఎక్కువగా గరిష్టంగా రూ. 2,300 వరకు ఇస్తున్నారు. దీంతో రైతులు సంబురపడిపోతున్నారు. కారణమిదీ.. జిల్లాలోని మిల్లర్లు సన్నరకం ధాన్యాన్నే ఎగుమతి చేస్తారు. ఈ ధాన్యాన్ని రా రైస్‌గా మార్చి హైదరాబాద్ సహా దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాలకు ప్రతి ఏడాది ఎగుమతి చేస్తుంటారు. ఇటీవల ఆయా ప్రాంతాల వ్యాపారులు పెద్ద ఎత్తున సన్నరకం కావాలని కోరడంతో ధాన్యం కొనుగోళ్లను పెంచినట్లు మిల్లర్లు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సన్న ధాన్యం విక్రయించేందుకు వస్తున్న రైతులు తగ్గడంతో మిల్లర్లు పోటీపడి మరీ ఎక్కువ ధరకు కొంటున్నారు. ఒక్క మిర్యాలగూడలోనే 83 మిల్లులు సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. చివరి దశకు సన్నరకం అమ్మకాలు నల్లగొండ జిల్లాలో సన్నరకం ధాన్యం 6,09,758 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో రైతులు తాము తినేందుకు పక్కనపెట్టుకున్నవి పోనూ మిగతా 5 లక్షల మెట్రిక్ టన్నులు అమ్ముతారని అధికారులు అంచనా వేశారు. మిల్లర్లు ఇప్పటికే 3.5 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు. దీంతో ధాన్యం రాక తగ్గింది. యాదాద్రి జిల్లాలో 1.12 లక్షల హెక్టార్లకు గాను 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో ఎక్కువ శాతం సాధారణ రకమే. సూర్యాపేట జిల్లాలో 4,51,623 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి రాగా ఇందులో సగానికిపైగా ఇప్పటికే మిల్లర్లకు అమ్మేశారు. ఇలా వచ్చే ధాన్యం తగ్గుతుండటం, వ్యాపారుల నుంచి డిమాండ్ ఉండటంతో రేటు పెరుగుతోంది. ఈయన పేరు పేరం వెంకన్న. ఊరు నేరేడుచర్ల మండ లం నర్సయ్యగూడెం. తనకున్న ఐదెకరాలతో పాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకొని చింట్లు రకం ధాన్యం సాగు చేశాడు. పదెకరాల్లో పండిన ధాన్యాన్ని 15 రోజుల కిందట క్వింటాకు రూ.1,700 చొప్పున విక్రయించాడు. తాజాగా ఆదివారం ఐదెకరాల ధాన్యాన్ని క్వింటా రూ.2,300 చొప్పున అమ్మాడు. ఒక్కో క్వింటాపై రూ. 600 ఎక్కువ రావడంతో సంతోషించాడు. -
‘వడ్లు దంచంగా రాడే.. వండంగ రాడే’.. ఈ పాట ఎక్కడైనా విన్నారా?
‘వడ్లు దంచంగా రాడే... వండంగ రాడే...’ వడ్లు దంచుతూ ఆ శ్రమను మర్చిపోవడానికి పల్లె మహిళలు పాడే పాట. ఇప్పుడంటే రైస్ మిల్లుల్లో బియ్యం పట్టిస్తున్నారు కానీ... తెలంగాణ పల్లెల్లో వెనుకట ఎంత ఉన్నవాళ్లైనా వడ్లు రోట్లో పోసి దంచి బియ్యం చేయటమే. ఆ ప్రక్రియలో శ్రమ అధికం. తమ బలాన్నంతా రోకలిపై ప్రయోగించి దంచాల్సి వచ్చేది. ఆ శ్రమ ఎక్కువగా లేని అనువైన సంప్రదాయ బియ్యం దంపుడు పద్ధతి మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కనిపించింది. అది కట్టెలతో తయారు చేసిన టెక్కి యంత్రం. రెండు కర్రల మధ్య భారీ చెక్కను పెట్టి, దానికి రోకలిని బిగించారు. ఆ చెక్క(టెక్కి)ని తొక్కితే రోకలి పైకి లేస్తుంది. వదిలేసినప్పుడు కింద సొర్కెలో ఉన్న వడ్లు దంచి బియ్యంగా మార్చేస్తుంది. వాటిని చెరిగి, మిగిలిన మెరిగలను మళ్లీ దంచుతారు. మిల్లుల్లో పాలిష్ చేసిన బియ్యంలో లేని పోషకాలెన్నో ఈ దంపుడు బియ్యంలో ఉంటాయి. చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్ దంపుడు బియ్యం ప్రయోజనాలు దంపుడు బియ్యం(ముడి బియ్యం) చూడటానికి ఇంపుగా లేకపోయినా చాలా పోషక విలువలున్నాయి. ముడి బియ్యంలో ఉన్న పీచు అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ముడి బియ్యం ఊక నుంచి లభ్యమయ్యే నూనె కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దంపుడు బియ్యం తినడం వల్ల రక్తపోటు తగ్గడమే కాకుండా రక్త నాళాల్లో కొమ్ము పేరుకోకుండా కాపాడుతుంది. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
వరికి ఎసరెందుకు?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 25కుపైగా రాష్ట్రాల్లో వరి పండిస్తున్నారు. ఇది కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో వరే ప్రధాన పంట. వరి ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నేరుగా కొనుగోలు చేయకుండా.. కస్టమ్ మిల్లింగ్ విధానంలో తీసుకుంటుంది. అంటే.. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే కొని రైతులకు డబ్బులు చెల్లిస్తాయి. తర్వాత ఆ ధాన్యాన్ని రైస్‌మిల్లులకు పంపి మిల్లింగ్ చేయిస్తాయి. ఇందుకోసం మిల్లులకు డబ్బులు చెల్లిస్తాయి. మిల్లింగ్ ద్వారా ఉత్పత్తి అయిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పంపుతాయి. ఎఫ్‌సీఐ ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తుంది. ఇలా సేకరించిన బియ్యాన్ని ‘డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ పూల్’ విధానం ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రేషన్ డిపోలకు సరఫరా చేస్తుంది. ఎఫ్‌సీఐ ప్రధానంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎక్కువగా బియ్యాన్ని సేకరిస్తుంది. ♦దేశవ్యాప్తంగా 2020–21లో 12.23 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా.. ఎఫ్‌సీఐ 25 రాష్ట్రాల నుంచి 5.99 కోట్ల టన్నులు సేకరించింది. ఇందులో ముందుజాగ్రత్త కోసం చేసే నిల్వ (బఫర్ స్టాక్) 1.35 కోట్ల టన్నులుపోగా.. మిగతా బియ్యాన్ని అవసరమైన రాష్ట్రాలకు పంపుతుంది. క్వింటాల్ ధాన్యానికి 68 కిలోల బియ్యం వస్తేనే.. ఎఫ్‌సీఐ ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు కనీసం 68 కిలోల బియ్యం రావాలి. కానీ రాష్ట్రంలో యాసంగి ధాన్యం మిల్లింగ్ సమయంలో విరిగిపోయి నూకల శాతం పెరుగుతోంది. బియ్యం తగ్గుతున్నాయి. దీనికి ఎఫ్‌సీఐ అంగీకరించదు. అదే ధాన్యాన్ని పారాబాయిల్డ్ మిల్లుల్లో ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్)గా మార్చితే ఎఫ్‌సీఐ ప్రమాణాల మేరకు 68కిలోలకుపైగా వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా బాయిల్డ్ రైస్ విధానాన్ని ప్రోత్సహిస్తూ, వీలైనంత వరకు ధాన్యం కొనుగోలు చేస్తూ వచ్చింది. అయితే ఎఫ్‌సీఐ ఇకముందు బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పడంతో సమస్య మొదలైంది. ♦ గత యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభు త్వం.. రైతులకు రూ.17 వేల కోట్లకుపైగా చెల్లించింది. ఆ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుటివరకు లక్ష్యంలో 50 శాతమే ఎఫ్‌సీఐకి పంపారు. ఎఫ్‌సీఐ గోడౌన్లకు బియ్యం చేరితేనే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు తిరిగి వస్తాయి. వరిసాగు భారీగా పెరగడంతో.. తెలంగాణలో గతంలో కంటే వరిసాగు భారీగా పెరిగింది. గతంలో సాధారణంగా 26 లక్షల ఎకరాల్లో వరి పండించేవారు. కొన్నాళ్లుగా సాగునీటి సమస్య తీరడం, వాతావర ణం అనుకూలిస్తుండటం, విద్యుత్ సరఫరా బాగుండటం తో.. ప్రస్తుతం సాగు 60 లక్షల ఎకరాలకు చేరింది. కొన్నేళ్లలో నే ఇంత భారీగా సాగు, ధాన్యం దిగుబడి పెరగడంతో.. దాని కి అనుగుణంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం పెరిగింది. మరోవైపు.. దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో సేకరణను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కూడా సమస్యకు దారి తీసింది. ♦ తెలంగాణలో గత యాసంగిలో పెరిగిన పంట విస్తీర్ణంతో ఏకంగా 92.33 లక్షల టన్నుల ధాన్యం దిగుబడిరాగా.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించింది. కానీ కేంద్రం 24.60 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటామని, మిగతా పచ్చి బియ్యంగా ఇవ్వాలని రాష్ట్రానికి లేఖ రాసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో రెండు సీజన్లలో పండిన పంటలో ఉప్పుడు బియ్యం, పచ్చి బియ్యం కలిపి 90 లక్షల టన్నులు సేకరించాలని కోరింది. దీనికి కూడా అంగీకరించని కేంద్రం.. వానకాలం పంటను పూర్తిగా తీసుకుని, యాసంగిలో 44.75 లక్షల టన్నులే సేకరించేందుకు ఒప్పుకొంది. 2021–22 వానాకాలం (ప్రస్తుత సీజన్) పంటలోనూ 40 లక్షల టన్నుల పచ్చి బియ్యం (రా రైస్) మాత్రమే సేకరిస్తామని చెప్పింది. భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం కొనబోమని స్పష్టం చేసింది. రాష్ట్రం నుంచి కేరళ, తమిళనాడు, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియాలకు సుమారు 30 లక్షల టన్నులు ఉప్పుడు బియ్యం ఎగుమతి అవుతాయని అంచనా. వరిలో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడితే.. యాసంగిలో రాష్ట్ర రైతులు.. ధాన్యం దిగుబడి అధికంగా ఉండి, చీడపీడలు అంటని రకాలనే సాగుచేస్తారు. ఆయా జిల్లాల వారీగా ఉన్న వాతావరణ పరిస్థితులు, సీడ్ కంపెనీల లాబీయింగ్ వంటికారణాలతో.. కొన్నేళ్లుగా ఒకే తరహా వంగడాలను సాగుచేస్తున్నారు. యాసంగి సమయంలోనూ మిల్లింగ్‌లో నూకలుగా మారని వంగడాలు ఉన్నా.. ఆ దిశగా రైతులు, సీడ్ కంపెనీలు ఆలోచించడం లేదని రైస్‌మిల్లర్ల సంఘం నేత తూడి దేవేందర్‌రెడ్డి చెప్తున్నారు. ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, జైశ్రీరాం, బీపీటీ వంటి వంగడాలు యాసంగిలో కూడా మంచి దిగుబడి వస్తాయని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల కన్నా వరిలోనే ప్రత్యామ్నాయ వంగడాలను ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయ పంటలివే.. ♦ మొక్కజొన్న, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, కందులు, శనగలు, పెసర్లు, ఉలువలు తదితరాలు ♦ వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్, కుసుమలు, ఆముదం, ఇతర నూనె పంటలు ♦ ఇతర ఆహార పంటలు, పొగాకు సాగు వానాకాలం పంట కొనుగోళ్లూ తక్కువే.. రాష్ట్రంలో వానాకాలం పంటను చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ వివిధ కారణాలతో పంట కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇదే సమయంలో అకాల వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిసిపోతోంది. రాష్ట్రంలో ఆదివారం నాటికి 2,34,517 మంది రైతుల నుంచి 14.84 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు మొదలేకాలేదు. రూ.2,415 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా.. రూ.489.6 కోట్లను మాత్రమే జిల్లాలకు విడుదల చేశారు. అయితే ఆలస్యమైనా వానకాలం కొనుగోళ్లకు ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్తుండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి యాసంగిపైనే పడింది. ఇతర రాష్ట్రాల్లో ‘బాయిల్డ్’ గొడవెందుకు లేదు? దేశవ్యాప్తంగా చూస్తే.. కేరళలో మాత్రమే అత్యధికంగా 80 శాతం ఉప్పుడు బియ్యాన్ని వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, హరియాణా, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ యాసంగిలో పండిన ధాన్యాన్ని కొంతమేర ఉప్పుడు బియ్యంగా మారుస్తారు. కానీ మరీ తెలంగాణ స్థాయిలో ఉండదు. ఆ రాష్ట్రాలలో ఉన్న భూసార పరిస్థితులకు తోడు.. వాటికి ఆనుకొని ఉన్న సముద్రం కారణంగా ఎండాకాలంలోనూ గాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. యాసంగిలో ధాన్యం ఎక్కువగా నూకలు అవదు. కొంతమేర ఉప్పుడు బియ్యం ఉత్పత్తి అయినా అది ఆ రాష్ట్రాల అవసరాలకు సరిపోనుంది. దీనివల్లే కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోబోమని చెప్పినా.. ఆయా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురుకాలేదు. కేసీఆర్ ప్రకటన కోసం ఎదురుచూపులు! ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. యాసంగిలో వరి వేయవద్దని హెచ్చరిస్తూనే, ఏ బియ్యం ఎంత మేర కొంటారో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా సాగు విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో ఈనెల 18న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఆదివారం మంత్రులు, అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. రెండు రోజులు అక్కడే ఉంటామని, ఉప్పుడు బియ్యం కొనుగోళ్లకు కేంద్రం ఒప్పుకోకపోతే రైతులు యాసంగిలో ఏ పంట వేయాలో సూచిస్తామని తెలిపారు. దీంతో రైతులు ముఖ్యమంత్రి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. పచ్చిబియ్యంగా మార్చలేకనే.. వానలు సరిగాపడి, నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు రైతులను పంటల కోసం ప్రోత్సాహించాల్సింది పోయి.. వరి పండించకూడదని కేం ద్రం చెప్పడం సరికాదు. రాష్ట్రంలో యాసంగిలో పండే ధాన్యాన్ని పచ్చిబియ్యంగా మారిస్తే.. నూకల శాతం పెరిగి ఎఫ్‌సీఐకి విక్రయించలేని పరిస్థితి. అందుకే కొన్నేళ్లుగా బాయిల్డ్ రైస్‌గా ఎఫ్‌సీఐకి ఇస్తున్నాం. యాసంగిలో కూడా బాయిల్డ్ రైస్ కేంద్రం కొనేందుకు ముందుకు రావాలి. అంతకు మించి ప్రత్నామ్నాయం లేదు. - సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు, అఖిల భారత రైతు సంఘం చట్టం ప్రకారం కేంద్రం కొనాల్సిందే.. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం వరి ధాన్యం కొనాల్సిందే. ఆ చట్టం కింద ప్రతీ ఒక్కరికి ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రం వరి తగ్గించాలనుకుంటే.. ఫలానా పంట వేస్తే మద్దతు ధరకు కొంటామని ముందే చెప్పాలి. ప్రతీ గింజ కొంటా మని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎందుకు చెప్పింది? ఏ ఆధారం చేసుకొని కేసీఆర్ ఈ ప్రకటన చేశారు? పచ్చిబియ్యం విషయంలో నూకలు వస్తాయంటున్నారు. ఇది ప్రాసెసింగ్ సమస్య. సేకరణ సమస్య కాదు. ఈ విషయంపై మిల్లర్లతో కూర్చొని చర్చించుకోవాలి. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు ప్రత్యామ్నాయ పంటలను మద్దతు ధరలకు కొనాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యామ్నాయ పంటలను మద్దతుధరకు కొనేలా హామీ ఇవ్వాలి. కేరళ తరహాలో బోనస్ ఇవ్వాలి. మద్దతు ధరలు లేని ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, ఆముదం, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, జొన్న పంటలు వేయాలని చెప్తోంది. ఇందులో ఆవాలు, ఆముదం పంటలు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల జాబితాలో లేవు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు నిర్ణయించాలి. ఈ యాసంగిలో రైతులు నష్టపోకుండా నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వ సంస్థల నుండే సరఫరా చేయాలి. – టి.సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతుసంఘం -
ధాన్యం కొనుగోలు చేయాలి
-
‘ప్రజాపంపిణీ’ పక్కదారి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రైస్‌మిల్లులు సీఎమ్మార్ (కస్టం మిల్లింగ్ రైస్) చిల్లు పెడుతున్నాయి. మర ఆడించాల్సిన ధాన్యాన్ని తెరచాటుగా పక్కదారి పట్టిస్తు న్నాయి. పేదలకు అందాల్సిన బియ్యం పెద్ద ల పాలవుతున్నాయి. రాష్ట్ర సరిహద్దులు దా టి అక్రమార్కుల చెంతకు చేరుతున్నాయి. రాష్ట్రంలో దారి ద్య్రరేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు ప్రతినెలా ప్రభుత్వం రూపాయికి కిలోబియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సరఫరా చేస్తోంది. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొని, మర ఆడించి ఇచ్చేలా రైస్‌మిల్లులకు సీఎమ్మార్(కస్టం మిల్లింగ్ రైస్) కేటాయిస్తోంది. మర ఆడించినందుకుగాను మిల్లర్లకు చార్జీలు సైతం చెల్లిస్తోంది. అయితే ప్రజాపంపిణీ వ్యవస్థలో పందికొక్కులు చేరి సీఎమ్మార్ బియ్యాన్ని బొక్కేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లో సీఎమ్మార్ ధాన్యం యథేచ్ఛగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలుతోంది. గద్వాల – కర్ణాటక – తమిళనాడు.. ఉమ్మడి పాలమూరు నుంచి సీఎమ్మార్ ధా న్యం ప్రధానంగా మూడు దశల్లో రాష్ట్ర సరి హద్దులు దాటుతోంది. గద్వాల నుంచి కర్ణా టకలోని రాయచూర్.. ఆ తర్వాత గంగావ తి జిల్లాలోని కాటుక టౌన్‌కు.. అక్కడి నుంచి తమిళనాడులోని గంగై పట్టణానికి త రలుతోంది. రాష్ట్రంలో ధాన్యానికి అధికంగా క్వింటాల్‌కు రూ.1,880 ధర పలుకుతుండగా, గంగైలో రూ.3 వేలకుపైగా పలుకుతోంది. క్వింటాల్‌కు అధికంగా రూ.1,000 నుంచి రూ.1,200 వరకు వస్తుండటంతో అక్రమార్కులు అక్కడికి దొంగచాటుగా తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం గద్వాల జిల్లాలో ఈ నెల 18న సీఎమ్మార్ ధాన్యాన్ని తరలిస్తూ పట్టుబడిన మూడు లారీలే. ఇవే నిదర్శనం.. ►గతేడాది యాసంగిలో గద్వాల జిల్లాలో 1,27,476 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 29 రైస్ మిల్లులకు సీఎమ్మార్ కింద కేటా యించారు. సరిగ్గా మర ఆడిస్తే 85,489 మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయి. అయి తే ఇప్పటివరకు 23,170 మెట్రిక్ టన్నులను మాత్రమే మిల్లర్లు ప్రభుత్వానికి అ ప్పగించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడు వు ఈ నెలాఖరులోపు ఇంకా 62,319 మెట్రిక్ టన్నుల బి య్యాన్ని అప్పగించాలి. వారంలో ఇంతమొత్తం అప్పగించడం సాధ్యం కాదనేది సుస్పష్టం. అటు మిల్లుల్లో సీఎమ్మార్ కింద కేటాయించిన ధాన్యం నిల్వలు