global tenders
-
క్వింటాల్ ధాన్యం సగటున రూ.1,685
సాక్షి, హైదరాబాద్: మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం విక్రయానికి మరో అడుగు ముందుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా మిల్లుల్లోని 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించేందుకు ఆన్లైన్లో గత నెలలో గ్లోబల్ టెండర్లు ఆహ్వానించగా, 11 సంస్థలు 54 బిడ్స్ దాఖలు చేశాయి. ఈనెల 14న టెక్నికల్ బిడ్స్ తెరిచిన పౌరసరఫరాల సంస్థ ఈ 11 సంస్థల్లో హరియాణాకు చెందిన గురునానక్ రైస్ అండ్ జనరల్ మిల్స్ కంపెనీ బిడ్‌ను తిరస్కరించింది. మిగతా అర్హత పొందిన 10 సంస్థలకు సంబంధించి శనివారం ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచారు. ఇందులో క్వింటాల్ ధాన్యానికి కనిష్టంగా రూ.1,618, గరిష్టంగా రూ.1,732 కింద బిడ్స్ వేసిన 10 సంస్థలకు 25 లాట్లు అప్పగించారు. మొత్తం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సగటున రూ.1,685 లెక్కన విక్రయించారు. నష్టం క్వింటాల్‌కు రూ. 375 రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో క్వింటాల్ ధాన్యాన్ని గరిష్ట మద్దతు ధర (ఎంఎస్పీ) రూ.2,060 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసింది. యాసంగిలో మొత్తంగా 66.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వ ఉంచింది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల నూకల శాతం ఎక్కువగా వస్తుందని మిల్లర్లు సీఎంఆర్‌కు నిరాకరించారు. దీంతో ఈ ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్లు ఆహ్వానించింది. ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే వచ్చే నూకలకు నష్టపరిహారంగా క్వింటాల్ ధాన్యానికి రూ. 280 వరకు కేంద్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చినా, మిల్లర్లు ససేమిరా అనడంతో తప్పక విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సగటున ధాన్యం క్వింటాల్‌కు రూ.1,800 వరకు విక్రయించేందుకు బిడ్స్ వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తర్వాత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సగటున క్వింటాల్‌కు రూ. 1,685 మాత్రమే బిడ్స్ ఫైనల్ అయ్యాయి. అంటే ఎంఎస్పీ రూ.2,060తో పోలిస్తే క్వింటాల్‌కు రూ. 375 ప్రభుత్వానికి నష్టం. అంటే ఒక మెట్రిక్ టన్నుకు రూ. 37 కోట్ల చొప్పున 25 ఎల్ఎంటీకి రూ. 925 కోట్ల నష్టం. కాగా ఈ ఫైనాన్షియల్ బిడ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ ఆమోదించాల్సి ఉంది. 25 లాట్లు దక్కించుకున్న 10 సంస్థలు ఇవే కేంద్రీయబండార్, సామ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, పట్టాబి ఆగ్రోఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్‌ఫుడ్ ఇండస్ట్రీ లిమిటెడ్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్ అండ్ రిటేనింగ్ కోఆపరేటివ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నోచా ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, బగదీయ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిద్దరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీలలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, శంభుదయాల్ జైన్ అండ్ కంపెనీ. -
ధాన్యం కొనుగోలుకు 54 టెండర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన లభించింది. తొలి విడతగా 25 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని విక్రయించాలని భావించిన పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు గత నెలలో టెండర్లను ఆహ్వనించింది. 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి , ప్రతి ఎల్ఎంటీ ఒక లాట్‌గా ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వనించింది. గురువారంతో గడువు ముగియగా, సాయంత్రం 5 గంటలకు అధికారులు టెక్నికల్ బిడ్లు తెరిచారు. 25 లాట్ల కోసం మొత్తం 54 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో 8 లాట్లకు సంబంధించి కేవలం ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైనట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా 17 లాట్ల కోసం 46 సంస్థలు పోటీ పడ్డాయి. యాసంగిలో 66.85 ఎల్ఎంటీల ధాన్యం సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి (2022–23)లో 66.85 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేయగా, అందులో కొంత భాగం అకాల వర్షాల కారణంగా తడిచిపోయింది. తడిచిన ధాన్యంతో పాటు మిగతా ధాన్యాన్ని కూడా ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు నిరాకరించారు. బాయిల్డ్ రైస్‌గా మాత్రమే ఇస్తామని చెప్పినా, కేంద్రం నిబంధనలతో అది సాధ్యం కాలేదు. దీంతో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఏక మొత్తంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్‌కుమార్ ఈ మేరకు నివేదిక రూపొందించగా, తొలి విడత 25 ఎల్ఎంటీలు విక్రయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెలలో ప్రక్రియ ప్రారంభం అయింది. గురువారం గడువు ముగిసే సమయానికి 54 టెక్నికల్ బిడ్లను ధ్రువీకరించారు. ఈ సంస్థల పూర్వాపరాలు పరిశీలించి, అర్హత పొందిన వాటిని ఫైనాన్షియల్ బిడ్లకు ఎంపిక చేస్తారు. ఈనెల 16న ఫైనాన్షియల్ బిడ్లను తెరిచిన అనంతరం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అర్హులైన సంస్థలను ఎంపిక చేయనుంది. -
బడా, లోకల్ మిల్లింగ్ కంపెనీలు కొనేలా!
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టెండర్ల ద్వారా రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ బిడ్డింగ్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. ఈ–వేలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి బడా కంపెనీలతో పాటు రాష్ట్రంలోని మిల్లింగ్ కంపెనీలు పాల్గొనేలా సరళమైన విధానాలను టెండర్ నిబంధనల్లో చేర్చారు. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి టెండర్ రాష్ట్రంలోని 2వేలకు పైగా రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న సుమారు 70 ఎల్ఎంటీ ధాన్యం నుంచి తొలి విడతగా 25 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గత నెల 19వ తేదీన విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆసక్తి గల సంస్థలు, వ్యాపారులు దరఖాస్తులు చేసుకోవడంతో ప్రి బిడ్డింగ్ సమావేశాలను సంస్థ నిర్వహించింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విధించిన నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నిబంధనల ద్వారా స్థానిక వ్యాపారులు, మిల్లర్లకు అవకాశం దక్కదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే విడతలో 4లక్షల లేదా 5 లక్షల మెట్రిక్ టన్నుల లాట్లలో ధాన్యం వేలం వేయడం వల్ల బడా కంపెనీలే తప్ప రాష్ట్రంలోని మిల్లర్లు గాని, మిల్లర్ల సిండికేట్ గానీ కొనుగోలు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం నిబంధనల్లో పలు మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రతీ లాట్‌ను ఒక లక్ష టన్నులుగా మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు వేలం వేయాలని తొలుత నిర్ణయించగా... దాన్ని పూర్తిగా కేవలం 6 లాట్స్‌లో «వేలం వేయాలని టెండర్ నోటిఫికేషన్లో పొందుపరిచారు.. ఇందులో ఐదు లాట్స్‌లో 4లక్షల టన్నుల చొప్పున ఉండగా ఒక లాట్లో ఐదు లక్షల టన్నుల ధాన్యం ఉంది. ప్రి బిడ్ మీటింగ్ అనంతరం ఇందులో మార్పులు చేశారు. ప్రతీ లాట్‌ను ఒక లక్ష టన్నులుగా నిర్ణయించారు. అంటే 25 లాట్స్‌లో ధాన్యం వేలం వేయనున్నారు. లక్ష టన్నుల కెపాసిటీ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రతి కంపెనీ ఈ వేలంలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. వార్షిక టర్నోవర్‌లోనూ భారీ మార్పులు తొలుత ప్రకటించిన టెండర్ నిబందనల ప్రకారం టెండర్లలో పాల్గొనే కంపెనీకి గడిచిన మూడేళ్లలో ప్రతిఏటా రూ.వెయ్యి కోట్ల వార్షిక టర్నోవర్‌తో పాటు రూ.100 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అయితే రూ. 1000 కోట్ల టర్నోవర్ ఉన్న బియ్యం కొనుగోలు కంపెనీలు దేశంలో అతి తక్కువగా ఉంటాయన్న వాదనల మేరకు ప్రి బిడ్డింగ్ సమావేశంలో ఈ నిబంధనలు కూడా మార్చారు. రూ. 1,000 కోట్ల టర్నోవర్‌ను రూ.100 కోట్లకు, నెట్‌వర్త్ విలువ ను రూ.100 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు తగ్గించారు. ఇక వేలం తర్వాత ధాన్యం తీసుకెళ్లాల్సిన గడువును 30 రోజుల నుంచి 45 రోజులకు పెంచారు. నిబంధనల్లో మార్పులు చేయడంతో దరఖాస్తు, వేలం తేదీల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దీంతో ఈ నెల 11న జరగాల్సిన వేలం ప్రక్రియను 16వ తేదీకి వాయిదా వేశారు. నిబంధనల్లో మార్పుతో స్థానిక వ్యాపారులు, మిల్లర్లు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం లభించనుంది. నిబంధనల సడలింపుతో ఎక్కువ మంది బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఏర్పడింది. -
అధికారి ధిక్కారం..టెండర్ ‘అప్రూవ్’ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థ అధికారుల్లో అలసత్వం, ధిక్కారం పెరిగిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో కూడా కొందరు అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని రైస్‌మిల్లుల వద్ద లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో గ్లోబల్ టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసేందుకు ఈనెల 21న గ్లోబల్ ఈ– టెండర్ ప్రకటన విడుదల చేసింది. 22వ తేదీ నుంచి ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వానించారు. సెపె్టంబర్ 5వ తేదీని బిడ్డింగ్‌కు ఆఖరి తేదీగా నిర్ణయించారు. అయితే టెండర్ ప్రకటన విడుదల చేసినప్పటికీ, వేలానికి సంబంధించిన నిబంధనలేవీ ఆన్లైన్లో పెట్టలేదు. ఈఎంఐ, డిపాజిట్లు, అర్హతలు, ఇతర వేలం నిబంధనలేవీ ఆన్లైన్లో పొందుపరచలేదు. దీంతో బుధవారం సాయంత్రంలోగా టెండర్ వివరాలను అప్లోడ్ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సంస్థ ఎండీ అనిల్‌కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే పౌరసరఫరాల సంస్థలో టెండర్లకు సంబంధించి ఆన్లైన్ డిజిటల్ కీ మార్కెటింగ్ సెక్షన్ జీఎం వద్ద ఒకటి, పీడీఎస్ డీజీఎం వద్ద మరొకటి ఉంటుంది. ఈ మేరకు కమిషనర్ ఇద్దరు అధికారులకు స్వయంగా ఫోన్ చేసి, గ్లోబల్ టెండర్లకు సంబంధించిన విధి విధానాలను అప్లోడ్, అప్రూవ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మార్కెటింగ్ సెక్షన్ జీఎం తన వద్ద ఉన్న డిజిటల్ కీతో అప్లోడ్ చేశారు. కానీ పీడీఎస్ డీజీఎంగా ఉన్న అధికారి, అప్లోడ్ అయిన వివరాలను తన వద్ద ఉన్న కీతో అప్రూవ్ చేయాల్సి ఉండగా, లాగిన్ కావడానికి కూడా ఒప్పుకోలేదని సమాచారం. స్వయంగా సంస్థ ఎండీ ఫోన్ చేసి డిజిటల్ కీతో టెండర్ ప్రక్రియను అప్రూవ్ చేయాలని ఆదేశించినప్పటికీ, ఆ అధికారి ససేమిరా అన్నట్లు సమాచారం. డిజిటల్ కీ ఇవ్వడానికి కూడా నిరాకరించిన ఆ అధికారి బుధవారం రాత్రి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు తెలిసింది. దాంతో బుధవారం రూ. వేల కోట్ల విలువైన టెండర్లకు సంబంధించిన విధి విధానాలను అప్లోడ్ చేయలేకపోయారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు అధికారిపై చర్యలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల సంస్థ అధికారులు.. పీడీఎస్ డీజీఎం పేరుపై ఉన్న డిజిటల్ కీ స్థానంలో మరో కీని రూపొందించి వివరాలను అప్లోడ్ చేశారు. బదిలీ చేశారనే కోపంతో..? పీడీఎస్ డీజీఎంగా ఉన్న ఆ అధికారిని ఇటీవలే హెడ్ ఆఫీస్ నుంచి వికారాబాద్‌కు బదిలీ చేశారు. అయితే అక్కడ జాయిన్ కాకుండా తిరిగి యథాస్థానంలో కొనసాగేందుకు పైరవీ చేసుకున్నా, ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి సంబంధించిన టెండర్ విధి విధానాలను అప్రూవ్ చేసే విషయంలో మొండిగా వ్యవహరించడం సంస్థలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఆ అధికారిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
318 టన్నుల ఎర్రచందనం.. రూ.182 కోట్ల ఆదాయం
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ డిమాండ్ ఉన్న ఎర్రచందనం విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల రూ.182 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడంతో అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో అమ్మగా మిగిలిన 318 మెట్రిక్ టన్నుల దుంగలకు ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధిసంస్థ (ఏపీఎఫ్డీసీ) ద్వారా కొద్దిరోజుల కిందట విడతల వారీగా గ్లోబల్ టెండర్లు పిలిచి వేలం నిర్వహించారు. గతం కంటే డిమాండ్ బాగుండడంతో సుమారు రూ.100 కోట్ల ఆదాయం లభిస్తుందని మొదట అధికారులు భావించారు. చైనా ఇతర దేశాల మార్కెట్లో ఈ దుంగలకు మంచి ధర ఉండడంతో 80 శాతం ఎక్కువ ఆదాయం లభించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కిందట రాష్ట్రానికి ఇచ్చిన ఎర్రచందనం అమ్మకాల కోటా పూర్తయింది. 10 ఏళ్లలో 8,498 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకం ఎర్రచందనం అమ్మకానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న సరుకును బట్టి కేంద్రం రాష్ట్రాలకు అమ్మకపు కోటా నిర్దేశిస్తుంది. 10 సంవత్సరాల కిందట రాష్ట్ర కోటా కింద 8,498 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. 2019 వరకు విడతల వారీగా గత ప్రభుత్వాల హయాంలో 8,180 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను విక్రయించారు. ఈ అమ్మకాలతో సుమారు రూ.1,700 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత కేంద్రం నిర్దేశించిన కోటాలో మిగిలిన 318 టన్నుల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల రూ.182 కోట్లకు అమ్మారు. దీంతో కేంద్రం ఇచ్చిన కోటా పూర్తయింది. ప్రస్తుతం అటవీశాఖ ఆధీనంలో ఇంకా 5,376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఉంది. శేషాచలం అడవుల్లో అక్రమంగా నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఎర్ర చందనం దుంగల్ని అటవీశాఖ ఇటీవల కాలంలో భారీఎత్తున పట్టుకుని సీజ్ చేసింది. ఈ సరుకును అటవీశాఖ ఆధీనంలోని తిరుపతి సెంట్రల్ గోడౌన్లో భద్రపరిచారు. కేంద్రం కొత్త కోటా నిర్దేశిస్తే ఈ సరుకును కూడా అమ్మడానికి అటవీశాఖ సిద్ధంగా ఉంది. ఇప్పటికే తమ వద్ద ఉన్న ఎర్ర చందనం నిల్వల గురించి చెప్పి అమ్మకానికి అనుమతి ఇచ్చే కొత్త కోటా నిర్దేశించాలని కేంద్ర అటవీ మంత్రిత్వశాఖను కోరింది. గతంలో కేటాయించిన కోటాకు సంబంధించిన వివరాలను మిగిలిన రాష్ట్రాలు పూర్తిగా ఇవ్వకపోవడంతో కొత్త కోటాను నిర్దేశించడానికి కేంద్రం జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కోటా ప్రకారం పారదర్శకంగా విక్రయాలు జరిపిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు కొత్త కోటా ఇవ్వాలని ఏపీ అటవీశాఖ కోరింది. -
వ్యాక్సిన్ కొనుగోలుకు మళ్లీ గ్లోబల్ టెండర్
సాక్షి, అమరావతి: వ్యాక్సిన్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ గ్లోబల్ టెండర్‌కు వెళ్లింది. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) శనివారం కొత్తగా టెండర్లు పిలిచింది. ఈ నెల 10వ తేదీన ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించనుండగా, జూన్ 21న టెండర్లు ఓపెన్ చేస్తారు. గతంలో నిర్వహించిన టెండర్లలో మూడు కంపెనీలు ప్రీబిడ్ మీటింగ్ రాగా, ఫైనల్ టెండరుకు ఒక్క కంపెనీ కూడా ఆసక్తి కనబరచకపోవడం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్లినా ఏ రాష్ట్రంలో ఒక్క కంపెనీ కూడా సరఫరా చేస్తామని ముందుకు రాలేదు. కాగా, ఒక్కసారి ఆన్లైన్ టెండర్ పూర్తయ్యాక గడువు పొడిగించడానికి కుదరదు. కొత్త టెండర్‌కు వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం తిరిగి గ్లోబల్ టెండర్‌ను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. -
గ్లోబల్ టెండర్లు: ఎవరూ ఆసక్తి చూపలేదు!
సాక్షి, అమరావతి: రాష్ట్రాలకు నేరుగా వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లకు వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ టెండర్లు తెరవగా... ఏ కంపెనీ కూడా సరఫరాకు ముందుకు రాలేదని అధికారులు తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండడం, రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలన్నా ఎన్ని విక్రయించాలనేది కేంద్రమే కంపెనీలకు నిర్దేశిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలందరికీ త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలన్న తాపత్రయంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు వెళ్లింది. తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలు ఏపీని అనుసరించి గ్లోబల్ టెండర్లు పిలిచాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే సరఫరా చేస్తామని, రాష్ట్రాల టెండర్లకు స్పందించకూడదని గ్లోబల్ కంపెనీలు నిర్ణయించుకున్న నేపథ్యంలో రాష్ట్రాలు పిలిచిన టెండర్లకు స్పందన రాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీ బాటలో 9 రాష్ట్రాలు.. తొలుత ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టెండర్లకు వెళ్లగా, అదే బాటలో మరో తొమ్మిది రాష్ట్రాలు నడిచాయి. ఆ మేరకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు వ్యాక్సిన్‌కోసం గ్లోబల్ టెండర్ల ద్వారా కంపెనీలను ఆహ్వానించాయి. అయితే ఉత్తరప్రదేశ్ టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జూన్ 10వ తేదీ వరకు గడువు పెంచింది. ముంబైలో డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చారు. దీంతో ఆ రాష్ట్రం ఆసక్తిగా లేదు. కర్ణాటకలోనూ కేవలం డిస్ట్రిబ్యూటర్లే ముందుకు రావడంతో టెండరు రద్దు చేశారు. రాజస్థాన్‌లో టెండర్లకు ఎవరూ ముందుకు రాలేదు. ఒడిశాలోనూ ఇదే పరిస్థితి. దీంతో జూన్ 4 వరకు గడువు పెంచింది. కేరళ, తమిళనాడులో జూన్ 5 వరకు టెండర్లకు గడువుంది. తెలంగాణ శుక్రవారం టెండర్లు తెరవబోతోంది. ఢిల్లీలో మాత్రం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్(ఆసక్తి వ్యక్తీకరణ) కింద నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటివరకూ గ్లోబల్ టెండర్లకు ఏ రాష్ట్రంలోనూ గ్లోబల్ కంపెనీలు ఆసక్తి చూపలేదు. చదవండి: ఆనందయ్య మందు.. ‘ఔషధచక్ర’? వ్యాక్సినేషన్ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్ -
వ్యాక్సినేషన్ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్–19 కట్టడిలో కీలకమైన వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రాల సమన్వయంతో పూర్తిగా కేంద్రమే నిర్వహించాలని, ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే మాట మీద నిలబడదామంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోని పలువురు ముఖ్యమంత్రులకు గురువారం లేఖలు రాశారు. ‘అంతర్జాతీయ టెండర్ల ద్వారా వ్యాక్సిన్ కొనుగోలు చేసి, రాష్ట్రంలో ఉచితంగా వ్యాక్సిన్ అందిద్దామన్నా, దీనికి అనుమతులు కేంద్రమే ఇవ్వాల్సి ఉండటంతో అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిలో వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రమే తీసుకోవాలని అందరం ఏకమై అడుగుదాం’ అని ఆ లేఖల్లో పేర్కొన్నారు. దేశంలోని పలువురు ముఖ్యమంత్రులకు ఆయన రాసిన లేఖల్లో భాగంగా.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రాసిన లేఖ ఇదీ.. శ్రీ పినరయి విజయన్ జీ, మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నా. భయంకరమైన కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సెకండ్ వేవ్ నుంచి భారతదేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్న ప్రాథమిక సంకేతాలు అందుతున్నాయి. అయినా కోవిడ్ కట్టడి చర్యలను అప్పుడే ఆపివేయలేం. మీ రాష్ట్రంలో బలమైన ఆరోగ్య వ్యవస్థతో తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతున్నారని భావిస్తున్నా. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో మన పదునైన ఆయుధం వ్యాక్సిన్ మాత్రమే. ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవిక విషయాలు చూసిన తర్వాత నేను మీకు లేఖ రాస్తున్నా. రాష్ట్రంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలన్న లక్ష్యంలో భాగంగా నేరుగా వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి అంతర్జాతీయ టెండర్లకు వెళ్లాం. జూన్ 3 సాయంత్రం 5 గంటల వరకు బిడ్లు సమర్పించడానికి గడువు ఇచ్చినా ఒక్కరు కూడా బిడ్లు దాఖలు చేయకపోవడం నిరాశ పరిచింది. వ్యాక్సిన్ కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రాల చేతిలో ఏమీలేదు. వ్యాక్సిన్ల కొనుగోలు ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల మధ్య అంశంగా మారడం, వ్యాక్సిన్ కొనుగోలుకు ఆమోదం తెలిపే అధికారం కేంద్రం చేతిలో ఉండటం ఈ పరిస్థితికి కారణాలుగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేక సమన్వయ అంశాలతో ముడిపడి ఉంది. కొన్ని రాష్ట్రాలు మాకు తగినంత వ్యాక్సిన్ సరఫరా లేదని భావిస్తున్నాయి. గ్లోబల్ టెండర్లకు వెళుతున్న రాష్ట్రాలకు సరైన స్పందన కూడా రావడం లేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యం అయ్యే కొద్ది ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నేను అందరి ముఖ్యమంత్రులను కోరేది ఒక్కటే.. వ్యాక్సినేషన్ బాధ్యతను పూర్తిగా కేంద్రమే చేపట్టాలని ఒకే మాటగా వినిపిద్దాం. ప్రారంభంలో కేంద్రమే వ్యాక్సినేషన్ పూర్తి బాధ్యత తీసుకున్న విషయం మీకు తెలిసిందే. ఆరోగ్య సిబ్బందికి సరైన సమయంలో వ్యాక్సినేషన్ చేయడం మంచి ఫలితాలను ఇచ్చింది. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలి అన్న నిర్ణయంతో సరైన సమయంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయగలిగాం. తద్వారా కరోనా సెంకడ్ వేవ్ ఉధృతిలో కూడా వారు వైరస్‌తో పోరాడగలిగారు. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాలో అనేక అవరోధాలు ఉండగా, వ్యాక్సిన్ కొనుగోళ్లను అధికంగా రాష్ట్రాలే చేపట్టాలనే నిర్ణయం సమంజసం కాదు. వ్యాక్సిన్ డ్రైవ్‌లో ఉన్న సవాళ్లను గత నెలన్నరగా మనం చూస్తున్నాం. దీనివల్ల రాష్ట్రాలు వైద్య సదుపాయాలు పెంచుకోవడానికి నిధులను వినియోగించుకోకుండా, మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ విధంగా అయినా వ్యాక్సిన్ సరఫరాను పెంచుకోవడం తక్షణావసరం. రాష్ట్రాల సహకారంతో నడిచే కేంద్రీకృత, సమన్వయ వ్యవస్థ ఉంటే దేశ ప్రజలకు మంచి ఫలితాలు అందుతాయి. ముఖ్యమంత్రులం అంతా ఒకేమాటపై ఉండి ఈ సంక్షోభాన్ని అధిగమిద్దాం. దీనికి మద్దతు ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చదవండి: 'కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు ఆర్థిక సాయం అందాలి' దేశ చరిత్రలోనే ప్రథమం.. కొత్త చరిత్రకు సీఎం జగన్ శ్రీకారం -
318.447 టన్నుల ఎర్రచందనం వేలానికి గ్లోబల్ టెండర్లు
సాక్షి, అమరావతి: తన వద్ద మిగిలిన 318.447 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచింది. అమ్మకం ప్రక్రియ పారదర్శకంగా, పోటీతత్వంతో జరిగేలా ఇ–టెండర్ కమ్ ఇ–వేలం నిర్వహణకు షెడ్యూల్ రూపొందించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ ఆదేశాలిచ్చారు. ఏప్రిల్ 9 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఆన్లైన్లో మొదటి విడత వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో మిగిలిన ఎర్రచందనం నిల్వలకు ఏప్రిల్ 16న రెండో విడత, ఆ తర్వాత కూడా మిగిలితే ఏప్రిల్ 23న మూడో విడత ఇ–వేలం నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులను తెలిసేలా జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్లు, జర్నల్స్‌లో ఏపీఎఫ్డీసీ (ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఎండీ టెండర్ ప్రకటన ఇస్తారు. ప్రధానంగా చైనాలోని కొనుగోలుదారులకు తెలుసుకునేలా టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఎటువంటి విమర్శలకు అవకాశం లేకుండా, సాధ్యమైనంత ఎక్కువ మంది వేలంలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన టెండర్ కమిటీ ఎర్రచందనం అమ్మకం ద్వారా ఎక్కువ లాభం వచ్చేలా చర్యలు తీసుకోనుంది. వేలం ప్రక్రియలో ఎంఎస్టీసీ సేవలను ఏపీఎఫ్డీసీ వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. -
చిరకాల స్వప్నం.. త్వరలోనే సాకారం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లా సముద్ర తీరంలో రామాయపట్నం వద్ద నౌకాశ్రయం నిర్మించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా పనులు ప్రారంభించనుంది. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహా్వనించేందుకు, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు జ్యుడీషియల్ రివ్యూకు కూడా పంపించింది. తొలిదశలో మూడు బెర్తులతో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంతో జిల్లా ప్రజల్లో రెట్టించిన ఆనందం నెలకొంది. 36 నెలల్లో పనులు పూర్తి చేసే దిశగా అడుగులు: రామాయపట్నం పోర్టు పనులను 36 నెలల్లోనే పనులు పూర్తి చేయాలన్న దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు ఈ నెలలోనే బిడ్డింగ్ విధానాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలి దశలో మూడు బెర్తులతో పనులు ప్రారంభించేలా విధివిధానాలను రూపొందిస్తున్నారు. అందుకుగాను ప్రాజెక్టు వ్యయ అంచనా విలువ రూ.2,169.62 కోట్లుగా నిర్ణయించారు. అందుకోసం అంతర్జాతీయ స్థాయి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. పోర్టు నిర్మాణాల్లో అనుభవమున్న బడా కాంట్రాక్టర్లను టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు. రివర్స్ టెండర్ ద్వారానే కాంట్రాక్టును కట్టబెట్టేలా ఇప్పటికే నిర్ణయించారు. పోర్టుకు తొలి దశలో మూడు బెర్తులను 900 మీటర్ల పొడవుతో 34.5 మీటర్ల లోతు ఉండేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ... రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలంటూ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి గతంలో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. వై.ఎస్.జగన్ నిర్ణయం పట్ల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అనుకున్న ప్రకారం పోర్టు నిర్మాణం జరిగితే జిల్లా రూపురేఖలే మారనున్నాయి. జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయి. వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం చేపట్టాలనే నిర్ణయం వల్ల జిల్లా అభివృద్ధికి రెడ్‌కార్పెట్ పరిచినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఎదురుచూస్తున్న జిల్లా ప్రజానీకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం వరంగా మారింది. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు పోర్టు నిర్మాణంపై మోసం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. 2014లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు జిల్లా అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా జిల్లాకు తీసుకురాని దుర్భర పరిస్థితి. రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోసం జిల్లాకు చెందిన అనేక మంది ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినా గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల ముందు మాత్రం ఓట్ల కోసం రామాయపట్నంలో మినీ పోర్టు ఏర్పాటు పేరుతో 2019 జనవరి 9వ తేదీన భూమి పూజ చేసి మరో మోసానికి తెరతీసిన వైనం అందరికీ తెలిసిందే. 2012లోనే అనుకూలమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పోర్టు నిర్మాణానికి రామాయపట్నం అనుకూలంగా ఉంటుందని 2012 ఆగస్టు 22వ తేదీన కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ స్టేక్ హోల్డర్స్‌తో సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తరువాత 2012 సెప్టెంబర్ 2న అప్పటి ప్రభుత్వం రామాయపట్నం ప్రాంతం ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రానికి అనువైనదని పేర్కొంటూ కేంద్రానికి లేఖ రాసింది. 2013 ఏప్రిల్ 15న కేబినెట్ కమిటీకి కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ ఒక నోట్ సమరి్పంచింది. ఆ నోట్ ద్వారా రామాయపట్నం అనుకూల ప్రదేశమని ఆర్ధిక, రక్షణ, హోం, రవాణా, రైల్వే మంత్రిత్వ శాఖలకు సమాచారం అందించారు. అయితే ఆ తరువాత అనూహ్యంగా దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనూ దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు అంశం విభజన చట్టంలో చేర్చారు. దీంతో అప్పటి నుంచి జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోరుతూ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోర్టు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. పోర్టు ఏర్పాటుకు అనుకూలాంశాలు ఇవీ.. జిల్లాలోని ఉలవపాడు– గుడ్లూరు మండలాల పరిధిలో రామాయపట్నం ఉంది. ఇక్కడ ‘సీఫ్రంట్’ సుమారుగా 7.5 కి.మీ తీరం పొడవున అతి దగ్గరలో సుమారు 10 మీటర్ల లోతు ఉండటం పోర్టు నిర్మాణానికి అనుకూలాంశంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మడ అడవులు అడ్డంకిగా లేని సముద్ర తీరం ఇక్కడ అందుబాటులో ఉండటం కూడా కలిసొచ్చే అంశం. సముద్ర తీరానికి అతి చేరువలో రవాణాకు అనుకూలంగా రైల్వేలైన్, 16వ నంబర్ జాతీయ రహదారి ఉండటం వల్ల పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా ఉంటుంది. దీనికితోడు రామాయపట్నం ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డ్ భూములు, రిజర్వ్ ఫారెస్ట్ భూములు అధికంగా అందుబాటులో ఉండటంతో స్థల సేకరణలో ఇబ్బందులు లేవు. జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్న తరుణంలో పోర్టు నిర్మాణం జరిగితే పారిశ్రామికవేత్తలకు జల రవాణా కూడా అత్యంత చేరువలో ఉంటుంది. దీని వల్ల జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
జ్యుడీషియల్ ప్రివ్యూకు రామాయపట్నం టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు టెండర్‌ను మారిటైమ్ బోర్డు జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. రూ.2,169.62 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన కొత్త ఓడరేవు పనులు చేపట్టేందుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి టెండర్లను పిలిచేందుకు న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కాంట్రాక్టు (ఈపీసీ) విధానంలో నిర్మించే ఈ ఓడరేవు కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు(ఆర్ఎఫ్క్యూ) పిలవాలని మారిటైమ్ బోర్డు నిర్ణయించింది. 5.05 కిలోమీటర్ల బ్యాక్ వాటర్‌తోపాటు 3 అధునాతన బెర్తుల నిర్మాణం కోసం టెండర్లకు పిలవనుంది. 15.52 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్ చేసి లోతు తవ్వేలా ప్రణాళికలు రూపొందించింది. రామాయపట్నం పోర్టును తొలిదశలో మొత్తం 900 మీటర్ల పొడవు, 34.5 మీటర్ల లోతు ఉండే విధంగా మూడు బెర్తులతో నిర్మించనున్నారు. ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అంశాలతో కూడిన టెండర్లను ఏపీ మారిటైమ్ బోర్డు జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. (రామాయపట్నానికి గ్లోబల్ టెండర్లు) -
రామాయపట్నానికి గ్లోబల్ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణం కోసం అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. రూ.2,169.62 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన కొత్త ఓడరేవు పనులు చేపట్టేందుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి టెండర్లను పిలిచేందుకు న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కాంట్రాక్టు (ఈపీసీ) విధానంలో నిర్మించే ఈ ఓడరేవు కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు(ఆర్ఎఫ్క్యూ) పిలవాలని మారిటైమ్ బోర్డు నిర్ణయించింది. తొలిదశలో 3 బెర్తులతో.. ► రామాయపట్నం పోర్టును తొలిదశలో మొత్తం 900 మీటర్ల పొడవు, 34.5 మీటర్ల లోతు ఉండే విధంగా మూడు బెర్తులతో నిర్మించనున్నారు. ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఓడరేవుల నిర్మాణంలో ఏడేళ్ల అనుభవం ఉండటంతోపాటు కనీసం రూ.1,080 కోట్ల విలువైన పనులు చేసిన సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కలిగినవిగా నిర్ణయించారు. గత మూడేళ్లలో కంపెనీ టర్నోవర్ రూ. 651 కోట్లు ఉండాలి. ► రెండు మూడు కంపెనీలు కలిపి భాగస్వామ్యంతో బిడ్ దాఖలు చేస్తే ఆర్థిక అర్హతలను కలిపి పరిగణిస్తారు. ప్రాజెక్టు విలువలో ఒక శాతం ఎర్నెస్ట్‌మనీ డిపాజిట్ (ఈఎండీ) కింద రూ.21.70 కోట్లు ముందుగా డిపాజిట్ చేయాలి. డిసెంబర్లో నిర్మాణ పనులు.. ► రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం లాండ్ లార్డ్ విధానంలో సొంతంగా నిర్మించనుంది. ఈ పోర్టు నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు నిధులు సమకూర్చి అనంతరం బెర్తుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు లీజుపై ఇస్తుంది. ► రివర్స్ టెండరింగ్ విధానంలో చేపట్టే ఈ బిడ్లకు జ్యుడిషియల్ ప్రివ్యూ అనుమతి రాగానే ఈ నెలలోనే అంతర్జాతీయ టెండర్లు పిలిచేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు ఏర్పాట్లు చేసింది. టెండర్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 15వ తేదీ నాటికి నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. -
కేసీఆర్ కిట్ గ్లోబల్ టెండర్లతో ఆదా
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్ ఆన్లైన్ గ్లోబల్ టెండర్లతో ఈ ఏడాది సర్కారుకు రూ.7 కోట్లు ఆదా అయినట్లు వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈసారి టెండర్లలో 8 కంపెనీలు పాల్గొనగా ఎల్–1 వచ్చిన కంపెనీ రూ.1593.97 కోట్ చేసిందని, గతం కంటే ఇది రూ.120 తక్కువ అని తెలిపారు. మొత్తం 6 లక్షల కిట్లకు గాను రూ. 7.14 కోట్లు ఆదా అయిందన్నారు. కేసీఆర్ కిట్ల పంపిణీలో అంతరాయం కలగకుండా ఉండేందుకు బిడ్ చేసిన ధరకే ఎల్–1కు 50 శాతం, ఎల్–2కు 30 శాతం, ఎల్–3కి 20 శాతం కేటాయించినట్లు తెలిపారు. రాబోయే రెండేళ్లలో 6 లక్షల కిట్లు అవసరమవుతాయన్న అంచనా ఉందన్నారు. -
సాగర్ ప్రక్షాళనకు గ్లోబల్ టెండర్లు!
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. 2017 సెప్టెంబర్‌లో ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదుట పైప్‌లైన్ పగిలిపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో మురుగు నీటిని సాగర్‌లోకి మళ్లించాల్సి వచ్చిందని తెలిపారు. ‘సాగర్ ప్రక్షాళన కోసం అప్పటికే రూ.350 కోట్లు ఖర్చు చేశాం. అక్కడి నీటిలో కాలుష్యం బాగా తగ్గిందని నమూనా పరీక్షలు తేల్చాయి. అయితే అనుకోకుండా మురుగు నీటిని మళ్లించడం వల్ల నీటి కాలు ష్యం మళ్లీ తీవ్రమైన మాట వాస్తవమే’అని చెప్పారు. పురపాలక శాఖ బడ్జెట్ పద్దులపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. చెన్నై కన్నా మన మెట్రోనే బెటర్ ‘హైదరాబాద్ మెట్రో రైలు నష్టాల్లో నడుస్తోందని పత్రికల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదు. ఇప్పటికే ప్రారంభమైన నాగోల్–అమీర్‌పేట్, అమీర్‌పేట్–మియాపూర్ మార్గాల్లో రోజూ 50 వేల నుంచి 60 వేల మంది ప్రయాణిస్తున్నారు. చెన్నై మెట్రో రైలుతో పోల్చితే హైదరాబాద్ మెట్రోకు మంచి స్పందన ఉంది. వచ్చే జూలైలోగా మియాపూర్–ఎల్బీ నగర్, సెప్టెంబర్‌లోగా నాగోల్–హైటెక్ సిటీ, డిసెంబర్‌లోగా జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఇమ్లీబన్ బస్‌స్టేషన్ మార్గాల్లో మెట్రో సేవలను ప్రారంభిస్తాం. హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గం విస్తరణ కోసం బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించాం’అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో మనుషులతో మురుగు నీటి కాల్వలు శుభ్రం చేయించడాన్ని పూర్తిగా నిషేధించామని, ప్రత్యామ్నాయంగా 75 మినీ జెట్టింగ్ యంత్రాలు వినియోగిస్తున్నామని చెప్పారు. త్వరలో మరో 75 మినీ జెట్టింగ్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 5 పట్టణాల్లోనే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉందని, మిగిలిన 69 పట్టణాల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. రూ.1000 కోట్లతో టీఎఫ్యూడీసీ ద్వారా రాష్ట్రంలోని 43 పురపాలికల్లో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. జపాన్‌లోని టోక్యో క్లీన్ అథారిటీ అందించనున్న సాంకేతిక సహకారంతో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. జీవన ప్రమాణాల్లో నంబర్‌వన్ రూ.3 వేల కోట్లతో హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా జీహెచ్ఎంసీకి రూ.300 కోట్ల రుణం లభించిందని, ఇంకా రూ.800 కోట్ల కోసం త్వరలో మళ్లీ బాండ్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్‌ల తరహాలో హైదరాబాద్‌లోని మురికివాడల్లో బస్తీ క్లినిక్‌లు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించనున్నామన్నారు. రూ.100 కోట్లతో గండిపేట జలాశయం చుట్టూ చేపట్టిన సుందరీకరణ పనులు మూడు నెలల్లో పూర్తి కానున్నాయని, దీంతో నగరానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. జీవన ప్రమాణాల రీత్యా దేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ వరుసగా నాలుగో సారి నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. -
బెరైటీస్ అమ్మకానికి గ్లోబల్ టెండర్లు
ఏపీఎండీసీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ జిల్లా మంగంపేటలోని బెరైటీస్ ఖనిజ విక్రయాలకు ‘ఈ-టెండర్ కమ్ ఈ-వేలం’ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) నిర్ణయించింది. 6 లక్షల టన్నుల ‘ఎ’ గ్రేడ్, 2 లక్షల టన్నుల ‘బి’ గ్రేడ్ ఖనిజ విక్రయాలకు ఈ-టెండర్ల నిర్వహణ బాధ్యతలను మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్(ఎంఎస్టీసీ)కు అప్పగించింది. టెక్నికల్ బిడ్ల దాఖలుకు మే 4ను తుది గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. విదేశీ సంస్థలైతే 1.50 లక్షల టన్నుల ‘ఎ’ గ్రేడ్ ఖనిజ కొనుగోలుకు టెండర్లు కోట్ చేయాలి. ‘బి’ గ్రేడ్ ఖనిజానికైతే లక్ష టన్నులకు టెండర్ వేయాలి. దేశీయ సంస్థలైతే ‘ఎ’ గ్రేడ్ ఖనిజం లక్ష టన్నులు, ‘బి’ గ్రేడ్ ఖనిజం 40 వేల టన్నులకు టెండర్లు వేయవచ్చు.ఆన్లైన్ దరఖాస్తుల దాఖలుకు దేశీయ సంస్థలైతే రూ.50 వేలు, విదేశీ సంస్థలైతే 1,500 అమెరికన్ డాలర్లు చెల్లించాలి. బిడ్ సెక్యూరిటీ కింద ‘ఎ’ గ్రేడ్ ఖనిజ టెండర్లకు భారతీయ సంస్థలు/వ్యక్తులు రూ.1.25 కోట్లు, విదేశీ సంస్థలైతే 1.90 లక్షల అమెరికన్ డాలర్లు చెల్లించాలి.‘బి’ గ్రేడ్ ఖనిజానికి దేశీయ సంస్థలు రూ.40 లక్షలు, విదేశీ సంస్థలు 60 వేల అమెరిక్ డాలర్లు బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. టన్ను కనీస టెండర్ ధర ‘ఎ’ గ్రేడ్ రూ.5,000, ‘బి’ గ్రేడ్ రూ.4,000గా ఏపీఎండీసీ నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీ వరకూ బిడ్డర్లు సందేహాలు పంపవచ్చు. రిజిస్టర్డ్ బిడ్డర్లకు ఈ నెల 22న ప్రీబిడ్ కాన్ఫరెన్స్ ఉంటుంది. వచ్చే నెల 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు వచ్చిన బిడ్లనే పరిగణనలోకి తీసుకుంటుంది. అర్హత సాధించిన సంస్థలు/వ్యక్తులను మే 6న ప్రకటిస్తుంది. మే 9న సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకూ ‘ఈ-టెండర్ కమ్ ఈ-వేలం’ ఉంటుంది. -
'గ్లోబల్ టెండర్ల ద్వారా సీడ్ క్యాపిటల్ నిర్మాణం'
విజయవాడ : గ్లోబల్ టెండర్ల ద్వారా సీడ్ క్యాపిటల్ నిర్మాణం చేపడతామని ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. శనివారం విజయవాడలో పి.నారాయణ మాట్లాడుతూ... సీడ్ క్యాపిటల్ ప్రాంతంలోని మూడు గ్రామాల రైతులకు ఆయా గ్రామాల పరిధిలో భూములిచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. మరోసారి ల్యాండ్ పూలింగ్ అభ్యంతరాలపై ఫిబ్రవరి1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. గ్రామాల నుంచి అభ్యంతరాలు వస్తే.. రోడ్లను బైపాస్ చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. -
ఎర్రచందనం టెండర్‌కు స్పందన కరువు
- 3,500 టన్నుల్లో 1,300 టన్నులకే టెండర్లు తిరుపతి మంగళం : రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ఎంఎస్టీసీ సంస్థ ద్వారా ఎర్రచందనం విక్రయానికి నిర్వహించిన గ్లోబల్ టెండర్లకు స్పందన కరువైంది. మొదటి దశలో 1,400 టన్నుల ఎర్రచందనానికి నిర్వహించిన టెండర్లలో 1100 టన్నులకు టెండర్లు వచ్చాయి. రెండో విడతలో భాగంగా ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు టెండర్లు నిర్వహించారు. రెండో దఫా నిర్వహించే టెండర్లపై గంపెడాశపెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి చేదు పరిస్థితిలు ఎదురయ్యాయి. దుంగల రూపంలో ఎర్రచందనం ఎగుమతికి టెండర్లకు సంబంధించిన సైటీస్, డీజీఎఫ్టీ(డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్), వాణిజ్యశాఖ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల నేపథ్యంలో రెండో దఫా టెండర్లకు అటవీశాఖ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రేణిగుంట సమీపంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో నిల్వ ఉంచిన 4వేల మెట్రిక్ టన్నుల్లో 3500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలకు ఈనెల 17 నుంచి 20వతేదీ వరకు టెండర్లు నిర్వహించారు. 3500 మెట్రిక్ టన్నులకుగానూ కేవలం 1300 టన్నులకు మాత్రమే టెండర్లు వచ్చాయి. ఎర్రచందనం వేలం ద్వారా రూ.కోట్లాది ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఆశించింది. తొలి దశ వేలంలో సుమారు రూ.800 కోట్లు వరకు ఆదాయం సాధించాలని భావించినా సరైన ప్రచారం లేకపోవడంతో అది సాధించలేకపోయ్యారు. అయితే రెండో దఫా టెండర్ల ద్వారా విక్రయించే ఎర్రచందనం దుంగల్లో ఎక్కువ శాతం ఎ,బి గ్రేడ్ దుంగలే ఉండడంతో ప్రభుత్వ లక్ష్యం కూడ పూర్తవుతుందని అటవీశాఖ భావించింది. ఎలాగైనా ఎర్రచందనం టెండర్లకు మంచి ఆదరణ లభించేలా విదేశాల్లో సైతం ఒక ప్రత్యేక బృందాలతో ప్రచారం కూడ నిర్వహించారు. అయినా అటు ప్రభుత్వం ఇటు అటవీశాఖ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. మొదటి దఫా నిర్వహించిన టెండర్లలో కొనుగోలు చేసిన గుత్తేదారులు చాలామంది ఇంతవరకు ఎర్రచందనం దుంగలను తీసుకెళ్లకుండా అలానే వదిలేశారు. రెండుసార్లు నిర్వహించిన టెండర్లలో ఔత్సాహికుల నుంచి స్పందన కరువు అవడంతో ప్రభుత్వం, అటవీశాఖ నిరాశకు గురయ్యాయి. అయితే ముంబయిలోనిడెమైండ్ సంస్థ ప్రతినిధులు గతంలో టెండర్లలో కొనుగోలు చేసిన ఎర్రచందన దుంగలను తీసుకెళ్లేందుకు శనివారం అలిపిరి వద్ద ఉన్న అటవీశాఖ కార్యాలయానికి వచ్చారు. ఎర్రచందనాన్ని తీసుకెళ్లేందుకు కావాల్సిన అనుమతులన్నీ పొందామని, తమ సరుకు అప్పజెప్పాలని ఫారెస్ట్ రేంజర్ బాలవీరయ్యను కోరారు. అనుమతులను పూర్తిస్తాయిలో పరిశీలించి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేస్తామని చెప్పారు. -
మంగంపేట బెరైటీస్‌పై 8న గ్లోబల్ టెండర్లు
ఓబులవారిపల్లె: వైఎస్ఆర్ జిల్లాలోని మంగంపేట బెరైటీస్‌కు ఈ నెల 8న గ్లోబల్ టెండర్లు నిర్వహిస్తున్నామని, ఆ తర్వాతే ఖనిజ విక్రయం మొదలవుతుందని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ కాగిత వెంకట్రావు తెలిపారు. కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు చంద్రశేఖర్‌రావు, శ్రీనివాసులురెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన ఏపీఎండీసీ ఆధ్వర్యంలోని మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆదాయ వనరులు పెంచుకునే మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోందని, అందులో భాగంగానే అసెంబ్లీ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం గనుల పరిశీలనకు పంపిందన్నారు. ఈ మేరకు తమ బృందం ఖనిజం వెలికితీత, మార్కెటింగ్ అంశంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తుందన్నారు. సంస్థలో పని చేసే ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్య తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. గనుల నిలకడపై కార్మికుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. నెలాఖరులోగా ప్రభుత్వం కొత్త మైనింగ్ విధానాన్ని తీసుకురానుందని చెప్పారు. -
వేలానికి ఎర్ర బంగారం
ఈ-టెండర్ కమ్ ఈ-వేలంపద్ధతిలో.. ఎర్రచందనం విక్రయం జిల్లాలో 1420.097 టన్నుల ఎర్రచందనం దుంగలు విక్రయించేందుకు శ్రీకారం 19న 836.077 టన్నులు.. 22న 584.02 టన్నుల విక్రయానికి ‘ఈ-వేలం’ ఎర్రచందనం విక్రయిస్తే రూ.116.05 కోట్లు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం దుంగల విక్రయానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఎర్రదొంగల నుంచి స్వాధీనం చేసుకున్న దుంగల్లో తొలిదశలో 4,159 టన్నులను ఈ-టెండర్ కమ్ ఈ-వేలం పద్ధతిలో విక్రయించడానికి శుక్రవారం గ్లోబల్ టెండర్లు పిలిచింది. ఇందులో మన జిల్లాలో తిరుపతి, భాకరాపేట అటవీశాఖ గోదాముల్లో నిల్వ చేసిన 1420.097 టన్నుల ఎర్రచందనం దుంగలను కూడా విక్రయించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మన జిల్లాలో విక్రయించే ఎర్రచందనం దుంగలను కాంట్రాక్టర్లు కనిష్ట ధరలకు కొనుగోలు చేసినా రూ.116.05 కోట్ల మేర ఆదాయం వస్తుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రెండు దశాబ్దాలుగా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను జిల్లాలో తిరుపతి, భాకరాపేట, చిత్తూరులోని అటవీశాఖ గోదాముల్లో నిల్వ చేశారు. ఎర్రచందనం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో వాటి విక్రయానికి అడ్డంకిగా మారింది. ఏళ్లుగా నిల్వ చేయడం వల్ల ఎర్రచందనం దుంగలకు చెదలు పట్టింది. ఎండకు ఎండి.. వానకు తడిచి పాడైపోయాయి. రాష్ట్రంలో భారీఎత్తున ఎర్రచందనం దుంగల నిల్వలు పేరుకుపోవడంతో గత ఏడాది నవంబర్‌లో వాటి విక్రయానికి కేంద్రం అనుమతిని ప్రభుత్వం కోరింది. ఇందుకు కేంద్రం సమ్మతించింది. రాష్ట్ర విభజన.. ఎన్నికల నేపథ్యంలో ఎర్రచందనం దుంగల విక్రయానికి అప్పట్లో బ్రేక్ పడింది. ఇప్పుడు విక్రయానికి ప్రభుత్వం తెరతీసింది. రాష్ట్రంలో 4,159 టన్నుల ఎర్రచందనం దుంగల విక్రయానికి శుక్రవారం ఈ-టెండర్ కమ్ ఈ-వేలం పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో మన జిల్లాలో తిరుపతి, భాకరాపేట గోదాముల్లో నిల్వ చేసిన 1420.097 టన్నులను విక్రయించాలని నిర్ణయించారు. జిల్లాలో విక్రయించనున్న 1420.097 టన్నుల ఎర్రచందనం దుంగలను 53 లాట్లుగా విభజించారు. ఈనెల 19న 30 లాట్లలోని 836.077 టన్నులు, 22న 23 లాట్లలోని 584.02 టన్నుల విక్రయానికి టెండర్ షెడ్యూలు దాఖలు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. అదేరోజున ఆ లాట్లలోని ఎర్రచందనం దుంగలను ఈ-వేలం పద్ధతిలో గరిష్ట ధరకు కోట్ చేసిన వారికి విక్రయిస్తారు. తిరుపతి, భాకరాపేటల్లో నిల్వ చేసిన 53 లాట్లలోని ఎర్రచందనం దుంగలను ఈనెల 11 నుంచి 17 వరకు కాంట్రాక్టర్లు, కొనుగోలుదారులు పరిశీలించడానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక జిల్లాలో తొలిదశలో విక్రయించే ఎర్రచందనం దుంగల్లో ఏ-గ్రేడ్ నాణ్యత కలిగినవి కేవలం 4.691 టన్నులు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం పేర్కొన్న మేరకు టన్ను రూ.12 లక్షల కనిష్ట ధరకు కోట్ చేసినా.. వీటి విక్రయం ద్వారా రూ.56.29 లక్షల ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది. ఇక బి-గ్రేడ్ నాణ్యత ఉన్న దుంగలు 106.082 టన్నులు ఉన్నాయి. బి-గ్రేడ్ ఎర్రచందనం దుంగలకు టన్నుకు కనిష్ట ధరగా రూ.10 లక్షలను ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కాంట్రాక్టర్లు ధరలను కోట్ చేసినా బి-గ్రేడ్ దుంగల విక్రయం ద్వారా రూ.10.68 కోట్ల ఆదాయం లభిస్తుంది. జిల్లాలో విక్రయించనున్న దుంగల్లో అత్యధిక శాతం సీ-గ్రేడ్ నాణ్యత ఉన్నవే కావడం గమనార్హం. సీ-గ్రేడ్‌గా వర్గీకరించిన దుంగలు 1310.197 టన్నులు ఉన్నాయి. టన్ను సీ-గ్రేడ్ ఎర్రచందనం దుంగల కనిష్ట ధరగా రూ.8 లక్షలను ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కాంట్రాక్టర్లు ధరను కోట్ చేసినా సీ-గ్రేడ్ దుంగల విక్రయం ద్వారా రూ.104.81 కోట్ల ఆదాయం వస్తుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. జిల్లాలో ఎర్రచందనం దుంగల విక్రయం ద్వారా తొలి దశలో కనిష్ఠంగా రూ.116.05 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
మ్యాన్‌పవర్ ఏజెన్సీ టెండర్లపై అనుమానాలు !
భానుగుడి(కాకినాడ),న్యూస్‌లైన్: జేఎన్టీయూకేలో ఇటీవల మాన్పవర్ ఏజెన్సీ నిర్వహణకు సంబంధించి పిలిచిన గ్లోబల్‌టెండర్ల విధానంపై వర్సిటీలోని ఒక వర్గం అనుమానాలను వ్యక్తం చేస్తోంది. జూన్ 6న మూడు విభాగాలకు మూడు విధాలుగా వర్సిటీ అధికారులు వేర్వేరుగా టెండర్లు పిలిచారు. 11మంది వేలందార్లు టెండర్ సమర్పించారు. ఇందులో మూడింటిని అనర్హంగా పేర్కొంటూ అధికారులు తొలగించారు. వర్సిటీ అధికారులు కోరిన అన్ని ధ్రువపత్రాలూ సమర్పించిన 8మందిని వేలందారులుగా ఎంపిక చేసి వారి బిడ్లను ప్రత్యేక కమిటీ పరిశీలించింది. ఇందులో వర్సిటీ ఆహ్వానించిన మూడు విభాగాలకు సాయి ఇన్విష్టిగేషన్ వేసిన మూడు బిడ్లు లాభదాయకంగా ఉండడంతో వేలంపాట సదరు సంస్థకు వచ్చినట్టు కమిటీ నిర్ధారించింది. అయితే మూడు ఏజెన్సీలకూ ఒకే సంస్థను అర్హమైనదిగా ఎంపిక చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇందులో కుమ్మక్కు ఉండవచ్చని కొందరు ఆరోపిస్తున్నారు. స్థానికులను కాదని, స్థానికేతర సంస్థకు వర్సిటీ రక్షణ బాధ్యతలను అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటోనని తర్కించుకుంటున్నారు. కాగా జేఏన్టీయూకేలో సెక్యూరిటీ బాధ్యతలకు +.36 శాతం, మాన్‌పవర్‌కు +.09 శాతం, ఈసీయూకేలో మాన్‌పవర్‌కు +.14 శాతం చొప్పున సదరు సంస్థ బిడ్లు సమర్పించిందని రిజిస్ట్రార్ జీవీఆర్ప్రసాదరాజు వెల్లడించారు. అన్ని అర్హతలూ పరిశీలించాకనే టెండర్ ఖరారు చేశామన్నారు. శ్రీ సాయి ఇన్విస్టిగేషన్, మాన్పవర్ సంస్థ వచ్చేనెల 1నుండి రెండేళ్లపాటు వర్సిటీలో ఈ మూడు విభాగాలకు కాంట్రాక్టు చేపడుతుందన్నారు.