grain sales
-
ధాన్యం విక్రయానికి అడ్డంకులు ఎందుకు?
కృష్ణా: ధాన్యం విక్రయంలో అడ్డంకులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నారాయణ పేట జిల్లా కృష్ణా మండల సరిహద్దు కర్ణాటకలోని శక్తినగర్‌లో రాయచూర్ జిల్లా రైతు సంఘం నాయకులు తెలంగాణ రైతుల ధాన్యం వాహనాలను అడ్డుకొని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో తమ రైస్ మిల్లులు ఉన్నాయని, నిరంతరం తమ మిల్లుల ద్వారానే హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు బియ్యం పంపిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోని తమ రైస్ మిల్లులకు కర్ణాటకలోని ధాన్యాన్ని అన్ని అనుమతులతో తీసుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. తెలంగాణలోని రైతులు కూడా ధాన్యాన్ని కర్ణాటకకు తీసుకెళుతున్నారు. వీరంతా రాయచూర్ మార్కెట్‌పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వరినే కాకుండా.. పత్తి, కంది, ఆముదం తదితర అన్ని పంటలు రాయచూర్ మార్కెట్‌కు తరలిస్తామని, తమ పంటలకు అవసరమైన పెట్టుబడులు సైతం అక్కడి కమీషన్ ఏజెంట్ల వద్దే తీసుకుంటున్నామని చెప్పారు. ఇరు రాష్ట్రాల అధికారులు, ప్రభుత్వాలు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
క్వింటాల్ ధాన్యం సగటున రూ.1,685
సాక్షి, హైదరాబాద్: మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం విక్రయానికి మరో అడుగు ముందుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా మిల్లుల్లోని 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించేందుకు ఆన్లైన్లో గత నెలలో గ్లోబల్ టెండర్లు ఆహ్వానించగా, 11 సంస్థలు 54 బిడ్స్ దాఖలు చేశాయి. ఈనెల 14న టెక్నికల్ బిడ్స్ తెరిచిన పౌరసరఫరాల సంస్థ ఈ 11 సంస్థల్లో హరియాణాకు చెందిన గురునానక్ రైస్ అండ్ జనరల్ మిల్స్ కంపెనీ బిడ్‌ను తిరస్కరించింది. మిగతా అర్హత పొందిన 10 సంస్థలకు సంబంధించి శనివారం ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచారు. ఇందులో క్వింటాల్ ధాన్యానికి కనిష్టంగా రూ.1,618, గరిష్టంగా రూ.1,732 కింద బిడ్స్ వేసిన 10 సంస్థలకు 25 లాట్లు అప్పగించారు. మొత్తం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సగటున రూ.1,685 లెక్కన విక్రయించారు. నష్టం క్వింటాల్‌కు రూ. 375 రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో క్వింటాల్ ధాన్యాన్ని గరిష్ట మద్దతు ధర (ఎంఎస్పీ) రూ.2,060 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసింది. యాసంగిలో మొత్తంగా 66.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వ ఉంచింది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల నూకల శాతం ఎక్కువగా వస్తుందని మిల్లర్లు సీఎంఆర్‌కు నిరాకరించారు. దీంతో ఈ ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్లు ఆహ్వానించింది. ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే వచ్చే నూకలకు నష్టపరిహారంగా క్వింటాల్ ధాన్యానికి రూ. 280 వరకు కేంద్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చినా, మిల్లర్లు ససేమిరా అనడంతో తప్పక విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సగటున ధాన్యం క్వింటాల్‌కు రూ.1,800 వరకు విక్రయించేందుకు బిడ్స్ వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తర్వాత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సగటున క్వింటాల్‌కు రూ. 1,685 మాత్రమే బిడ్స్ ఫైనల్ అయ్యాయి. అంటే ఎంఎస్పీ రూ.2,060తో పోలిస్తే క్వింటాల్‌కు రూ. 375 ప్రభుత్వానికి నష్టం. అంటే ఒక మెట్రిక్ టన్నుకు రూ. 37 కోట్ల చొప్పున 25 ఎల్ఎంటీకి రూ. 925 కోట్ల నష్టం. కాగా ఈ ఫైనాన్షియల్ బిడ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ ఆమోదించాల్సి ఉంది. 25 లాట్లు దక్కించుకున్న 10 సంస్థలు ఇవే కేంద్రీయబండార్, సామ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, పట్టాబి ఆగ్రోఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్‌ఫుడ్ ఇండస్ట్రీ లిమిటెడ్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్ అండ్ రిటేనింగ్ కోఆపరేటివ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నోచా ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, బగదీయ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిద్దరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీలలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, శంభుదయాల్ జైన్ అండ్ కంపెనీ. -
ప్రచారంలో ఆర్భాటం.. చెల్లింపుల్లో జాప్యం
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే 24 గంటల్లో నగదు జమ చేస్తామంటూ ఊకదంపుడు ప్రచారం తప్ప అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలో 15 రోజులుగా ధాన్యం విక్రయాలకు సంబంధించిన నగదు చెల్లింపులు నిలిచిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 11,500 రైతులకు రూ.433 కోట్లు చెల్లించాల్సి ఉంది. * రూ.433 కోట్ల మేర నిలిచిన ధాన్యం సొమ్ము * లబోదిబోమంటున్న 11,500 మంది రైతులు * 15 రోజులుగా రూపాయి చెల్లించని వైనం భీమవరం: జిల్లాలో పదిహేను రోజులుగా ధాన్యం విక్రయాలకు సంబంధించిన సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాళ్వాకు పెట్టుబడులు అధికం కావడంతో ఎక్కువమంది రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. పంట చేతికిరావడంతో 24 గంటల్లో సొమ్ము చేతికి వస్తుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి అప్పగించారు. ధాన్యం అమ్మి 15 రోజులవుతున్నా సొమ్ములు రాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకున్న బకాయిలు జిల్లాలో సుమారు 4.60 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు చేయగా దాదాపు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా అధికారులు ఐకేపీ ఆధ్వర్యంలో 173, సొసైటీల ద్వారా 93 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 17 శాతం కంటే తేమ తక్కువగా ఉంటే 75 కిలోల బస్తాకు రూ.1,087 ధర చెల్లించనున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు అనేక వ్యయప్రయాసల కోర్చి వరికోత యంత్రాల ద్వారా మాసూళ్లు చేసిన ధాన్యంతో పాటు కూలీలతో ఎండ కోసిన పంటను సైతం ఎండబెట్టి ఐకేపీ కేంద్రాలు, సొసైటీల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేర్చారు. జిల్లాలో ఈ నెల 11 నుంచి ఐకేపీ కేంద్రాలు, సొైసైటీలకు ధాన్యం అమ్మకాలు చేసిన సుమారు 11,500 మంది రైతులకు రూ.433 కోట్లు సొమ్ములు చెల్లించాల్సి ఉంది. ఒక్క భీమవరం మండలంలోనే 288 మంది రైతులకు సుమారు రూ.10 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. దళారుల వైపు రైతుల చూపు ప్రభుత్వం నుంచి సకాలంలో నగదు అందకపోవడంతో రెండు రోజులుగా రైతులు దళారులు, కమీషన్ ఏజెంట్ల వైపు చూస్తున్నారు. కమీషన్‌దారులు నాలుగైదు రోజుల్లోనే నగదు అప్పగిస్తామని చెబుతుండడం, దానికితోడు బస్తా రూ. 1,150 చేసి కొనుగోలు చేస్తుండడంతో వారివైపు మొగ్గుచూపుతున్నారు. త్వరగా సొమ్ము చేతికందితే రుణాలను కొంత మేర తీర్చుకోవచ్చని రైతులు ఆశిస్తున్నారు. అయితే దళారుల మాయమాటలకు రైతులు మోసపోయే ప్రమాదముందని రైతు సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ప్రచారం చేసినట్టుగా 24 గంటల్లో సొమ్ము చెల్లిస్తే రైతులు దళారుల వైపు చూడాల్సిన అవసరం రాదని, ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
రైతు ఖాతాకు ‘మాఫీ’ చిల్లు
గిట్టుబాటు లేకున్నా బయట మార్కెట్లో విక్రయించేందుకు మొగ్గుతున్న రైతన్న ధాన్యం విక్రయాలు, రైతుల సమస్యలపై పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్య వైఖరి ధాన్యం అమ్మిన డబ్బులు బ్యాంకుల కైవసం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రుణ మాఫీ అంశంపై నాన్చుడు ధోరణి అన్నదాతలను అనేక కష్టాల పాలుజేస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తామని.. ఎవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించనక్కరలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే చెప్పటంతో.. రుణాలు చెల్లించకుండా రుణ మాఫీపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఇప్పుడు అదే శాపంగా పరిణమిస్తోంది. ఇప్పటికే బ్యాంకు రుణాలు తీరనందున రైతులు డిఫాల్టర్లుగా మారి కొత్త రుణాలు పొందడానికి అనర్హులయ్యారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి సాగు చేసిన రైతులు.. ఇప్పుడు పండించిన ధాన్యం విక్రయించగా వచ్చిన సొమ్ము బ్యాంకు ఖాతాలకు వస్తుండటంతో.. ఆ డబ్బును కాస్తా బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో చేతికి చిల్లిగవ్వ రాక.. బయట అప్పులు తీర్చటం మాట దేవుడెరుగు కనీసం కుటుంబ పోషణ ఎలా అన్నది అన్నదాతకు జవాబు లేని ప్రశ్నగా మారింది. గిట్టుబాటు లేకున్నా బయటకే మొగ్గు... రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర లభించాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సర్కారు చెప్తుండటంతో.. చాలా మంది రైతులు అక్కడకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. విక్రయించగా వచ్చిన ధాన్యానికి డబ్బు నగదు రూపంలో ఇవ్వకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మరుక్షణమే.. ఆయా బ్యాంకులు సంబంధిత రైతుల పాత అప్పుల కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని కొందరు రైతులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరించేందుకు బ్యాంకు అధికారులతో చర్చించాల్సింది పోయి.. రుణం తీసుకోని బ్యాంకుల్లో కొత్తగా ఖాతా ప్రారంభించాలని ఉచిత సలహా ఇస్తుండటం విశేషం. ఈ పరిస్థితుల్లో చాలా మంది రైతులు గిట్టుబాటు ధర లభించకపోయినా సరే బయట మార్కెట్లో విక్రయించేందుకే మొగ్గుచూపుతున్నారు. ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉందని గిట్టుబాటు ధర ఇవ్వకుండా వ్యాపారులు నిలువునా మోసం చేస్తున్నా.. ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము తప్పని పరిస్థితుల్లో బయట మార్కెట్లో విక్రయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. పౌరసరఫరాల శాఖ నిర్లిప్తత... రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 15.17 లక్షల హెక్టార్లలో రైతులు వరి పంట సాగుచేశారు. తద్వారా 58.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో వెలుగు గ్రూపు సభ్యుల ద్వారా 591 కేంద్రాలు, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 433, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ద్వారా 45 చొప్పున మొత్తం 1,069 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే రైతుల ఇబ్బందులను పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి సమస్యను పరిష్కరించాల్సి ఉన్నా.. ఆ విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కనీసం ఏ జిల్లాలో ఎంత పంట పండిందో కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది నుంచి సరైన వివరాలు కూడా సేకరించలేదంటే వారి పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని ఎండబెట్టుకునేందుకు టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా పౌరసరఫరాల శాఖ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ శాఖ మంత్రి పరిటాల సునీత ఈ విషయమై చొరవ తీసుకుని తరచూ సమీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో అంతిమంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న దుస్థితి నెలకొంది.