కనిపించడం లేదని సివిల్ సప్లయ్ వర్గాలే చెబుతున్నాయి. అంటే 70 శాతం మేర ధాన్యం తమిళనాడుకు తరలిపోయినట్లు తెలుస్తోంది. ►శ్రీ ఆంజనేయ రైస్ మిల్లుకు గత యాసంగికి సంబంధించి 2,883.320 మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ ధాన్యం కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 421.900 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వానికి చేరింది. ఇంకా 1499.924 మెట్రిక్ టన్ను ల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ నెల 18న ఈ మిల్లు నుంచి 1,399 బస్తాల ధాన్యాన్ని రెండు లారీల్లో తమిళనాడుకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతోపాటు వేరొకరికి చెందిన మరో లారీలో 600 బస్తాల ధాన్యం తరలుతుండగా అధికారులు మల్దకల్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. గద్వాల స్టేషన్‌కు తరలించిన ఈ వాహనాలను తప్పించేందుకు ఓ ప్రజాప్రతినిధి తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. వీరిపై ఎట్టకేలకు ఐదు రోజుల తర్వాత 6ఏ కేసు నమోదు చేశారు. 50 శాతం వాటా.. గత ఏడాది యాసంగిలో గద్వాల జిల్లా నుం చే కాకుండా నారాయణపేట, నాగర్‌కర్నూ ల్, వనపర్తి జిల్లాల నుంచి కూడా ధాన్యం సేకరించారు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే రంగప్రవేశం చేసి సీఎమ్మార్ కింద మిల్లులకు కేటాయింపులు చేశారు. ఆ తర్వాత రేషన్ మాఫియాను తెర ముం దు ఉంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ తతంగానికి ముందు రేషన్ దందా నిర్వహిస్తున్న ముఖ్యులతో ఆయన సమావేశమై 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. మూడు లారీలు పట్టుబడిన క్రమంలో రేషన్ మాఫియాకు చెందిన ఓ లీడర్ ‘మాకేం మిగులుతాంది.. ఆయనకే సగం పోతాంది’అని తెలిసిన వారి వద్ద వాపోయినట్లు సమాచారం. నెలనెలా రేషన్ మాఫియా నుంచి ఆమ్యామ్యాలు అందుతుండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా.. లేక సదరు ప్రజాప్రతినిధి కంటపడితే బదిలీ కాక తప్పదని భయపడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు.. రైస్ మిల్లులకు ప్రభుత్వం సీఎమ్మార్ ధాన్యాన్ని కేటాయించింది. ఈ క్రమంలో ఈ నెల 18న మూడు లారీలలో అక్రమంగా ధాన్యం తరలివెళ్తుండగా పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించాం. మూడు లారీలలో రెండు వేల బస్తాల ధాన్యం పట్టుబడింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై 6ఏ కేసు నమోదు చేశాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఈ దందాలో పెద్దల పాత్రపై తమకు ఎలాంటి సమాచారం లేదు. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. – రఘురామ్‌శర్మ, అదనపు కలెక్టర్, జోగుళాంబ గద్వాల -
‘ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: యాసంగికి సంబంధించి రైసు మిల్లుల్లో ఉన్న ధాన్యం నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైసు మిల్లర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు, మిల్లర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యాసంగి సీజన్ సీఎంఆర్ సేకరణ, ఎఫ్‌సీఐ నుంచి ఎదురవుతున్న సమస్యలపై గురువారం పౌరసరఫరాలభవన్‌లో కమిషనర్ అనిల్ కుమార్‌తో కలసి ఆయన రైసు మిల్లర్లతో సమీక్షించా రు. యాసంగి సీజన్లో మొత్తంగా 92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, సీఎంఆర్ కింద బియ్యంగా మార్చి 64 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉందని, అయితే ఇప్పటివరకు మిల్లర్ల నుంచి 22లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకుందని తెలిపారు. -
సీఐ గారి రైస్‌మిల్ కథ!.. సుప్రియ పేరుతో
సాక్షి, పట్నంబజారు(గుంటూరు తూర్పు): ఇదీ ఒక సీఐ గారి రైస్‌మిల్ కథ.. రైస్ మిల్లులో ప్రజల సొమ్మును కొల్లగొట్టారు. ‘సుప్రియ పేరుతో రైస్‌మిల్ పెడుతున్నా.. పెట్టుబడి పెడితే షేర్లు ఇస్తా.. దీంతో పాటు మిల్లులో ఉద్యోగం ఇస్తామని నమ్మబలికారు’.. కోట్లాది రూపాయలు వసూలు చేశారు.. మిల్లు తెరుచుకుంది.. సంపాదన బాగానే ఉంది.. అందుకు పెట్టుబడి పెట్టిన వారికి.. అప్పులిచ్చిన వారికి మాత్రం ఇప్పటికీ షేర్లు రాలేదు సరికదా ఉద్యోగాలు వచ్చింది లేదు. ఇదంతా చేసింది ఒక పోలీసు అధికారి. ఓ నాలుగు కేసులు ఆయనపైనా, మరో రెండు కేసులు ఆయన భార్యపైనా నమోదయ్యాయి. అయితే స్టేషన్ స్థాయి అధికారులు కేసుల విచారణలో పక్షపాతం చూపుతున్నారనే విమర్శలొస్తున్నాయి. గుంటూరు రేంజ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బత్తుల శ్రీనివాసరావు ఎస్ఐ, సీఐగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్‌లో ఉన్నారు. ఖాకీ దుస్తులను అడ్డుపెట్టుకుని నిలువు దోపిడీకి తెరదీశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇతర వ్యాపారాలు చేయకూడదనే నిబంధనలకు నీళ్లొదిలేశారు. రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో రైస్‌మిల్లు కడుతున్నానంటూ జనం నుంచి కోట్లాది రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. చదవండి: (టీడీపీతో ఒప్పందంతోనే సీఎంపై పవన్ విమర్శలు) కేసుల పరంపర ఇలా... ►గుంటూరు శ్రీనివాసరావుతోటకు చెందిన బండ్లమూడి బిందు వద్ద 2016 సంవత్సరంలో రూ. 1 కోటి 40 లక్షలు అప్పుగా తీసుకుని, ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో బాధితురాలు నగరంపాలెంలో పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయనతోపాటు భార్యపైనా కేసు నమోదైంది. ►తెనాలికి చెందిన యండ్రాతి చంద్రమ్మ అనే మహిళ వద్ద 2018 సంవత్సరంలో రూ.15 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశారనే ఫిర్యాదు మేరకు టూటౌన్లో కేసు నమోదైంది. ►విశాఖపట్నంలోని గాజువాకలో తనకు బంధువైన ఏలిషా వద్ద రూ.29 లక్షల వరకు తీసుకుని మోసం చేయటంపై గాజువాక పీఎస్‌లోనూ కేసు నమోదైంది. తన రైస్‌మిల్లుకు సంబంధించి షేర్లు ఇస్తామని నమ్మబలికి అతన్ని మోసం చేయటంపై ఫిర్యాదు చేశాడు. ►గుంటూరు నగరంలో నివాసం ఉండే పాపాబత్తుల ప్రభుదాస్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేశారు. ఈ క్రమంలో పరిచయమైన సీఐ బత్తుల శ్రీనివాసరావు అతని రైస్‌మిల్లులో షేర్లు ఇవ్వటంతో పాటు, సూపర్వైజర్గా ఉద్యోగం ఇస్తా మని నమ్మబలికి రూ.34 లక్షల 84 వేల నగదును తన అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అయితే ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని బాధితుడు వాపోతున్నాడు. ►పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కూడా ఇదే విధంగా షేర్ ఇస్తామని, తన బినామీల ద్వారా రూ.25 లక్షలు వరకు తీసుకున్నారని, అందులో ఆయనే సాక్షిగా ఉన్నారని బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బెదిరింపులకు తెరదీసి.. డబ్బులు తీసుకున్న ఏ ఒక్కరికీ తిరిగి ఇవ్వకపోగా, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. సీఐ స్థాయిలో ఉన్న శ్రీనివాసరావుపై కేసులు నమోదు చేసినప్పటికీ, ఉన్నతాధికారులు తప్ప, స్టేషన్ అధికారులు పట్టించుకోవటంలేదు. మాపై దయ ఉంచి.. డబ్బులు ఇప్పించండయ్యా! నేను రిటైర్మెంట్ అవ్వగానే వచ్చిన డబ్బులన్ని సీఐ బత్తుల శ్రీనివాసరావుకే ఇచ్చా. నా జీవితకాలం కష్టం తీసుకెళ్లి ఆయనకిచ్చా. కుటుంబ పెద్దగా రిటైర్మెంట్ తరువాత ఏదో వ్యాపారం చేద్దామకున్నా.. తప్ప, పోలీసు అయి ఉండి ఆయన మోసం చేస్తారని అనుకోలేదు. నా డబ్బులు, మిగిలిన బాధితులకు తిరిగి డబ్బులు తిరిగి ఇప్పించాలి. – పాపాబత్తుల ప్రభుదాస్, శ్రీనగర్, గుంటూరు కేసులు వాస్తవమే సీఐ హోదాలో ఉన్న బత్తుల శ్రీనివాసరావుపై పలు కేసులు నమోదైన మాట వాస్తవమే. పూర్తిస్థాయిలో కేసులు విచారిస్తున్నాం. ఆరోపణల నేపథ్యంలోనే బత్తుల శ్రీనివాసరావును సస్పెండ్ చేశాం. గుంటూరు జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. మరెవరైనా బాధితులు ఉన్నారా.. అనే కోణంలోనూ విచారిస్తున్నాం. –సీఎం తివిక్రమవర్మ, డీఐజీ -
బియ్యం అక్రమార్కులకు పెద్దల అండ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని రేఖ రైస్ మిల్లు అక్రమాల్లో భాగస్వాములైన అధికారులకు రాష్ట్రస్థాయిలో ఓ ఉన్నతాధికారి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాపతినిధి అండగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అందువల్లే గత ఏడాది డిసెంబర్లో విచారణ నివేదిక అందినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. అయితే గద్వాల టీఆర్ఎస్ పార్టీలో మూడు వర్గాలు ఉండగా.. ఓ వర్గం నేతలు జిల్లాస్థాయి అధికారికి మద్దతు ఇస్తున్నారని, మరో వర్గం తటస్థంగా ఉందని తెలిసింది. వారికి పోటీగా ఉండే ఇంకో వర్గం నేతలు రేషన్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ యంత్రాంగంపై ఇటీవల తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. దీని కారణంగానే ఒకరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు చెప్తున్న వివరాలు కూడా ఈ ప్రచారాన్ని బలపరుస్తున్నాయి. ఒకరిపై కేసు నమోదుకు ఆదేశాలు ‘‘రేఖ రైస్‌మిల్లులో పట్టుబడిన 170.05 క్వింటాళ్ల రేషన్ బియ్యం విషయంలో రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులను తప్పుదోవ పట్టించిన ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గణపతిరావుపై కేసు నమోదు చేయాలని చెప్పారు. ఈ మేరకు గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం’’అని ఇన్చార్జి డీఎస్ఓ రేవతి తెలిపారు. ఈ ఘటనతో సంబంధమున్న ఇతర అధికారులపై చర్యలకు సంబంధించి పైనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వివరించారు. ఈ లెక్కన రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదిక బుట్టదాఖలైనట్టేనా? అందులో పేర్కొన్న అదనపు కలెక్టర్ (రెవెన్యూ), మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇన్చార్జి తహసీల్దార్, సీఐ, ఎస్సైలపై చర్యలుంటాయా.. లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘రేషన్’ బియ్యం వ్యవహారం ఇదీ.. 2020 అక్టోబర్ 2న గద్వాల శివారులోని రేఖ రైస్ మిల్లులో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్టు స్థానిక పోలీసులకు పక్కా సమాచారం అందింది. రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు ఆ మిల్లులో సోదాలు నిర్వహించారు. 341 సంచుల్లో (170.05 క్వింటాళ్లు) రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. కానీ మిల్లు యాజమాన్యంతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారు. పట్టుబడినది రేషన్ బియ్యం కాదంటూ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఎల్.గణపతిరావు తప్పుడు నివేదిక రూపొందించి బురిడీ కొట్టించాడు. దీనిపై అప్పట్లో పోలీస్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గతంగా వివాదం చెలరేగింది. ఈ విషయం బయటికి రావడంతో రాష్ట్రస్థాయి విజిలెన్స్ బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. మిల్లులో సీజ్ చేసిన బియ్యాన్ని ల్యాబ్‌కు పంపగా రేషన్ బియ్యమేనని తేలింది. దీంతో పూర్తిస్థాయిలో ఆరా తీశారు. రేఖ మిల్లులో బియ్యం పట్టుబడ్డ రోజు గణపతిరావు విధుల్లోనే లేరని, తప్పుడు అనుమతి పత్రాలను రూపొందించి అధికారులకు ఇచ్చారని గుర్తించారు. ఈ వ్యవహారంలో అప్పటి గద్వాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)తోపాటు మరో ఐదుగురి హస్తం ఉన్నట్టు తేల్చి గత ఏడాది డిసెంబర్లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇన్నాళ్లూ ఆ నివేదిక మూలనపడగా.. తాజాగా గత నెల 21న గద్వాల పట్టణ పోలీసు స్టేషన్లో డీటీ గణపతిరావుపై కేసు నమోదు చేశారు. ఈ దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. -
మిల్లు ఆగలేదు
సాక్షి, అమరావతి: రబీ పంట చేతికొచ్చే సమయంలోనే కరోనా ముంచుకొచ్చింది. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్డౌన్ ప్రకటించినా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలోని రైస్ మిల్లులు పూర్తిస్థాయిలో పనిచేశాయి. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైస్ మిల్లులను అత్యవసర సేవలు పరిధిలోకి తీసుకు రావడంతో పూర్తిస్థాయిలో ధాన్యాన్ని మిల్లింగ్ చేయగలిగాయి. లాక్డౌన్ ప్రకటించిన తొలి 10 రోజుల్లో చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టర్లు, తహసీల్దార్లు రైస్ మిల్లులు పని చేయడానికి వీలుగా సిబ్బంది, కార్మికుల రాకపోకలకు అనుమతులు ఇవ్వడంతోపాటు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసింది. వైఎస్ తర్వాత జగనే.. గతంలో రైస్ మిల్లులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదుకోగా.. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రంగాన్ని ఆదుకున్నారని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ హయాంలో రైస్ మిల్లులకు ఇండస్ట్రియల్ ఎల్టీ విద్యుత్ పరిమితిని 100 హెచ్‌పీకి పెంచితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఏప్రిల్ నుంచి ఎల్టీ పరిమితిని 150 హెచ్‌పీకి పెంచారు. లాక్డౌన్ సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం చిన్న రైస్ మిల్లులకు పెద్ద ఊరటనిచ్చింది. ఇదే సమయంలో మూడు నెలల పాటు మినిమమ్ డిమాండ్ చార్జీలను రద్దు చేయడంతో అనేక మిల్లులు లబ్ధి పొందాయి. ఒక్కొక్క మిల్లుకు కనీసం రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ప్రయోజనం కలిగింది. బియ్యం రీసైక్లింగ్‌కు చెక్ ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని రేషన్ కార్డులపై అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిస్తోంది. గతంలో రేషన్ బియ్యం మిల్లులకు వచ్చేవి. వాటిని రీసైక్లింగ్ చేసి తిరిగి మార్కెట్లోకి వెళ్లేవి. ప్రభుత్వ చర్యలతో రీసైక్లింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు మిల్లర్లు సార్టెక్స్ మెషిన్లను సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 800 మిల్లుల్లో సార్టెక్స్ మెషిన్లు ఉన్నాయి. ఒక్కో మెషిన్ ఏర్పాటుకు రూ.60 లక్షల వరకు అవుతుందని అంచనా. ఎల్టీ పరిమితిని 150 హెచ్‌పీకి పెంచడం, ప్రభుత్వం గ్యారెంటీతో రుణాలు ఇస్తుండటంతో చాలా మంది మిల్లర్లు సార్టెక్స్ మెషిన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. పాతికేళ్ల డిమాండ్ నెరవేరింది రైస్ మిల్లులకు ఇండస్ట్రియల్ ఎల్టీ పరిమితిని 150 హెచ్‌పీకి పెంచాలని 25 ఏళ్లుగా కోరుతున్నాం. రాజశేఖరరెడ్డి హయాంలో 100 హెచ్‌పీకి తీసుకెళితే.. ఆయన తనయుడు సీఎం జగన్ 150 హెచ్‌పీకి పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ కింద రుణాలకు గ్యారెంటీ ఇస్తుండటంతో బ్యాంకులు రుణాలివ్వడం ప్రారంభించాయి. – గుమ్మడి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఇబ్బందుల్లేకుండా చేశారు లాక్డౌన్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పూర్తిస్థాయిలో 14 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేశాం. తూర్పు గోదావరి జిల్లాలో 350 మిల్లులు ఉన్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు. – అంబటి రామకృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వ ధరే ఎక్కువగా ఉంది లాక్డౌన్ సమయంలో ప్రారంభంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమకు చిన్నపాటి ఇబ్బందులొచ్చినా ఆ తర్వాత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. కృష్ణా జిల్లాలో 250 వరకు మిల్లులు ఉన్నాయి. విదేశాలకు ఎగుమతి చేసే ధర కంటే ప్రభుత్వం కొనుగోలు ధరే ఎక్కువగా ఉంది. అందుకని మొత్తం బియ్యాన్ని ప్రభుత్వానికే సరఫరా చేస్తున్నాం. – పి.వీరయ్య, పిన్నమనేని వీరయ్య అండ్ కంపెనీ -
పెద్దాపురంలో ఐటీ అధికారుల సోదాలు
-
లలితా రైస్ మిల్స్‌లో ఐటీ దాడులు
-
లలితా రైస్ మిల్స్‌లో ఐటీ దాడులు
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. లలితా రైస్ మిల్స్‌లో ఐటీ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఏడు బృందాలుగా ఏర్పడి అధికారులు ఈ తనిఖీలు జరిపారు. కాగా లలితా రైస్‌మిల్స్ యజమానులు మట్టే ప్రసాద్, శ్రీనివాస్.. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు అత్యంత సన్నిహితులు. ఖరీదైన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షాటెక్స్ యంత్రాలతో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని నౌకల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులుగా వీరికి పేరుంది. కాగా మట్టే సోదరులు.. ఒక షాటెక్స్ యంత్రానికి అనుమతి తీసుకుని, దాని పేరు మీద మరిన్ని షాటెక్స్ యంత్రాలతో బియ్యాన్ని మిల్లింగ్ చేసి కోట్లాది రూపాయలు అక్రమార్జన చేశారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ హయాంలో అచ్చంపేట వద్ద మాజీ హోంమంత్రి చినరాజప్పకు క్యాంప్ కార్యాలయం భవనాన్ని మట్టే సోదరులే బహుమతిగా ఇచ్చారని ప్రచారం ఉంది.