commission agents
-
ధాన్యం విక్రయానికి అడ్డంకులు ఎందుకు?
కృష్ణా: ధాన్యం విక్రయంలో అడ్డంకులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నారాయణ పేట జిల్లా కృష్ణా మండల సరిహద్దు కర్ణాటకలోని శక్తినగర్‌లో రాయచూర్ జిల్లా రైతు సంఘం నాయకులు తెలంగాణ రైతుల ధాన్యం వాహనాలను అడ్డుకొని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో తమ రైస్ మిల్లులు ఉన్నాయని, నిరంతరం తమ మిల్లుల ద్వారానే హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు బియ్యం పంపిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోని తమ రైస్ మిల్లులకు కర్ణాటకలోని ధాన్యాన్ని అన్ని అనుమతులతో తీసుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. తెలంగాణలోని రైతులు కూడా ధాన్యాన్ని కర్ణాటకకు తీసుకెళుతున్నారు. వీరంతా రాయచూర్ మార్కెట్‌పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వరినే కాకుండా.. పత్తి, కంది, ఆముదం తదితర అన్ని పంటలు రాయచూర్ మార్కెట్‌కు తరలిస్తామని, తమ పంటలకు అవసరమైన పెట్టుబడులు సైతం అక్కడి కమీషన్ ఏజెంట్ల వద్దే తీసుకుంటున్నామని చెప్పారు. ఇరు రాష్ట్రాల అధికారులు, ప్రభుత్వాలు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ముక్కలైన కొత్తపేట్ పండ్ల మార్కెట్.. తలో దిక్కు..
సాక్షి,హైదరాబాద్: పోయిన దసరా రోజున బాటసింగారంలో ప్రభుత్వం పండ్ల మార్కెట్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు అక్కడ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగడంలేదు. అధికారుల ఒత్తిడితో కొందరు వ్యాపారులు అక్కడికి వెళ్లినా.. వ్యాపారం సాగక తిరిగి కొత్తపేట్ పరిసరాలకే చేరుకున్నారు. రూ.కోట్లతో సకల సౌకర్యాలు కల్పించామని మార్కెటింగ్‌శాఖ ప్రకటించినా.. వ్యాపారులు, రైతులు కొత్తగా ఏర్పాటు చేసిన బాటసింగారం వైపు ఆసక్తి కనబర్చడంలేదు. కొంతమంది కమిషన్ ఏజెంట్లు కోర్టు తీర్పు వచ్చే వరకు వ్యాపారం నిలిపివేశారు. మరికొందరు ఎల్బీనగర్ చుట్టు పక్కల స్థలాలు అద్దెకు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు కొత్తపేట్ పరిసరాల్లో రోడ్లపైనే క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. దీంతో గతంలో ప్రాంగణంలో కొనసాగిన వ్యాపారం ఇప్పుడు ముక్కలు ముక్కలుగా చీలిపోయింది. రోజూ వేల టన్నులకొద్దీ వచ్చే వివిధ రకాల పండ్లు నగర మార్కెట్‌కు రావడం నిలిచిపోయింది. దీంతో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు పండ్లు పండించే రైతులు సరుకులు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాటసింగారానికి ససేమిరా.. కమిషన్ ఏజెంట్లు మాత్రం వివిధ ప్రాంతాల నుంచి పండ్లను దిగుమతి చేసుకుని ఎల్బీనగర్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ అధికారులు బలవంతంగా బాటసింగరానికి తరలించినా అక్కడ వ్యాపారం చేయడానికి సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. కొంత మంది చిన్న వ్యాపారులు అధికారుల బెదిరింపులతో బాటసింగారం వెళ్లి ఎంట్రీ చేసుకొని వచ్చి మళ్లీ కొత్తపేట్ ప్రాంతంలోనే పండ్లు విక్రయిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రోడ్లపై విక్రయిస్తే కేసులు పెడతామని అధికారులు బెదిరించడంతో కొంత మంది వ్యాపారులు తుదకు వ్యాపారమే మానివేయడం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ చిత్రంలో దిగాలుగా కూర్చున్న వ్యక్తి పేరు ఫరీద్. గతంలో కొత్తపేట్ మార్కెట్లో పండ్లు విక్రయించేవాడు. ఆ మార్కెట్‌ను మూసివేయడంతో ప్రస్తుతం రోడ్డున పడ్డాడు. బాటసింగారంలో పండ్ల అమ్మకాలు సరిగా ఉండవనే ఉద్దేశంతో కొత్తపేట్ రహదారిపైనే ఇలా పండ్లు విక్రయిస్తున్నాడు. విక్రయాలు సక్రమంగా లేక కుటుంబ పోషణ భారంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇతడి పేరు హనుమంతు. కొత్తపేట్ మార్కెట్‌ను మూసివేయడంతో కొంత కాలం వ్యాపారం చేయలేదు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక కుటుంబ అవసరాల కోసం మార్కెట్ చుట్టపక్కల స్థలం అద్దెకు తీసుకొని పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. బాటసింగారం వెళ్లలేక మార్కెట్‌కు దగ్గరలో పండ్లు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పండ్లు విక్రయిస్తున్న ఈ వ్యక్తి జహంగీర్ కొత్తపేట్ మార్కెట్‌ను మూసేసిన తర్వాత కొన్ని రోజులకు అధికారులు బలవంతం చేయడంతో బాటసింగారం వెళ్లాడు. అక్కడ వినియోగదారులు లేకపోవడంతో తిరిగి కొత్తపేటకే చేరుకున్నాడు. బాటసింగారంలో వ్యాపారం చేద్దామంటే వినియోగదారులు రావడం లేదని నిరాశ వ్యక్తంచేస్తున్నాడు. -
టమాటా రైతుకు సీఎం బాసట
రాష్ట్రంలో టమాటా మార్కెట్‌కు ఆ ప్రాంతం పెట్టింది పేరు.. కొద్ది రోజులుగా ధర కూడా బాగానే ఉంది.. రోజూ లాగే పెద్ద ఎత్తున రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొచ్చారు.. పంట ఎక్కువగా రావడం చూసిన దళారులకు కన్ను కుట్టింది.. వారి కనుసైగలతో నిమిషాల వ్యవధిలో ధర భారీగా పడిపోయింది.. అందరి నోటా ఒకే మాట.. వారు చెప్పిన ధరకే సరుకు అమ్ముకుని పోవాలని హుకుం.. నిశ్చేషు్టలవ్వడం రైతుల వంతైంది.. ఏం చేయాలో పాలుపోక తర్జనభర్జన పడ్డారు.. అంతలో విషయం సీఎం దాకా వెళ్లింది. ధరల స్థిరీకరణ నిధి ఉపయోగించి సరుకు కొనుగోలు చేయాలంటూ మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి.. ఆ వెంటనే వారు రంగంలోకి దిగారు.. కిలోకు రూ.4 అధికంగా ఇచ్చి కొనుగోళ్లు మొదలు పెట్టారు.. దళారుల దిమ్మ తిరిగిపోయింది.. ఇలాగైతే తమకు సరుకు దక్కదని వారూ ఆదే రేటుకు కొన్నారు. దళారులను అరికడతామని, ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న హామీని సీఎం వైఎస్ జగన్ శనివారం కర్నూలు జిల్లాలో అక్షరాలా అమలు చేసి చూపారు. సాక్షి, అమరావతి : దళారులు ధరలతో దగా చేయాలనుకున్న తీరు తిరగబడింది. మార్కెట్లో టమాటా కొనుగోళ్లు నిలిపేసి రైతులకు ఇబ్బందులు సృష్టించాలనుకున్న వ్యూహం బెడిసి కొట్టింది. ముఖ్యమంత్రి దెబ్బకు దిగొచ్చిన దళారులు గత్యంతంర లేక ధర పెంచి కొనుగోలు చేశారు. మార్కెట్ ఫీజు లేకుండా, ఏజెంట్లకు కమీషన్ ఇవ్వకుండా రైతులకు వంద శాతం న్యాయం జరిగేలా పండ్లు, కూరగాయల అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై నుంచి డీ రెగ్యులేట్ చేసింది. దీంతో తమకు లాభంలేదని భావించిన కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డులోని దళారులు సమస్యలు సృష్టించారు. మార్కెట్ యార్డులో కొనుగోళ్లు చేస్తే తమకు ఉపయోగం ఉండడం లేదని, లోపల అమ్మకాలు నిలిపివేసి రైతులే బయటకు వచ్చి సరుకు విక్రయించాలని, లేకపోతే కొనుగోళ్లు చేయబోమని బెదిరింపులకు దిగారు. కానీ, రైతులు తాము లోపలే విక్రయాలు చేస్తామని చెప్పడంతో ఇబ్బంది ఏర్పడింది. ఈ సమస్య సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంతో వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిపించాలని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ధరల పతనం కాకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది ఉండకూడదని.. ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. వెంటనే మార్కెటింగ్ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలు పెట్టాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మార్కెటింగ్ శాఖ.. శనివారం టమాటా కొనుగోళ్లను ప్రారంభించింది. కిలోకు అదనంగా రూ.4 ఇచ్చి కొనుగోళ్లు మొదలెట్టింది. ఇలా 50 టన్నుల టమాటా కొనుగోలు చేసింది. నేరుగా తాము కొనుగోళ్లు జరపడం వల్ల రూ.14, రూ.15 ఉన్న కిలో టమాటా ధర రూ.18, రూ.19కి పెరిగి రైతులకు లాభం చేకూరింది. దీంతో అవాక్కయిన దళారులు తాము నష్టపోతామని భావించి వెంటనే మార్కెట్లోనే కొనుగోళ్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో వారు కూడా శనివారం 100 మెట్రిక్ టన్నుల టమాటాను కోనుగోలు చేశారు. నాలుగు నెలల్లోనే గిట్టుబాటు ధర విషయమై సీఎం మాట నిలుపుకున్నారని రైతులు ప్రశంసించారు. దళారులపై ఫిర్యాదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి వల్ల వెంటనే కొనుగోళ్లు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయగలిగామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏజెంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ ఏడాది జూలై నుంచి మార్కెట్ డి రెగ్యులేషన్‌ను ప్రారంభించామని, దీనివల్ల రైతులకు పూర్తిగా న్యాయం జరుగుతుందని కమిషనర్ చెప్పారు. ప్రభుత్వం మా పక్షాన నిలిచింది పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా అమ్మకాలు సవ్యంగా జరిగితే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు సౌకర్యాలు ఉంటాయి. కానీ రైతులకు లాభాలు రాకుండా దళారులు అడ్డుపడుతుంటారు. టమాటా రైతుల కష్టాలను తెలుసుకుని సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించి ఆదేశాలు ఇవ్వడం వల్లనే అధికారులు కదిలి వచ్చి సమస్యను పరిష్కరించారు. – రామచంద్ర, రైతు, దూదేకొండ, పత్తికొండ మండలం రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు టమాటా రైతుల ఇబ్బందులపై సీఎం వైఎస్ జగన్ స్పందించడం హర్షణీయం. రైతులకు ఇబ్బంది లేకుండా పత్తికొండ మార్కెట్ యార్డులోనే అమ్మకాలు జరిగేలా చూశారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని, దళారుల బెడద లేకుండా చేస్తామని ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాట నిలుపుకున్నారు. గ్రేట్ సీఎంకు ధన్యవాదాలు. – రాజశేఖర్, రైతు, చక్రాళ్ల, పత్తికొండ మండలం -
ఉల్లి.. కమీషన్ల లొల్లి
కర్నూలు(అగ్రికల్చర్) : ఉల్లి రైతులను కమీషన్ ఏజెంట్లు దోపిడీ చేస్తున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌కు ఉల్లి భారీగా వస్తోంది. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు 2 శాతం కమీషన్ ఉండగా ఉల్లికి మాత్రం 4 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. అయితే కమీషన్ ఏజెంట్లు రైతులకు ఇచ్చే బిల్లులో మాత్రం 2శాతం తీసుకుంటున్నట్లుగా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ఉల్లి ధరలు పెరిగి పోయాయి. క్వింటాల్ ధర రూ 4000 పైగా ఉంది. అంటే ఒక క్వింటాల్ పైనే కమీషన్ రూపంలో రూ. 40 వసూలు చేస్తున్నారు. ఉల్లిని వేలంపాట ద్వారా కొనుగోలు చేస్తారు. ఏ ధరకు పోయినా రైతుకు డబ్బు చెల్లించేటపుడు క్వింటాళుపై రూ. 20 ప్రకారం కోత విధించి చెల్లిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇలా చేస్తునే యథావిధిగా కూలీల చేత చెడిన వాటిని వ్యర్థాలను ఏరీ వేయిస్తున్నారు. క్వింటాలుకు 2 నుంచి 3 కిలోలు ఏరీ వేయిస్తుడటంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఈ విషయం మార్కెట్ కమిటీ అధికారలకు తెలిసినా పట్టించుకోరు. ఎందకంటే సీజన్ మామూలు కింద ఏటా రూ 5లక్షల నుంచి 6 లక్షలు ముట్ట చెబుతుండటమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్లో ఉల్లిని విక్రయించిన రైతులు శ్యాంపల్ కింద ప్యాకెట్ ఉల్లి సమర్పించుకోవాల్సింది. కాటాదారులు, ఉల్లిని క్లీన్ చేసిన మహిళా కూలీలు 10 కిలోలకు పైగా రైతును అడగకుండానే తీసుకుంటున్నారు. వేలంపాట నిర్వహించే సెక్యూరిటీ సిబ్బందికి మరో 10 కిలోలు సమర్పించుకుంటున్నారు. కాటాదారులు, ఇతర హమాలీలకు నిబంధనల ప్రకారం కూలి చెల్లిస్తునే అదనంగా ఇచ్చుకుంటున్నామని రైతులు వాపోతున్నారు. కర్నూలు మార్కెట్లో అడుగడుగునా దగా చేస్తుడటంతో రైతులు తాడేపల్లిగూడేనాకి వెలుతున్నట్లు సమాచారం. ఇప్పటికైన మార్కెట్ కమిటీ అధికారులు చర్యలు తీసుకొని ఉల్లి దోపడీని అరికట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. -
రూ.3 కోట్లకు కుచ్చుటోపీ
►ఉడాయించిన ఇద్దరు వ్యాపారులు ►పోలీసులను ఆశ్రయించిన కమీషన్ ఏజెంట్లు ►ఎమ్మిగనూరు యార్కెట్ యార్డులో కలకలం ఎమ్మిగనూరు టౌన్ : స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో అన్నదమ్ములైన ఇద్దరు వ్యాపారులు (బయ్యర్స్) రూ.3కోట్ల చెల్లింపులు చేయకుండా ఊడాయించారు. వారం రోజులు నుంచి వారు కనిపించకపోవడంతో ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లి ఉంటారని కమీషన్ ఏజెంట్లు భావించారు. అనుమానం వచ్చి కొందరు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఇంట్లో విలువైన సామాన్లతో పాటు పాఠశాలల నుంచి పిల్లల టీసీలను కూడా తీసుకొని పకడ్బందీగా వెళ్లారని తెలుసుకొని వ్యాపారులు గొల్లుమన్నారు. వారి బంధువులు నివసించే ముంబాయి, బళ్లారి, రాయచూర్.. తదితర ప్రాంతాలకు కూడా కొంత మంది కమీషన్ ఏజెంట్లు వెళ్లివచ్చినా వారి జాడ తెలియలేదు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఆశా ట్రేడర్స్, అతావుల్లా ట్రేడర్స్ పేరుతో రెండు టేడ్‌లపై కమీషన్ ఏజెంట్ల ద్వారా రైతుల నుంచి సరుకులను కొనుగోలు చేస్తూ వచ్చారు. మార్కెట్లోని దాదాపు 30మంది కమీషన్ ఏజెంట్లకు దాదాపు రూ.3కోట్ల వరకు వారు చెల్లించాల్సి ఉంది. ఒక్కొక్క కమీషన్ ఏజెంట్‌కు రూ.20లక్షల నుంచి రూ.54లక్షల వరకు ఆ ఇద్దరు అన్నదమ్ములు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోమార్కెట్‌యార్డ్ కమీషన్ ఏజెంట్ల అసోసియేషన్ నాయకులు ఆదివారం.. పట్టణ ఎస్ఐను ఆశ్రయించి అసలు విషయం చెప్పడంతో పాటు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హామీ ఇచ్చారు. -
ఆన్లైన్ పసుపు కొనుగోళ్లపై వివాదం
⇒ ఈ-గొడవ ⇒ ఈ-గొడవవివాదానికి దారితీసిన ‘ఆన్లైన్’ ⇒ ఈ-గొడవఈ పద్ధతి వద్దంటున్న కమీషన్ ఏజెంట్లు ⇒ ఈ-గొడవదీంతో రైతులకు మేలంటున్న అధికారులు ⇒ ఈ-గొడవసమస్యను పరిష్కరించాలని రైతుల వాగ్వాదం ‘⇒ ఈ-గొడవసాంగ్లీ’ విధానం అమలు చేయాలని డిమాండ్ నిజామాబాద్ వ్యవసాయం : నిజామాబాద్ మార్కెట్‌యార్డ్‌లో గురువారం ఆన్లైన్ పసుపు కొనుగోళ్లపై వివాదం చెలరేగింది. ఈ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలంటూ కమీషన్ ఏజెంట్లు మార్కెట్ యార్డ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ వ్యవహారాన్ని తక్షణమే పరి ష్కరించాలని కోరుతూ రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ విధానంతో తమకూ అన్యాయం జరుగుతోందని వాపోయారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో అమలవుతున్న పద్ధతిని అమలు చేయాలని కోరారు. సాంగ్లీలో పసుపు నాణ్యతను బట్టి ధరలను నిర్ణయిస్తారని పేర్కొన్నా రు. రైతులు కూడా పసుపును వేరు చేసి నాణ్యత గల పసుపును ఒక లాట్‌గాను, ఇతర రకాన్ని మరో లాట్‌గాను వేరు చేసి విక్రయిస్తారని, దీంతో రైతుకు నష్టం జరుగదని వివరించారు. నాణ్యత ప్రకారం ధర వస్తుందన్నారు. విషయా న్ని ఉన్నతాధికారులకు విన్నవించి, అందుబాటులోకి తీసుకొస్తామని మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎల్లయ్య రైతులకు హామీ ఇచ్చారు. ఈ-బిడ్డింగ్ ద్వారా రైతులకు కలిగే లాభాలను వివరించారు. దీంతో సమస్య సద్దుమణిగినప్పటికీ, వ్యాపారలావాదేవీలు మాత్రం కొనసాగలేదు. అసలేం జరిగింది నిజామాబాద్ మార్కెట్‌యార్డ్‌లో పసుపు విక్రయాలను కొంత కాలంగా ఈ- టెండర్ ద్వారా కొనసాగిస్తున్నారు. ఈ విధానంతో మోసాలు జరుగవని అధికార యంత్రాంగం భావించింది. అందుకోసమే ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించింది. ఈ విధానంతో రైతులకు లాభాల మాట దేవురెడుగు కానీ, ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ పద్ధతిలో ఎక్కువ ధర కోడ్ చేసిన వ్యాపారికి రైతులు కమీషన్ ఏజెంటు ద్వారా పసుపును విక్రయించాలి. ఇందుకు రైతులు సుముఖంగా ఉన్నా, కమీషన్ ఏజెంట్లు మాత్రం అంగీకరించడం లేదు. సదరు వ్యాపారిపై తమకు నమ్మకం లేదంటూ, తక్కువ కోడ్ చేసిన వ్యాపారికి విక్రయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా అయితే రైతుకు నష్టం వస్తుంది. గురువారం ఇదే కారణంగా వివాదం చెలరేగి వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. ఎక్కువ ధర కోడ్ చేసిన వ్యా పారి సకాలంలో డబ్బులు చెల్లించకుంటే తాము నష్టపోతామని కమీషన్ ఏజెంట్లు చెబుతున్నారు. ఇది చినికి చినికి గాలివానగా మారింది. రైతులు, వ్యాపారులు, కమీష న్ ఏజెం ట్లు, అధికారులకు మధ్య వాగ్వాదానికి దారి తీసింది. చివరికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జోక్యం చేసుకుని రైతులకు ఇబ్బంది కలుగకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమస్యను తాను స్వయంగా వచ్చి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం పసుపు కొనుగోళ్లు యథావిధి గా జరుగుతాయని కార్యదర్శి ఎల్లయ్య తెలిపారు. ఇదీ విషయం ఆన్లైన్ విధానంతో నిజానికి రైతుకు లాభం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. పసుపు అమ్మగానే నిబంధనల ప్రకారం బిల్లు వస్తుందని, కమీషన్ కూడా నిబంధనల ప్రకారమే ఉంటుందని అంటున్నారు. ధరలో కోత ఉండదని, వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొంటున్నారు. అన్ని వివరాలు తెలుపుతూ కంప్యూ టర్ ద్వారా తెలియజేసే చీటి కూడా వస్తుందంటున్నారు. అదనపు కమీషన్లు వచ్చే అవకాశం లేనందునే ఏజెంట్లు ఈ విధానాన్ని అంగీకరించడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. అందుకే తమకు అనుకూలం గా ఉండే వ్యాపారులకు మాత్రమే పసుపును విక్రయించాలని ఒత్తిడి తెస్తు న్నా రంటున్నారు. అందుకోసం తమ మాట వినే రైతులను కూడా ఆ వైపున ప్రోత్స హిస్తున్నారని చెబుతున్నారు. -
కందులు @ రూ.5100
తాండూరు: కందుల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. కందులకు అధిక ధర పలుకుతుండడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,350 ఉండగా మార్కెట్లో రూ.5,100 పలుకుతోంది. క్వింటా కందులకు అదనంగా రూ.750 ధర లభిస్తున్నది. కందులకు డిమాండ్ ఉండటంతోనే అధిక ధర రావడానికి కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఎర్ర, తెల్ల, నల్ల కందుల కొనుగోళ్లతో కళకళలాడుతున్నది. బుధవారం యార్డులో ఎర్ర కందులకు గరిష్టంగా రూ.5,230, కనిష్టంగా రూ.5వేలు, సగటు ధర రూ.5,100 ధర పలికింది. సగటు ధర ప్రకారం రూ.79.56లక్షల విలువ చేసే 1560 క్వింటాళ్ల ఎర్ర కందులను యార్డులో వివిధ గ్రామాల రైతుల నుంచి కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. నల్ల కందులు క్వింటాలుకు రూ.4,925, రూ.4,900, రూ.4,920 ధర పలికింది. సగటు లెక్కన రూ.2,95,200 విలువచేసే 60 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. తెల్లకందులు క్వింటాలుకు రూ.5,211 -రూ.5,200 ధర వచ్చింది. కనిష్ట ధర చొప్పున రూ.2.86లక్షల విలువ చేసే 55 క్వింటాళ్లను కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. మొత్తం యార్డులో రూ.85,37,200 విలువచేసే 1,675 క్వింటాళ్ల కందుల వ్యాపార లావాదేవీలు జరిగాయి. కొనుగోలు చేసిన కందులను కమీషన్ ఏజెంట్లు మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రవాణా చేస్తున్నారు. వరికి లభించని ‘మద్దతు’ మార్కెట్ యార్డులో సాధారణ రకం వరిధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర లభించడం లేదు. దాంతో రైతులు నష్టపోతున్నారు. సాధారణ రకం వరి ధాన్యానికి ప్రభుత్వ కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.1,360 ఉంది. బుధవారం యార్డులో క్వింటాలు ధాన్యానికి గరిష్టంగా రూ.1,250, కనిష్టంగా రూ.1,220, సగటు ధర రూ.1,240 పలికింది. సగటు ధర ప్రకారం చూసినా వరి రైతులకు మద్దతు ధర లభించలేదు. క్వింటాలుకు సుమారు రూ.120 చొప్పున రైతులు నష్టపోయారు. సగటు ధర లెక్కన రూ.3,22,400 విలువ చేసే 260 క్వింటాళ్ల వరిధాన్యాన్ని కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. -
దళారీ దగా..!
నిర్మల్ అర్బన్ : ఆరుగాలం శ్రమించి పండించి ధాన్యం అమ్ముకున్న రైతులు, రైతుల నుంచి కొనుగోలు చేసి విక్రయించిన కమీషన్ ఏజెంట్లు దగాకు గురైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. రూ.కోట్లలో మోసం చేశాడంటూ నిర్మల్‌లోని గాజులపేట్‌లో ఉన్న సదరు దళారీ కొనుగోలు కేంద్రం వద్దకు వివిధ ప్రాంతాల బాధితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కేంద్రంలో సదరు వ్యక్తి లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి కోటి వరకు చెల్లించాల్సి ఉందని వారు వాపోయారు. బాధితుల కథనం ప్రకారం.. నిర్మల్‌లోని గాజులపేట్‌కు చెందిన దళారీ అనీఫ్ కొన్నేళ్లుగా మొక్కజొన్న, వరి, సోయా తదితర పంటలను కొనుగోలు చేస్తున్నాడు. ఆయా గ్రామాల్లో ఇందుకోసం ప్రత్యేకంగా కమీషన్ ఏజెంట్లను ఏర్పరచుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, నిర్మల్ నియోజక వర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు, కమీషన్ ఏజెంట్లు వరి, మొక్కజొన్న, సోయాను సదరు దళారీకి విక్రయించారు. రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించలేదు. దీంతో డబ్బుల విషయమై రైతులు, కమీషన్ ఏజెంట్లు ఒత్తిడి తెచ్చారు. వారం రోజులు గడువుకావాలని కోరడంతో ఓపిక పట్టారు. ఆది, సోమవారాల్లోనూ నిర్మల్‌లోని గాజులపేట్‌లో ఉన్న కేంద్రం వద్దకు వచ్చి వెళ్లారు. మంగళవారం డబ్బులు చెల్లిస్తానని చెప్పడంతో వారు తిరిగి పెద్ద సంఖ్యలో వచ్చారు. అక్కడ ఎవరూ లేకపోవడం, కేంద్రం మూసి ఉండటంతో అనుమానం వచ్చి సదరు వ్యక్తిని ఫోన్లో సంప్రదించారు. ఎంతకీ ఫోన్ లో స్పందించకపోవడంతో విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పట్టణ ఎస్సై రాంనర్సింహారెడ్డి అక్కడి చేరుకుని బాధితులను వివరాలడిగి తెలుసుకున్నారు. కోట్లలో టోకరా..? పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేసిన సదరు దళారీ, వారికి చెల్లించాల్సిన డబ్బులు కోట్లలో ఉన్నట్లు రైతులు, కమీషన్ ఏజెంట్లు పేర్కొంటున్నారు. రోజుల తరబడి తిప్పుకుంటూ వస్తున్న దళారీ తీరుపై సందేహం వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని విక్రయించినా డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉందని నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ సాధీక్ అనే కమీషన్ ఏజెంట్ పేర్కొన్నాడు. రూ.2 లక్షల 40 వేలు చెల్లించాల్సి ఉందని కుంటాలకు చెందిన సుదాం పటేల్, అనంతపేట్‌కు చెందిన దశరథ్కు రూ.2 లక్షల వరకు, లక్ష్మణచాంద మండలానికి చెందిన చింతకింది రమేష్‌కు రూ.లక్షా 70 వేలు, నిర్మల్‌కు చెందిన భాస్కర్‌రెడ్డికి రూ.2 లక్షలు, గురుగోవింద్సింగ్కు రూ.2 లక్షలు, పరిమండల్‌కు చెందిన జంగయ్యకు రూ.3 లక్షలు, కుంటాల మండలం లింబా గ్రామానికి చెందిన దత్తురాంకు రూ.2 లక్షల 40వేలు, వైకుంఠాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌కు రూ.8 లక్షలు, ఇలా పలువురికి రూ.లక్షల్లో చెల్లించడం చూస్తుంటే రూ.కోట్లలోనే బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలకు రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉందని వారు ఆరోపించారు. సదరు దళారీ నుంచి స్పందన లేకపోవడం, స్థానికంగా అందుబాటులో లేకపోవడంపై రూ.కోట్లలో టోకరా వేసినట్లు రైతులు, కమీషన్ ఏజెంట్ల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రైతుకు అండగా ఉంటాం
జిల్లా కేంద్రంలోని వ్యవసాయమార్కెట్ యార్డు. నిత్యం కుప్పలు కుప్పలుగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఆముదాలు ఇలా అన్ని రకాల ధాన్యం రాశులు ఉంటాయి. 1971లో ఏర్పాటైన ఈ మార్కెట్ యార్డులో ప్రతి ఏటా రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. మార్కెట్‌కు రూ.2.48 కోట్ల ఆదాయం వస్తోంది. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ యార్డును జేసీ శర్మన్ సందర్శించారు. రైతులు, హమాలీలు, దడవాయి, కమీషన్ ఏజెంట్లు, మార్కెటింగ్ ఏడీని పలుకరిస్తూ... ‘సాక్షి’ తరఫున విలేకరిగా మారారు. జేసీకి ఎదురైన అనుభవాలను పాఠకుల ముందుంచుతున్నాం. జాయింట్ కలెక్టర్ ఎల్. శర్మన్ హామీలు.. మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్‌యార్డును ప్రభుత్వ పరంగా మరింత ఉన్నత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటాం. ఈ సారి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా 72 ఐకేపీ, మహిళా సంఘాలు కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం. కనుక రైతులందరూ దళారులను ఆశ్రయించకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటిని సద్వినియోగం చేసుకొని, ధాన్యం విక్రయించి, ఆశించిన రేటు పొందండి. మొక్కజొన్నకు సంబంధించి పీఏసీఎస్ కూడా కొనుగోళ్లు చేస్తుంది. పత్తికి సంబంధించి సీసీఐ ఇప్పటికే షాద్‌నగర్, జడ్చర్లలో కొనుగోలు చేస్తుంది. త్వరలో నాగర్‌కర్నూల్, గద్వాలలో కూడా చేయనుంది. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే సాగు విషయంలో ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తున్నా... రైతులకు అవగాహన ఉండడం లేదు. ఈ విషయంలో వారికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. అనేక కొత్త ఒరవడులు వస్తున్నాయి. వాటిని రైతులకు పరిచయం చేస్తాం. అన్ని రకాలుగా రైతుకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శర్మన్: మీరంతా రైతులేనా..? ఏజెంట్లు, ఇతరులు ఎవరైనా ఉన్నారా? జవాబు: లేదు సారు.. ఇక్కడున్నొళ్లమంతా రైతులమే శర్మన్: మీ పేరేంటి? ఎక్కడినుంచి వచ్చారు రైతు: మాసన్న యాదవ్, అల్లీపూర్ నుంచి వచ్చిన శర్మన్: ఏ ధాన్యం తీసుకొచ్చావు. మార్కెట్‌కు ఎప్పుడు వచ్చావు? మాసన్న: వడ్లు తెచ్చిన. నిన్న తీసుకొచ్చిన. ఇయాల ఇంకా బీట్ కాలేదు. శర్మన్: ఎన్ని ఎకరాలు వేస్తే ఎంత దిగుబడి వచ్చింది? ఖర్చు ఎంత..? మాసన్న: నేను రెండు ఎకరాలు వేసిన..