క్వింటాల్‌ ధాన్యం సగటున రూ.1,685 | Govt to Sale of 25 lakh metric tonnes of grain | Sakshi
Sakshi News home page

క్వింటాల్‌ ధాన్యం సగటున రూ.1,685

Published Sun, Sep 17 2023 2:21 AM | Last Updated on Sun, Sep 17 2023 2:21 AM

Govt to Sale of 25 lakh metric tonnes of grain - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం విక్రయానికి మరో అడుగు ముందుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా మిల్లుల్లోని 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని విక్రయించేందుకు ఆన్‌లైన్‌లో గత నెలలో గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించగా, 11 సంస్థలు 54 బిడ్స్‌ దాఖలు చేశాయి. ఈనెల 14న టెక్నికల్‌ బిడ్స్‌ తెరిచిన పౌరసరఫరాల సంస్థ ఈ 11 సంస్థల్లో హరియాణాకు చెందిన గురునానక్‌ రైస్‌ అండ్‌ జనరల్‌ మిల్స్‌ కంపెనీ బిడ్‌ను తిరస్కరించింది. మిగతా అర్హత పొందిన 10 సంస్థలకు సంబంధించి శనివారం ఫైనాన్షియల్‌ బిడ్స్‌ తెరిచారు. ఇందులో క్వింటాల్‌ ధాన్యానికి కనిష్టంగా రూ.1,618, గరిష్టంగా రూ.1,732 కింద బిడ్స్‌ వేసిన 10 సంస్థలకు 25 లాట్లు అప్పగించారు. మొత్తం 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సగటున రూ.1,685 లెక్కన విక్రయించారు. 

నష్టం క్వింటాల్‌కు రూ. 375 
రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో క్వింటాల్‌ ధాన్యాన్ని గరిష్ట మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూ.2,060 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసింది. యాసంగిలో  మొత్తంగా 66.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వ ఉంచింది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్‌ చేయడం వల్ల నూకల శాతం ఎక్కువగా వస్తుందని మిల్లర్లు సీఎంఆర్‌కు నిరాకరించారు. దీంతో ఈ ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్లు ఆహ్వానించింది. ముడి బియ్యంగా మిల్లింగ్‌ చేస్తే వచ్చే నూకలకు నష్టపరిహారంగా క్వింటాల్‌ ధాన్యానికి రూ. 280 వరకు కేంద్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చినా,  మిల్లర్లు ససేమిరా అనడంతో తప్పక విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే సగటున ధాన్యం క్వింటాల్‌కు రూ.1,800 వరకు విక్రయించేందుకు బిడ్స్‌ వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ ఫైనాన్షియల్‌ బిడ్స్‌ తెరిచిన తర్వాత 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సగటున క్వింటాల్‌కు రూ. 1,685 మాత్రమే బిడ్స్‌ ఫైనల్‌ అయ్యాయి. అంటే ఎంఎస్‌పీ రూ.2,060తో పోలిస్తే క్వింటాల్‌కు రూ. 375 ప్రభుత్వానికి నష్టం. అంటే ఒక మెట్రిక్‌ టన్నుకు రూ. 37 కోట్ల చొప్పున 25 ఎల్‌ఎంటీకి రూ. 925 కోట్ల నష్టం. కాగా ఈ ఫైనాన్షియల్‌ బిడ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ ఆమోదించాల్సి ఉంది. 

25 లాట్లు దక్కించుకున్న 10 సంస్థలు ఇవే
కేంద్రీయబండార్, సామ్‌ అండ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్, పట్టాబి ఆగ్రోఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, శ్రీరామ్‌ఫుడ్‌ ఇండస్ట్రీ లిమిటెడ్, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫార్మర్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ రిటేనింగ్‌ కోఆపరేటివ్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, నోచా ఆగ్రోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బగదీయ బ్రదర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, శ్రీ సిద్దరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీలలిత ఎంటర్‌ప్రైజెస్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, శంభుదయాల్‌ జైన్‌ అండ్‌ కంపెనీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement