కందులు @ రూ.5100
తాండూరు: కందుల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. కందులకు అధిక ధర పలుకుతుండడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,350 ఉండగా మార్కెట్‌లో రూ.5,100 పలుకుతోంది. క్వింటా కందులకు అదనంగా రూ.750 ధర లభిస్తున్నది. కందులకు డిమాండ్ ఉండటంతోనే అధిక ధర రావడానికి కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఎర్ర, తెల్ల, నల్ల కందుల కొనుగోళ్లతో కళకళలాడుతున్నది.
బుధవారం యార్డులో ఎర్ర కందులకు గరిష్టంగా రూ.5,230, కనిష్టంగా రూ.5వేలు, సగటు ధర రూ.5,100 ధర పలికింది. సగటు ధర ప్రకారం రూ.79.56లక్షల విలువ చేసే 1560 క్వింటాళ్ల ఎర్ర కందులను యార్డులో వివిధ గ్రామాల రైతుల నుంచి కమీషన్ ఏజెంట్‌లు కొనుగోలు చేశారు. నల్ల కందులు క్వింటాలుకు రూ.4,925, రూ.4,900, రూ.4,920 ధర పలికింది. సగటు లెక్కన రూ.2,95,200 విలువచేసే 60 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి.
తెల్లకందులు క్వింటాలుకు రూ.5,211 -రూ.5,200 ధర వచ్చింది. కనిష్ట ధర చొప్పున రూ.2.86లక్షల విలువ చేసే 55 క్వింటాళ్లను కమీషన్ ఏజెంట్‌లు కొనుగోలు చేశారు. మొత్తం యార్డులో రూ.85,37,200 విలువచేసే 1,675 క్వింటాళ్ల కందుల వ్యాపార లావాదేవీలు జరిగాయి. కొనుగోలు చేసిన కందులను కమీషన్ ఏజెంట్‌లు మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రవాణా చేస్తున్నారు.
వరికి లభించని ‘మద్దతు’
మార్కెట్ యార్డులో సాధారణ రకం వరిధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర లభించడం లేదు. దాంతో రైతులు నష్టపోతున్నారు. సాధారణ రకం వరి ధాన్యానికి ప్రభుత్వ కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.1,360 ఉంది. బుధవారం యార్డులో క్వింటాలు ధాన్యానికి గరిష్టంగా రూ.1,250, కనిష్టంగా రూ.1,220, సగటు ధర రూ.1,240 పలికింది. సగటు ధర ప్రకారం చూసినా వరి రైతులకు మద్దతు ధర లభించలేదు. క్వింటాలుకు సుమారు రూ.120 చొప్పున రైతులు నష్టపోయారు. సగటు ధర లెక్కన రూ.3,22,400 విలువ చేసే 260 క్వింటాళ్ల వరిధాన్యాన్ని కమీషన్ ఏజెంట్‌లు కొనుగోలు చేశారు.