కరెంటు సరిగ లేక కొంత ఎండిపోయింది. ఎండిపోగ ఉన్నది తీసుకొచ్చిన. సారు ఎకరకు ఖర్చు అంటరా.. రేట్లు బాగ పెరిపోయినయి. ట్రాక్టరొళ్లకు కూళ్లు అన్నీ బాగా పెరిగినయి. ఎకరాకు 25వేల వరకు ఖర్చు వచ్చింది. శర్మన్: ధాన్యాన్ని మార్కెట్‌కు తెస్తుంటారు కదా? నీవు నిన్నటి నుంచి ఉన్నవు ఇక్కడ ఏమైనా సమస్యలున్నాయా? అడ్తీదారుల నుంచి.. మాసన్న: పాపం అడ్తీదారులు ఏమనరు. శర్మన్: మార్కెట్లో మధ్యాహ్నం భోజనం పెడతారా? మాసన్న: లేదు సారు. బయటనే తింటాం. తినడానికి ఒక్కొక్కరికి 50 నుంచి 70 రూపాయలు అవుతున్నయి. శర్మన్: నీవు తీసుకొచ్చిన వడ్లకు మార్కెట్లో ఎంత రేటుంది? మాసన్న: నేనైతే 1010 రకం వడ్లు తీసుకొచ్చిన. రేటు అయితే కొంచెం డౌన్ అయ్యిందంటున్నరు. క్వింటాల్‌కు 1300 రూపాయలు పెడుతున్నరట. శర్మన్: ధర ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకోవాలి కదా? బహిరంగ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.1600 పోతుందట? జిల్లాలో ఐకేపీ, మహిళా గ్రూపుల ద్వారా కూడా కొనుగోళ్లు జరుగుతున్నాయి కదా? దశరథం: సారు మాది హన్వాడ మండలం బుద్దారం. మీరన్నట్లు ఎవరు కొంటరో మాకు తెల్వదు కదా? ఎప్పట్లాగనే మార్కెట్కుతెచ్చినం. వడ్లకు 1600 ఈ మార్కెట్ల లేదు సారు. మీరే చూడండి 1010కి క్వింటాల్‌కు ఆఖరికి 1400 పెట్టిండ్రట. శర్మన్: రెండు, మూడు రోజుల్లో ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం మొత్తం 76 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. కాస్త ఓపిక పట్టండి దశరథం: మాకు తెలువకనే తీసుకొచ్చినం. శర్మన్: మీరు పేపర్లు చదవరా? మాసన్న: మాకు చదువనింకె రాదుకదా సారు. ఎవరు చెప్తరు శర్మన్: ప్రతి ఒక్కరికీ చదవడం రాకపోయినా.. చాలామంది ఊళ్లో ఉంటారు కదా? వారి నుంచి తెలుసుకోవచ్చు కదా? దశరథం: ఎక్కడ సారు. ఊళ్ల చదువొచ్చిన పిల్ల లు ఉంటలేరు. ప్రైవేటు నౌకర్ల కోసం పట్నం పోతున్నరు. ఉన్న పిల్లలు కాపుదనం విషయా లు అస్సలు పట్టించుకోరు. మాకు చెప్పరు. శర్మన్: ఈసారి వరి ఎండిపోయిందని చాలా మంది చెబుతున్నారు. అలా కాకుండా ఆరుతడి పంటలు పండించవచ్చు కదా? దశరథం: పచ్చజొన్నలు ఏస్తే ఈనేటప్పుడు వానపడ్డది. ఉన్నది కాస్త నల్లగ అయినవి. శర్మన్: సాంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలు వేయాలి. బాగా డబ్బు వచ్చేవి వేసుకోవాలి. పసుపు, పత్తి, మిర్చి లాంటివి వేయాలి. రాజు: సారు మాది కార్కొండ. మా భూముల్లో పసుపు పండదు. పత్తి ఏసినం కానీ ఏం లాభం పంట పండకపాయే. పెట్టుబడి మొత్తం నెత్తిన పడ్డది. నేను మూడెకరాలు పత్తి పెడితే. పెట్టుబడి మొత్తం మీద పడ్డది. లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన ఏం లాభం లేదు. శర్మన్: పత్తి ఎకరాకు ఎంత ఖర్చు అవుతది? దిగుబడి ఎంత ఉంటది? రాజు: ఎకరాకు 30 నుంచి 40వేల దాకా ఖర్చు అయితది. పంట పండితే మస్తుగ ఉంటది కాని. ఏం లాభం.. ఈసారి వానలు పడకపాయే. దంటుకు 50 మొగ్గలు వచ్చినయి... శర్మన్: ఏదో నేను అడుగుతున్నానని కాదు.. నిజం చెప్పండి? రాజు: సారు అబద్ధం చెప్తే మాకు ఏమొస్తది. సారు ఇట్లే నా వెంటరా... పత్తి చేనుకు తీసుకుపోయి చూపిస్తా. బాగా గూడ వచ్చేటప్పుడే వానలు పోయినయి. చేన్లన్నీ దెబ్బతిన్నయి. శర్మన్: పత్తి బాగా పండితే, లాభం ఎంతుంటది? రాజు: వానలు కరెక్టుగా పడితే, పత్తిల మస్తు లాభముంటది. కానీ ఈసారి పోయింది. అంతా నెత్తిన పడ్డది. కూలీల రేట్లు బాగా పెరిగినయి. ఏం పాయిదా లేదు. శర్మన్: కౌలుకు తీసుకుంటే రైతుకు ఎంత మిగులుతుంది? రాజు: ఈ కాలంల భూమి కౌలుకు తీసుకొని చే యాలంటే చాన ఇబ్బంది. ఏం ఎల్లదు. వేస్టు. శర్మన్: ఇప్పుడు ఏ పంటలు వేస్తే రైతుకు లాభం కానీ తృప్తిగానీ ఉంటది? రాజు: ఏం పంటలున్నయి. వానలు పడితే అన్ని పంటలు నమ్మకంగానే ఉంటయి. వాన పడకపోతే అన్ని పోతయి. శర్మన్: కూరగాయలు ఎందుకు సాగు చేయరు? ప్రతిరోజూ డబ్బులు వస్తాయి కదా? బాల్యనాయక్: సారు మాది కోయిల్‌కొండ మండలం అభగపట్నం. కూరగాయలకు చాన తెగుళ్లు తగుల్తయి. మొలక కూడా ఎత్తనీయవు.. పురుగులు. పాలమూరు మందులు ఎన్ని కొట్టినా కంట్రోల్ కాదు.. శర్మన్: మార్కెట్లో చాలా రకాల కూరగాయలు వస్తున్నాయి.. కదా. అవి కూడా రైతులు పండించినవే కదా? బాల్యనాయక్: ఏమో సారు మేం ఏసి చూసినం. పంట రాదు. పురుగులకు తట్టుకోలేం. శర్మన్: పల్లీలు తెచ్చారు. ఖరీఫ్‌లో పండించినవేనా? రాములు(ఓగులాయపల్లి): లేదు సారు. పోయిన ఏడాది పంట. విత్తనం కోసం అట్లే ఉంచినం. ఈ సారి కాలం కాకపాయే అనుకున్నంత అమ్ముడుపోలే. మిగిలింది మార్కెట్‌కు తెచ్చిన. శర్మన్: వానలు పడ్డాయి కాని, డ్రై పిరియడ్.. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో పడనందు వల్ల ఇబ్బంది వచ్చింది. శర్మన్: మీరు ఏం తెచ్చారు? మీ సమస్యలేంటి? రాంరెడ్డి: వడ్లు తెచ్చిన కానీ.. ఏం చెప్పమంటరు సారు.. మాకు చాన ఇబ్బంది ఉంది. పంట మొ త్తం షావుకారి అప్పుకే సరిపోతలేదు. ఏం చేయలే. శర్మన్: ముందుగానే డబ్బులు ఎందుకు తీసుకుంటారు? రాంరెడ్డి: పెట్టుబడి ఎట్ల ఎల్తది. విత్తనం కా నుంచి ఎరువు బస్తలు, కూళ్లు అన్ని పైసలు లేకపోతే పని నడవదు కదా? అందుకే సేటుతో నుంచి అప్పు తీసుకొని, పంట పండిన తర్వాత పట్టిస్తం. శర్మన్: బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి కదా? రాంరెడ్డి: ఎక్కడ సారు... కేసీఆర్ మొత్తం మో సం చేసే. బ్యాంకుల మాఫీ అని చెప్పే.. మాకు అప్పు పుట్టకుండా చేసే. బ్యాంకోళ్లు పైసలే ఇస్తలేరు. శర్మన్: మీరు హమాలీలా..? ఏం పేరు? ఎన్నాళ్ల నుంచి ఈ పనిచేస్తున్నారు? హమాలీలు: సారు నా పేరు వెంకటయ్య, ఈ యన పేరు రాములు. మేం పది ఏళ్ల నుంచి ఈ మార్కెట్లనే పని చేస్తున్నాం. శర్మన్: గుర్తింపు కార్డులు ఉన్నాయా? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? వెంకటయ్య: గుర్తింపు కార్డులు యూనియన్ వాళ్లు ఇచ్చారు. ఇబ్బందులంటే ఉన్నయి. మా కు ఇక్కడ మూడు నెలలే నడుస్తది. ఉన్నకాడికి చేసుకొవాలే. ఉండాలే. శర్మన్: ఎందుకు సంవత్సరం పొడువునా ఏవో పంటలు వస్తాయి కదా? వెంకటయ్య: లేదు సారు.. నాలుగు నెలలు ఊకనే ఉంటది. శర్మన్: బస్తాకు ఎంత తీసుకుంటారు? వెంకటయ్య: బండి నుంచి దించి కుప్ప పోస్తం, తర్వాత కాంటకు పెడతం అందుకు పైసలిస్తరు. శర్మన్: డబ్బులు రైతులిస్తారా? కమీషన్ ఏజెంట్ ఇస్తారా? వెంకటయ్య: రైతుల నుంచే కట్ చేసి .. షావుకారి ఇస్తడు. శర్మన్: ఎంత కట్ చేస్తరు? వెంకటయ్య: పక్కాగా మాకు తెల్వదు.సేటును అడుగుతే తెలుస్తది. శర్మన్: రోజుకు ఎంత గిట్టుబాటు అవుతది? రాములు: సారు నాకు మాట్లాడనింకె రాదు. నేను వెంకటయ్య ఒక్కటే. ఆయననే చెప్తడు. వెంకటయ్య: మార్కెట్ వచ్చే బస్తాలను బట్టి ఉంటది. నిన్న 200రూపాయలు వచ్చినయి. శర్మన్: తక్కువ చెబుతున్నట్లు ఉన్నావ్? వెంకటయ్య: అట్లేం లేదు సారు. మార్కెట్ కు ధాన్యం బాగ వస్తే మాకు నాలుగు పైసలొస్తయి. మంచిగ నడిచిన నాడు వెయ్యి రూపాయ ల దాక వస్తయి. శర్మన్: హమాలీలకు వసతులు ఉన్నాయా? విశ్రాంతి గదితో పాటు ఇతర సౌకర్యాలు? వెంకటయ్య: ఉన్నాయి. శర్మన్: మీరు మార్కెట్లో ఏం చేస్తుంటారు? వెంకట్రావు: సారు మేం దడువాయి.. శర్మన్: తూకం చేసేవారు అన్నమాట... ఏమైనా తేడాలు చేస్తుంటారా? వెంకట్రావు: (నవ్వుతూ) అదేం లేదు సారు. మేం అట్ల చేయం. పక్కాగా ఉంటది. శర్మన్: ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? వెంక ట్రావు: మార్కెట్‌కు సరకు వస్తలేదు. అంతా బయట బయటనే మిల్లులకు పోతుంది. శర్మన్: మీరు కమీషన్ ఏజెంట్నా? ఎన్నాళ్ల నుంచి చేస్తున్నారు.. ఈ మార్కెట్లో? నారాయణ: నేను కమీషన్ ఏజెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఇదే మార్కెట్ల చేస్తున్నా. శర్మన్: గిట్టుబాటు అవుతుందా? నారాయణ: ఎక్కడ సార్.. మా పరిస్థితి కూడా రై తుల లాగనే. వ్యవసాయం రోజు రోజుకు చాన భారంగా మారింది. రైతులు మా వద్ద ముందు రూ.45వేలు తీసుకెళ్తే.. వాళ్లు తెచ్చిన ధాన్యం దానికే సరిపోతది. అవి తేరగానే మళ్లీ అప్పు చేస్తడు... శర్మన్: అప్పు అంటున్నరు... వడ్డీ ఎంత తీసుకుంటారు? నారాయణ: నూటికి రెండు రూపాయలు వేసుకుంటం. శర్మన్: అలా తీసుకోవడం తప్పు కదా, చట్ట ప్రకారం నేరం కూడా? నారాయణ: మమ్మల్ని ఏం చేయమంటరు సా ర్.. మేం కూడా బయట అప్పు తీసుకొస్తున్నాం. కదా? మేం తెచ్చిన పైసలువడ్డీలు కడుతున్నాం. శర్మన్: మీ విషయం పక్కన పెట్టండి. అలా చేయకూడదు. శర్మన్: ఏడీ గారు మీరు చెప్పండి.. రైతుకు గిట్టుబాటు ధర అందుతుందా? బాలామణి: ఎంఎస్పీ కంటే అధికంగానే వస్తోంది. హంస మద్దతు ధర 1360 ఉండగా.. 1400 పైగానే ధర వస్తోంది. సోనమసూరి రకం అత్యధికంగా రూ.1900 వరకు పోతుంది. శర్మన్: మార్కెట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? రైతులకు మధ్యాహ్నం బోజనం పెడుతున్నారా? బాలామణి: శుద్ధమైన తాగునీరు అందిస్తున్నాం. భోజనం మాత్రం లేదు సారు. ప్రభుత్వానికి ప్ర పోజల్స్ పంపించాం. ఇంకా ఆచరణలోకి రాలేదు. -
మాకే అమ్మాలె!
పరిగి: తాము పండించిన మక్కలు, ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతోంది. రైతులు పెట్టుబడుల కోసం తీసుకున్న అప్పులు.. వాళ్ల రాబడికి ఎసరు పెడుతున్నాయి. మార్కెట్లో కమీషన్ ఏజెంట్లు(అడ్తిదారులు)గా పనిచేస్తున్న వారే వడ్డీ వ్యాపారుల అవతారమెత్తి రైతులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలతో పోలిస్తే క్వింటాలుకు రూ.200 నుంచి రూ. 300 తక్కువైనా అడ్తాదారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ కారణంగా సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతు లు మద్దతు ధర దక్కే పరిస్థితి కన్పిం చడం లేదు. పరిగిలో మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన నాటి నుంచి అటు కొనుగోలు కేంద్రాలకు, ఇటు పరిగి వ్యవసాయ మార్కెట్లో అడ్తీదారుల వద్దకు వస్తున్న రైతు ఉత్పత్తులే ఇందుకు నిదర్శనం. మార్కెట్‌కు ఒక్కరోజే నాలుగు వేల క్వింటాళ్ల మక్కలు.. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు పరిగిలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి 15రోజులైంది. వేల కొలది ఖాళీ సంచులు సైతం అందుబాటులో ఉంచారు. ఐదారుగురు సిబ్బంది, కూలీలను కొనుగోలు కేంద్రం వద్ద ఉంచుతున్నారు. కానీ 15 రోజుల్లో కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చి విక్రయించిన మక్కలు కేవలం 500 క్వింటాళ్లు మాత్రమే. అదే గత శుక్రవారం ఒక్కరోజే ఆ పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్లో అడ్తీల వద్దకు 4వేల క్వింటాళ్ల మక్కలు వచ్చాయి. కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు రూ.1,310 చెల్లిస్తుండగా.. మార్కెట్లో రూ.1000 నుంచి రూ.1,150 మాత్రమే ఇస్తున్నారు. రైతులు క్వింటాలుకు రూ.200 నుంచి రూ.300 వరకు నష్టపోతున్నారు. ఇప్పటికే రైతులు ఇలా రూ.10 లక్షల వరకు నష్టపోయారు. అధికారికంగా మాత్రమే ఈ లెక్కులు. పరిగిలో జీరో మార్కెట్ నిర్వహిస్తున్నందున.. ఆ సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడమే కారణం రైతులు కొనుగోలు కేంద్రాలకు విక్రయించకుండా అడ్తీదారులకు విక్రయిస్తూ ప్రభుత్వ మద్దతు ధర పొందక పోవడానికి ఈ సారి బ్యాంకులు రుణాలివ్వకపోవటమే ప్రధాణ కారణంగా చెప్పవచ్చు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు అడ్తాదారుల వద్ద, ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్ల వద్ద అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో తప్పని పరిస్థితితో పండించిన పంటను అడ్తీదారుల వద్దకు తీసుకు వెళ్లి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. అప్పులు ఇచ్చిన అడ్తీదారులు, వ్యాపారులు పండించిన పంటను తమకే విక్రయించాలని ముందే కండీషన్ పెట్టడడంతోపాటు వందకు నెలకు రూ. మూడు.. అంతకంటే ఎక్కువ వడ్డీ కూడా వసూలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో సవాలక్ష నిబంధనలు.. మొక్కజొన్నలు, ధాన్యానికి మద్దతు ధరలు ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అనేక నిబంధనలు పెట్టింది. తేమశాతం మొక్కజొన్నలకు 14, ధాన్యానికి 17 ఉండాలనే నిబంధన ఉంది. ఏమాత్రం తేమశాతం ఎక్కువగా ఉన్నా కొనడం లేదు. బీ, సీ గ్రేడ్ మక్కులు సైతం కొనుగోలు చేస్తామని ప్రకటించినా వాటిని రెండో, మూడో గ్రేడ్లలోకి నెట్టేస్తున్నారు. ఒక వేళ తేమ శాతం నిర్దేశించిన విధంగా ఉండి కొనుగోలు చేసినా డబ్బులు 15 రోజుల తర్వాత చెల్లిస్తారు. ఒక్కోసారి నెలలు పడుతుంది. పండించిన ఉత్పత్తులు తమవేనని రెవెన్యూ అధికారులతో ధ్రువీకరించాలి. ఇవన్నీ దాటుకుని కొనుగోలు కేంద్రంలో విక్రయించినా.. డబ్బులు చెక్కురూపంలో ఇస్తారు. ఆ చెక్కును మార్చుకునేందుకు బ్యాంకులకు వెళితే అధికారులు పాత బకాయిల కింద జమచేసుకుంటారనే భయం. ఇవన్నీ రైతులకు మద్దతు ధరను దూరం చేయడంతోపాటు వ్యాపారుల ఉచ్చులో చిక్కుకునేలా చేస్తున్నాయి. -
ఉల్లి రైతుల కన్నీరు
రైతులను దగా చేస్తున్న కమీషన్ ఏజెంట్లు వ్యాపారుల మాయాజాలంతో ధర అంతంత మాత్రమే నష్టాలను మూటగట్టుకుంటున్న ఉల్లి రైతులు కర్నూలు(అగ్రికల్చర్): గిట్టుబాటు ధర రాక ఉల్లి రైతులు క న్నీరు పెట్టుకుంటున్నారు. ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఎకరాకు దాదాపు రూ.30 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. మామూలుగా అయితే 60 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది. అనావృష్టి వల్ల ప్రస్తుతం 25 నుంచి క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. దీనికితోడు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారుల మాయాజాలం వల్ల ధర పెరగకపోగా మరింత తగ్గుతోంది. దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. అనామత్తో నష్టాలు.. కర్నూలు మార్కెట్లో ఉల్లిని వేలంపాట ద్వారా కొనాల్సి ఉంది. అరుుతే వ్యాపారులు అనామత్ కొనుగోళ్లపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వేలంపాట ద్వారా ధర రూ.1000 ఆపైన లభిస్తే అనామత్పైన రూ.800 నుంచి రూ.900 ధరకే కొనుగోలుచేస్తున్నారు. దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. రైతులు కూడా రోజుల తరబడి మార్కెట్లో ఉండలేక ఏదో ఒక ధరకు అమ్ముకుని నష్టాలపాలవుతున్నారు. ఈ క్రమంలో స్థానిక రైతులు తాడేపల్లి గూడేనికి తరులుతున్నారు. ధరలో వ్యత్యాసం.. కర్నూలు మార్కెట్‌కు రోజుకు 50 లారీల ఉల్లి వస్తుంటే, తాడేపల్లి గూడెం మార్కెట్‌కు 60 లారీల ఉల్లి జిల్లా నుంచి వెళుతోంది. అక్కడ క్వింటాఉల్లికి రూ.1800 నుంచి రూ.2000 వరకు అత్యధిక ధర లభిస్తోంది. మధ్యస్తంగా రూ.1400 నుంచి రూ.1500 వరకు లభిస్తోంది. అదేకర్నూలులో అత్యధిక ధర రూ.1125 ఉండగా, మధ్యస్తంగా రూ.600 నుంచి రూ.800 వరకు పోతోంది. అదనపు చార్జీలతో మోసం రైతు 50 క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్‌కు వేస్తే క్లీనింగ్ పేరుతో రెండు క్వింటాళ్ల ఉల్లిని తీసేస్తున్నారు. పైగా కమీషన్ ఏజెంట్లు క్లీనింగ్ చార్జీలను కూడా రైతులపై వేస్తుండడంతో మరింత నష్టపోతున్నారు. తాడేపల్లి గూడెంలో ఉల్లికి క్లీనింగ్ లేదు. లారీల్లో ఉల్లిని తీసుకుపోతే అక్కడక్కడ నాలుగు ప్యాకెట్లు తీసి కింద పోసి వేలంపాట ద్వారా ధర నిర్ణయిస్తారు. ఇక్కడ మాత్రం మొత్తం క్లీన్ చేసిన తర్వాతే కొంటారు. ఇలా చేయడం వల్ల కోత, కుప్ప, క్లీనింగ్ చార్జీలు రైతులపై అదనంగా పడుతున్నాయి. అదేవిధంగా లోడింగ్, సంచులకు నింపి కాటాపై పెట్టేందుకు చార్జీలను వ్యాపారి భరించాలి. కమీషన్ ఏజెంట్లు మాత్రం ఇవి కూడా రైతుల నుంచి వసూలు చేస్తూ దగా చేస్తున్నారు. రైతులు తాము తెచ్చిన సరుకును అమ్ముకున్న తర్వాత కమీషన్ ఏజెంట్లు మార్కెట్ కమిటీ జారీ చేసిన తక్ పట్టీలు ఇవ్వాల్సి ఉంది. ఇందులో రైతు తెచ్చిన సరుకు, ఎన్ని క్వింటాళ్లు అమ్మారు, ధర ఎంత, కూలీ, హమాలీ చార్జీలన్నీ నమోదు చేసి ఇవ్వాలి. కానీ 50 శాతం కమీషన్ ఏజెంట్లు తక్ పట్టీలు ఇవ్వకుండా కాగితాలపై వివరాలు రాసి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే కమీషన్ ఏజెంట్లు జీరో వ్యాపారానికి పాల్పడుతూ ఇటు ప్రభుత్వానికి, అటు రైతులను మోసం చేస్తున్నారు. ఇటు వ్యాపారుల మాయాజాలం, అటు కమీషన్ ఏజెంట్ల దగా వల్ల ఉల్లి రైతులు నష్టాలపాలవుతున్నాడు. -
రైతన్నకే మద్దతు
శరత్: మీరంతా రైతులేనా? కమీషన్ ఏజెంట్లు కూడా ఉన్నారా? రైతులు: అంతా రైతులమే సార్. శరత్: మీ పేర్లు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? రైతులు: నాపేరు నర్సింహులు సార్... నా పేరు శేషారెడ్డి.. మాది యార్రారం, నా పేరు మానయ్య, మా ఊరు కంసానిపల్లి, నా పేరు జోగిరెడ్డి.. నాది కూడా రాంసానిపల్లి సారు, నా పేరు మాణిక్‌రెడ్డి..కంసానిపల్లి మాజీ సర్పంచ్‌ను సార్....నా పేరు సత్తయ్య, నా పేరు యాదయ్య సార్. శరత్: ఎందుకు దిగులు పడుతున్నారు ? మీకున్న సమస్యలేమిటీ? నర్సింహులు: సార్, మక్కలు గింతమంచిగున్నయ్( మొక్కజొన్నలు చూపిస్తూ) రేటు మాత్రం ఇస్తలేరు శరత్: ఏమైంది... నిబంధనల ప్రకారం ఇవ్వటం లేదా? తూకంలో మోసం చేస్తున్నారా? నర్సింహులు: ఏం పాడైందో.. ఏమో..! సారు, ఏందో గేడింగ్‌లు అంటున్నరు..ఇసువంటి గేడింగులు ఎప్పుడూ లేకుండే. శరత్: గ్రేడింగ్ గురించి మీకు తెలియదా? రైతులు : గ్రేడింగ్‌లు ఎప్పుడూ లేకుండే సార్( ముక్తకంఠంతో) శరత్ : ఏం జోగిరెడ్డి నీకు కూడా తెలియదా? జోగిరెడ్డ్డి: తెల్వదు సార్.. శరత్: చిన్నసైజు గింజలు ఉన్న మక్కలు వరూ కొనటం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. రైతు పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ గ్రేడింగ్ విధానం తెచ్చింది. పెద్ద సైజు గింజలుంటే ‘ఏ’ గ్రేడ్, మధ్యరకం గింజలు ‘బీ’ గ్రేడ్, చిన్న సైజు గింజలు ‘సీ’ గ్రేడ్ గా చేస్తున్నారు. ‘ఏ’గ్రేడ్‌కు రూ.1,310, ‘బీ’ గ్రేడ్‌కు రూ.1,230, సీ గ్రేడ్‌కు రూ.1,180 మద్దతు ధర చెల్లిస్తోంది. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి? మానయ్య: ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలతోనే పండించాం, కానీ పంట సరిగా పండలేదు సారూ శరత్: పంటకు తడి బాగా అందిందా? మానయ్య: వానలు ఎక్కడివి సారు, అప్పుడింత..ఇప్పుడింత కురిసిన జల్లుకు ఈ మాత్రం పండింది. విత్తనాలు కూడా మంచియిగానట్టున్నయి సారు. శరత్ : మీ పేరేమిటి? ఏదో సమస్యల్లో ఉన్నట్లున్నావు? రైతు : నా పేరు మాణిక్‌రెడ్డి సార్, ఇక్కడ హమాలీలకు డబ్బులు మేమే చెల్లించాల్సి వస్తోంది సార్? శరత్: కొనుగోళ్లు సక్రమంగా జరగటం లేదా? నర్సింహులు: వచ్చేటపుడు డబ్బులు తెచ్చుకోలేం కదా సార్? శరత్: ధాన్యంకు సంబంధించి డబ్బులు వచ్చాయా? సత్తయ్య: ఈరోజే వచ్చాయి సారు. శరత్: ధాన్యాన్ని ఇక్కడకు ఎప్పుడు తెచ్చావు. సత్తయ్య: గత నెల 31న కొన్ని, ఈ నెల 2న కొన్ని వడ్లు తెచ్చి కేంద్రంలో కాంటా పెట్టిన. ఇవ్వాళ్ల డబ్బులు వచ్చినాయి. శరత్: హమాలీకి ఎంత డబ్బు ఇచ్చావు. సత్తయ్య: రూ.600 వరకు ఇచ్చిన. శరత్: హమాలీ డబ్బులో సగం భాగం మహిళాగ్రూపు వారు చెల్లించుకోవాలి కదా..! అనంతరం జేసీ పక్కనే ఉన్న రైతు బక్కొళ్ల యాదయ్యతో మాట్లాడారు. శరత్: ఏం యాదయ్య...ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశావు. యాదయ్య: నాలుగు ఎకరాల్లో వేశాను సార్. శరత్: ఈ నాలుగు ఎకరాల్లో గత ఏడాది ఎంత దిగుబడి వచ్చింది. ఈ సారి ఎంత వచ్చింది. యాదయ్య: గత ఏడాది 70 క్వింటాళ్ల వరకు వచ్చాయి. ఈ సారి 25 క్వింటాళ్లే వచ్చినయి సారు. -
మిర్చియార్డులోకోల్డ్ వార్
36 మంది కమీషన్ ఏజెంట్లకు నోటీసులు మరో 100 మందిపై కొర్రీలు పెడుతూ నివేదికలు కాసుల కోసం అధికారుల కొత్త వలలు సమంజసం కాదని తెగేసి చెప్పిన ఏజెంట్ల సంఘం గుంటూరు మిర్చియార్డులో కమీషన్ ఏజెంట్లు, అధికారుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అదనపు ఆదాయం, అనధికార కాసుల కోసం అధికారులు వల విసరడం, నిబంధనల పేరిట తరచూ వేధింపులకు గురిచేయడం పలువురు కమీషన్ ఏజెంట్లకు తలనొప్పిగా మారింది. ఇటీవల యార్డు అధికారులు 36 మంది కమీషన్ ఏజెంట్లకు నోటీసులు జారీ చేయడం, వివరణ ఇచ్చిన తరువాత కూడా అధికారులు సరైన విధంగా స్పందించక పోవడం మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. తాజా వివాదానికి ఈ అంశమే కారణంగా కనిపిస్తోంది. సాక్షి, గుంటూరు మిర్చియార్డులో మొత్తం 582 మంది కమీషన్ ఏజెంట్లు లెసైన్సులు కలిగి ఉన్నారు. ఇందులో 193 మంది ఏజెంట్ల లై సెన్సుల కాలపరిమితి 2013 మార్చి 31తో ముగిసింది. వీరందరూ ఐదేళ్లకు ఒకేసారి లెసైన్సు ఫీజు చెల్లించి తమకున్న రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంది. అయితే కమీషన్ ఏజెంట్ల భాగస్వామ్య బదిలీల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం వీరి లెసైన్సుల రెన్యువల్స్‌ను నిలిపివేసింది. ఆ తరువాత కమీషన్ ఏజెంట్లు పెద్ద మొత్తంలో సొమ్మును పైఅధికారులకు ముట్టజెప్పినట్లు వినికిడి. నెలలు గడుస్తున్నా లెసైన్సుల రెన్యువల్ పనులు జరగకపోవడంతో లోలోపలే ఆయా కమీషన్ ఏజెంట్లు కుతకుతలాడుతున్నారు. సమయం వచ్చినపుడు అధికారుల్ని నిలదీయాలని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యార్డు అధికారులు మరో 36 మందికి ముందస్తు సమాచారం, హెచ్చరికలు లేకుండా నోటీసులు జారీ చేశారు. వ్యాపారం చేస్తున్న ప్లాట్లు రిజిస్టర్డ్ ప్లాట్లు కావనీ, అనధికార వ్యాపారాలు జరుపుతున్నారంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపైఆయా ఏజెంట్లు సరైన వివరణ ఇచ్చినా అధికారులు స్పందించలేదని సమాచారం. ఇదిలా ఉండగా అత్యవసరంగా కార్యాలయానికి వచ్చి సమాధానం చెప్పాలని సోమవారం ఫోన్ చేయడం కమీషన్ ఏజెంట్లకు ఇబ్బందికరంగా మారిందిఅంతేకాకుండా మరో 100 మంది ఏజెంట్ల లెసైన్సుల విషయంలోనూ కొర్రీలు పెడుతూ నివేదికలు తయారు చేయడం కూడా వీరికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఏజెంట్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కిలారు రోశయ్య, శివరామిరెడ్డితో పాటు ముఖ్యమైన మిర్చి ఏజెంట్లు కొందరు సోమవారం మధ్యాహ్నం యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి నరహరిని కలిసి తమ వాదన వినిపించారు. వివిధ కారణాలతో కమీషన్ ఏజెంట్లను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని తెగేసి చెప్పినట్లు సమాచారం. మరికొంత పిండేందుకేనా.. ఇదిలాఉండగా యార్డు అధికారులు, పాలక వర్గంలోని పలువురు సభ్యులు అదనపు ఆదాయం పైనే దృష్టి సారించారన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల కిందట కమీషన్ ఏజెంట్ల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు అందుకున్న కొందరు పైస్థాయి అధికారుల సహకారంతో మరోసారి వల విసిరేందుకు యార్డులోని అధికారులు, పాలకవర్గ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే సోమవారం కమీషన్ ఏజెంట్లను పిలిపించారని సమాచారం. -
పూల రైతులకు,కమిషన్ ఏజెంట్లకు మధ్య తీవ్ర వాగ్వాదం
-
పదండి తోసుకు
సాక్షి, కర్నూలు: సెలవు రోజుల్లోనూ ఉద్యమ తీవ్రత తగ్గకపోవడం ప్రజల్లో సమైక్య ఆకాంక్షకు అద్దం పడుతోంది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు కదంతొక్కారు. కర్నూలులోని ఎ.క్యాంప్ అపార్ట్మెంట్, కాలనీకి చెందిన సుమారు 2వేల మంది భారీ ర్యాలీ నిర్వహించి, ప్రధాన కూడళ్లలో మానవహారంగా ఏర్పడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినదించారు. తడకనపల్లె స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సర్పంచ్ గంగుల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనం చేశారు. మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల, కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు, కార్మికులు భారీ ర్యాలీ చేపట్టి వంటావార్పు నిర్వహించారు. కల్లూరు రైతు సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై గేదెలతో నిరసన తెలిపారు. వెల్దుర్తిలో దాదాపు 10వేల మందితో సమైక్య సింహగర్జన చేపట్టారు. ఆదోనిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకు పెకైక్కి నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డు జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నడిచారు. ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. రుద్రవరంలో మండల వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీపక్ష చేపట్టారు. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్ష కొనసాగుతోంది. పట్టణ కన్వీనర్ ఇస్కాల రమేష్ ఆధ్వర్యంలో పలువురు దీక్షలో కూర్చొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమైక్యవాదులు వివిధ రాజకీయ నేతల చిత్రపటాలతో కూడిన కుండలతో ర్యాలీ నిర్వహించి అనంతరం పగులగొట్టి నిరసన తెలి పారు. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో వీఆర్వో కె.మహబూబ్‌బాషా, ఆవాజ్ కమిటీ సభ్యులు చేపట్టిన నిరాహార దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. వెలుగోడులో జేఏసీ ఆధ్వర్యంలో మోతుకూరు గ్రామస్తులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు.