
కర్ణాటక రైతుల ఆగ్రహం
కృష్ణా: ధాన్యం విక్రయంలో అడ్డంకులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నారాయణ పేట జిల్లా కృష్ణా మండల సరిహద్దు కర్ణాటకలోని శక్తినగర్‌లో రాయచూర్ జిల్లా రైతు సంఘం నాయకులు తెలంగాణ రైతుల ధాన్యం వాహనాలను అడ్డుకొని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో తమ రైస్ మిల్లులు ఉన్నాయని, నిరంతరం తమ మిల్లుల ద్వారానే హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు బియ్యం పంపిస్తున్నామని చెప్పారు.
తెలంగాణలోని తమ రైస్ మిల్లులకు కర్ణాటకలోని ధాన్యాన్ని అన్ని అనుమతులతో తీసుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. తెలంగాణలోని రైతులు కూడా ధాన్యాన్ని కర్ణాటకకు తీసుకెళుతున్నారు. వీరంతా రాయచూర్ మార్కెట్‌పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.
వరినే కాకుండా.. పత్తి, కంది, ఆముదం తదితర అన్ని పంటలు రాయచూర్ మార్కెట్‌కు తరలిస్తామని, తమ పంటలకు అవసరమైన పెట్టుబడులు సైతం అక్కడి కమీషన్ ఏజెంట్ల వద్దే తీసుకుంటున్నామని చెప్పారు. ఇరు రాష్ట్రాల అధికారులు, ప్రభుత్వాలు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment