AP: వలంటీర్లకు ప్రతినెలా అదనంగా రూ.750 | Additional Rs 750 per month for volunteers | Sakshi
Sakshi News home page

AP: వలంటీర్లకు ప్రతినెలా అదనంగా రూ.750

Published Sat, Dec 30 2023 4:50 AM | Last Updated on Sat, Dec 30 2023 5:23 PM

Additional Rs 750 per month for volunteers - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5,000కు అదనంగా మరో రూ.750ను ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నందుకు ఈ ప్రోత్సాహ­కాన్ని అందజేయనున్నట్టు తెలిపింది. ప్రతి నెలా రూ.750 మొత్తాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా వేరేగా వలంటీర్లకు అందిస్తామని వెల్లడించింది.

ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌­కుమార్‌ కొద్ది రోజుల క్రితం గ్రామ, వార్డు సచివా­ల­యాల శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్‌ టీఎస్‌ చేతన్‌ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు జాయింట్‌ కలెక్టర్లు, జిల్లాల గ్రామ, వార్డు సచివా­లయాల శాఖ ఇన్‌చార్జిలు, మున్సిపల్‌ కమిషనర్లు, డీఎల్‌డీవోలు, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 13న సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకుఇంటింటికీ æరేషన్‌ పంపిణీలో వలంటీర్లను మరింత భాగస్వాములను చేయనున్నారు. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ వలంటీర్లకు కొన్ని ప్రత్యేక విధులను నిర్ధారించింది. వీటిని కూడా రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు తెలియజేశారు. కాగా వలంటీర్లకు రూ.750 అదనపు ప్రోత్సాహకాన్ని ఎప్పటి నుంచో వర్తింపజేస్తామో వేరేగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది.

ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో వలంటీర్లకు ప్రత్యేక విధులు..
వలంటీర్లు తమ క్లస్టర్‌ (గ్రామీణ ప్రాంతాల్లో 50 ఇళ్ల పరిధి, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్ల పరిధి)లో ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో పూర్తి అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ప్రతినెలా ప్రభుత్వం అందజేసే రేషన్‌ సరుకులను తీసుకునేలా విస్తృత ప్రచారం చేయాలి. రేషన్‌ వాహనాలు ఇంటింటికీ పంపిణీకి వచ్చే సమయాన్ని ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు తెలియజేయాలి.

పంపిణీ జరిగే సమయంలో వలంటీర్లు కూడా ఉండాలి. రేషన్‌ సరుకులు తీసుకునే క్రమంలో లబ్ధిదారులు వేలిముద్రలు వేయడం తదితర అంశాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అక్కడికక్కడే వాటి పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. తమ పరిధిలో రేషన్‌ పంపిణీలో ఏవైనా లోపాలు, అవకతవకలు జరిగినట్టు గుర్తిస్తే.. ఆ వివరాలను వెంటనే సంబంధిత వీఆర్‌వో లేదా డిప్యూటీ తహసీల్దార్‌లకు తెలియజేయాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement