kandulu
-
కంది రైతుకు ‘మద్దతు’కు మించి ధర
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా కందులు కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అదీ.. మద్దతు ధరకు మించి.. మార్కెట్ రేటుతో సమానంగా చెల్లిస్తోంది. దీంతో కంది రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యాన ఈ సీజన్లో దాదాపు 20వేల టన్నుల కందులు సేకరించనుంది. ఇప్పటికే అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభించింది.కేంద్రం క్వింటా కందుల మద్దతు ధర రూ.7 వేలుగా ప్రకటించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మార్కెట్లో ఉన్న రేటుకే రూ. 9,500 నుంచి రూ.10 వేలు చెల్లించి కొంటోంది. రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. రైతుకు ఈ ఖర్చులూ మిగులు ఇప్పటివరకు రైతులు కందులను మార్కెట్‌కు తీసుకువెళ్లి విక్రయించాల్సి వచ్చేది. ఇందుకోసం గోనె సంచులు, హమాలీలు, రవాణాకు (జీఎల్టీ) పెద్ద మొత్తంలో రైతుకు ఖర్చయ్యేది. రైతుకు ఈ బాధలన్నీ తప్పిస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే గ్రామాల్లోనే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తోంది. గోనె సంచులు, రవాణా, హమాలీ సౌకర్యాలను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. దీంతో రైతుకు వ్యయప్రయాసలు తగ్గిపోయాయి. ఒకవేళ రైతులే సొంతంగా జీఎల్టీని సమకూర్చుకుంటే టన్నుకు రూ.746 అదనంగా వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. పొలం నుంచి పీడీఎస్‌లోకి ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు రూ.140కిపైగా ఉంది. పౌర సరఫరాల శాఖ రేషన్ లబ్దిదారులకు సబ్సిడీపై కిలో రూ.67కే అందిస్తోంది. కిలో రూ.170కిపైగా ఉన్నప్పుడు కూడా ఇదే ధరకు ఇచ్ఛింది. ఇటీవల మార్కెట్లో కందిపప్పుకు డిమాండ్ పెరగడంతో భారీగా వెచ్చించి కొనాల్సిన పరిస్థితి. జాతీయ స్థాయి నోడల్ ఏజెన్సీ అయిన హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) వద్ద కూడా నిల్వలు లేకపోవడంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నేరుగా రైతుల నుంచే కొని, ప్రాసెసింగ్, మిల్లింగ్ చేసి రేషన్ లబ్దిదారులకు ఇచ్చేందుకు పౌరసరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 2,500 టన్నులు కందులు సేకరించింది. ఇందులో 600 టన్నులకు పైగా కందిపప్పును ప్రాసెసింగ్, మిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేస్తోంది. ఊర్లోనే కొన్నారు.. మూడు రోజుల్లో డబ్బు జమ చేశారు నా పేరు చేజాల పెద్దరాజు. అనంతపురం జిల్లా ఉరవకొండ. కొంత సొంత భూమి, మరికొంత కౌలుకు తీసుకుని 27 ఎకరాల్లో కంది సాగు చేశాను. గతంలో పంట కోత పూర్తయిన తర్వాత బళ్లారి, రాయచూర్ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేవాళ్లం. ఈ మార్కెట్లు మా ప్రాంతం నుంచి 50 నుంచి 120 కిలో మీటర్లకు పైగా దూరం ఉండటంతో రవాణాకు ఎక్కువ ఖర్చయ్యేది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వమే మా ఊర్లో ఆర్బీకేలో కొనుగోలు కేంద్రం పెట్టింది. క్వింటాకు రూ.9,370 చొప్పున చెల్లించింది. సుమారు 80 క్వింటాళ్లు విక్రయించా. మూడు రోజుల్లోనే నాకు రూ.7 లక్షలకుపైగా నగదు జమైంది. ప్రభుత్వమే రవాణా, గోనె సంచులు సమకూర్చింది. ఒకప్పుడు మేము ఎంతో కష్టపడి మార్కెట్ వరకు తీసుకెళ్తే వచ్చే ధర ఇప్పుడు అధికారులు మా దగ్గరకే వచ్చి మరీ కొని, డబ్బులు జమ చేయడం సంతోషంగా ఉంది. నిరంతరం సరఫరా చేసేలా ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి మద్దతు ధరకు మించి ధర ఇచ్చి కందులు కొనడం ఇదే ప్రథమం. దీనివ్లల రైతుకు, రేషన్ లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. స్థానికంగా పండించిన పంటను స్థానిక అవసరాలకు వినియోగిస్తే సమయం, అదనపు భారం తగ్గుతాయి. బయట మార్కెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. నిరంతరాయంగా వినియోగదారులకు పంపిణీ చేయొచ్చు. – హెచ్.అరుణ్‌కుమార్, ఎక్స్అఫీషియో సెక్రటరీ, ఏపీ పౌరసరఫరాల శాఖ మార్కెట్ రేటు ప్రకారమే.. ఈ సీజన్లో 20వేల టన్నులకు పైగా కందుల సేకరణపై దృష్టిపెట్టాం. పంట దిగుబడి ఎక్కువగా వచ్చే ప్రకాశం, పల్నాడు ప్రాంతాల్లో కొనుగోళ్లు వేగంగా ఉన్నాయి. ఈ–క్రాప్ ప్రామాణికంగా వాస్తవ రైతులకు మార్కెట్ రేటు ప్రకారం ధర ఇస్తున్నాం. జీఎల్టీ సైతం వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. – జి.వీరపాండియన్, ఎండీ, ఏపీ పౌరసరఫరాల సంస్థ -
అంతా గప్‌చుప్..!
జనగామ: జనగామ మార్క్‌ఫెడ్ కేంద్రంగా కందుల అక్రమ వ్యాపారానికి అడ్డుకట్టవేయలేక పోతున్నారు. ప్రైవేట్ కొనుగోళ్లపై నిఘా వేయాల్సిన మార్క్‌ఫెడ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత కూడా కందులను తూకం వేస్తూ రాచమార్గాన గోదాముల్లోకి తరలిస్తున్నారు. పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు కన్నం పెడుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనగామ వ్యవసాయ మార్కెట్లో ప్రైవేట్‌గా కందులను కొనుగోలు చేస్తూ, మద్దతు ధరకు విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. జేసీ హెచ్చరికలు బేఖాతర్.. ప్రైవేట్‌గా కందుల కొనుగోలు కోసం వ్యాపారులు జనగామ మార్క్‌ఫెడ్ కేంద్రాన్ని అడ్డా చేసుకున్నారు. జనగామ, బచ్చన్నపేట, దేవరుప్పుల, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘణపురం, పాలకుర్తి మండలాలతోపాటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మోత్కూరు, ఆలేరు, తిరుమలగిరి తదితర ప్రాంతాల నుంచి దళారులు పెద్ద ఎత్తున కందులను ఇక్కడకు తరలిస్తున్నారు. కందుల అక్రమ దందాపై ‘సాక్షి’ అనేక వార్తా కథనాలను ప్రముఖంగా ప్రచురించడంతో మంత్రి హరీష్‌రావుతోపాటు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో వారు మాట్లాడిన ప్రతిసారి జనగామ పేరును ప్రస్తావించారు. కందుల అమ్మకాల్లో గోల్మాల్ చేసిన అధికారులతోపాటు విక్రయించిన వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చ రించారు. అయితే మంత్రి ఆదేశాలతో వారం రోజుల క్రితం జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి మార్క్‌ఫెడ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బినామీ కందులను విక్రయిస్తుంటే పట్టుకున్నారు. అప్పటి వరకు మార్క్‌ఫెడ్ అధికారులు గుర్తించక పోవడం సిగ్గుచేటు. జేసీ హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ రైతుల పేరుతో కొంతమంది వ్యాపారులు, బ్రోకర్లు కందుల అమ్మకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. శ్రీనివాస ట్రేడర్స్ కందుల సంగతి తేలేది నేడే జనగామ మార్కెటింగ్ శాఖ అధికారుల ఆధీనంలో ఉన్న శ్రీనివాస ట్రేడర్స్ కందుల సంగతి సోమవారం తేలనుంది. కొద్ది రోజుల క్రితం మార్కెట్ ఆవరణలో శ్రీనివాస ట్రేడర్స్‌కు చెందిన కందులను తూకం వేస్తుండగా మార్కెటింగ్ డీఎం ఎన్.సంతోష్, సివిల్ సప్లయ్, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ప్రైవేట్‌గా ఎక్స్‌పోర్టు చేసే క్రమంలో ట్రేడర్లు 60 కిలోలు, ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం 51 కిలోలు తూకం వేస్తున్నాయి. శ్రీనివాస టేడర్స్‌కు సంబంధించిన గోదాంలో 51 కిలోల 180 బస్తాలను కాంటా వేస్తుండడంతో అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కందులకు సంబంధించి సదరు వ్యాపారి రికార్డులను చూపించగా..విచారణ సోమవారానికి వాయిదా వేశారు. అధికారులు తనిఖీలు చేస్తున్న సందర్భంగా ట్రేడర్లతోపాటు కొంతమంది అడ్తి వ్యాపారులు అక్కడికి చేరుకున్నారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. నిజంగా అక్రమ కందులే మార్క్‌ఫెడ్‌కు తరలించేందుకే 51 కిలోల కాంటా వేస్తున్నారు. ఖాళీ గన్నీ బ్యాగులను కూడా అక్కడి నుంచే తీసుకువచ్చారంటూ అధికారుల ముందే ఆరోపణలు చేశారు. ప్రతిరోజు కందుల అక్రమ వ్యాపారం జోరుగా సాగుతున్నా పట్టించుకోవడం లేదంటూ సదరు అడ్తి వ్యాపారి బహిరంగంగా విమర్శించినా ఎవరూ కూడా అడ్డుచెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కందుల విక్రయాలపై విచారణ ఎక్కడ? మార్క్‌ఫెడ్‌లో జనవరి 2 నుంచి కొనుగోలు చేసిన కందులపై విచారణ పక్కదారి పట్టింది. కందులు అమ్మకాలు చేసిన అసలు రైతులు.. బినామీదారులు ఎంతమంది అనే విషయాన్ని తెలుసుకునేందు జేసీ పదిహేను రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేశారు. జేసీ ఆదేశాలను సైతం మార్క్‌ఫెడ్ అధికారులు లెక్కచేయడం లేదనే ప్రచారం జరుగుతుంది. వీఆర్వో ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే క్రమంలో నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నారనే సందేహాలు కలుగక మానదు. విషయమై మార్కెట్ డీఎం ఎన్.సంతోష్ మాట్లాడుతూ శ్రీనివాస ట్రేడర్స్‌కు చెందిన కందులకు సంబంధించి సోమవారం విచారణ చేస్తామన్నారు. మార్కెట్లో కందుల అమ్మకాలపై గట్టి నిఘా వేస్తున్నమని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఎందుకు బిగించడం లేదు వ్యవసాయ మార్కెట్లో అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గతంలోనే సర్కారు ఆదేశాలు జారీ చేసింది. జనగామ మార్కెట్లో మాత్రం సీసీ కెమరాల ఏర్పాటు విషయంలో జాప్యం ఎందుకు చేస్తున్నారనే విషయమై చర్చ జరుగుతోంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే మార్క్‌ఫెడ్‌కు కందులు ఎవరెవరుతీసుకు వస్తున్నారనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది -
కందులు @ రూ.5100
తాండూరు: కందుల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. కందులకు అధిక ధర పలుకుతుండడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,350 ఉండగా మార్కెట్లో రూ.5,100 పలుకుతోంది. క్వింటా కందులకు అదనంగా రూ.750 ధర లభిస్తున్నది. కందులకు డిమాండ్ ఉండటంతోనే అధిక ధర రావడానికి కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఎర్ర, తెల్ల, నల్ల కందుల కొనుగోళ్లతో కళకళలాడుతున్నది. బుధవారం యార్డులో ఎర్ర కందులకు గరిష్టంగా రూ.5,230, కనిష్టంగా రూ.5వేలు, సగటు ధర రూ.5,100 ధర పలికింది. సగటు ధర ప్రకారం రూ.79.56లక్షల విలువ చేసే 1560 క్వింటాళ్ల ఎర్ర కందులను యార్డులో వివిధ గ్రామాల రైతుల నుంచి కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. నల్ల కందులు క్వింటాలుకు రూ.4,925, రూ.4,900, రూ.4,920 ధర పలికింది. సగటు లెక్కన రూ.2,95,200 విలువచేసే 60 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. తెల్లకందులు క్వింటాలుకు రూ.5,211 -రూ.5,200 ధర వచ్చింది. కనిష్ట ధర చొప్పున రూ.2.86లక్షల విలువ చేసే 55 క్వింటాళ్లను కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. మొత్తం యార్డులో రూ.85,37,200 విలువచేసే 1,675 క్వింటాళ్ల కందుల వ్యాపార లావాదేవీలు జరిగాయి. కొనుగోలు చేసిన కందులను కమీషన్ ఏజెంట్లు మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రవాణా చేస్తున్నారు. వరికి లభించని ‘మద్దతు’ మార్కెట్ యార్డులో సాధారణ రకం వరిధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర లభించడం లేదు. దాంతో రైతులు నష్టపోతున్నారు. సాధారణ రకం వరి ధాన్యానికి ప్రభుత్వ కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.1,360 ఉంది. బుధవారం యార్డులో క్వింటాలు ధాన్యానికి గరిష్టంగా రూ.1,250, కనిష్టంగా రూ.1,220, సగటు ధర రూ.1,240 పలికింది. సగటు ధర ప్రకారం చూసినా వరి రైతులకు మద్దతు ధర లభించలేదు. క్వింటాలుకు సుమారు రూ.120 చొప్పున రైతులు నష్టపోయారు. సగటు ధర లెక్కన రూ.3,22,400 విలువ చేసే 260 క్వింటాళ్ల వరిధాన్యాన్ని కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు.