ration distribution
-
ఉచితాలతో ఇంకెంతకాలం?
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి సమయం నుంచి వలస కార్మికులకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఉచితాలను ఇంకా ఎంతకాలం ఇస్తారంటూ ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఉద్యోగావకాశాల కల్పన, సామర్థ్యాల పెంపుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81 కోట్ల మందికి ఉచిత/సబ్సిడీ రేషన్ అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలపగా..దీనర్థం పన్ను చెల్లింపుదార్లను మాత్రమే మినహాయించారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న అవస్థలపై సుమోటోగా దాఖలైన పిటిషన్‌పై ఎన్జీవో తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. ఇ–శ్రమ్ పోర్టల్ నమోదైన వలస కార్మికులందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. ‘వలస కార్మికులందరికీ ఉచితంగా రేషనివ్వాలని రాష్ట్రాలను మేం ఆదేశిస్తే ఒక్కరు కూడా ఇక్కడ కనిపించరు. ఉచిత రేషన్ బాధ్యత ఎలాగూ కేంద్రానిదే కాబట్టి, రాష్ట్రాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డులను జారీ చేస్తాయి. అసలు సమస్య ఇదే’అని ధర్మాసనం పేర్కొంది. వలస కార్మికుల సమస్యలపై సవివర విచారణ జరపాల్సి ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీన వాయిదా వేసింది. -
ఇంటింటికీ రేషన్ మూర్ఖపు నిర్ణయం
సాక్షి, అమరావతి: ఇంటింటికీ రేషన్ పంపిణీ మూర్ఖపు నిర్ణయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ పంపిణీ చేసే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) వల్ల పౌర సరఫరాల సంస్థకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ఆయన గురువారం విజయవాడలోని పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పౌర సరఫరాల సంస్థకు రూ.1,500 కోట్లు నష్టం కలిగేలా 9,260 ఎండీయూ వాహనాలు కొన్నారని, ప్రతి నెలా ఒక్కో వాహనానికి రూ.27 వేలు వెచ్చిస్తున్నామని, ఇంతకన్నా అన్యాయం ఉండదని చెప్పారు. 2027 వరకు వీటితో కాంట్రాక్టు కుదుర్చుకొని కార్పొరేషన్‌కు నష్టం కలిగించేలా మూర్ఖమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. రేషన్ డోర్ డెలివరీపై త్వరలో స్టేక్ హోల్డర్లతో విస్తృతంగా చర్చించి, నివేదిక రూపొందిస్తామని, కేబినెట్లోనూ చర్చిస్తామని చెప్పారు. పౌర సరఫరాల సంస్థను రూ.36,300 కోట్ల అప్పుల పాలు చేశారన్నారు. రూ. 2 వేల కోట్ల బకాయిలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇటీవలే చెల్లించామన్నారు. బియ్యం స్థానంలో నగదు పంపిణీపై విలేకరులు ప్రశ్నించగా.. ప్రభుత్వంలో అనేక ఆలోచనలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ సూచనలతో ఉమ్మడి ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని ఓ మాజీ ఎమ్మెల్యే కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. -
గిరిజనులకు ఇంటి వద్ద రేషన్ పంపిణీ నిలిపివేత
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ఇకపై ఇంటి వద్దకు రేషన్ సరకులు రావు. గిరిజనులు రేషన్ షాపులకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ విషయం వెల్లడించారు. మంత్రి మంగళవారం గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తామని, ఇకపై రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్ అందించే మొబైల్ డిస్పెన్సరీ వాహనాలు (ఎండీయూ) వల్ల సమస్యలు ఉన్నాయన్నారు.అందువల్ల గిరిజనుల సౌలభ్యం కోసం ఏజెన్సీలోని 962 రేషన్ డిపోల ద్వారానే సరుకులు అందిస్తామని చెప్పారు. అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీ అవుట్లెట్లను పెద్ద ఎత్తున విస్తరించి, డిమాండ్‌ను మరింతగా పెంచుతామన్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అందించే తేనె, ఇతర ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి పెడతామని చెప్పారు. జీసీసీ పరిధిలోని 16 పెట్రోల్ బంకులు, 18 గ్యాస్ డిపోలు, 12 సూపర్ మార్కెట్ల ద్వారా మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు వస్తున్నాయని, వాటిలో 2 వేలకుపైగా పోస్టులు గిరిజన ప్రాంతాల్లో భర్తీ అవుతాయని చెప్పారు. దీంతో గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుందన్నారు. గిరిజన పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం 554 ఏఎన్ఎంలను డిప్యుటేషన్‌పై నియమిస్తున్నట్టు తెలిపారు. గిరిజన వసతి గృహాల్లో స్డడీ అవర్స్ పెడతామన్నారు. గిరిజన విద్యాలయాల్లో బాలికల రక్షణ కోసం ఫిర్యాదుల బాక్స్ పెడతామన్నారు. ఫిర్యాదు చేసిన విద్యారి్థని పేరు గోప్యంగా ఉంచుతామని, వేరే ప్రాంత అధికారులతో విచారణ చేయిస్తామని చెప్పారు. గిరి శిఖర గ్రామాల ప్రజలకు తక్షణ వైద్య సేవల కోసం ఫీడర్ అంబులెన్స్‌లు, ప్రసవం అనంతరం సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. వంద రోజుల్లో గంజాయికి చెక్ పెట్టేందుకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు. -
Enforcement Directorate: టీఎంసీ నేత కోసం లుకౌట్ నోటీస్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు చెందిన టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఆచూకీ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)శనివారం లుకౌట్ నోటీస్ జారీ చేసింది. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖలిలో షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు జరుపుతున్న ఈడీ బృందంపై అతడి అనుచరులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఘటనలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి జాడ తెలియకుండా పోయిన షాజహాన్ షేక్ బహుశా దేశం విడిచి వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. అతడి గురించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చినట్లు ఈడీ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు. -
బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి
కోల్‌కతా: పశి్చమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతుదారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఘటనలో అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పరిణామంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశాయి. అరాచకానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గవర్నర్ సీవీ ఆనంద బోస్ పేర్కొన్నారు. రేషన్ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఈడీ అధికారులు సందేశ్‌ఖలిలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న షాజహాన్ మద్దతుదారులు రెచి్చపోయి ఈడీ అధికారులపై దాడికి తెగబడ్డారు. దాడిలో అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. షాజహాన్ అనుచరులు అధికారుల వాహనాల్నీ వదల్లేదు. వాటిని ధ్వంసం చేశారు. రక్షణగా వచి్చన కేంద్ర పారా మిలటరీ బలగాలపైనా దాడికి దిగారు. సోదాలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బందిపైనా దాడి చేశారు. వారి వాహనాల్ని తుక్కు చేశారు. గాయపడిన ఈడీ అధికారులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో అక్కడి నుంచి బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు అధికారులకు ఆస్పత్రిలో చికిత్స చేయించనున్నారు. రాష్ట్రమంత్రి జ్యోతిప్రియో మాలిక్‌కు షాజహాన్ సన్నిహితుడు. రేషన్ కేసులోనే గత ఏడాది మాలిక్ అరెస్టయ్యారు. షేక్ షాజహాన్‌పై ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి నివేదిక పంపినట్లు ఈడీ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు. ఘటనతో సంబంధమున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రాష్ట్ర పోలీసులు చెప్పారు. సందేశ్‌ఖలి ఘటనను రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులపై దాడిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అనాగరిక చర్యను, విధ్వంసాన్ని ఆపాలని కోరారు. రాజ్యాంగానికి లోబడి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర అధికారులపై దాడి సమాఖ్య వ్యవస్థపై జరిగిన దాడిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పేర్కొన్నారు. ఘటనపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించి, రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ కోరారు. -
AP: వలంటీర్లకు ప్రతినెలా అదనంగా రూ.750
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5,000కు అదనంగా మరో రూ.750ను ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నందుకు ఈ ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్టు తెలిపింది. ప్రతి నెలా రూ.750 మొత్తాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా వేరేగా వలంటీర్లకు అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ కొద్ది రోజుల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ టీఎస్ చేతన్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు జాయింట్ కలెక్టర్లు, జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్చార్జిలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీవోలు, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకుఇంటింటికీ æరేషన్ పంపిణీలో వలంటీర్లను మరింత భాగస్వాములను చేయనున్నారు. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ వలంటీర్లకు కొన్ని ప్రత్యేక విధులను నిర్ధారించింది. వీటిని కూడా రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు తెలియజేశారు. కాగా వలంటీర్లకు రూ.750 అదనపు ప్రోత్సాహకాన్ని ఎప్పటి నుంచో వర్తింపజేస్తామో వేరేగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఇంటింటికీ రేషన్ పంపిణీలో వలంటీర్లకు ప్రత్యేక విధులు.. వలంటీర్లు తమ క్లస్టర్ (గ్రామీణ ప్రాంతాల్లో 50 ఇళ్ల పరిధి, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్ల పరిధి)లో ఇంటింటికీ రేషన్ పంపిణీలో పూర్తి అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ప్రతినెలా ప్రభుత్వం అందజేసే రేషన్ సరుకులను తీసుకునేలా విస్తృత ప్రచారం చేయాలి. రేషన్ వాహనాలు ఇంటింటికీ పంపిణీకి వచ్చే సమయాన్ని ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు తెలియజేయాలి. పంపిణీ జరిగే సమయంలో వలంటీర్లు కూడా ఉండాలి. రేషన్ సరుకులు తీసుకునే క్రమంలో లబ్ధిదారులు వేలిముద్రలు వేయడం తదితర అంశాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అక్కడికక్కడే వాటి పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. తమ పరిధిలో రేషన్ పంపిణీలో ఏవైనా లోపాలు, అవకతవకలు జరిగినట్టు గుర్తిస్తే.. ఆ వివరాలను వెంటనే సంబంధిత వీఆర్వో లేదా డిప్యూటీ తహసీల్దార్లకు తెలియజేయాల్సి ఉంటుంది. -
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ పంపిణీపై నీతి ఆయోగ్ కితాబు
-
రేషన్ సరఫరాపై రోత రాతలు
-
ఉచిత రేషన్‌కు సర్కారు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా కేంద్రం ప్రకటించిన సంవత్సర కాలం ఉచితరేషన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ జనవరి నుంచి వచ్చే డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా 5 కిలోలు బియ్యం ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ ఆహార భద్రతా చట్టం కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి 5కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు. అంత్యోదయ కార్డులకు కుటుంబానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోలు ఉచితంగా అందించనున్నారు. అదేవిధంగా కుమ్రంబీమ్, ఆసిఫా బాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలకు బియ్యానికి బదులుగా ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రత కార్డులున్న వారి విషయంలో ఉచిత రేషన్ గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో 90 లక్షల ఆహార భద్రత కార్డులుండగా, అందులో 55 లక్షల కార్డులు కేంద్ర పరిధిలో ఉండగా, 35 లక్షల కార్డులు రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. -
మరింత సమర్ధంగా ఇంటింటికీ బియ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. ఇంటింటికీ రేషన్ అందించే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ (ఎండీయూ వాహనాలు) క్రమం తప్పకుండా లబ్ధిదారుల ప్రాంతాలకు వెళ్లేలా పక్కాగా పర్యవేక్షించనుంది. ఇందులో భాగంగా రూట్ మ్యాపింగ్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి సాంకేతిక సేవలను వినియోగించనుంది. ఎండీయూ పరిధిలోని లబ్ధిదారులు తమ ఇళ్ల నుంచి ఎక్కువ దూరం వెళ్లకుండా సమీపంలోకే వాహనం వచ్చేలా అధికారులు ప్రత్యేక పాయింట్లను గుర్తిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా ఐదారు ఇళ్లకు ఒకచోట ప్రతి నెలా ఎండీయూలో రేషన్ అందించేలా సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. వాహనాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా బియ్యం లబ్ధిదారులకు అందుతుంది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చె నెలలో మండలానికి ఒక ఎండీయూ పరిధిలో దీనిని అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ విప్లవాత్మక చర్యలతో పెరిగిన రేషన్ పంపిణీ శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రతి నెలా రేషన్ తీసుకునేవారి శాతం గణనీయంగా పెరిగింది. లబ్ధిదారులకు నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం ఇవ్వడంతో పాటు 9,260 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించడం మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రతి నెలా 1.45 కోట్ల కార్డుదారులకు 2.30 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతుంది. గతంలో నెలకు 80 నుంచి 85 శాతం మాత్రమే రేషన్ పంపిణీ జరిగితే.. ఇప్పుడు 90 శాతానికి చేరుకొంది. మరోవైపు అనివార్య కారణాలతో ఎండీయూ వాహనదారులు ఎవరైనా తప్పుకుంటే వారి స్థానాన్ని భర్తీ చేసేంత వరకు గరిష్టంగా మూడు నెలల పాటు ఇన్చార్జి ఎండీయూకు (వేరే ఎండీయూ వాహనదారుడు పని చేస్తే) బాధ్యతలు అప్పగిస్తోంది. వీరికి నెలకు రూ.18,000 చొప్పున అదనంగా అందిస్తూ ఎక్కడా రేషన్ పంపిణీలో జాప్యం జరగకుండా చర్యలు చేపడుతోంది. 2 నుంచి 3 నెలలు నిల్వ చేసిన తర్వాతే రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసిన వెంటనే పీడీఎస్‌లోకి తీసుకురావడంతో సమస్యలు వస్తున్నాయి. కొత్త బియ్యం వండితే అన్నం బాగోలేదని, ముద్దగా అవుతుందనే ఫిర్యాదులున్నాయి. దీనిని అధిగమించేందుకు కస్టమ్ మిల్లింగ్ అనంతరం 2 నుంచి 3 నెలలు బఫర్ గోడౌన్లలో నిల్వ ఉంచిన తర్వాతే పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
రేషన్ పంపిణిపై ఎల్లో మీడియా విష ప్రచారం
-
1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేవై) కింద ఆగస్టు ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సచివాలయంలో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతినెల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 4.23 కోట్ల మందికి రేషన్ ఇస్తుంటే.. ఇందులో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద కేవలం 2.68 కోట్ల మందికి మాత్రమే సరుకులు అందిస్తోందన్నారు. మిగిలిన లబ్ధిదారులకు సొంత ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వమే రేషన్ పంపిణీ చేస్తోందన్నారు. కరోనా సమయంలో పీఎంజీకేవై కింద కేంద్రం ఉచిత రేషన్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2022 వరకు రాష్ట్రంలో ఉచిత రేషన్ పంపిణీ చేపట్టామన్నారు. ఇక్కడ కేంద్రం ఇచ్చే వాటాపోనూ నాన్–ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులకు మానవతా దృక్పథంతో తమ ప్రభుత్వం సొంతంగా ఉచిత బియ్యాన్ని అందించిందన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కొనసాగిస్తున్న ఉచిత రేషన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో.. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారని బొత్స తెలిపారు. రేషన్ దుకాణాల వద్దే.. తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లలో మినహా విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 1.67 కోట్ల మందితో పాటు మిగిలిన జిల్లాల్లోని 89.20 లక్షల ఎస్సీ, ఎస్టీలకు, 24.60 లక్షల మంది అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కార్డుదారులకు ఉచిత రేషన్‌ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. వీరితో పాటు కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉండటంతో అక్కడ కూడా ఈ విధానాన్ని అమలుచేస్తామన్నారు. తద్వారా రాష్ట్రంలోని 2.68 కోట్ల మందికి పైగా ఉచిత బియ్యం అందుతుందని బొత్స చెప్పారు. వీటిని రేషన్ దుకాణాల వద్ద మ.3.30 గంటల నుంచి సాయంత్రం వరకూ పంపిణీ చేస్తామని.. ఈ నెలాఖరు నాటికి వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు కూపన్లు అందజేస్తామన్నారు. ఇక ప్రతినెలా ఇచ్చే బియ్యాన్ని యథావిధిగా వాహనాల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ జరుగుతుందన్నారు. పీఎంజీకేవై అమలుకు ప్రత్యేక ప్రణాళిక అనంతరం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులు అందరికీ పీఎంజీకేవైను వర్తింపజేయాలని సీఎం జగన్ లేఖల ద్వారా ప్రధానమంత్రిని కోరారన్నారు. నీతి ఆయోగ్, మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులు, ఉన్నతాధికారలు అధ్యయనాల తర్వాత పీఎంజీకేవై అమలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కంటే పీడీఎస్ లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగిందని.. ఇటీవల కొత్తగా 7,051 కార్డులను కూడా జారీచేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో పేదలకిచ్చే బియ్యం కోసం రూ.12వేల కోట్లు ఖర్చుచేస్తే తమ ప్రభుత్వం మూడేళ్లలోనూ రూ.14వేల కోట్ల వరకు ఖర్చుచేసిందన్నారు. సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు.. రాష్ట్రంలో 4.23 కోట్ల మంది నిరుపేదలు రేషన్ తీసుకుంటుండగా కేంద్రం ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద 2.68 కోట్ల మందిని మాత్రమే గుర్తించింది. వారికే ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. మిగిలిన 1.55 కోట్ల మంది ప్రజలను నిరుపేదలుగా పరిగణించట్లేదు. ఈ క్రమంలో కొంతమందికే కాకుండా నిరుపేదలందరికీ పీఎంజీకేవై కింద ఉచిత రేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నీతి ఆయోగ్ సైతం చేసిన సిఫారసులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అయినా కేంద్రం స్పందించలేదు. కరోనా సమయంలో కేంద్రం ఇస్తున్న 2.68 కోట్ల మందితో పాటు మిగిలిన వారికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్ ఇచ్చింది. ఆర్థికభారం మోయలేనిస్థాయికి చేరడంతో.. అందరకీ ఉచిత రేషన్ ఇవ్వమని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసి, కేంద్రం స్పందన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో.. ఉచిత రేషన్ పంపిణీ చేయకపోతే ధాన్యం కొనుగోళ్లు నిలిపేస్తామని, బిల్లులను కూడా ఆపేస్తామని బెదిరించింది. రైతులు ఇబ్బందులు పడకుండా వారి ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి వారి సిఫారసుల అనుగుణంగా వెనుకబడిన ప్రాంతాలు, సామాజికవర్గాల వారీగా ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లుచేసింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో మోయలేని ఆర్థిక భారం పడినా.. నిరుపేదల కడుపు నింపేందుకు కేంద్రంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భారం భరించి రెండేళ్లూ ఉచిత రేషన్ అందించింది. ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు చక్కబడకపోవడంతో కేంద్రాన్ని సాయం కోరినా ఫలితం దక్కకపోగా బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోంది. -
