సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టెండర్ల ద్వారా రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ బిడ్డింగ్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. ఈ–వేలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి బడా కంపెనీలతో పాటు రాష్ట్రంలోని మిల్లింగ్ కంపెనీలు పాల్గొనేలా సరళమైన విధానాలను టెండర్ నిబంధనల్లో చేర్చారు.
25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి టెండర్
రాష్ట్రంలోని 2వేలకు పైగా రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న సుమారు 70 ఎల్‌ఎంటీ ధాన్యం నుంచి తొలి విడతగా 25 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గత నెల 19వ తేదీన విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆసక్తి గల సంస్థలు, వ్యాపారులు దరఖాస్తులు చేసుకోవడంతో ప్రి బిడ్డింగ్ సమావేశాలను సంస్థ నిర్వహించింది.
ఈ సమావేశాల్లో ప్రభుత్వం విధించిన నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నిబంధనల ద్వారా స్థానిక వ్యాపారులు, మిల్లర్లకు అవకాశం దక్కదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే విడతలో 4లక్షల లేదా 5 లక్షల మెట్రిక్ టన్నుల లాట్‌లలో ధాన్యం వేలం వేయడం వల్ల బడా కంపెనీలే తప్ప రాష్ట్రంలోని మిల్లర్లు గాని, మిల్లర్ల సిండికేట్ గానీ కొనుగోలు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం నిబంధనల్లో పలు మార్పులు చేయాలని నిర్ణయించింది.
ప్రతీ లాట్‌ను ఒక లక్ష టన్నులుగా
మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు వేలం వేయాలని తొలుత నిర్ణయించగా... దాన్ని పూర్తిగా కేవలం 6 లాట్స్‌లో «వేలం వేయాలని టెండర్ నోటిఫికేషన్‌లో పొందుపరిచారు.. ఇందులో ఐదు లాట్స్‌లో 4లక్షల టన్నుల చొప్పున ఉండగా ఒక లాట్‌లో ఐదు లక్షల టన్నుల ధాన్యం ఉంది. ప్రి బిడ్ మీటింగ్ అనంతరం ఇందులో మార్పులు చేశారు. ప్రతీ లాట్‌ను ఒక లక్ష టన్నులుగా నిర్ణయించారు. అంటే 25 లాట్స్‌లో ధాన్యం వేలం వేయనున్నారు. లక్ష టన్నుల కెపాసిటీ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రతి కంపెనీ ఈ వేలంలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు.
వార్షిక టర్నోవర్‌లోనూ భారీ మార్పులు
తొలుత ప్రకటించిన టెండర్ నిబందనల ప్రకారం టెండర్లలో పాల్గొనే కంపెనీకి గడిచిన మూడేళ్లలో ప్రతిఏటా రూ.వెయ్యి కోట్ల వార్షిక టర్నోవర్‌తో పాటు రూ.100 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అయితే రూ. 1000 కోట్ల టర్నోవర్ ఉన్న బియ్యం కొనుగోలు కంపెనీలు దేశంలో అతి తక్కువగా ఉంటాయన్న వాదనల మేరకు ప్రి బిడ్డింగ్ సమావేశంలో ఈ నిబంధనలు కూడా మార్చారు. రూ. 1,000 కోట్ల టర్నోవర్‌ను రూ.100 కోట్లకు, నెట్‌వర్త్ విలువ ను రూ.100 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు తగ్గించారు.
ఇక వేలం తర్వాత ధాన్యం తీసుకెళ్లాల్సిన గడువును 30 రోజుల నుంచి 45 రోజులకు పెంచారు. నిబంధనల్లో మార్పులు చేయడంతో దరఖాస్తు, వేలం తేదీల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దీంతో ఈ నెల 11న జరగాల్సిన వేలం ప్రక్రియను 16వ తేదీకి వాయిదా వేశారు. నిబంధనల్లో మార్పుతో స్థానిక వ్యాపారులు, మిల్లర్లు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం లభించనుంది. నిబంధనల సడలింపుతో ఎక్కువ మంది బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment