రాష్ట్ర చరిత్రలో నేరుగా రైతుల నుంచి సేకరిస్తున్న ప్రభుత్వం
మార్కెట్ రేటు ప్రకారం రైతుల నుంచి కొనుగోలు
క్వింటా మద్దతు ధర రూ.7,000
రాష్ట్ర ప్రభుత్వం రూ.9500 నుంచి రూ.10,000 వరకు చెల్లింపు
గ్రామాల్లోని ఆర్బీకేల్లోనే కొనుగోలు
శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూలు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొనుగోలు
20 వేల టన్నులకుపైగా కందుల సేకరణకు సమాయత్తం
వీటిని మిల్లింగ్ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థలోకి
ప్రతినెలా వినియోగదారులకు కందిపప్పు సరఫరా
గతంలో రేటు ఎంత ఉన్నా సబ్సిడీపై కిలో రూ.67కే అందించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా కందులు కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అదీ.. మద్దతు ధరకు మించి.. మార్కెట్ రేటుతో సమానంగా చెల్లిస్తోంది. దీంతో కంది రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యాన ఈ సీజన్‌లో దాదాపు 20వేల టన్నుల కందులు సేకరించనుంది. ఇప్పటికే అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభించింది.కేంద్రం క్వింటా కందుల మద్దతు ధర రూ.7 వేలుగా ప్రకటించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మార్కెట్‌లో ఉన్న రేటుకే రూ. 9,500 నుంచి రూ.10 వేలు చెల్లించి కొంటోంది. రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది.
రైతుకు ఈ ఖర్చులూ మిగులు
ఇప్పటివరకు రైతులు కందులను మార్కెట్‌కు తీసుకువెళ్లి విక్రయించాల్సి వచ్చేది. ఇందుకోసం గోనె సంచులు, హమాలీలు, రవాణాకు (జీఎల్‌టీ) పెద్ద మొత్తంలో రైతుకు ఖర్చయ్యేది. రైతుకు ఈ బాధలన్నీ తప్పిస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే గ్రామాల్లోనే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తోంది. గోనె సంచులు, రవాణా, హమాలీ సౌకర్యాలను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. దీంతో రైతుకు వ్యయప్రయాసలు తగ్గిపోయాయి. ఒకవేళ రైతులే సొంతంగా జీఎల్‌టీని సమకూర్చుకుంటే టన్నుకు రూ.746 అదనంగా వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.
పొలం నుంచి పీడీఎస్‌లోకి
ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.140కిపైగా ఉంది. పౌర సరఫరాల శాఖ రేషన్ లబ్దిదారులకు సబ్సిడీపై కిలో రూ.67కే అందిస్తోంది. కిలో రూ.170కిపైగా ఉన్నప్పుడు కూడా ఇదే ధరకు ఇచ్ఛింది. ఇటీవల మార్కెట్‌లో కందిపప్పుకు డిమాండ్ పెరగడంతో భారీగా వెచ్చించి కొనాల్సిన పరిస్థితి.
జాతీయ స్థాయి నోడల్ ఏజెన్సీ అయిన హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) వద్ద కూడా నిల్వలు లేకపోవడంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నేరుగా రైతుల నుంచే కొని, ప్రాసెసింగ్, మిల్లింగ్ చేసి రేషన్ లబ్దిదారులకు ఇచ్చేందుకు పౌరసరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 2,500 టన్నులు కందులు సేకరించింది. ఇందులో 600 టన్నులకు పైగా కందిపప్పును ప్రాసెసింగ్, మిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేస్తోంది.
ఊర్లోనే కొన్నారు.. మూడు రోజుల్లో డబ్బు జమ చేశారు
నా పేరు చేజాల పెద్దరాజు. అనంతపురం జిల్లా ఉరవకొండ. కొంత సొంత భూమి, మరికొంత కౌలుకు తీసుకుని 27 ఎకరాల్లో కంది సాగు చేశాను. గతంలో పంట కోత పూర్తయిన తర్వాత బళ్లారి, రాయచూర్ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేవాళ్లం. ఈ మార్కెట్లు మా ప్రాంతం నుంచి 50 నుంచి 120 కిలో మీటర్లకు పైగా దూరం ఉండటంతో రవాణాకు ఎక్కువ ఖర్చయ్యేది.
ఈసారి రాష్ట్ర ప్రభుత్వమే మా ఊర్లో ఆర్బీకేలో కొనుగోలు కేంద్రం పెట్టింది. క్వింటాకు రూ.9,370 చొప్పున చెల్లించింది. సుమారు 80 క్వింటాళ్లు విక్రయించా. మూడు రోజుల్లోనే నాకు రూ.7 లక్షలకుపైగా నగదు జమైంది. ప్రభుత్వమే రవాణా, గోనె సంచులు సమకూర్చింది. ఒకప్పుడు మేము ఎంతో కష్టపడి మార్కెట్ వరకు తీసుకెళ్తే వచ్చే ధర ఇప్పుడు అధికారులు మా దగ్గరకే వచ్చి మరీ కొని, డబ్బులు జమ చేయడం సంతోషంగా ఉంది.
నిరంతరం సరఫరా చేసేలా
ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి మద్దతు ధరకు మించి ధర ఇచ్చి కందులు కొనడం ఇదే ప్రథమం. దీనివ్లల రైతుకు, రేషన్ లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. స్థానికంగా పండించిన పంటను స్థానిక అవసరాలకు వినియోగిస్తే సమయం, అదనపు భారం తగ్గుతాయి. బయట మార్కెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. నిరంతరాయంగా వినియోగదారులకు పంపిణీ చేయొచ్చు. – హెచ్.అరుణ్‌కుమార్, ఎక్స్‌అఫీషియో సెక్రటరీ, ఏపీ పౌరసరఫరాల శాఖ
మార్కెట్ రేటు ప్రకారమే..
ఈ సీజన్‌లో 20వేల టన్నులకు పైగా కందుల సేకరణపై దృష్టిపెట్టాం. పంట దిగుబడి ఎక్కువగా వచ్చే ప్రకాశం, పల్నాడు ప్రాంతాల్లో కొనుగోళ్లు వేగంగా ఉన్నాయి. ఈ–క్రాప్ ప్రామాణికంగా వాస్తవ రైతులకు మార్కెట్ రేటు ప్రకారం ధర ఇస్తున్నాం. జీఎల్టీ సైతం వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. – జి.వీరపాండియన్, ఎండీ, ఏపీ పౌరసరఫరాల సంస్థ
Comments
Please login to add a commentAdd a comment