CM YS Jagan: 48 గంటల్లో సాయం
వరద బాధితులను ఆదుకోవడంలో విరామం లేకుండా అవిశ్రాంతంగా పని చేస్తున్నప్పటికీ కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న దురుద్దేశపూర్వక ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ‘మీరు చేస్తున్న మంచి పనులు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతుంటే వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ముందడుగు వేసి అలాంటి వాటి పట్ల దూకుడుగా వ్యవహరించాలి’ అని నిర్దేశించారు. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గోదావరి వరద బాధిత కుటుంబాలకు 48 గంటల్లోగా రూ.రెండు వేల సాయం అందించడంతోపాటు రేషన్ పంపిణీని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ముంపు బారిన పడిన గ్రామాల్లో ఏ ఒక్క ఇల్లూ మిగిలిపోకుండా అందరికీ సాయం అందించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ఎక్కడా రూ.2 వేల సాయం, రేషన్ అందలేదనే మాటే వినిపించడానికి వీల్లేదని, కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. 25 కిలోలు బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, కిలో పామాయిల్‌తో రేషన్ సరుకుల పంపిణీ జరగాలన్నారు. బాధితులు శిబిరాలకు వచ్చినా రాకున్నా.. ముంపునకు గురైన చోట్ల ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు, రేషన్ సరుకులు అందాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతున్నందున సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దురుద్దేశపూరితంగా చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, విపత్తుల నిర్వహణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి సాయానికైనా సిద్ధం.. మీకు ఇంకా ఏమైనా అవసరమైతే అన్ని రకాలుగా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నిధుల సమస్య లేనే లేదు. చురుగ్గా ముందుకు వెళ్లండి. ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కారానికి ఫోన్ కాల్ చేస్తే చాలు. బాధిత కుటుంబాల పట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించండి. ఇప్పటివరకూ ఒకరు మాత్రమే మరణించినట్లు సమాచారం ఉంది. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సహాయ శిబిరాలు కొనసాగించాలి. బాధిత కుటుంబాలకు మంచి ఆహారం, తాగునీరు అందించాలి. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి. వరద తగ్గగానే పంట నష్టం అంచనా వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తి చేయాలి. పశువులకు పశుగ్రాసం, దాణా సక్రమంగా అందించాలి. పశు సంపదకు నష్టం వాటిల్లితే అంచనాలు రూపొందించాలి. గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ గర్భిణిలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఆస్పత్రులకు తరలించాలి. వైద్యాధికారులు, స్పెషలిస్టులు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. ముంపు తగ్గగానే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. ఆస్పత్రుల్లో తగినంత మంది సిబ్బంది, మందులను సిద్ధంగా ఉంచాలి. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించాలి, క్లోరినేషన్ కొనసాగించండి. అన్ని మంచినీటి పథకాలను ఒకసారి పరిశీలించడంతో పాటు మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయించండి. అదనపు సిబ్బంది తరలింపు.. వరద బాధిత ప్రాంతాలకు పక్క జిల్లాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తరలించి ముమ్మరంగా పనులు చేపట్టాలి. ఇతర జిల్లాల నుంచి తరలించేటప్పుడు సిబ్బంది వసతి, భోజన సదుపాయాలకు లోటు రాకుండా చూసుకోవాలి. పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖల విభాగాధిపతులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మురుగునీటి కాలువల్లో పూడిక తీత కార్యక్రమాలు చేపట్టాలి. నీరు తగ్గగానే కల్వర్టులు, బ్రిడ్జిలను క్షుణ్నంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టాలి. కరకట్ట పరిశీలన.. పూడికతీత గోదావరి కరకట్ట బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలి. అన్ని డ్రెయిన్ల ముఖద్వారాలు మూసుకుపోయే అవకాశం ఉన్నందున పూడిక తొలగింపు పనులు చేయాలి. గట్లు, కాల్వలకు ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే పూడ్చి వేయాలి. తక్షణం విద్యుత్తు పునరుద్ధరణ వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చే 48 గంటల్లో ఈ సమస్యను పరిష్కరించాలి. పలు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలను నిర్వహిస్తున్నందున తిరిగి అప్పగించేటప్పుడు పరిశుభ్రంగా అప్పగించాలి. అందుబాటులో అత్యుత్తమ వ్యవస్థ.. గతంలో రెండు జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు ఇద్దరు చొప్పున మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కాకినాడతో కలిపి ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలున్నారు. సచివాలయాల వ్యవస్థ కూడా మీకు అందుబాటులో ఉంది. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులున్నారు. ప్రతి 50 ఇళ్లకూ ఒక వలంటీర్ ఉన్నారు. అందుబాటులో ఉన్న ఇలాంటి అత్యుత్తమ వ్యవస్థ ద్వారా నాణ్యమైన సేవలు అందించాలి. పంపిణీ ముమ్మరం చేయాలి. ఈ వ్యవస్థ ద్వారా ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ రూ.2 వేలు ఆర్థిక సాయం చేయలేదు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్‌కళ్యాణ్ లాంటివారు బురద జల్లుతున్నారు. వీరంతా రాష్ట్ర ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తారు. బురద జల్లడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలి. వదంతులను కూడా తిప్పికొట్టాలి. -
AP: పరేశాన్ లేకుండా ఇళ్లకే రేషన్
► ఈ ఫొటోలోని అవ్వ పేరు.. తెర్లి మహాలక్ష్మి. వయసు 75 ఏళ్లకు పైమాటే. ఈమెది పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలం పెద్దూరు. 15 ఏళ్ల కిందట భర్త మరణించాడు. కుమార్తె పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోవడం, కొడుకు ఉపాధి వెతుక్కుంటూ కుటుంబంతో కలిసి విశాఖపట్నానికి వలస పోవడంతో ఒంటరిగా చిన్నగదిలో కాలం వెళ్లదీస్తోంది. ఒంటిలో పని చేసే సత్తువ లేని తరుణంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యమైన, ఫోర్టిఫైడ్ చౌక బియ్యమే అవ్వ ఆకలి తీరుస్తోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చే బియ్యం దొడ్డుగా, రాళ్లు, నూకలు ఉండేవని.. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం బాగుంటున్నాయని అవ్వ చెబుతోంది. తనకు నెలకు 20 కిలోల బియ్యంతోపాటు వృద్ధాప్య పింఛన్ కూడా ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ► ప్రజలందరూ రేషన్ పంపిణీ వాహనం చుట్టూ చేరి రేషన్ తీసుకుంటున్న ఈ చిత్రం.. విశాఖ ఏజెన్సీలోని జంగంపుట్టులోనిది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని గుల్లేలు పంచాయతీ 12 గ్రామాల్లోని ఓ పల్లె.. జంగంపుట్టు. గ్రామస్తులు ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే 9 కిలోమీటర్ల దూరంలోని రాయిమామిడికి వెళ్లాల్సి వచ్చేది. రేషన్ బియ్యం కోసం రోజు కూలి పోగొట్టుకుని కాలినడకన బయలుదేరి గుర్రాలపై బియ్యం మూటలను వేసుకొచ్చేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డు వేయడంతో గుల్లేలు పంచాయతీలో రేషన్ డిపో వచ్చింది. ఇప్పుడు అన్ని గ్రామాలకు వాహనాల్లో రేషన్ సరుకులు వెళ్తున్నాయి. ప్రజలు వారి ఇంటి వద్దే నాణ్యమైన రేషన్ తీసుకుంటున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి చెరగని బాటలు వేస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో చేపట్టిన రేషన్ సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం చౌక డిపోల ద్వారా నాణ్యమైన రేషన్ బియ్యాన్ని.. అది కూడా లబ్ధిదారులకు ఇంటి వద్దే అందిస్తూ వారి ఆకలిని తీరుస్తోంది. దీనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన రేషన్ బియ్యమే పేదల పాలిట పరమాన్నమైంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రజలు ఏ రకం బియ్యం తింటున్నారో.. వాటినే రేషన్ దుకాణాల్లో అందించాలని సీఎం వైఎస్ జగన్ఆదేశించారు. దానికి అనుగుణంగా 2019 సెప్టెంబర్‌లో శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా నాణ్యమైన బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం 2021 ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం సరఫరా చేయడంతోపాటు రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పుడది దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శనీయంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల పంజాబ్‌లో కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం ‘ఘర్ ఘర్ రేషన్ యోజన’ పేరుతో లబ్ధిదారుల ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేస్తుందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్సింగ్ ప్రకటించారు. మరో 8 రాష్ట్రాలు సైతం ఈ విధానంపై అధ్యయనం చేస్తుండటం విశేషం. రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరికి పంపిణీ చేసేందుకు నెలకు 2.31 లక్షల టన్నుల బియ్యం అవసరం. అయితే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేవలం 90 లక్షల కార్డులకు 1.54 లక్షల టన్నుల బియ్యాన్ని.. అది కూడా సాధారణ బియ్యాన్ని మాత్రమే అందిస్తోంది. మిగిలిన కార్డులకు అవసరమైన 77 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో కొనుగోలు చేసి పంపిణీ చేస్తోంది. ఇందుకు ప్రభుత్వంపై నెలకు రూ.344 కోట్ల భారం పడుతోంది. ఇందులో నాణ్యమైన బియ్యాన్ని (సార్టెక్స్ చేసి) ఇచ్చేందుకు రూ.23.08 కోట్లు అదనపు భారాన్ని మోస్తోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో బియ్యం సబ్సిడీపై చేసిన ఖర్చు రూ.12,377 కోట్లయితే.. వైఎస్ జగన్ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున నాణ్యమైన బియ్యమిస్తూ ఈ మూడేళ్లలోనే రూ.12,400 కోట్లు సబ్సిడీకి వెచ్చించింది. ఈ ఏడాది మరో రూ.4300 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద బియ్యం ఇస్తున్నప్పటికీ వాటి రవాణా, డీలర్ కమీషన్ తదితర ఖర్చుల కింద ఏడాదికి రూ.500 కోట్లకు పైనే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ప్రజలకు దగ్గరై.. కష్టాలను దూరం చేసి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారుల ఇంటి వద్దే నాణ్యమైన రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. రేషన్ దుకాణాల్లో గంటల పాటు క్యూలో నిల్చుని రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో పాటు ఒక రోజు పనిని వదులుకుని, కూలి పోగొట్టుకోవాల్సి వచ్చేది. ఇటువంటి వారి కోసం రూ.530 కోట్లకు పైగా వ్యయంతో 2021 ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా 9,260 మొబైల్ వాహనాలతో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ యువతకు ఉపాధిని కల్పించారు. రేషన్ డోర్ డెలివరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహనదారుడితోపాటు హెల్పర్ల కింద సుమారు 17 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. నెలలో 18 రోజులపాటు లబ్ధిదారుల ఇళ్ల వద్దే రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వాహనం విలువ రూ.5.81 లక్షలు కాగా.. ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తోంది. ఈ వాహనాలను వాడుకున్నందుకు పౌరసరఫరాల శాఖ నెలకు ఆపరేటర్లకు సుమారు రూ.25 కోట్లు చెల్లిస్తోంది. కార్డుదారుల సమక్షంలో ఇంటి దగ్గరే సంచులు తెరచి, కచ్చితమైన తూకంతో రేషన్ సరుకులు ఇస్తున్నారు. దీంతో కొలతలపై ఫిర్యాదులు తగ్గడంతోపాటు వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. కష్టాలు తీరాయి.. గతంలో రేషన్ బియ్యం కావాలంటే మా ఊరు నుంచి 5 కిలోమీటర్ల కాలినడకన మసిమండ పంచాయతీలోని ఎండభద్రకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వచ్చేది. పైగా అక్కడ రేషన్ డిపో దగ్గర గంటల కొద్దీ లైన్లో నిల్చునేవాళ్లం. మా ఊరు గిరిశిఖరం కావడంతో బియ్యం మూటతో నడవడానికి చాలా అవస్థలు పడేవాళ్లం. జగనన్న వచ్చాక ఇంటి ముందుకే రేషన్ బండిని తెచ్చి బియ్యం ఇస్తున్నారు. ఒకప్పుడు రాళ్లు, పురుగులు ఉండే బియ్యాన్ని తినడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు చక్కటి నాణ్యమైన బియ్యం ఇస్తున్నారు. – చోడి చింతమ్మ, కొమరాడ మండలం, లంజి గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా తొలిసారిగా ఏపీలోనే రైస్ ఏజ్ టెస్టు గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన బియ్యం నాసిరకంగా ఉండటంతోపాటు ప్రజలు వాటిని వండుకోవడానికి, తినడానికి వీలుండేది కాదు. దీంతో చాలా మంది సబ్సిడీ బియ్యాన్ని మార్కెట్లో తక్కువ ధరకు విక్రయించేవారు. ఇవే బియ్యం రీసైక్లింగ్ ద్వారా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి వెళ్లి తిరిగి రేషన్ షాపులకు వచ్చే విధానం ఇన్నాళ్లూ కొనసాగింది. దీనికి అడ్డుకట్ట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా బియ్యం కాలనిర్ధారణ పరీక్ష (రైస్ ఏజ్ టెస్టింగ్)ను ప్రవేశపెట్టింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం సైతం అన్ని ఎఫ్‌సీఐ గోదాముల వద్ద తప్పనిసరిగా రైస్ ఏజ్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించింది. -
కేంద్రం ఆదేశాలను బీజేపీ విస్మరించడం విడ్డూరంగా ఉంది: కారుమూరి
సాక్షి, తాడేపల్లి: నగదు బదిలీపై అపోహలు సృష్టిస్తున్నారని, నగదు బదిలీ ప్రారంభించాలని 2017లోనే కేంద్రం సూచించిందని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఆదేశాలపై అదే పార్టీ విస్మరించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజల ఇష్టంతోనే పైలట్ ప్రాజెక్టుగా రెండు, మూడు మున్సిపాలిటీల్లో ప్రారంభిస్తామని అన్నారు. ఇష్టం ఉన్న వాళ్లకి నగదు బదిలీ చేస్తామని, ఇష్టం లేని వాళ్లకి బియ్యం ఇస్తామని అన్నారు. కార్డులు తొలగిస్తామని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవ్వరి కార్డులు తొలగించం.. జూన్‌లో కూడా కొత్త కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇంకా రేటు నిర్ణయించలేదని, రూ. 16 రూపాయలంటూ కొన్ని టీవీ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రజలని భయభ్రాంతులకి గురి చేసే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. -
ఏపీ తరహాలో ఇంటింటి రేషన్ పంపిణికి పంజాబ్ శ్రీకారం
-
మరింత పటిష్టంగా.. ‘ఇంటింటికీ రేషన్’
సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్ సరఫరా’ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా రెండు రోజుల వ్యవధిలోనే బియ్యం కార్డు లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర రేషన్ సరుకుల పంపిణీని పూర్తిచేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో ప్రతి నెలా మొదటి వారంలో సామాజిక పింఛన్ల పంపిణీకి ఆటంకం కలగకుండా రేషన్ పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యతలు చూస్తున్న జాయింట్ కలెక్టర్లకు గురువారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. పంపిణీ సమయంలో వలంటీర్లు ఉండాల్సిందే.. సంబంధిత క్లస్టర్లకు రేషన్ పంపిణీ చేసే సంచార వాహనాలు ఏ తేదీన, ఏ సమయానికి వస్తాయో తెలియజేస్తూ.. ఒకరోజు ముందే లబ్ధిదారులకు కూపన్లు ఇవ్వాలని వలంటీర్లకు సూచించింది. రేషన్ పంపిణీ సమయంలో గ్రామ, వార్డు వలంటీర్లు ఉం డి లబ్ధిదారుల బయోమెట్రిక్‌ను తీసుకోవాలని ఆదేశించింది. ఎవరివైనా వేలిముద్రలు పడకపోతే వ లంటీర్లే వేయాలని స్పష్టం చేసింది. ఏదైనా సమస్య తలెత్తితే గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శులను సంప్రదించి పరిష్కరించాలని వలంటీర్లకు సూచిం చింది. ఎవరైనా లబ్ధిదారులు రేషన్ తీసుకోకపోతే.. ఆ వివరాలను వలంటీర్లు ఏరోజుకారోజు సచివాల యాల్లో సాయంత్రం 6 నుంచి 7 గంటల్లోగా తెలి యజేయాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులు ఎక్కడ ఉంటే.. అక్కడే రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంద నే విషయంపై వారికి అవగాహన కల్పించాలని ఆదే శించింది. క్లస్టర్లో మ్యాపింగ్‌కాని లబ్ధిదారులు.. వారు నివాసం ఉంటున్న క్లస్టర్‌లోనే రేషన్ తీసుకోవ చ్చనే విషయాన్నీ వారికి తెలపాలని కోరింది. రేషన్ పంపిణీ పూర్తయ్యే వరకు వలంటీర్లు సంచార వాహ నాలతో అందుబాటులో ఉండాలని పేర్కొంది. లోడింగ్, అన్‌లోడింగ్‌తో సంబంధం లేదు.. వలంటీర్ల సేవలను లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. సరుకుల లోడింగ్, అన్ లోడింగ్, తదితర కార్యకలాపాలతో వలంటీర్లకు సంబంధం ఉండదని స్పష్టం చేసింది. వీటిని పర్యవేక్షించాలని జేసీలను ఆదేశించింది. చదవండి: బాబు చెప్పినా వినలేదు.. టీడీపీ నేతల హల్చల్ పరిషత్ ఎన్నికలు: రెచ్చిపోయిన టీడీపీ నేతలు -
ఈ నెల 10 వరకు ఫిబ్రవరి రేషన్
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి నెలలో వివిధ కారణాల వల్ల రేషన్ సరుకులు తీసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. గత నెలలో సరుకులు తీసుకోని 35.18 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర సబ్సిడీ సరుకులను లబ్ధిదారులందరికీ అందించాలనే లక్ష్యంతో గత నెలలో తీసుకోని వారికి రెండు నెలల కోటాను ఒకేసారి అందించే వెసులుబాటు కల్పించింది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుంది. గత నెల నుంచి 9,260 మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 1,45,98,041 బియ్యం కార్డులుండగా.. 1,10,79,333 కార్డుదారులు మాత్రమే ఫిబ్రవరి నెల సరుకులు తీసుకున్నారు. వివిధ కారణాలతో 35,18,708 కార్డుదారులు సరుకులు తీసుకోలేకపోయారు. వలంటీర్లకు మ్యాపింగ్ కాని కార్డుదారులు, వలస కూలీల వంటివారు సరుకులు ఎక్కడ తీసుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వాహనం వద్దనైనా తీసుకోవచ్చు రేషన్ కార్డుదారులు ఏ మొబైల్ వాహనం వద్దనైనా సరుకులు పొందేవిధంగా ప్రభుత్వం పోర్టబిలిటీ అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ వలంటీర్ పరిధిలోని క్లస్టర్‌కు మ్యాప్ కాని కార్డులు 4,45,388 ఉన్నట్టు గుర్తించారు. ఈ కార్డుదారులు కూడా ఎక్కడైనా సరుకులు తీసుకోవచ్చు. ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటును పేదలు సద్వినియోగం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ కోరారు. -
ఓటీపీ ప‘రేషన్’.. మీసేవ కేంద్రాల వద్ద జనం బారులు
సాక్షి, నెట్వర్క్: మొబైల్ ఫోన్‌కు వచ్చిన వన్‌టైం పాస్వర్డ్ (ఓటీపీ) చెబితేనే రేషన్ సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలివ్వటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా కార్డులున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదివరకు అమలులో ఉన్న బయోమెట్రిక్ (వేలిముద్రల) ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీకి కరోనా కారణంగా హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. ఇటు ఐరిస్ లేదా మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపించడం ద్వారా రేషన్ ఇవ్వొచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. దాదాపు దశాబ్దం కిందటనే అందరూ ఆధార్ కార్డులు తీసుకున్నారు. అప్పట్లో చాలామందికి మొబైల్ ఫోన్లు లేకపోవడం, ఉన్నవారు కూడా ఆ తర్వాతకాలంలో ఫోన్ నంబర్లు మార్చడంతో ఆధార్‌తో అనుసంధానం అటకెక్కింది. ఆహార భద్రతా కార్డులున్నా చాలామందికి మొబైల్ ఫోన్లు లేవు. చదువురాని వారు కూడా ఈ ఓటీపీ విధానంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో సరుకులు తీసుకోవడానికి రేషన్ షాపుల వద్ద ఆలస్యం జరుగుతోంది. క్యూ కట్టిన జనం.. రేషన్ సరఫరాలో వస్తున్న ఇబ్బందులతో మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి మీసేవ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. అయితే మండలానికి ఒక కేంద్రానికే ఆధార్–ఫోన్ నంబర్ లింకు చేసే అనుమతి ఇవ్వటంతో ఆయా కేంద్రాల వద్ద వృద్ధులు, మహిళలు పిల్లాపాపలతో అగచాట్లు పడుతున్నారు. ఒక్కో అనుసంధాన ప్రక్రియ 10 నిమిషాల్లో పూర్తి కావాల్సి ఉండగా రద్దీ ఎక్కువ కావటం, సర్వర్ డౌన్ అవుతుండటంతో అరగంట నుంచి గంట సమయం పడుతోంది. బుధవారం కరీంనగర్, వరంగల్, నల్లగొండ తదితర ఉమ్మడి జిల్లాల్లో అన్ని చోట్లా అనుసంధానం కోసం భారీ క్యూలు కట్టి వృద్ధులు, మహిళలు అనేక అవస్థలు పడ్డారు. ఇటు కార్డుదారుల కళ్లను కొన్ని ఐరిస్ యంత్రాలు సాంకేతిక సమస్యలతో గుర్తించకపోవడం వల్ల కూడా పూర్తిగా రేషన్ ఇవ్వలేని పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు మీసేవ కేంద్ర నిర్వాహకులు ఇదే అదనుగా ఆధార్‌తో ఫోన్ నంబర్ అనుసంధానానికి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నారు.. వెరసి ప్రజలు మీసేవ కేంద్రాలు, రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది.. ఐరిస్‌కు ప్రాధాన్యం.. ఆధార్‌తో మొబైల్ ఫోన్ అనుసంధానం కాకపోయినా సరే.. ఐరిస్‌కు ప్రాధాన్యతనిచ్చి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్ షాప్ డీలర్లంతా ఐరిస్ ద్వారా బియ్యం పంపిణీ సాధ్యం కాని పక్షంలోనే ఓటీపీ అడగాలని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన ఆదేశించారు. ఆధార్ డేటాబేస్‌లో కార్డుదారుల ఫోన్ నంబర్లను ఈ–పాస్ ద్వారా అనుసంధానం చేయడానికి ఆధార్ సంస్థ అంగీకరించిందని, అందుకోసం డేటాబేస్‌లో అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఫోన్ నంబర్ ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా రేషన్ డీలర్లకు ఒక్కో దానికి రూ.50 సర్వీసు చార్జీ కింద లభిస్తుందని అనిల్‌కుమార్ వివరించారు. ఇందుకోసం ఆధార్ సంస్థ ప్రతినిధులు మెగా శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
ఇంటికే వచ్చారు.. రేషన్ ఇచ్చారు
సాక్షి, అమరావతి: పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ రేషన్ పంపిణీ’ పథకం పట్టణాల్లో సోమవారం ప్రారంభమైంది. మొన్నటి వరకు సరుకుల కోసం పేదలు రేషన్ షాపుల వద్ద వేచి ఉండే పరిస్థితి. ఒక్కోసారి పేదలు కూలి పనులు మానుకుని రేషన్ సరుకుల కోసం వెళ్లాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి ఇబ్బందులను గుర్తించి లబ్ధిదారుల ఇంటికే వెళ్లి సరుకుల పంపిణీ చేసేందుకు వీలుగా 9,260 వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు వాటిని వెంటనే వినియోగంలోకి తెచ్చారు. రాష్ట్రమంతటా సోమవారం నుంచి లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి రేషన్ సరుకులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ సరఫరాను నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో నాణ్యమైన బియ్యం పంపిణీ మొదటి రోజున కేవలం పట్టణాల్లో మాత్రమే ప్రారంభించారు. మొబైల్ వాహనదారులకు ఈ–పాస్ వినియోగం, తూకం వేయడం, ఇళ్ల దగ్గరకు వెళ్లి సరుకులు పంపిణీ కొత్త కావడంతో అక్కడక్కడా కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి రోజు 83,387 మంది కుటుంబాలకు 12.86 లక్షల కిలోల నాణ్యమైన బియ్యం పంపిణీ చేసినట్టు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. గ్రామాల్లో పంపిణీకి అనుమతివ్వండి హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ సరుకుల పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పథకాన్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రమంతటా అమలు చేయాలని ఎన్నికలకు ముందే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఎస్ఈసీ త్వరగా నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) త్వరగా నిర్ణయం తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కోరారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉంటోందని.. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఇంటింటికీ రేషన్ బియ్యాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. మంత్రి ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీని అమలుచేసి, అక్కడ ఎదురైన లోటుపాట్ల ఆధారంగా ఈ మొబైల్ వాహనాలను తీసుకొచ్చామన్నారు. అయితే, పేదలకు ఎంతో అవసరమైన ఈ పథకం ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని, దాన్ని నిలిపివేయాలని సీఎస్‌కి ఎస్ఈసీ లేఖ రాశారన్నారు. దీంతో ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం.. న్యాయస్థానం ఐదు రోజుల్లోగా దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించడం హర్షణీయమని కొడాలి చెప్పారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో రాజకీయ నేతలెవరూ లేకుండానే సోమవారం నుంచి ఇంటింటికీ రేషన్ బియ్యాన్ని మొబైల్ వాహనాల ద్వారా అందిస్తారని మంత్రి చెప్పారు. ఎస్ఈసీ నిర్ణయం వచ్చాకే గ్రామాల్లోనూ అమలు చేస్తామన్నారు. -
కోడ్ పేరిట పేదల పథకానికి బ్రేక్
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర సబ్సిడీ సరుకులను ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రమంతటా పేదల గడప వద్దకే వెళ్లి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పంచాయతీ ఎన్నికల కోడ్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అడ్డు చెప్పారు. గ్రామాల్లో ఈ పథకం కింద మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీ ఎన్నికల దృష్ట్యా నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శుక్రవారం లేఖ రాశారు. కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేసుకోవచ్చని లేఖలో స్పష్టం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం, ఇందులో భాగంగానే ఈ నెల 21న మొబైల్ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించడం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 9,260 వాహనాలు ముందుకు కదలడంతో ఇక రేషన్ షాపుల వద్ద గంటల తరబడి వేచి చూసే పని ఉండబోదని, ఇంటి వద్దే బియ్యం, ఇతర సబ్సిడీ సరుకులు అందుతాయని, తద్వారా ఫిబ్రవరి నుంచి తమ కష్టాలు తీరతాయని భావించిన పేదలకు ఎన్నికల కమిషనర్ ఆదేశం శరాఘాతమైంది. వాస్తవానికి ఈ పథకం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైనుంచే అమలవుతోంది. అందువల్ల ఈ పథకాన్ని ఇప్పటికే కొనసాగుతున్నదిగా భావించి పంపిణీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరినా ఎస్ఈసీ పట్టించుకోకపోవడం గమనార్హం. కేవలం పట్టణాల్లో మాత్రమే ఈ పథకాన్ని కొనసాగించుకోవచ్చని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఏజీ అభిప్రాయం కోరాలని నిర్ణయం.. ఈ పథకం అమలు కోసం ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకు నాణ్యమైన బియ్యంతోపాటు మొబైల్ వాహనాలు వెళ్లాయి. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎస్ఈసీ నిలిపివేయడం సమంజసం కాదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇదే విషయమై అడ్వొకేట్ జనరల్‌తో చర్చించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. అంతిమంగా అడ్వొకేట్ జనరల్ సూచన మేరకు పథకం అమలుపై ముందుకెళ్లాలా.. వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
ఏపీలో సరికొత్త చరిత్ర.. ఇక ఇంటికే బియ్యం
సాక్షి, అమరావతి: పాదయాత్ర హామీలన్నీ నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేస్తూ నూతన ఒరవడికి నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. రేషన్ సరుకుల కోసం కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను నాడు పాదయాత్ర సమయంలో స్వయంగా గుర్తించిన సీఎం జగన్ ఇంటివద్దే వాటిని అందచేస్తామని మాట ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే రేషన్ సరుకుల సరఫరా వాహనాలను గురువారం ప్రారంభించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను అదే రోజు మంత్రులు ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం 9,260 వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు. వాహనాల ఆపరేటర్లతో పాటు నోడల్ వీఆర్వోలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం రంగు మారి ఉండటం, నూకల శాతం ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వినియోగించడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తినేందుకు వీలుగా నాణ్యమైన బియ్యాన్ని ఇంటివద్దే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిల్లింగ్ సమయంలోనే నూకలు శాతాన్ని బాగా తగ్గించి కార్డుదారులకు నాణ్యతతో కూడినవి అందించేలా చర్యలు చేపట్టింది. చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీలో కొందరు డీలర్లు సమయ పాలన పాటించకపోవడం, సక్రమంగా అందకపోవడం, నల్లబజారుకు తరలించడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే పేదలు సరుకుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు మొబైల్ వాహనం ద్వారా ఇంటివద్దే నాణ్యమైన బియ్యం అందించే విధానాన్ని ప్రభుత్వం తెస్తోంది. బుధవారం రాత్రి విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద బారులు తీరిన రేషన్ డోర్ డెలివరీ వాహనాలు 22, 23న వాహనదారులకు శిక్షణ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియాన్ని ఇంటివద్దే పంపిణీ చేస్తారు. మొబైల్ ఆపరేటర్ (వాహనదారుడు) రోజూ ఉదయం బియ్యంతో పాటు ఈ–పాస్ యంత్రాన్ని రేషన్ డీలర్ నుంచి తీసుకోవాలి. ఆఖరులో మిగిలిన స్టాకుతో పాటు ఈ–పాస్ యంత్రాన్ని తిరిగి డీలర్‌కు అప్పగించాలి. ఆపరేటర్ రోజూ ఈ–పాస్ మిషన్‌లో తన హాజరును నమోదు చేసుకోవాలి. ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీపై ఈ నెల 22, 23 తేదీల్లో మొబైల్ ఆపరేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వాహనం వినియోగం, తూకం యంత్రం, డోర్ డెలివరీ తదితరాలపై అవగాహన కల్పిస్తారు. ఈ నెల 24 నుంచి 29 వరకు వాహన ఆపరేటర్లు, నోడల్ వీఆర్వోలు ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. క్లస్టర్ పరిధిలోని రేషన్ డీలర్లు, వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని కలిసి పరిచయం చేసుకోవాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి.. బియ్యం, నిత్యావసర సరుకులను కార్డుదారులకు ఇంటివద్దే అందించేందుకు 9,260 మొబైల్ వాహనాలను రివర్స్ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు ఈ వాహనాలను వివిధ కార్పొరేషన్ల ద్వారా 60 శాతం సబ్సిడీతో సమకూర్చింది. ఒక్కో వాహనం విలువ రూ. 5,81,000 కాగా రూ.3,48,600 సబ్సిడీగా అందించింది. ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతి నెలా అద్దె చెల్లిస్తూ ఆరేళ్ల పాటు వినియోగించుకోనుంది. ఏ వర్గాలకు ఎన్ని వాహనాలు? ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 700 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,300 బీసీ కార్పొరేషన్ ద్వారా 3,800 మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా 660 ఈబీ కార్పొరేషన్ ద్వారా 1,800 మొబైల్ వాహనంలో వసతులు ఇలా మొబైల్ వాహనంలో తూకం వేసే యంత్రం (వేయింగ్ స్కేల్), కొలతల పరికరాలు ఉంటాయి. ఎల్ఈడీ ల్యాంప్స్, ఈ–పాస్ యంత్రాల ఛార్జింగ్ పాయింట్లు, మినీ ఫ్యాన్, చిన్న మైక్ ఉంటుంది. ప్రథమ చికిత్స బాక్సు, నగదు పెట్టె, అగ్ని మాపక యంత్రం, నోటీసు బోర్డు ఏర్పాటు చే శారు. తూకం యంత్రం 12 నుంచి 18 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. రేషన్ సరఫరాలో పాత విధానం ఇదీ – రేషన్ సరుకుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి రావడంతో రోజువారీ కూలీలు వేతనాలు కోల్పోయే వారు. – సరుకుల పరిమాణం, పంపిణీలో కోతలపై పలు ఫిర్యాదులు అందేవి. రేషన్ సరుకుల్లో కొత్త విధానం ఇలా... – కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్ సరుకుల పంపిణీ జరగడం వల్ల కూలీ పనులకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. – కార్డుదారుల సమక్షంలోనే సంచులు తెరిచి కచ్చితమైన ఎలక్ట్రానిక్ తూకంతో పంపిణీ చేస్తారు. – వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దే కార్డుదారుల వేలిముద్ర తీసుకుని నాణ్యమైన, కచ్చితమైన తూకం కలిగిన బియ్యాన్ని తిరిగి వినియోగించే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇవ్వనున్నారు. – కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతి బియ్యం బస్తాకూ సీల్ ఉంటుంది, ప్రతి సంచికీ యూనిక్ కోడ్ వల్ల ఆన్లైన్ ట్రాకింగ్ జరుగుతుంది. అన్ని మొబైల్ వాహనాలకు జీపీఎస్ అమర్చడం వల్ల కార్డుదారులు మొబైల్ యాప్ ద్వారా పంపిణీ వివరాలు రియల్ టైంలో తెలుసుకోవచ్చు. మొబైల్ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారుల సౌకర్యార్ధం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాలి. దీనిపై నిరంతరం సోషల్ ఆడిట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ తూకం ద్వారా కచ్ఛితమైన తూకంతో సరుకుల పంపిణీ చేయనున్నారు. సచివాలయాల ద్వారా బియ్యం కార్డుల సేవల వివరాలు (2020 జూన్ నుంచి ఇప్పటివరకు) కొత్త బియ్యం కార్డులు 4,93, 422 కొత్త బియ్యం కార్డులలో సభ్యులను చేర్చడం 17,07,928 కొత్త బియ్యం కార్డులను విభజించడం 4,38,013 మొత్తం సేవలు 26,39,363 -
ఉచిత సరుకులు అర్హులందరికీ అందాలి
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ఉచితంగా ఇస్తున్న సరుకులు అర్హులందరికీ అందాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్వర్ పని చేయలేదనే సాకు చెబుతూ షాపులు మూసేసి తప్పించుకునేందుకు వీల్లేదని హెచ్చరించింది. ఈ–పాస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినా రేషన్ డీలర్లు షాపుల వద్దే వేచి ఉండాలని పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదేశించారు. దీంతో చాలావరకు డీలర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 5.30 గంటలకు, పట్టణ ప్రాంతాల్లో 6 గంటలకే ఈ–పాస్ మిషన్ ఆన్ చేస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు ఉచిత సరుకులు పంపిణీ చేస్తున్నారు. మోసాలకు చెక్ పెట్టడంతో షాపులకు తాళం లాక్డౌన్ పరిస్థితుల్లో నెలకు రెండుసార్లు చొప్పున రాష్ట్రంలో పేదలకు ఉచితంగా సరుకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాలతో ఒక్కో కార్డుదారుడికి ప్రతిసారీ కేజీ శనగలు/కందిపప్పు, కార్డులోని ఒక్కో సభ్యుడికి 5 కేజీల బియ్యం అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 16వ విడత ఉచిత సరుకుల పంపిణీ కొనసాగుతోంది. అయితే చాలామంది డీలర్లు కందిపప్పు/శనగలు పంపిణీ చేయకుండా పేదలను మోసం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మోసాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో లబ్ధిదారుల నుండి బియ్యం ఇచ్చినప్పుడు ఒకసారి, కందిపప్పు/శనగలకు మరోసారి బయోమెట్రిక్ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సరుకుల పంపిణీలో అవకతవకలకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో కొందరు డీలర్లు షాపులను సరిగా ఓపెన్ చేయకుండా.. ఈ–పాస్ యంత్రాలు పని చేయడం లేదని, నెట్వర్క్ సమస్య ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. లబ్ధిపొందిన కుటుంబాల వివరాలు.. సర్కారు హెచ్చరికలతో దారికి.. ఈ–పాస్ మిషన్లు ఉదయం 5.30 గంటలకే ఆన్ చేయాలని, ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించడంతో డీలర్లు దారికొచ్చారు. ఉదయం నుండి రాత్రి వరకు సరుకులు పంపిణీ చేస్తున్నారు. స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేసిన హెచ్చరికల కారణంగా.. పంపిణీ ప్రారంభించిన రెండురోజుల్లోనే 30.38 లక్షల కుటుంబాలకు ఉచిత సరుకులు అందాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 4,07,857 కుటుంబాలకు పంపిణీ చేశారు. రేషన్ డీలర్లు సహకరించాలి ఉచితంగా పంపిణీ చేస్తున్న సరుకులు కార్డున్న ప్రతి ఒక్కరికీ అందాల్సిందే. రెండుసార్లు బయోమెట్రిక్‌తో కొంత ఇబ్బంది ఉన్నా.. సరుకులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. పేద ప్రజల ప్రయోజనం దృష్ట్యా రేషన్ డీలర్లు కూడా సహకరించాలి. –కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ -
జవాబుదారీతనం
-
జవాబుదారీతనం
నగర, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన తాగునీరు, పారిశుధ్యం.. తదితర అంశాల్లో నాణ్యమైన సేవలు అందాలి. ఈ సేవలు అందనప్పుడు వాటికి ఫీజులు అడగడం సరికాదు. నాణ్యమైన సేవలు అందించడమన్నది పరిపాలనలో ఒక ప్రమాణంగా ఉండాలి. సేవలు నాణ్యంగా ఉన్నాయా? లేదా? అన్నదాన్ని నిర్ధారించడానికి ఒక యంత్రాంగం ఉండాలి. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పౌరుల సమస్యల పట్ల జవాబుదారీతనం ఉండాలని, నాణ్యమైన సేవలు అందించడమే పరిపాలనలో ప్రమాణం కావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం – ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) పరిమితిని పెంచాలన్న రాష్ట్రాల కోరికపై కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు సంబంధించి సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా వన్ నేషన్ – వన్ రేషన్ కార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మున్సిపాల్టీలు–కార్పొరేషన్ల స్వయం సమృద్ధి, విద్యుత్, కార్మిక రంగాల్లో కేంద్రం.. రాష్ట్రాలకు సూచించిన సంస్కరణల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్వయం సమృద్ధిపై సీఎం జగన్ మాట్లాడుతూ.. పౌరుల సమస్యల పరిష్కారం, నాణ్యమైన సేవలు అందించడంపై దృష్టి సారించాలన్నారు. కేంద్రం పంపిన సంస్కరణల మార్గదర్శకాలను పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పోర్టబిలిటీ సదుపాయం – దేశంలో ఎక్కడైనా సరే రేషన్ పొందేలా కేంద్రం వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే పోర్టబిలిటీ సదుపాయం ఉందని, రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. – ఈ విధానంలో రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. బియ్యం కార్డులు, వాటి లబ్ధిదారులతో ఆధార్ సీడింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తికావొచ్చిందన్నారు. నవశకం ద్వారా తీసుకున్న దరఖాస్తులు, వాటిలో అర్హులుగా గుర్తించిన వారితో కలుపుకుని దాదాపు 1.39 కోట్ల మందికి బియ్యం కార్డులు ఉన్నాయని స్పష్టం చేశారు. పరిశ్రమల భద్రత కూడా ముఖ్యం – ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కేంద్రం చెప్పిన సంస్కరణల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ముందంజలో ఉందని అధికారులు వివరించారు. రెడ్ టేపిజానికి దూరంగా సింగిల్ విండో విధానాలు అనుసరిస్తూ, అనుమతుల విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. – రెన్యువల్స్ విషయంలో పారిశ్రామిక వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. పరిశ్రమలు ఎంత ముఖ్యమో, వాటి భద్రత కూడా ముఖ్యమని, వాటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. – పరిశ్రమల్లో కాలుష్యం, భద్రతకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. విశాఖపట్నంలో గ్యాస్ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలన్నారు. – పరిశ్రమల్లో కాలుష్యంపైగానీ, భద్రతపైన గానీ ఫిర్యాదు లేదా సమాచారం రాగానే స్పందించేలా ఈ యంత్రాంగం ఉండాలని స్పష్టం చేశారు. కాలుష్య తనిఖీలతోపాటు కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలని ఆదేశించారు. కార్మికులకు పనికి తగ్గ వేతనం లభించాలి – కార్మిక సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు నిర్దేశించిన సంస్కరణలపై సమావేశంలో చర్చ జరిగింది. కోవిడ్ లాంటి విపత్తు నుంచి తిరిగి పారిశ్రామిక రంగాన్ని పట్టాలపైకి తీసుకొచ్చి, వేగంగా నడిపించడానికి.. మరిన్ని ఉద్యోగాల కల్పన కోసం ఈ సంస్కరణలు తీసుకు రావాలని కేంద్రం చెబుతోందని అధికారులు వివరించారు. – ఈ ప్రయత్నంలో కార్మికుల ప్రయోజనాలకు భంగం కలగకూడదని సీఎం స్పష్టం చేశారు. వారి పనికి తగ్గ వేతనం లభించేలా చూడాలన్నారు. రబీ నుంచి రైతులకు సంపూర్ణంగా నాణ్యమైన విద్యుత్ – విద్యుత్ రంగం సంస్కరణల్లో భాగంగా విద్యుత్ సరఫరా, సాంకేతిక నష్టాలను తగ్గించాలని.. ఏసీఎస్– ఏఆర్ఆర్ మధ్య ఉన్న తేడాను తగ్గించాలన్న కేంద్రం సూచనలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ రంగంలో తీసుకున్న చర్యలపై సమావేశంలో ప్రస్తావించారు. – మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. కరెంటు సరఫరా నష్టాలు రాష్ట్రంలో చాలా తక్కువని అధికారులు వివరించారు. డిస్కంలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించుకుంటూ వాటిని కష్టాల నుంచి బయటకు పడేసే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. – ఉచిత విద్యుత్ రూపంలో ప్రభుత్వంపై భారాన్ని తగ్గించుకునేందుకు, పగటి పూటే 9 గంటల కరెంటు ఇచ్చేందుకు దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా 10 వేల మెగావాట్ల సోలార్ కరెంటు ప్రాజెక్టును తీసుకొస్తున్నామన్నారు. దీనివల్ల తక్కువ ధరకే ప్రభుత్వానికి విద్యుత్ వస్తుందని, దీన్ని రైతులకు అందిస్తుందని పేర్కొన్నారు. – పగటి పూట 9 గంటల కరెంటు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫీడర్లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఇప్పటికే దీనికి సంబంధించి 82 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయయని సీఎం చెప్పారు. మిగిలిన పనులు కూడా పూర్తి అయితే రబీ నుంచి నూటికి నూరు శాతం సంపూర్ణంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ లభిస్తుందని అన్నారు. విద్యుత్ సంస్కరణల విషయంలో మనం చాలా అడుగులు ముందుకేస్తున్నామని అధికారులు తెలిపారు. – సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక, విద్యుత్, పౌరసరఫరాలు, కార్మిక, పరిశ్రమల శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
పేదలకు అండగా
-
రేషన్ ఇద్దామా.. వద్దా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలకు గడిచిన మూడు నెలలుగా పంపిణీ చేస్తున్న మాదిరే పన్నెండు కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకం కొనసాగింపుపై ఇంకా సందిగ్ధత నెలకొంది. మరో ఐదు నెలల పాటు అంటే నవంబర్ వరకు ఉచితంగా ఐదు కిలోల బియ్యం పంపిణీ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించినప్పటికీ, రాష్ట్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై నిర్ణయం తెలపాలని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి ఫైల్ పంపింది. సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేద, మద్య తరగతి రేషన్ దారులకు ఊరటనిచ్చేలా కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ నుంచి 3 నెలల పాటు ఉచితంగా 5 కిలోల బియ్యంతో పాటు, కిలో కందిపప్పును పంపిణీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తంగా 2.80కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా, ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించిన వారు 1.91కోట్ల మంది ఉన్నారు. కేంద్ర పరిధిలోని లబ్ధిదారులకు 5కిలోల బియ్యం వంతున కేంద్రం ప్రతీ నెలా సుమారు 95వేల మెట్రిక్ టన్నుల మేర సరఫరా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న 5 కిలోల ఉచిత బియ్యానికి అదనంగా మరో 7 కిలోలు కలిపి మొత్తంగా 12 కిలోలు అందరు లబ్ధిదారులకు అందించింది. దీంతో ప్రభుత్వంపై ప్రతీ నెలా రూ.1100 కోట్ల మేర భారం పడినా భరించింది. కేంద్రం ఇటీవలే ఉచిత 5 కిలోల బియ్యం పథకాన్ని నవంబర్ వరకు పొడిగించింది.కేంద్రం ఇస్తున్న దానికి కలిపి గతంలో మాదిరి 12 కిలోలు పంపిణీపై రాష్ట్రం నిర్ణయం చేయాల్సి ఉంది. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేంత వరకూ... ప్రధాని ప్రకటన అనంతరం ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై సీఎం స్థాయిలో జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం చేయాల్సి ఉంది. ఐదు నెలల పాటు గతంలో మాదిరి బియ్యం పంపిణీ చేయాలంటే కనీసంగా రూ.5వేల కోట్ల మేర భరించాల్సి ఉంటుంది. దీంతో సీఎం ప్రకటన వచ్చేంత వరకు వేచిచూసే ధోరణిలో ఉన్న పౌర సరఫరాల శాఖ ప్రస్తుతం ఈ నెల ఒకటి నుంచి ఆరంభించాల్సిన రేషన్ పంపిణీని ఇంకా మొదలు పెట్టలేదు. సీఎం నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని రేషన్ డీలర్లకు సమా చారం ఇవ్వడంతో వారెక్కడా పంపిణీ మొదలు పెట్టలేదు. ఒకట్రెండు రోజుల్లో నిర్ణ యం వస్తుందని ఎదురుచూస్తున్నామని, నిర్ణ యం రాగానే పంపిణీ మొదలు పెడతామని పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ఐదో విడతకు రెడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలకు ఐదో విడత ఉచిత సరుకులు పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 29 లేదా 30 నుంచి సరుకులను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. ఈ దఫా కూడా కార్డులోని ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యంతో పాటు కార్డుకు కిలో కందిపప్పు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఉన్న 1.48 కోట్ల కార్డుదారులకు అవసరమైన బియ్యం, కందిపప్పు గోదాముల నుంచి రేషన్ షాపులకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ► మార్చి 29వ తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఇప్పటికే 4 విడతలుగా పేదలకు ఉచితంగా సరుకులు పంపిణీ చేశారు. ► వలంటీర్లు లబ్ధిదారులకు టైంస్లాట్‌తో కూడిన కూపన్లను జారీ చేస్తారు. ► ప్రస్తుతం ఉన్న 29 వేల రేషన్ షాపులకు అదనంగా మరో 15,331 కౌంటర్ల ద్వారా సరుకులు పంపిణీ చేయనున్నారు. ► కేంద్రనిబంధనల మేరకు లబ్ధిదారుల బయోమెట్రిక్ తప్పనిసరి. పోర్టబులిటీ ద్వారా లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడే సరుకులు తీసుకోవచ్చు. -
వేలి ముద్రలు పడకపోయినా రేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి ష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సాధారణంగా ఈ–పాస్ మిషన్‌లో వేలి ముద్రలు వేస్తేనే సరుకులు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, లెప్రసీ (కుష్టు వ్యాధి) బాధితులు, తాపీ పని చేసే కార్మికులు, రజకులు (ఇస్త్రీ చేయడం) తదితర వృత్తులు చేసే వారికి వేలిముద్రలు అరిగిపోయి యంత్రాల్లో పడటం లేదు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఇచ్చే సరుకులు తీసుకోవడానికి వారు ప్రతి నెలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ‘నామినీ’ (బంధువుల) ద్వారా బయోమెట్రిక్ తీసుకొని సరుకులు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐరిష్ యంత్రాల్లో సమస్య వేలి ముద్రలు సరిగా పడని వారికోసం ఐరిష్ మిషన్లు అందుబాటులో ఉంచినా, పలు కారణాలతో అవి సరిగా పనిచేయడంలేదు. పేదలెవరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నామినీ ద్వారా సమీప బంధువుల బయోమెట్రిక్ తీసుకొని లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తోంది. బంధువులు అందుబాటులో లేని పక్షంలో వీఆర్వో లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి బయోమెట్రిక్ తీసుకొని సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇంటి వద్దే సబ్సిడీ సరుకుల పంపిణీ వేలిముద్రలు, ఐరిష్ యంత్రాల సమస్య వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఇంటి వద్దే సబ్సిడీ సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిం ది. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సబ్సిడీ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తీసుకురానుంది. వేలి ముద్రలు సరిగా పడకపోవడం తదితర కారణాలతో నామినీ వేలిముద్రల సాయంతో ఈనెలలో 35,282 మంది లబ్ధిదారులు ఉచిత సరుకులు తీసుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేలిముద్రల సమస్యను పరిష్కరించి నామినీ విధానంలో రేషన్ సరుకులు అందిస్తుండడంపై పేద లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
30 వేల టన్నుల బియ్యం పంపిణీ..
సాక్షి, అమరావతి: పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత సరుకుల పంపిణీ శనివారం ప్రారంభమైంది. తొలి రోజు 24.38 లక్షల కుటుంబాలకు రేషన్ అందింది. ఇందులో వలస వెళ్లిన, అవసరాల నిమిత్తం వెళ్లి ఇతర ప్రాంతాల్లో నిలిచిపోయిన 6 లక్షల మంది లబ్ధిదారులు పోర్టబిలిటీ ద్వారా సరుకులు తీసుకున్నారు. శనివారం ఒక్కరోజే 30,996.533 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,664.344 మెట్రిక్ టన్నుల శనగలు పంపిణీ చేశారు. ఉపాధి లేని వేళ.. ► లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు లేదా శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ► లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికే 3 విడతలుగా సరుకులు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. నాలుగో విడత పంపిణీ శనివారం నుంచి ప్రారంభమైంది. ► రాష్ట్రంలో 1.48 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఒక్కో రేషన్ షాపులో రోజుకు 30 మందికే టోకెన్లు జారీ చేశారు. ► టైం స్లాట్‌తో కూడిన కూపన్లు ముందుగా ఇవ్వడం వల్ల పంపిణీ సాఫీగా సాగుతోంది. కార్డుదారుల వేలి ముద్రలు నమోదు చేస్తున్నందున లబ్ధిదారులు చేతులు శుభ్రం చేసుకునేందుకు వీలుగా ప్రతిచోట శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. -
‘టీడీపీ కంటే మాది వందరెట్లు మెరుగైన పాలన’
సాక్షి, విజయవాడ: టీడీపీ పాలన కంటే వంద రెట్లు మెరుగైన పాలన అందిస్తున్నామని విజవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు చెప్పారు. శనివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని విష్ణు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా పేదలకు ఉచిత రేషన్ ఇస్తున్నాం. లాక్డౌన్ కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేలా ప్రభుత్వం నాలుగో విడుత రేషన్ అందిస్తోంది. వాలేంటీర్ల వ్యవస్థ ను వినియోగించుకుని భౌతిక దూరం పాటిస్తూ పేదలకు రేషన అందిస్తున్నాం.రాష్ట్ర వ్యాప్తంగా కోటి 50 లక్షల పై చిలుకు, నగరంలోని 1లక్ష 74వేల రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ ద్వారా లబ్ది చేకూరుతుంది. రేషన్‌కార్డు లేని వారికి వార్డు సచివాలయల ద్వారా నూతన కార్డులు వచ్చేలా చర్యలు చేపట్టాం. రాష్టంలో లబ్ధిదారులకు 80 వేల నూతన రేషన్ కార్డులు అందించాం. పేదవారు ఎవరు ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోంది. లాక్ డౌన్ సమయంలో సైతం సంక్షేమపథకాలు అమలు చేస్తోన్నాం. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పావలా వడ్డీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ పధకాలు తెచ్చాం. రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని మల్లాది విష్ణు తెలిపారు. ఇక కరెంట్ చార్జీల విషయంలో ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కరెంట్ ఛార్జీలు పెంచలేదని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పులను తమ ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. దేవినేని ఉమా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. (జనసేన నేత దాడి.. ఆత్మహత్యాయత్నం) మొక్క జొన్న రైతులకు 500 కోట్లు , విద్యార్థులకు1700 కోట్లు చెల్లించామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని ప్రతి పక్షాలు చూస్తున్నాయని, నిబంధనలకు వ్యతిరేకంగా కరెంటు చార్జీలు పెంచిన దాఖలాలు లేవని వెల్లడించారు. విద్యుత్ శాఖ అధికారులను సబ్ స్టేషన్ ల వారిగా ప్రజల్లోకి వెళ్లి ఈ విషయాన్ని వివరించమని ఆదేశించినట్లు తెలిపారు. విజయపాల డైరీ ధరలను లీటరుకు 4 రూపాయలు ఎవరిని అడిగి పెంచారని నిలదీశారు. పాల ధరల పెంపుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల మీద నాలుగు రూపాయలు భారం వేసి ఏ మోహం పెట్టుకుని తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. బకాయిలు, అప్పులు, అవినీతి ప్రభుత్వం టీడీపీదని ... సంక్షేమ ప్రభుత్వం తమదని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. సబ్సిడీలు ప్రగతికి ప్రతి బంధకాలు అనుకునే నాయకుడు చంద్రబాబు నాయుడుని, దుర్ఘటనలను కూడా స్వార్ధ ప్రయోజనాలకు వాడుకునే నీచ నాయకుడు ఆయన అని ధ్వజమెత్తారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, అన్ని వర్గాలకు ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తుందని తెలిపారు. మే 30 రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే రోజు అని తెలిపారు. టీడీపీ దౌర్భాగ్య పాలనకు నిదర్శనం 23 సీట్లు గెలవడమేనని ఎద్దేవా చేశారు. బోండా ఉమా, దేవినేని ఉమాకి సీఎం జగన్ మోహన రెడ్డిని విమర్శించే నైతిక హక్కులేదని మండిపడ్డారు. ('పర్యావరణం కాపాడేవారైతే అక్కడెందుకున్నారు') -
ఆధార్‌తో పేదలకు ఉచిత సరుకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బియ్యం కార్డులు లేని పేదలకు ఆధార్ నంబర్ ఆధారంగా ఉచిత రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బియ్యం కార్డు కోసం వచ్చిన దరఖాస్తులను వలంటీర్లు, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి 81,862 మందిని అర్హులుగా తేల్చారు. అయితే.. ప్రస్తుతం సామాజిక తనిఖీ నిర్వహించే అవకాశం లేనందున వారికి కొత్తగా బియ్యం కార్డులకు సంబంధించి నంబర్లను జారీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బియ్యం కార్డులు లేకపోయినా కుటుంబ యజమాని ఆధార్ నంబర్ ఆధారంగా ఈ నెల 4 నుంచి∙వారందరికీ ఉచిత రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఆధార్ నంబర్‌ను ఈ – పాస్ మిషన్‌లో నమోదు చేయనున్నారు. వారి నుంచి బయోమెట్రిక్ తీసుకొని సరుకులు పంపిణీ చేసేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ► లాక్డౌన్ కారణంగా ఆహారం కోసం పేదలు ఇబ్బందులు పడకుండా ఇప్పటికే రెండు విడతలుగా ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేసింది. ► మూడో విడత రేషన్ పంపిణీ ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే 90,95,969 కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి. ► రాష్ట్రంలో 20,02,224 మంది లబ్ధిదారులు పోర్టబిలిటీ ద్వారా లబ్ధి పొందారు. ► రాష్ట్రంలో 1,47,24,016 తెల్ల రేషన్ కార్డులున్న లబ్ధిదారులకు ఉచిత సరుకులు పంపిణీ చేస్తారు. ► రేషన్ అందకపోయినా, ఇతర ఇబ్బందులు ఉన్నా 1902 నంబర్‌కు ఫోన్ చేస్తే అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారు. -
తొలి రోజు ఉచిత రేషన్ 21.55 లక్షల కుటుంబాలకు..
సాక్షి, అమరావతి: లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న మూడో విడత ఉచిత సరుకుల పంపిణీ ప్రారంభమైన బుధవారం తొలిరోజు 21.55 లక్షల కుటుంబాలకు అందించినట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ► రేషన్ దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఈసారి కూడా లబ్ధి్దదారులకు టైంస్లాట్‌తో కూడిన కూపన్లు పంపిణీ చేశారు. ► ప్రభుత్వ సూచనల మేరకు రేషన్ షాపుల వద్ద శానిటైజర్లను డీలర్లు అందుబాటులో ఉంచారు. సరుకుల కోసం వచ్చిన వారు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే రేషన్ డీలర్లు బయోమెట్రిక్ తీసుకున్నారు. బియ్యంతో పాటు కందిపప్పు పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ► రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు 4,73,537 కుటుంబాలకు పోర్టబులిటీ ద్వారా సరుకులు అందించారు. ► వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు కూలడంతో కొన్ని చోట్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ–పాస్ మిషన్లు పని చేయకపోవడంతో ఆ రెండు జిల్లాల్లో పంపిణీ ఆలస్యమైంది. -
నేటి నుంచి ఉచిత రేషన్
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. ఇప్పటికే రెండు విడతల ఉచిత రేషన్ సరుకులను పంపిణీ చేయగా బుధవారం నుంచి వచ్చే నెల 10 వరకు మూడో విడత కింద ఉచిత రేషన్ సరుకులను అందించనుంది. ఈసారి మొత్తం 1.48 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో మార్చి 29 నుంచి, రెండో విడతలో ఈ నెల 16 నుంచి సరుకులు పంపిణీ చేశారు. ఈసారి కూడా రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యంతోపాటు ప్రతి కార్డుకు కిలో కందిపప్పును ఉచితంగా అందిస్తారు. ఈ మేరకు ఇప్పటికే సరుకులు రేషన్ షాపులకు చేరుకున్నాయి. ► రెండో విడత సరుకుల పంపిణీ వరకు రాష్ట్రంలో 1,47,24,016 తెల్ల రేషన్ కార్డులున్నాయి. ► బియ్యం కార్డుల కోసం ‘స్పందన’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ► వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అందులో 81,862 మందిని అర్హులుగా తేల్చారు. ► ప్రస్తుతం మూడో విడత సరుకులు తీసుకునేందుకు మొత్తం 1,48,05,878 మందిని అర్హులుగా తేల్చినట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ► ఈ దఫా ఉచిత సరుకులు తీసుకునే లబ్ధిదారులకు బయోమెట్రిక్ తప్పనిసరి. ► కరోనా నేపథ్యంలో ఒక్కో దుకాణం పరిధిలో రోజుకు 30 మంది లబ్ధిదారుల చొప్పున టైమ్‌స్లాట్ విధానంలో టోకెన్లు పంపిణీ చేశారు. ► అన్ని రేషన్ షాపులు, అదనపు కౌంటర్ల వద్ద శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు, నీళ్లు అందుబాటులో ఉంచారు. ► రేషన్ కార్డులు ఎక్కువ ఉన్న రేషన్ షాపులకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ► పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న కార్డుదారులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే సరుకులు తీసుకునేందుకు వీలు కల్పించారు. ► రేషన్ అందకపోయినా, ఇతర ఇబ్బందులు ఉంటే 1902 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ► 28,354 రేషన్ షాపులు, 15,331 అదనపు కౌంటర్లు కలిపి 43,685 చోట్ల లబ్ధిదారులకు ఉచిత సరుకులు పంపిణీ చేయనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ: మూడో విడత కింద ఉచిత రేషన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు బియ్యం, కందిపప్పును పంపిణీ చేస్తామన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా కార్డుల కోసం 95 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరందరికీ కూడా రేషన్ సరుకులను ఉచితంగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రేషన్ కార్డు లేకపోయినా వీఆర్వోల ద్వారా రేషన్ సరుకులు ఇవ్వాలన్నారు. -
29 నుంచి మూడో విడత ఉచిత సరుకులు
సాక్షి, అమరావతి: పేదలకు మూడవ విడత ఉచిత సరుకులు ఈ నెల 29 నుంచి మే నెల 10వ తేదీ వరకు పంపిణీ చేయనున్నారు. కరోనా విపత్తు సమయంలో ఉపాధిలేని పేదలకు ఆకలి బాధ ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటికే రెండు విడతలుగా ఉచిత సరుకులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మూడో విడత పంపిణీ సందర్భంగా రెవిన్యూ అధికారులకు, డీలర్లకు ప్రత్యేక జాగ్రత్తలు సూచిస్తూ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. ► కరోనా నేపథ్యంలో ఒక్కో దుకాణం పరిధిలో రోజుకు 30 మంది లబ్ధిదారులకు టైం స్లాట్ టోకన్లు ఇచ్చి పంపిణీ చేయాలి. ► మొదటి, రెండో విడతల్లో వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించగా ఈసారి మాత్రం లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలి. ► అన్ని రేషన్ షాపుల వద్ద శానిటైజర్, మాస్కులు ఉంచాలి. ► ప్రతి లబ్ధిదారుడు బయోమెట్రిక్ ఉపయోగించే ముందు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా డీలర్లు జాగ్రత్త వహించాలి. ఏడాదికి సరిపడా ఆహార నిల్వలు సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏడాదికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కరోనా వేళ ఆహార ధాన్యాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వద్ద 16.89 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నందున సెప్టెంబర్ నాటికి మరో 12 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చే అవకాశం ఉందన్నారు. లాక్డౌన్ ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చి 29 నుంచి ఏప్రిల్ 29వ వరకు 1.47 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులకు మూడు విడతలుగా ఉచితంగా బియ్యంతో పాటు కిలో కందిపప్పు లేదా శనగలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో ఈనెల అదనంగా మరో 70 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఎఫ్‌సీఐ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ► రాష్ట్రంలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గొడౌన్ల నుంచి ఇటీవల కర్ణాటక, కేరళ, తమిళనాడుకు 1,93,330 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపారు. యానాంకు 189 మెట్రిక్ టన్నులు, అండమాన్ నికోబార్ దీవులకు 304.310 మెట్రిక్ టన్నులు పంపారు. ► వలస కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి మేరకు విశాఖపట్నానికి 10 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సబ్సిడీపై కేటాయించింది. ► ఎఫ్‌సీఐ వద్ద 7.35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 11,082 మెట్రిక్ టన్నుల గోధుమలు అందుబాటులో ఉన్నాయి. -
సక్రూభాయికి అరుదైన గౌరవం..
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన అంగన్వాడీ కార్యకర్త సక్రూబాయ్ సేవలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. దివ్యాంగురాలైనా కూడా కరోనా వైరస్‌కు భయపడకుండా ఇంటింటికీ వెళ్లి పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నందుకు ఆమెను కొనియాడింది. ఈ మేరకు ఆమెకు లేఖ రాసింది. దీనిపై సక్రూబాయ్ సంతోషం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతోనే వైకల్యాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. ఆ కేంద్రాల్లోని పిల్లలు, బాలింతలు, గర్భిణులకు కార్యకర్తల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే ఏర్పాట్లు చేసింది. ► ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ఈపూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులోని అంగన్వాడీ కార్యకర్త తన పరిధిలోని అందరికీ మూడుసార్లు రేషన్‌ను సరఫరా చేసింది. ► ఆమె దివ్యాంగురాలైనా ట్రై సైకిల్ సాయంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు రేషన్ పంపిణీ చేసింది. ► ఈ సమాచారం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆమెను అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ శాఖకు లేఖ రాసింది. ► దివ్యాంగురాలైనా రేషన్ పంపిణీలో ఆమె తన చిత్తశుద్ధి చాటుకున్నారని లేఖలో అభినందించింది. ► సక్రూభాయిని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సకల ఉద్యోగుల సంఘం మరో ప్రకటనలో అభినందించింది. ► రాష్ట్రంలోని 6.20 లక్షల గర్భిణులకు, బాలింతలకు, 22 లక్షల మంది పిల్లలకు (ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు) మూడుసార్లు రేషన్ పంపిణీ చేసినట్లు రాష్ట్ర ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. మరింతగా సేవలందిస్తా.. కేంద్ర ప్రభుత్వం నేను చేస్తున్న సేవలను గుర్తించటం చాలా సంతోషంగా ఉంది. 2002లో ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నా. మా ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో వైకల్యాన్ని లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నా. ఈ రోజు నాకు వచ్చిన గుర్తింపుతో పడ్డ కష్టమంతా మరచిపోయా. మా ఉన్నతాధికారులు, తోటి కార్యకర్తలు, బంధువులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సాహంతో మరింతగా పనిచేస్తాను. –కె.సక్రూభాయి, అంగన్వాడీ కార్యకర్త, మన్నేపల్లి, బొల్లాపల్లి మండలం, గుంటూరు జిల్లా -
1.10 కోట్ల కుటుంబాలకు ఉచిత సరుకులు
సాక్షి, అమరావతి: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత రేషన్ పంపిణీ రెండో విడత కార్యక్రమంలో ఇప్పటి వరకు 1.10 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. ఇందులో స్థానికేతరులుగా ఉన్న 25.62 లక్షల మంది పోర్టబిలిటీ ద్వారా ప్రస్తుతం వారు నివాసం ఉన్న ప్రాంతాల్లోనే సరుకులు తీసుకున్నారు. మొదటి విడత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రెండో విడతను మరింత పక్కాగా చేపట్టింది. సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు రేషన్ దుకాణం వద్ద లబ్ధిదారులు గుమికూడకుండా ఉండేందుకు టైం స్లాట్‌తో కూడిన కూపన్లను కేటాయించి సాఫీగా సాగేలా చేశారు. ఉదయం ఆరు గంటలకే పంపిణీ చేపట్టడం వల్ల కూడా ఎక్కువ మంది సరుకులు తీసుకునే అవకాశం ఏర్పడింది. మొదటి విడతలో బియ్యంతో పాటు కందిపప్పు ఇవ్వగా ఈసారి బియ్యంతో పాటు శనగలు అందించారు. మిగిలిన లబ్ధిదారులు కూడా వారికి కేటాయించిన సమయానికి రేషన్ షాపునకు వెళ్లి సరుకులు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచించారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో నివాసం ఉన్న పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వలంటీర్లు వారి ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు పంపిణీ చేశారు. -
3 రోజులు.. 86.23 లక్షల కుటుంబాలు
సాక్షి, అమరావతి: అధికారులు, రేషన్ డీలర్లు, గ్రామ, వార్డు వలంటీర్ల కృషితో మూడు రోజుల్లోనే రాష్ట్రంలో 86.23 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత రేషన్ సరుకులు అందాయి. శనివారం ఒక్క రోజే 33.26 లక్షల మంది కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి. ఇప్పటి వరకు 1.26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 8,524 మెట్రిక్ టన్నుల శనగల్ని పేదలకు పంపిణీ చేశారు. రేషన్ కార్డుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పంపిణీ చేశారు. రాష్ట్రంలో 18.67 లక్షల మంది పోర్టబులిటీ ద్వారా సరుకులు తీసుకున్నారు. తెల్లరేషన్ కార్డులున్న 1,47,24,017 కుటుంబాలకు సరుకులు అందుబాటులో ఉంచినట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియోకార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. -
రికార్డు స్థాయిలో ఉచిత రేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రోజుల్లోనే అర కోటి కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా ఉచిత సరుకులు పంపిణీ చేశారు. పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి సరుకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 29,620 రేషన్ షాపులతో పాటు అదనంగా 14,315 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఎక్కువ కుటుంబాలకు ఉచిత సరుకులు పంపిణీ చేయడంతో రికార్డు నెలకొల్పినట్లైంది. రెండో విడత పంపిణీ గురువారం నుండి ప్రారంభం కాగా శుక్రవారం నాటికి 50 లక్షల కుటుంబాలకు సరుకులు అందాయి. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు రెండో విడత ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 5 గంటలకే రేషన్ షాపులు ఓపెన్ చేసేలా చర్యలు తీసుకున్నామని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు వెల్లడించారు. చాలా చోట్ల సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు వలంటీర్లకు డీలర్లు సహకరించారు. టైమ్ స్లాట్ కూపన్స్ విధానం రేషన్ షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి. కేంద్రప్రభుత్వం అదనంగా ఉచిత రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఆహార భద్రతా పథకం కింద ఉన్న 92 లక్షల కుటుంబాలకే వర్తిస్తోంది. మిగిలిన 55.24 లక్షల కుటుంబాలకు అయ్యే అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి బియ్యంతో పాటు శనగలు పంపిణీ చేస్తోంది. -
ఏపీ: పేదల ముంగిటకు ఉచిత రేషన్
సాక్షి, అమరావతి: లాక్డౌన్ నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా రెండో విడత అందిస్తున్న సరుకుల పంపిణీ గురువారం సజావుగా ప్రారంభమైంది. రేషన్ దుకాణాల వద్ద రద్దీని నివారించేందుకు టైం స్లాట్‌తో కూడిన కూపన్లు జారీ చేయడంతో నిర్దేశించిన సమయానికి చేరుకుని వేచి చూడాల్సిన పని లేకుండా సరుకులు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో కుటుంబానికి కిలో శనగలు, రేషన్ కార్డులో నమోదైన ప్రతి సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందచేశారు. కరోనా వైరస్ ప్రభావంతో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రభుత్వం నేరుగా లబ్ధి్దదారుల ఇళ్లకే ఉచిత రేషన్ సరుకులను అంద చేసింది. బయోమెట్రిక్ లేకుండా భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. లాక్డౌన్ వల్ల పేదలు ఆకలితో వస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఈ నెలలో మూడు దఫాలు ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మొదటి విడత సరుకులను గత నెల 29 నుంచి ఈ నెల 15 వరకు పంపిణీ చేశారు. పంపిణీ ఇలా.. ► కొందరు డీలర్లు ఉదయం ఆరు గంటల నుంచే సరుకుల పంపిణీ ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ ఉదయం 5 గంటలకే కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు జాయింట్ కలెక్టర్లతో పర్యవేక్షించారు. ► రెండో విడత ఉచిత సరుకులను మొదటిరోజు 18,33,245 కుటుంబాలకు పంపిణీ చేశారు. ► పోర్టబిలిటీ ద్వారా 3,51,185 కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 56,659, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 10 కుటుంబాలు పోర్టబిలిటీని వినియోగించుకున్నాయి. ► రాష్ట్రవ్యాప్తంగా 26,712.441 టన్నుల బియ్యం, 1,714.302 టన్నుల శనగలు తొలిరోజు పంపిణీ చేశారు. ► రేషన్ షాపుల వద్ద శానిటైజర్, సబ్బు, నీటిని అందుబాటులో ఉంచారు. రెడ్ జోన్లలో ఇంటికే రేషన్ – విశాఖ జిల్లాలో 2,179 రేషన్ దుకాణాలతో పాటు 1,817 తాత్కాలిక కౌంటర్ల ద్వారా ఉచిత సరుకుల పంపిణీ చేపట్టారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 1,15,014 మందికి సరుకులు అందచేశారు. రెడ్‌జోన్ ప్రాంతాలైన పద్మనాభం మండలం రేవిడి వెంకటాపురం, పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాల్లో లబిŠాధ్దరులకు ఇంటి వద్దే వలంటీర్లు ఉచిత సరుకులు పంపిణీ చేశారు. – కరోనా కేసులు అధికంగా నమోదు కావడంతో రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇస్లాంపేటలో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి ఉచిత రేషన్ సరుకులు అందజేశారు. పేదింటిని కాపాడారు.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం జగన్నాయకులపాలేనికి చెందిన భూమాడి సత్తిరాజు చేనేత కార్మికుడు. ఆయన పనిచేసే బట్టల దుకాణం లాక్‌డౌన్‌తో మూత పడటంతో ఆందోళనకు గురయ్యాడు. ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు అందించడంతో పాటు రూ.వెయ్యి నగదు సాయం కూడా చేయడంపై పేదింటిని కాపాడిన దేవుడు ముఖ్యమంత్రి జగన్ అని కృతజ్ఞతలు తెలిపాడు. కరోనా ఉన్నా ఆగలేదు.. ‘కష్టకాలంలో ప్రభుత్వం ఉచితంగా బియ్యం, పప్పులు అందించి ప్రజలను అదుకుంది. మా గ్రామంలో నలుగురికి కరోనా సోకడంతో వలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు ఉచితంగా ఇంటివద్దే అందచేశారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు’ – ఎం.నాగరాజు, వెంకటాపురం, పద్మనాభం మండలం, విశాఖ జిల్లా గుడివాడలో డోర్ టు డోర్ పంపిణీ గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా త్వరలో ప్రారంభించనున్న డోర్ టు డోర్ రేషన్ సరుకుల పంపిణీలో లోటుపాట్లను గుర్తించేందుకు కృష్ణా జిల్లాలోని గుడివాడతోపాటు కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఒక ప్రకటనలో తెలిపారు. కార్డుదారుల ఎదురుగానే తూకం వేసి వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు రేషన్ సరుకులు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 56 లక్షల టన్నుల ధాన్యం పండిందని, దీనిలో 33 లక్షల టన్నులు పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ధాన్యం విక్రయించదలచిన రైతులు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కొడాలి నాని ఇంటికే వచ్చింది ప్రకాశం జిల్లా ఒంగోలు ఇస్లాంపేటలో ఇంటింటికి వెళ్లి ఉచిత రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తున్న వలంటీర్లు తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం ఉమ్మిడివరంలో తన ఇంటివద్ద వలంటీర్ రామకృష్ణ అందిస్తున్న బియ్యాన్ని తీసుకుంటున్న పాయం రాధ -
సీఎం వైఎస్ జగన్ పేదల పక్షపాతి
-
ఏపీ : రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత రేషన్ సరకుల పంపిణీ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం నుంచే కూపన్లు తీసుకున్న వారికి ఒక్కో కుటుంబానికి కేజీ శనగలు, ఒక్కో సభ్యుడికి 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు.రెడ్ జోన్ ఏరియాల్లో నేరుగా కార్డుదారుని ఇంటికే ఉచిత రేషన్‌ను పంపిణీ చేస్తున్నారు. తొలి విడతగా మార్చి 29వ తేదీ నుంచి కార్డులో పేరు ఉన్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. రెండో విడతలో భాగంగా రాష్ట్రంలో 1,47,24,017 కుటుంబాలకు బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా అందిస్తున్నారు. అందరూ ఒకేసారి రేషన్ షాప్ లోకి రాకుండా సమయాలను సూచిస్తూ వాలంటీర్లు కూపన్లు పంపిణీ చేశారు. కార్డుదారులు తమకు ఇచ్చిన కూపన్లోని సమయాల్లోనే రేషన్ షాపుకు వచ్చి సరుకులను తీసుకెళ్తున్నారు. ఇక లబ్దిదారులు భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు పకడ్బంధీగా చర్యలు తీసుకున్నారు. బయోమెట్రిక్ లేకుండానే సరుకులను అందజేస్తున్నారు. నేరుగా ఇంటికే రేషన్..! లాక్డౌన్ నేపథ్యంలో రెండో విడత ఉచిత రేషన్ కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా కేంద్రం మచిలీపట్నం నగర పాలక సంస్థలో ఉచిత డోర్ డెలివరీని మంత్రి పేర్ని నాని, ఆర్డీవో ఖాజావలీ ప్రారంభించారు. కార్డులోని కుటుం సభ్యులకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం, ప్రతి కార్డుకి కిలో శనగలు పంపిణీ చేశారు. 27 వరకు అందిస్తాం : మంత్రి వెల్లంపల్లి రెండో విడత ఉచిత రేషన్‌ను ఈ నెల 27వరకు అందిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విజయవాడ తూర్పులో రెండో విడత రేషన్ సరకుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెల్లకార్డు లేకపోయినా పేదవానిరి గుర్తిస్తే సరుకులు అం దిస్తామని తెలిపారు. ముందుగా రెడ్ జోన్ల ప్రాంతాలతో ఇంటికే రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నామని, ఆతర్వాత అన్ని ప్రాంతాల వారికి అందిస్తామని చెప్పారు. ►తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరడ గ్రామంలో రెండో విడత బియ్యం పంపిణీని ఆర్డివో చిన్న కృష్ణ ప్రారంభించారు. ►నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు ఆర్ఆర్ కాలనీలో రెండో విడత రేషన్‌ను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో పేదలు ఆకలితో వస్తులు ఉండకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు సార్లు రేషన్ అందిస్తున్నారని తెలిపారు. ►కర్నూలు జిలాల్లోని 2436 రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ ప్రారంభమైంది. లాక్డౌన్ నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా 2,036 కౌంటర్లు ఏర్పాటు చేసి జిల్లాలోని 11.91 లక్షల కార్డు దారులకు రేషన్ అందిస్తున్నారు. ►వైఎస్సార్ జిల్లా రామరాజుపల్లిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పర్యటించి ఉచిత రేషన్ సరకులను అందించారు. రేషన్ సరకులకు వచ్చే ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. కూపన్లలో తెలిపిన సమయానికే రేషన్‌కు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ►వైయస్సార్ జిల్లా రాయచోటిలో తెల్లవారుజామున ఆరు గంటల నుంచి విపత్తు పరిహారం క్రింద ఎపి సర్కార్ అందిస్తున్న ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం కోనసాగుతుంది. సచివాలయ, రెవిన్యూ సిబ్బంది పర్యవేక్షణలో పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. గుంపులు గుంపులుగా లబ్ధిదారులు రాకుండా ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ ద్వారా టైమింగ్ స్లాట్ ఇవ్వడంతో లబ్ధిదారులు సమయపాలన పాటిస్తూ, భౌతిక దూరం వహిస్తూ రేషన్ తీసుకోంటున్నారు. ►తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 16.5 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. 600 కార్డులు దాటితే అదనపు కేంద్రాలను ఏర్పాటు చేసి రేషన్ సరుకులను అందిస్తున్నారు. ►కృష్ణా జిల్లా నందిగామ నియోజవర్గంలో ఉదయం 6 గంటలకే రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. కేటాయించిన సమయంలో కార్డు దారులను వాలంటీర్లు రేషన్ షాపుకు తీసుకొస్తున్నారు. ►శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 8.29 లక్షల కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు లేని అర్హులైన 14677 మందిని గుర్తించి వారికి కూడా సరుకులు అందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13,300 టన్నుల బియ్యం, 824 టన్నుల శనగలు పంపిణీ చేయనున్నారు. ►అనంతపురం జిల్లా కదిరిలో రేషన్ సరుకులను వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డా.సిద్దారెడ్డి ప్రారంభించారు. ►కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని రేషన్ దుకాణం షాప్ నెం 1,2,4,5,13,14, 114 లలో ఎమ్మెల్యే ఆర్థర్ అకస్మిక తనిఖీలు నిర్వహించారు. చౌక దుకాణం వద్ద సామాజిక దూరం పాటించాలని లబ్దిదారులకు అవగాహన కల్పించారు. రేషన్ కోసం క్యూలైన్లలో ఉన్న వారికి మాస్కలు,శానటైజర్లు పంపిణీ చేశారు. 4వ చౌక దుకాణం వద్ద రేషన్ పంపిణీ సరిగ్గా జరగడం లేదని డీలర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా, సామాజిక దూరం పాటిస్తూ సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. -
రెండోవిడత ఉచిత రేషన్ పంపిణీకి సర్వం సిద్దం
సాక్షి, అమరావతి : కరోనా విపత్తు సమయంలో పేదలు ఉపాధి లేక ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు గురువారం నుంచి రాష్ట్రంలో రెండో విడత ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా బియ్యం, కేజీ శనగలను అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 13 జిల్లాల్లోని 29,783 చౌక దుకాణాల ద్వారా మొత్తం 1,47,24,017 కుటుంబాలకు బియ్యం, శనగలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే అన్ని చౌక దుకాణాలకు బియ్యం, శనగలను రవాణా చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరంను పాటించాలన్న నిబంధనల మేరకు రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుంపులుగా ఏర్పరకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలను తీసుకుంది. మొదటివిడత పంపిణీ సందర్బంగా కొన్నిచోట్ల రేషన్ కోసం కార్డుదారులు తొందరపడి ఒకేసారి దుకాణాల వద్దకు వచ్చిన పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. రేషన్ ఏ సమయంలో తీసుకోవాలో తెలిపేలా కూపన్లు.. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కూపన్లను ముద్రించింది. వాలంటీర్ల ద్వారా ఈ కూపన్లను బియ్యం కార్డుదారులకు అందిస్తున్నారు. ఈ కూపన్లపై వారికి కేటాయించిన రేషన్ షాప్‌లో, ఏ తేదీలో, ఏ సమయానికి వారు వెళ్ళి రేషన్ తీసుకోవచ్చో నిర్ధేశిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో వేర్వేరుగా నిర్ణయించిన సమయాలకు అనుగుణంగా కార్డుదారులు రేషన్ షాప్‌లకు వెళ్ళి బియ్యం, శనగలను తీసుకోవాలని సూచిస్తున్నారు. దానివల్ల ఎక్కడా కూడా ఒకేసారి జనం గుమిగూడకుండా నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. వేలిముద్ర వేయకుండానే, వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించనున్నారు. కార్డులు ఎక్కువ ఉన్నచోట్ల అదనపు కౌంటర్లు రాష్ట్రంలోని 14,315 రేషన్ దుకాణాల్లో ఎక్కువ కార్డులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. వాటిలో అధికశాతం అర్బన్ ఏరియాల్లో ఉన్నందున్న రేషన్ కూపన్లను అందించినా కూడా రోజుల తరబడి రేషన్ పంపిణీ చేయాల్సి వస్తోంది. దీంతో ఎక్కువ కార్డులు నమోదైన షాప్‌లకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో 8 వేల దుకాణలకు సింగిల్ కౌంటర్, 3800 దుకాణాలకు రెండు కౌంటర్లు, 2,500 షాప్ లకు అదనంగా 3 కౌంటర్లు సిద్ధం చేశారు. ఈ అదనపు కౌంటర్లలో తూకం యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు బియ్యం కార్డులు వున్నాయి. కానీ కేంద్రం మాత్రం 92 లక్షల కార్డులకే ఉచిత బియ్యంను అందిస్తోంది. మిగిలిన 55 లక్షల మందికి రాష్ట్రప్రభుత్వమే ఉచితంగా బియ్యం, కేజీ శనగలను అందిస్తోంది. దీనితోపాటు బియ్యంకార్డులు పొందేందుకు అన్ని అర్హతలు వుండి, దరఖాస్తు చేసుకున్న పేదలకు కూడా ఉచిత బియ్యం, శనగలను అందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పేదలు రెవెన్యూ అధికారులకు ఉచిత బియ్యం కోసం దరఖాస్తు చేసుకుంటే, అర్హతలను పరిశీలించి వెంటనే మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకునే వారిని కూడా ముందుగానే వాలంటీర్లు గుర్తించి సివిల్ సప్లయిస్ అధికారులకు సమాచారం అందచేశారు. లక్షల సంఖ్యలో పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న కార్డుదారులకు కూడా వారు నివాసం వుంటున్న ప్రాంతంలోని రేషన్ దుకాణం నుంచి సరుకులు తీసుకునేందుకు వీలుగా వాలెంటీర్లు కూపన్లను అందిస్తున్నారు. నెలాఖరులో మూడో విడత.. గత నెలలో ప్రారంభమైన లాక్డౌన్ వల్ల రాష్ట్రంలో రోజువారీ కూలీపనులు చేసుకునే పేదలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని గతనెల 29వ తేదీన తొలివిడతగా ఉచితంగా రేషన్కారుడలో పేరు ఉన్న ఒక్కో సభ్యుడికి అయిదు కిలోల బియ్యం, కార్డుకు కేజీ కందిపప్పును ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. తొలివిడతలోనే దాదాపు 1.35 కోట్ల మంది పేదలు ఈ మేరకు లబ్ధిపొందారు. రెండో విడతలో భాగంగా రేపటి నుంచి ఉచిత బియ్యం, కేజీ శనగలను పంపిణీ చేస్తున్నారు. తిరిగి నెలాఖరులో మూడోవిడత కూడా ఇదే తరహాలో బియ్యం, కందిపప్పు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం రేషన్ సరుకులను డోర్ డెలివరీ ద్వారా అందిస్తోంది. మిగిలిన కరోనా ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ జోన్ గా ప్రకటించిన ఏరియాల్లో బియ్యంకార్డు దారులు సురక్షితమైన జోన్లో సరుకులు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ లకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రేషన్ అందక, ఇతరత్రా ఇబ్బందులు వుంటే 1902 కి కాల్ చేస్తే వెంటనే అధికారయంత్రాంగం చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారిగా రేషన్ వివరాలు.. జిల్లా చౌక దుకాణాలు మొత్తం కార్డులు పశ్చిమగోదావరి 2,211 12,59,925 చిత్తూరు 2,901 11,33,535 నెల్లూరు 1,895 9,04,220 తూర్పు గోదావరి 2,622 16,50,254 కృష్ణా 2,330 12,92,937 ప్రకాశం 2,151 9,91,822 గుంటూరు 2,802 14,89,439 వైఎస్సార్ కడప 1,737 8,02,039 విశాఖపట్నం 2,179 12,4,5266 విజయనగరం 1,404 7,10,528 శ్రీకాకుళం 2,013 8,29,024 కర్నూలు 2,363 11,91,344 అనంతపురం 3,012 12,23,684 -
ప్రజలు గుమ్మి కూడకుండా టోకెన్లు పంపిణీ చేయాలి
-
ఏపీలో 15నుంచి రెండో విడత రేషన్ పంపిణీ
-
ప్రతి గిరిజన కుటుంబానికీ ప్రభుత్వ సాయం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్, రూ.1000 ఆర్థిక సాయంతో పాటు.. అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న పౌష్టికాహారాన్ని కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రతి గిరిజన కుటుంబానికీ చేర్చాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ గిరిజన ప్రాంతాలకు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారులకు పథకాలను చేర్చడం, క్వారంటైన్, భౌతిక దూరం అమలుపై సోమవారం ఐటీడీఏ పీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ► సీతంపేట, పాడేరు, కేఆర్‌పురం, చింతూరు, శ్రీశైలం, నెల్లూరు ఐటీడీఏల పీవోలతో మంత్రి మాట్లాడుతూ గిరిశిఖర గ్రామాలు, రహదారుల్లేని గిరిజన గ్రామాలకు రేషన్ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు. ► నెల్లూరు యానాది ఐటీడీఏ పరిధిలో సంచారజాతికి చెందిన 900 గిరిజన కుటుంబాలకు రేషన్ కార్డులు లేకున్నా ఉచిత రేషన్ పంపిణీచేసినట్టు నెల్లూరు పీవో మణికుమార్ చెప్పారు. ► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలను క్వారంటైన్ కేంద్రంలో ఉంచి గడువు ముగిశాక వారిని స్వగ్రామాలకు పంపినట్టు చింతూరు పీవో చెప్పారు. -
1.18 కోట్ల కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ
సాక్షి, అమరావతి: లాక్డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమంలో ఇప్పటి వరకు 1,18,01,827 కుటుంబాలు (రేషన్ కార్డుదారులు) లబ్ధిపొందారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గత నెల 29వ తేదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈనెల 14 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈనెల 15వ తేదీ నుంచి రెండో విడత పంపిణీని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రెండో విడతలో బియ్యంతో పాటు ప్రతి రేషన్ కార్డుకు కేజీ శనగపప్పును ఉచితంగా అందజేస్తామన్నారు. రేషన్ షాపుల్లో రద్దీ నియంత్రణకు ఈసారి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వలంటీర్ల ద్వారా కూపన్లను జారీ చేసి వాటి ప్రకారం పంపిణీ చేస్తామన్నారు. కరోనా వైరస్ వల్ల రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులను సరఫరా చేస్తామన్నారు. లాక్డౌన్ సమయంలో పేద ప్రజలు ఆకలితో ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ ఉచిత రేషన్ పంపిణీ చేపట్టారని తెలిపారు. -
69.78 లక్షల కుటుంబాలకు ఉచిత రేషన్
సాక్షి, అమరావతి: లాక్డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ సరుకులను గత నాలుగు రోజుల్లో 69.78 లక్షల కుటుంబాలు తీసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ రేషన్ కార్డులు ఉన్న పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పేదలను ఆకలి బాధల నుంచి తప్పించేందుకు నెలలోగా మూడుసార్లు ఉచిత సరుకులు పంపిణీ చేస్తారు. దీని వల్ల నెల రోజుల్లోనే రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి వ్యక్తికి 15 కిలోల బియ్యం, ప్రతి కార్డుకు 3 కిలోల కందిపప్పు అందుతాయి. ఇందులో భాగంగా మొదటి విడత కింద మార్చి 29 నుంచి ఏప్రిల్ 14 వరకు, రెండో విడత కింద ఏప్రిల్ 15 నుంచి 28 వరకు, మూడో విడత కింద ఏప్రిల్ 29 నుంచి ఉచిత సరుకులు పంపిణీ చేస్తారు. మరో మూడు నాలుగు రోజుల్లో లబ్ధిదారులందరికీ సరుకుల పంపిణీ పూర్తయ్యే అవకాశం ఉంది. – ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా ఉచిత రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ 90.28 లక్షల కార్డుదారులకు మాత్రమే దీన్ని పరిమితం చేసింది. – దీంతో మిగిలిన 56.95 లక్షల కుటుంబాలకు (1.52 కోట్ల కుటుంబ సభ్యులకు) పంపిణీ చేస్తున్న సరుకులకు అయ్యే భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. – కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రేషన్ షాపుల వద్ద ప్రతి ఒక్కరూ కనీసం ఒకటి రెండు మీటర్ల భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. –అవసరం ఉన్న రేషన్ షాపుల వద్ద బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండి షాపుల్లోకి ఒక్కొక్కరినే అనుమతించారు. -
కరోనా కట్టడికి ముమ్మర చర్యలు
-
ఉచిత రేషన్ పంపిణి పై..
-
నిత్యావసరాల రవాణాకు ఆటంకం ఉండదు
-
మూడు నెలలకు సరిపోయే రేషన్‌ను..
-
వారికి విసుగొస్తే కరోనా అందరికి సోకుతుంది: రోజా
సాక్షి, నగరి : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలు తిండికి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ ఉచితంగా అందిస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మూడు నెలలకు సరిపోయే రేషన్‌ను మూడు విడతల్లో అందిస్తామని చెప్పారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ రోజు మొదటి విడత రేషన్‌ను అందించామన్నారు. ఏప్రిల్ 15న రెండో విడత, ఏప్రిల్ 29న మూడో విడత రేషన్‌ను అందిస్తామన్నారు. ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యం, ప్రతి కార్డుకు కేజీ కందిపప్పు చొప్పున ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. అలాగే 58 లక్షల మంది పెన్షన్ దారులకు ఏప్రిల్ 1వ తేదిన పెన్షన్ అందిస్తామన్నారు. (చదవండి : రేషన్ పంపిణీతో ఏపీ ప్రజలకు ఊరట) సీఎం జగన్ ఆదేశాలతో ప్రతి పేద కుటుంబానికి ఏప్రిల్ నాలుగో తేదిన రూ.1000 ఇవ్వబోతున్నామని తెలిపారు. సీఎం జగన్‌కు ప్రజలపై ఉన్న ప్రేమాభిమానాలు, చిత్తశుద్దిని ఈ నిర్ణయాలు తెలియజేస్తాయన్నారు. ఇంట్లో ఉండండి అని చెప్పడమే కాదు ఇంట్లో ఉన్నవారికి అన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరోనావైరస్ ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా వాలంటీర్ల ద్వారా పది మందికి రేషన్ అందించి ఆతర్వాత మరో పదిమందికి ఇస్తున్నామని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందకుండా చేయడమే కాకుండా పేదలకు నిత్యవసర వస్తువులను అందించడం గొప్ప విషయం అన్నారు. దీంట్లో పోలీసులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని ప్రశంసించారు. రాత్రింబవళ్లు పని చేస్తున్న పోలీసులకు అందరూ అండగా నిలవాలని కోరారు. పోలీసులు విసిగిపోతే కరోనా అందరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. కరోనా కట్టడికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు కాబట్టే దేశంలోనే ఏపీలో తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనాను పారదోలడంతో అందరు ఐకమత్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. లాక్డౌన్ నియమాలను పాటిస్తూ ఎవరూ బయట తిరగొద్దని ఎమ్మెల్యే రోజా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
రేషన్ పంపిణీతో ఏపీ ప్రజలకు ఊరట
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు, చెక్కరను రేషన్ డీలర్లు అందజేస్తున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకుంటున్నారు. ‘కరోనా వైరస్’ కారణంగా కొన్నిరోజులుగా నిత్యావసర సరుకులు దొరకక నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడగా.. రెండు రోజుల ముందుగానే బియ్యం సరఫరా చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను ఈ నెల 29 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. (కరోనాపై పోరు: సీఎం జగన్ బాటలో కేరళ, బ్రిటన్) రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ కోనసాగుతోంది. దీంతో ఆరు లక్షల కుటుంబాలకు లబ్ది కలగనున్నది. రేషన్ పంపిణీపై కార్డుదారులు హర్షం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్లు కార్డుదారులకు బియ్యం, కందిపప్పు, చక్కరను పంపిణీ చేస్తున్నారు. పాయకరావుపేటలో మంత్రి అవంతి శ్రీనివాస్ రావు పర్యటించి రేషన్ సరుకుల పంపిణీని పరిశీలించారు. అదేవిధంగా ఎమ్మెల్యే గొల్ల బాబురావుతో కలిసి మంత్రి రైతు బజారులో చేసిన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. రేషన్ డిపో నుంచి సరుకును మంత్రి అవంతి శ్రీనివాసరావు వినియోగదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలన్నారు. దీంతోపాటు సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా కట్టడి చేద్దాం అని చెప్పారు. కాకినాడ: ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఎమ్యెల్యే ద్వారంపూడి అన్నారు. ఇక సామాజిక దూరం పాటించాలని, బయటకు వెళ్లితే మాస్క్‌లు ధరించాలని ఆయన ప్రజలకు సూచించారు. కాకినాడలో 40 ఆటోల ద్వారా రైతుబజార్ల ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మూడు రైతుబజార్లను మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రకాశం: రేషన్ సరుకుల పంపిణీలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.అనంతరం ఆయన పీవీఆర్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రైతుబజార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ధీరజ్ ఆస్పత్రి వద్ద రేషన్‌షాపులో బాలినేని ప్రజలకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కడప: నగరంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సందర్శించారు. అనంతరం ఆయన పేద ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నివారణకు ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు. విజయవాడలో కొనసాగుతున్న రేషన్ సరుకుల పంపిణీ.. సత్యనారాయణపురంలో రేషన్ సరుకుల పంపిణీని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సందర్శించారు. క్యూలో ఉన్నవారికి ఆయన శానిటైజర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరుకులు పదిహేను రోజులపాటు పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ షాపు వద్ద ఎక్కువగా క్యూ లైన్ ఉంటే కొంత సమయం ఇంటి వద్దనే ఉండాలని ఆయన సూచించారు. రేషన్‌కార్డు ఉన్న పేదలందరికీ సరుకులు అందిస్తామని ఆయన చెప్పారు. రేషన్ డిపోలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో వేలిముద్రతో సంబంధం లేకుండా డీలర్లు సరుకులను పంపిణీ చేస్తున్నారు. సామాజిక దూరం పాటించేలా మీటరు దూరంలో రింగులు ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌తో ఎలా బతకాలి అన్న భయం కలిగిందని, ఆందోళన చెందుతున్న సమయంలో సీఎం వైస్ జగన్ తీసుకున్న నిర్ణయం తమకు ఊరట కలిగించిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మూడు నెలల పాటు ఆహారానికి ఇబ్బంది పడకుండా నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కి తాము రుణపడి ఉంటామన్నారు. -
ఉచిత రేషన్ పంపిణీ
సాక్షి, మచిలీపట్నం: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను ఈ నెల 29 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి కార్డుదారుడికి కేటాయించిన బియ్యంతో పాటు కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తారు. పంచదార పొందడానికి గతంలో మాదిరిగానే నగదు చెల్లించాల్సి ఉంటుంది. 35.98 లక్షల మంది లబ్ధిదారులు జిల్లాలో అన్నపూర్ణ కార్డులు 465, అంత్యోదయ కార్డులు 65,411, తెల్లకార్డులు 12,27,060 ఉన్నాయి. వీటి పరిధిలో 35,98,408 మంది లబ్ధిదారులు (యూనిట్స్) ఉన్నారు. నవశకం సర్వేలో అనర్హులను తొలగించి ఈ కార్డుల స్థానంలో 11.54 లక్షల రైస్‌కార్డులు పంపిణీ చేశారు. ఏప్రిల్ నుంచి రైస్ కార్డులకే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని తొలుత భావించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా మచిలీపట్నంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి వలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు. (లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన వారికి ప్రభుత్వ సాయం) కానీ ప్రస్తుతం తలెత్తిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో డోర్ డెలివరీ నిర్ణయాన్ని వాయిదా వేశారు. పాత పద్ధతిలోనే రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి సరుకులు ఇవ్వాలని నిర్ణయించారు. రేషన్ డిపోల వద్ద సామాజిక దూరం పాటిస్తూ సరుకులు పంపిణీ చేస్తారు. బియ్యం కార్డుదారులు ఈ–పోస్ యంత్రంపై వేలిముద్రలు వేయనవసరం లేదు. వారి స్థానంలో ప్రతి కార్డుకు గ్రామ, రెవెన్యూ కార్యదర్శి, గ్రామ, వార్డు సహాయకుల వేలిముద్రలతో సరుకులు అందజేస్తారు. మాన్యువల్ రిజిస్టర్ కూడా ఏర్పాటు చేసి దాంట్లో కార్డుదారుల సంతకాలు తీసుకుంటారు. సంతకాలు చేయడం రాకపోతే వేలిముద్రలు తీసుకొని వారి ఫొటోలు కూడా తీసుకుంటారు. ప్రతి డీలర్ వద్ద కార్డుదారుల జాబితా ఉంచుతారు. (జిల్లాల్లో హెల్త్‌కేర్ క్యాంపులు) ప్రతి సచివాలయంలో వలంటీర్లు వారి క్లస్టర్ పరిధిలోని కార్డుదారుల పేర్లు, ఏ రేషన్ డిపోలో ఉన్నది అనే విషయాలను కార్డుదారులకు తెలియజేస్తారు. ఎవరికైనా రేషన్ కార్డు ఉండి సంబంధిత రేషన్ డిపోలో జాబితాలో పేరు లేకుంటే అటువంటి వారికి పోర్టబులిటి విధానంలో నిత్యావసర వస్తువులను అందజేస్తారు. రేషన్ డిపో వద్ద బకెట్ నిండా నీళ్లు, సబ్బు ఏర్పాటు చేస్తారు. సరుకులు తీసుకునే ముందు.. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కునే ఏర్పాటు చేశారు. -
ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి
-
సోషల్ డిస్టెన్స్తో రేషన్ తీసుకోవాలి
-
మార్చి 29నే రేషన్ పంపిణీ
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రేషన్‌ను ఈనెల 29నే ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనుంది. దీంతోపాటు ఒక్కో కార్డుదారుడికి రూ.వెయ్యి నగదు కూడా అందజేయనున్నట్లు సీఎస్ నీలం సాహ్ని సోమవారం ఉత్తర్వులిచ్చారు. కరోనాను నియంత్రించేందుకు ఇప్పటికే సర్కారు బయోమెట్రిక్ విధానాన్ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే. (ప్రజల కోసమే పోలీస్ ఆంక్షలు) ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు.. - ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన బియ్యం, ఒక కేజీ కందిపప్పును కార్డుదారులకు ఉచితంగా ఇస్తున్నాం. - వాస్తవానికి ఇవి ఏప్రిల్‌లో ఇవ్వాల్సి ఉంది. కానీ, మార్చి 29నే ఇస్తున్నాం - ఉచితంగా రేషన్‌తో పాటు రూ.వెయ్యి నగదు కూడా అందజేస్తున్నాం. - ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ఉద్యోగస్తులకు కూడా సకాలంలో వేతనాలు అందిస్తాం. - ప్రైవేటు సంస్థలు కూడా విధిగా తమ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి. - నిబంధనలు అతిక్రమించిన సంస్థలపై చర్యలు తీసుకుంటాం - నిత్యావసరాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులకు గురిచేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. -
రసీదుల్లేవు..తూకాల్లేవు..అంతా అక్రమమే
-
ఆన్లైన్ ప‘రేషన్’
తిరుమలాయపాలెం : రేషన్ దుకాణాల్లో ఆన్లైన్లో ఈ పాస్ విధానంతో సరుకులు ఇచ్చే ఇంటర్నెట్ సౌకర్యం సరిగాలేకపోవడం, డీలర్లకు ఆన్లైన్ నమోదులో సరైన అవగాహన లేని ఫలితంగా కార్డుదారులను ఇబ్బందులకు గురిచేస్తుంది. రేషన్ కార్డు దారుల వేలిముద్ర ఆన్లైన్లో నమోద యితేనే బియ్యం ఇవ్వాలనే నిబంధన ఉంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలు రోజులతరబడి రేషన్ షాపుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలాయపాలెం మండలంలో 28 పంచాయతీల పరిధిలో 38 రేషన్ షాపులు ఉన్నాయి. ఆయా షాపుల పరిధిలో 19302 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ అక్రమాలను నిరోధించేందుకు ఈపాస్ విధానాన్ని చేపట్టి రేషన్ వివరాలను ప్రజల ముంగిట్లో ఉంచేందుకు ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఆలైన్ వ్యవస్థను నడి పించేందుకు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఈ విధానాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ ఆయా గ్రామాలలో సరైన ఇంటర్నెట్ సౌకర్యం ఉందా! లేదా? అనే విషయాన్ని తెలుసుకోకుండానే మిషన్లను అందజేసింది. రేషన్ డీలర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండానే మిషన్లు అందజేసి ఈ పాస్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు మిషన్లను పర్యవేక్షిస్తున్న సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం లేదని రేషన్ డీలర్లు వాపోతున్నారు. దీంతో ఆయా గ్రామాలలో మిషన్లు పనిచేయక రేషన్ కార్డు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీడీఎస్ విధానం ద్వారా రేషన్ బియ్యం తీసుకోకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతాయనే భయంతో కార్డు దారులు ఈ విధానంలో నమోదు చేయించుకుని బియ్యం తీసుకునేందుకు రేషన్ షాపులకు వస్తున్నారు. ఈ పాస్ మిషన్లలో కొందరు కార్డుదారుల వేలిముద్రలు పడడంలేదు. దీనిపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వడంలేదు. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. -
రేషన్.. పరేషాన్..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రేషన్ దుకాణాలకు అందజేసిన ఈపాస్ మిషన్లలో లబ్ధిదారులు వేలిముద్ర వేస్తేనే సరుకులను అందజేస్తారు. అయితే సర్వర్ సమస్యతో ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటంతో సరుకుల పంపిణీ 40 శాతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దుకాణాల ఎదుట లబ్ధిదారులు పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతుండగా, అటు డీలర్లు మొరాయిస్తున్న మిషన్లతో గడువులోగా సరుకులు పంపిణీ చేయక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరుకుల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. ఆగస్టులో ఈ పాస్ యంత్రాలు అందజేసిన ఒయాసిస్ కంపెనీ సెప్టెంబర్ నుంచి నూతన విధానంలో సరుకులు పంపిణీ చేసేలా సాంకేతిక జోడించింది. ఆ సమయంలో తదనుగుణంగా సంబంధిత యంత్రాలు అందజేయగా సరుకుల పంపిణీ సాగింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సర్వర్‌ను మార్పు చేయడంతో ఈపాస్ యంత్రాలు దాదాపు స్థంబించిపోయాయని డీలర్లు వాపోతున్నారు. సరుకుల కోసం వెళ్లిన లబ్ధిదారులు పడిగాపులు గాసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 7వ తేదీ దాటినప్పటికీ సరుకుల పంపిణీ ప్రారంభించని దుకాణాలు ఉమ్మడి జిల్లాలో 600కు పైగానే ఉన్నాయని సమాచారం. సాంకేతిక సమస్యతో పరికరాలను పట్టుకుని పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి వస్తున్నారు. ఈ–పాస్ యంత్రాల వెనుక ఉద్దేశం.. పేదల పొట్ట నింపేందుకు ప్రభుత్వం నెలనెలా పౌరసరఫరాల దుకాణాల ద్వారా రూపాయికే కిలో బియ్యాన్ని, ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. బియ్యం పంపిణీ ఎంతగా పెరిగిందో, అదే స్థాయిలో రేషన్ బియ్యంలో అక్రమాలకు తావు ఏర్పడింది. బియ్యం రేషన్ దుకాణాలకు పూర్తిగా చేరకుండానే, మిల్లర్లకు, వ్యాపారుల దరికి చేరుతున్నాయి. ఇలా ప్రతి నెలా లారీల కొద్ది బియ్యం పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అక్రమాలను అడ్డుకోలేక పోయింది. చివరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్, ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌లు నియంత్రణపై దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలో ఈ– రేషన్ ప్రక్రియకు ఈ ఏడాది మార్చి నెల నుంచి శ్రీకారం చుట్టింది. రేషన్ దుకాణాలలో వేలిముద్రల (ఈ–పాస్) యంత్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా రేషన్ సరుకుల్లో అక్రమాలను అరికట్టగలిగారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన కసరత్తును అన్ని జిల్లాల్లో ప్రారంభించింది. ఇబ్బందికరంగా సరుకులకు పంపిణీకి గడువు... ప్రభుత్వం రేషన్‌సరుకులను ప్రతి నెల ఒకటి నుంచి 15 వరకే పంపిణీ చేయాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే 7వ తేదీ దాటినప్పటికీ ఈ పాస్ యంత్రాలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో గడువులోగా పంపిణీ జరగడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్ సరుకులను పంపిణీ చేయాల్సి ఉండగా సర్వర్ సమస్యతో ఒక్కో డీలరు రోజుకు 50 మందికి మించి సరుకులు పంపిణీ చేయలేకపోతున్నారు. ఈ పాస్ యంత్రంలో వేలిముద్ర వేసిన అనంతరం డిస్ప్లేలో పేరు రావడం తదుపరి తూకం వేయడం ప్రక్రియతో దాదాపు 10 నుంచి 20 నిమిషాలు పడుతున్న సంధర్డాలుంటున్నాయి. ఈ పాస్ యంత్రానికి.. తూకం యంత్రానికి అనుసంధానం కాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఉమ్మడి జిల్లాలో 40 శాతానికి పైగా దుకాణాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సరుకులను సకాలంలో.. గడువులోగా పంపిణీ చేయడం సందిగ్ధంగా మారింది. యంత్రాల సాంకేతిక సమస్యలను కంపెనీ ప్రతినిధులు పట్టించుకోవడం లేదని డీలర్లు వాదిస్తున్నారు. వేలిముద్రలు పడక తిప్పలు...15వ తేదీ వరకే పంపిణీతో ఇబ్బంది రేషన్‌దుకాణాల వద్దకు కార్డుదారులే స్వయంగా వచ్చినా బయోమెట్రిక్ యంత్రంపై వారి వేలిముద్రలు పడనికారణంగా డీలర్లు సరుకులను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వేలిపై ఉన్న గీతలు యంత్రంపై పడని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికారులంటున్నారు. అయితే చాలా కొద్దిమందికే ఇలాంటి పరిస్థితి ఉంటుందని, అలాంటి వారికి సరుకులను ఇచ్చేందుకు (కార్డుదారుల్లో 1శాతం మించకుండా) డీలర్లకు అనుమతిచ్చామని తెలిపారు. ఈ పాస్ విధానంతో సబ్సిడీ సరుకులను తీసుకెళ్లేందుకు వద్దులు, ఒంటరిగా ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కార్డుదారులు లేకున్నా వారి బంధు, మిత్రులు వచ్చి సరుకులు తీసుకెళ్లే అవకాశముండేది. ఇపుడు ఆ అవకాశం లేకపోవడంతో డీలర్ల వద్ద సరుకులు ఎక్కువ మొత్తంలో మిగులుతున్నాయి. కాగా ప్రతి నెల 15వతేది లోగానే లబ్ధిదారులు రేషన్ దుకాణాలనుంచి సరుకులను పొందాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈపాస్ మిషన్లు అపుడపుడు పనిచేయకపోవడంతో సమయమంతా వధా అవుతోందని, తమకు వీలున్నపుడు వచ్చే అవకాశం లేకుండా పోతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగానే నెల చివరి వారం వరకు పంపిణీ చేసేలా చూడాలన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పంపిణీ అంతకంతే.. 10 రోజుల్లో 50 శాతమే ఉమ్మడి జిల్లాల్లో ని రేషన్ దుకాణాలలో ఈ పాస్ విధానంలో సాంకేతిక అంతరాయాలు అవరోధంగా మారాయి.. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 16 మండల లెవెల్ స్టాక్ పాయింట్ల (ఎంఎల్ఎస్) నుంచి 1,880 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెల 16,644 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. పంచదారను అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు అందజేస్తున్నారు.. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 9,41,948 కార్డులు 27,73,996 యూనిట్లపై 16,643.976 బియ్యంకు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికీ 50 శాతం కూడా పంపిణీ చేయలేదని తెలుస్తోంది. అయితే సర్వర్ మార్పుతో గత కొద్ది రోజులుగా ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటమే ఇందుకు కారణంగా అధికారులు చెప్తుండగా... లబ్దిదారులకు తిప్పలు తప్పడం లేదు.. ఈ విషయంలో అధికారుల ముందస్తు ప్రణాళికలోపం స్పష్టమవుతోంది. కిరోసిన్ పంపిణీలోను ఇదే రకమైన సమస్య ఉత్పన్నమవడం చర్చనీయాంశంగా మారింది. సరుకుల పంపిణీకు ముందే సర్వర్ మార్పును, సాంకేతిక సమస్యలను అధిగమిస్తే డీలర్లకు.. ఇటు లబ్దిదారులకు తిప్పలుండేవి కావని స్పష్టమవుతోంది. ఇప్పటివరకు బియ్యం తీసుకోలే.. గీ ఏలి ముద్రలు ఎప్పుడు సురువు అయినయో గప్పడి నుంచి నా చేతి వేలిముద్రలు వస్తలేవు అంటున్నారు. నా భర్త వేలిముద్రలు కూడ మిషన్ తీసుకుంట లేదు. బియ్యం పంచినప్పుడల్ల పోయినా ఎన్నిసార్లు వేలిముద్రలు పెట్టిన రాలేదు. ఇప్పటి వరకు బియ్యం తీసుకోలేదు. మరునాడు పోతే గడువు ముగిసిందని ఇస్తలేరు. బియ్యం కాడికి పోతే బాగా తిప్పలు అవుతుంది. గిట్లయితే ఎట్ల. బియ్యం వచ్చేలా చూడాలి సారు. –మసర్తి నర్సవ్వ, బుగ్గారం -
మొరాయిస్తున్నాయి..!
‘‘ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. అందులో భాగంగానే రేషన్ దుకాణాల్లో ఈ పాస్ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ, అందులో నెలకొంటున్న సాంకేతిక సమస్యలను సత్వరం పరిష్కరించకపోవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.’’ జడ్చర్ల : ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబందించి ఈ–పాస్ విధానాన్ని అమలులోకి తేగా సాంకేతిక సమస్యలతోఅటు డీలర్లు ఇటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివైస్‌లకు సంబందించి గ్రామీణప్రాంతాలలో పూర్తి స్థాయిలో నెట్ రాకపోవడంతో పంపిణీలో ఆలస్యం చోటు చేసుకుం టుంది. దీనికి తోడు ఇటీవల డివైస్‌లలో సాఫ్ట్‌వేర్‌ను ఆకస్మికంగా మార్పు చేయడంతో ఈనెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ నిలిచిపోయింది. ఏమైంది అన్న విషయం అర్థం గాక మొదటి రోజు అటు అధికారులు ఇటు డీలర్లు తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. తీరా వయాసిస్ కంపెనీ తమ సాఫ్ట్వేర్ మార్పు చేసి ఆధార్ అనుసంధానంగా సర్వర్‌తో లింక్ చేసే కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి అమలు చేస్తుందని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్తోనే.. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ పూర్తి చేసే విధంగా అధికారులు విధివిధానాలను రూపొందించారు. 15వ తేదీ తర్వాత బియ్యం పంపిణీ ఉండదు. ఆ సమయంలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసే విధంగా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఆకస్మికంగా 1వ తేదీనుంచి అంటే బియ్యం పంపిణీ ప్రారంభంరోజు నుంచే సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేయడంతో సమస్య నెలకొందని అటు అధికారులు ఇటు రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ సమస్యలు ఈ–పాస్ విధానంలో తరచు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేక పోవడంతో సమస్య నెలకొంటుందని అంటున్నారు. తమకు ఎయిర్టెట్, ఐడియా సిమ్‌లు జారీ చేశారని అయితే కొన్ని ప్రాంతాల్లో ఆయా సిమ్‌లు పనిచేయడం లేదన్నారు. ఒక వేళ పనిచేసినా నెట్ సిగ్నల్ సరిగ్గా లేక నెట్ నెమ్మదిగా ఉంటుందని.. దీంతో పొద్దస్తమానం సమయం వెచ్చించే పరిస్థితి ఉంద న్నారు. 4జీ నెట్ అందించే జియో సిమ్‌లను సరఫరా చేస్తే బాగుంటుందని వారు పేర్కొంటున్నారు. నెట్ స్పీడ్‌గా వస్తే పని కూడా సులువు అవుతుందని, బియ్యం పంపిణీని త్వరగా పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నా మని కొందరు డీలర్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేగాక మిషన్లలో సాంకేతిక సమస్య తలెత్తితే సదరు మిషన్‌ను తీసుకుని సంబందిత తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని టెక్నిషియన్ కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంటుందన్నారు. దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు ఇటీవల డివైస్(మిషన్)లలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఓ టెక్నీషియన్‌ను తమ కార్యాలయంలో అందుబాటులో ఉంచి సమస్యను సరిచేయిస్తున్నాం. దాదాపుగా సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి బియ్యం పంపిణీకి చర్యలు తీసుకున్నాం. – లక్ష్మీనారాయణ, తహసీల్దార్, జడ్చర్ల -
నగదు రహితం..వేదనా భరితం
= సామర్థ్యం లేని సర్వర్‌తో ఇక్కట్లు = జిల్లావ్యాప్తంగా చౌకదుకాణాల్లో సమస్య = సరుకుల పంపిణీ చేయలేమన్న డీలర్లు = రేషన్ అందక జనం అష్టకష్టాలు అనంతపురం అర్బన్ : చౌకధరల దుకాణాల్లో నగదు రహితంపై రేషన్ సరుకుల పంపిణీ కష్టసాధ్యమవుతోంది. పంపిణీ ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపడం లేదు. లీడ్ బ్యాంక్‌గా ఉన్న సిండికేట్ బ్యాంక్ ‘గేట్‌వే’తో కొన్ని బ్యాంకులు లింక్ కావడం లేదు. అత్యధిక బ్రాంచ్‌లున్న ఏపీజీబీ (ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్) సంబంధించిన సర్వర్ సామర్థ్యం తక్కువ ఉండడంతో పెద్ద సమస్యగా మారింది. దీంతో ఇటు చౌకడిపో డీలర్లు, అటు రేషన్ కార్డుదారులు ఇబ్బంది పడుతున్నారు. గేట్‌వే లింక్.. సర్వర్ సమస్య జిల్లాలో 11.92 లక్షల కార్డులు ఉన్నాయి. జిల్లాలో ఏపీజీబీకి సంబంధించి అత్యధికంగా 120 బ్రాంచ్‌లు ఉన్నాయి. అధిక సంఖ్యలో కార్డుదారులకు ఈ బ్రాంచ్‌ల్లోనే ఖాతాలు ఉన్నాయి. అయితే ఏపీజీబీకి ప్రస్తుతం ఉన్న సర్వర్ సామర్థ్యం తక్కువగా ఉండడంతో సమస్య అధికమైంది. జిల్లాకు లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తున్న సిండికేట్ బ్యాంక్‌కు కర్ణాటక బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఏడీసీసీ బ్యాంకుల లింక్ లేకపోవడంతో గేట్‌వేలోకి వెళ్లడం లేదు. ఇదో పెద్ద సమస్యగా మారినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లా సరిహద్దుగా, కర్ణాటక సమీపంలో ఉన్న గ్రామాల్లోని కార్డుదారులకు కర్ణాటక, కోటక్ మహీంద్ర బ్యాంక్ బ్రాంచీల్లో ఖాతాలు ఉన్నాయని చెబుతున్నారు. గేట్‌వే లేకపోవడంతో ఆ బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్న కార్డుదారులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించలేక పోతున్నారని తెలిపారు. అమలు చేయలేమంటున్న డీలర్లు సర్వర్ సమస్య కారణంగా నగదురహితంపై సరుకులు పంపిణీ చేయలేమని జిల్లా సరఫరాల శాఖ అధికారి (డీఎస్ఓ) శివశంకర్‌రెడ్డికి చౌకడిపో డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరావిురెడ్డి ఆధ్వర్యంలో డీలర్లు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ–పాస్ యంత్రాలు నగదురహిత విధానాన్ని స్వీకరించడం లేదని చెప్పారు. నగదురహితానికి ఒక్కొక్క కార్డుదారుని 20 నిమిషాలకు పైగా సమయం పడుతోందని, అయినా కూడా డిక్లెయిన్ అని వస్తోందని అంటున్నారు. రోజుకు 20 మందికి కూడా సరుకులు ఇవ్వలేక పోతున్నామంటున్నారు. దీంతో కార్డుదారులు తమను ఇష్టానుసారంగా దూషిస్తున్నారంటూ వాపోయారు. పంపిణీ అంతంత మాత్రమే నగదురహిత లావాదేవీల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ జిల్లావ్యాప్తంగా అంతంత మాత్రంగానే సాగుతోంది. జిల్లాలో 11.92 లక్షల కార్డులు ఉండగా... అధికారిక లెక్కల ప్రకారం శనివారం నాటికి సరుకులు తీసుకునేందుకు చౌక ధరల దుకాణాలకు 2,30,965 మంది కార్డుదారులు వెళ్లారు. అయితే 48,219 మంది కార్డుదారులకు మాత్రమే నగదురహితంగా సరుకులు అందాయి. దీన్నిబట్టి చూస్తే ప్రక్రియ అమలు తీరు ఎంత అధ్వానంగా సాగుతోందో స్పష్టమవుతోంది. -
ప'రేషన్'
సర్వర్ డౌన్‌తో సక్రమంగా పనిచేయని ఈ పాస్ యంత్రాలు ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు ధర్మవరం : ధర్మవరం పట్టణంలోని చౌక దుకాణం నంబర్ 33లో ఉదయం 8 గంటల నుంచి 15 మంది కార్డుదారులకు రేషన్ పంపిణీ చేశారు. ఈ-పాస్ యంత్రాలు సరిగా పని చేయక రోజుకు 20 మందికి కూడా రేషన్ ఇవ్వలేని పరిస్థితి. బత్తలపల్లి మండల కేంద్రంలో ఉదయమే రేషన్ షాపును తెరిచారు. సర్వర్ సక్రమంగా పని చేయక పంపిణీ ఆలస్యమైంది. దీంతో లబ్ధిదారులు సాయంత్రం దాకా పడిగాపులు కాయాల్సి వచ్చింది. రేషన్ షాపుల్లో నిత్యావసరాలు తీసుకోవడానికి లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈపాస్ మిషన్లు సరిగా పని చేయకపోవడమే ఇందుకు కారణం. వారం రోజులుగా లబ్ధిదారులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.ఈపాస్ యంత్రాలకు సర్వర్ పనిచేయక ఇటు డీలర్లు, అటు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని చోట్ల వేలిముద్రలు పడక కార్డుదారులకు సమస్యలు తప్పడం లేదు. జిల్లాలో మొత్తం 63 మండలాలకు కలిపి 2,983 చౌక దుకాణాలు , 12,37,571 కార్డులు ఉన్నాయి. గతంలో నిత్యావసరాలు నేరుగా ఇచ్చేవారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇచ్చిన ఈపాస్ మెషీన్లు తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. దినసరి కూలీల సమస్యలు వర్ణణాతీతం : ఒక్కో రేషన్ షాపు పరిధిలో 200 నుంచి 500 మధ్య రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డు దారులంతా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు కావడంతో సరుకుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఎప్పుడు సర్వర్ పని చేస్తుందా.. అని ఉదయం నుంచి సాయంత్రం దాకా చౌక దుకాణం వద్ద వేచి ఉంటున్నారు. దినసరి కూలీలు తమ రోజు కూలిని పోగొట్టుకోవాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని లబ్ధిదారులు కోరుతున్నారు. డీలర్లకూ తప్పని తిప్పలు ఈపాస్ విధానం వల్ల రేషన్ డీలర్లకూ తిప్పలు తప్పడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులో ఉంటే 10 నుంచి 20 మందికి మాత్రమే రేషన్ పంపిణీ చేయగల్గుతున్నారు. రేషన్ సకాలంలో అందకపోవడంతో డీలర్లతో లబ్ధిదారులు గొడవలకు దిగుతున్నారు. -
ఐదు దాటితే అంతే...
* ఈ-పాస్ విధానంతో ఇంకా తప్పని ఇక్కట్లు * రేషన్ పంపిణీలో కొత్త నిబంధనతో కష్టాలు సూళ్లూరుపేట: చౌకడిపో దుకాణాల్లో సరుకులు పొం దేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానంతో ఎంతోమంది లబ్ధిదారులకు సరుకులు అందకుండా ఇబ్బందులుపడుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి నెలా 5వ తేదీ లోపే సరుకులు పొందాలి అనే నిబంధనను కొత్తగా తెరపైకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి తెల్లరంగు రేషన్‌కార్డు ఇచ్చి బియ్యం, కిరోసిన్, కంది పప్పు, చక్కెర తదితర వస్తువులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉనికిని చాటుకునేందుకు చంద్రన్న కానుక పండగలు వచ్చినపుడు రాష్ట్రప్రభుత్వం ఉనికిని చాటుకునేందుకు చంద్రన్న కానుక పేరుతో మరో ఐదు రకాలు వస్తువులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకు ప్రతి నెలా 20వ తేదీవరకు సరుకులు ఇస్తూ వచ్చారు. నకిలీకార్డులు ఏరివేతకు సంబంధించి ఇటీవల ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంతో కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన సామెతలా తయారైంది పరిస్థితి. నకిలీ కార్డులు పట్టుబడ్డాయో లేదో గాని నిజంగా నిరుపేదలైన వారికి వేలిముద్రలు సరిపోక సరుకులు అందడం లేదు. చాలా మంది బాధితులు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రు. ఈ విధంగా లబ్ధిదారులు సతమవుతుంటే ఇప్పుడు మళ్లీ కొత్తవిధానాన్ని తీసుకొచ్చి పేదవాళ్ల కడుపుమీద వాత పెట్టే పనికి ప్రభుత్వం పూనుకుంటుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి నెలా ఐదో తేదీలోపు సరుకులు తీసుకోవాలనే నిబంధనను లబ్ధిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సూళ్లూరుపేట నియోజకవర్గంలో మాంబట్టు, మేనకూరు, శ్రీసిటీ సెజ్‌ల్లోని పలు కంపెనీలో పనిచేసే కార్మికులు చాలామందికి ఐదో తరువాత నెల జీతాలు వస్తాయి. జిల్లాలో పరిస్థితి కూడా ఇంచుమించుగా ఐదో తేదీలోపు సరుకులు పొందలేని పరిస్థితులున్నా యి. ఐదో తేదీని ఆఖరు తేదీగా పెడితే చౌకడిపో దుకాణాల్లో సరుకులు ఎవరూ తీసుకోలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ-పాస్‌తో రూ.10 కోట్లు ఆదా సరుకుల పంపిణీలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ఈ- పాస్ విధానాన్ని తీసుకొచ్చి సుమారు రూ.10 కోట్లు విలువచేసే సరుకులు ఆదా చేసినట్టుగా అధికారులు అంచనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 8.31 లక్షలున్న తెల్ల రేషన్ కార్డులు నేడు 7,70,359కి చేరినట్లు సమాచారం. వీటిని కూడా వడపోసేందుకు సరుకుల పంపిణీని ఐదో తేదీకి కుదించింది. ఈ విధానాన్ని అమలు చేస్తే సరుకులు ఇంకా మిగిలిపోయే అవకాశంఉంది. మొత్తానికి నూతన విధానలతో ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజా పంపిణీ వ్యవస్థలో సరుకులు పంపిణీని 15 తేదీని ఆఖరు రోజుగా ప్రకటించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
రేషన్ మేస్తున్నారు..!
ఈ రెండు చిత్రాలు కేవలం ఉడికిన అన్నంలో రెండు మెతుకుల్లాంటివే. జిల్లాలోని ఒక్క మండలంలో రేషన్ సరుకులు అమ్మిన విధానాన్ని తెలియజేసేవే. రేషన్ పంపిణీలో జరిగే అక్రమాలకు నిదర్శనంగా నిలిచేవే...సమాచార హక్కు చట్టం ద్వారా ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఈ వాస్తవాల వెనుక అంతులేని దోపిడీ ఉంది. - జిల్లాలో యథేచ్ఛగా నిత్యావసర సరుకుల దోపిడీ - పౌరసరఫరాల అధికారులు, డీలర్ల కుమ్మక్కు - పక్కదారి పడుతున్న టన్నుల కొద్దీ బియ్యం - ఒకే వేలిముద్రలతో రేషన్ సరుకుల పంపిణీ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సమాచార హక్కు చట్టం ద్వారా 2013 జనవరి నుంచి 2014 జనవరి వరకు నల్లగొండ మండలంలో రేషన్ పంపిణీకి సంబంధించిన రిజిస్టర్లు, ప్రజాపంపిణీ వ్యవస్థ గురించి వివరాలు సేకరించారు హక్కు చట్టం కార్యకర్త కొత్తపల్లి శివాజీ. ఈయన వివరాలు సేకరించడానికే చాలా సమయం పట్టింది. వాటిని పరిశీలించి వాస్తవాలు తేల్చేందుకు నెలల సమయమే తీసుకుంది. సమాచార హక్కు చట్టం కింద వెలుగులోనికి వచ్చిన ఈ వాస్తవాలను పరిశీలిస్తే ముక్కు మీద వేలు వేసుకోక తప్పదు. నిజంగా ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల అధికారులు ఏం చేస్తున్నారనే అంశం అంతుపట్టదు. విజిలెన్స్ విభాగాలు, ఆకస్మిక తనిఖీలు వీటిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయో అర్థం కాదు. ఒక్కసారి ఆ చిత్ర విచిత్ర రేషన్ పంపిణీ విన్యాసాలను చూద్దామా..! కొన్ని షాపుల కీ రిజిస్టర్లలో వేలిముద్రలు మొత్తం ఒకే రకంగా ఉన్నాయి. కొన్ని షాపుల కీ రిజిస్టర్లలో కిరోసిన్ అమ్మకాలకు సంబంధించి రేషన్‌కార్డుదారుల సంతకాలు లేవు కానీ, కిరోసిన్ మొత్తం అమ్మినట్టు జీరో బ్యాలెన్స్ మాత్రం చూపించారు. లబ్ధిదారుల సంతకాలకు సంబంధించి అనేక ఎత్తులు వేశారు రేషన్ డీలర్లు. ఒకే వ్యక్తి పేరు పది చోట్ల సంతకాలుగా ఉపయోగించారు. ఒకరి పేరు కార్డుపై ఉంటే మరో వ్యక్తి పేరిట సంతకం ఉంటుంది. వేలిముద్రలైతే ఎవరూ గుర్తుపట్టలేరు కనుక అద్దుడే అద్దుడు. అడ్డగోలుగా అద్ది, పేర్లు మార్చి సంతకాలు పెట్టి సరుకులను మాయం చేసినట్టు ఆధారాలు చెపుతున్నాయి. స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలిస్తే సరుకులు 15వ తేదీలోపు అమ్మేసినట్టు ఉంటుంది. అదే కీ రిజిస్టర్‌ను పరిశీలిస్తే నెల మొత్తం సరుకులు అమ్మినట్టు ఉంటుంది. మరి ఆ సరుకులు ఎప్పుడు ఎవరికి అమ్మారో, ఏ రిజస్టర్ సరైందో ఆ రేషన్ డీలర్లు, అధికారులకే తెలియాలి. లబ్ధిదారులు సంతకాలు పెట్టాల్సిన గడులు మాత్రం చాలా ఖాళీగానే కనిపిస్తాయి. కానీ స్టాక్ ఏమీ లేదని, అంతా అమ్మేశామని స్టాక్ రిజిస్టర్లో కనిపిస్తుంది. ప్రతి నెలా కీ రిజిస్టర్లను తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించి కొత్త కీ రిజిస్టర్లు పట్టుకె ళ్లాలి. కానీ అదేమీ లేకుండానే కొత్త కీ రిజిస్టర్లను తీసుకెళ్లిపోయారు రేషన్ డీలర్లు. ఎందుకంటే సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించిన వ్యక్తి సమాచారం ప్రకారం అతనికి కీ రిజిస్టర్లు చూపించేందుకు 20 రోజులకుపైగా పట్టింది. ఎందుకంటే అవి తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో లేవు. డీలర్ల వద్దే ఉండిపోయాయి. ఇక, స్టాక్ రిజిస్టర్ల విషయానికి వస్తే గోదాము నుంచి వచ్చిన సరుకు, గత నెలలో నిల్వ ఉన్న సరుకు కలిపితే వచ్చిన మొత్తాన్ని ఆ నెలలో అమ్మాలి. కానీ అమ్మింది తక్కువైనా బ్యాలెన్స్ మాత్రం నామమాత్రంగా చూపెడుతున్నారు. ఆ తేడా మొత్తం సరుకులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారని అర్థమవుతుంది. కొందరు డీలర్లు మధ్యాహ్న భోజన బియ్యానికి సంబంధించిన స్టాక్‌రిజిస్టర్లు నిర్వహించడం లేదు. అలాట్మెంట్లో, ఆర్వో రిజిస్టర్లలో బియ్యం ఇచ్చినట్టు చూపెడుతున్నారు కానీ తాము ఆ బియ్యాన్ని దిగుమతి చేసుకున్నామని రేషన్ డీలర్లు స్టాక్రిజిస్టర్లలో చూపడం లేదు. పైగా వేసవి సెలవులు ఉండే మే నెలలో కూడా మధ్యాహ్న భోజన బియ్యం ఇచ్చామని చెప్పి పేద విద్యార్థులకందాల్సిన బియ్యాన్ని కూడా పిండుకున్నారని అర్థమవుతుంది. కొందరు డీలర్లు రాసే స్టాక్రిజిస్టర్లలో రోజువారీ అమ్మకాల్లోనే తేడాలు రాస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. సార్లు ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతున్నా అటు రెవెన్యూ, ఇటు పౌరసరఫరాల అధికారులు మాత్రం మనకెందుకులే అనే రీతిలోనే వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే ఏడాది పొడవునా అక్రమాలు జరిగాయని సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన సమాచారం చెపుతుంటే దానిని అడ్డుకునే ప్రయత్నం కూడా జరగకపోవడం గమనార్హం. వాస్తవానికి ప్రతి నెలా సివిల్‌సప్లయ్ అధికారులు వారి పరిధిలో ఉన్న రేషన్‌షాపులను సందర్శించి స్టాక్రిజిస్టర్లలో ఉన్న ప్రకారం సరుకులు ఉన్నాయా లేవా అని చెక్ చేయాలి. డీలర్లు సరుకులు ఎలా అమ్ముతున్నారు? పేదలకు రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా? లేదా అనే అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. కానీ, మన సార్లు అవేమీ చేసినట్టు కనిపించడం లేదని ఆధారాలు చెపుతున్నాయి. లెక్క చూస్తే మైండ్ బ్లాకే సమాచార హక్కు చట్టం ద్వారా నల్లగొండ మండలంలోని రేషన్ షాపుల పనితీరు ఆధారంగా ఒక చిన్న లెక్క చదివితే మీ మతి పోతుంది. ఎందుకో తెలుసా ఉజ్జాయింపుగా కడితేనే ఆ లెక్క దాదాపు రూ.80కోట్ల వరకు వచ్చింది. ఎలానో తెలుసుకుంటారా..? ఎంత లేదన్నా కనీసం నెలకు ఒక్కో రేషన్ షాపులో రూ.15వేల విలువైన సరుకులైనా పక్కదారి పడతాయని అంచనా. నల్లగొండ రూరల్ మండలం, పట్టణంలో ఉన్న రేషన్ షాపులు 75. అంటే నెలకు నల్లగొండ రూరల్ మండలంలోనే 11, 25,000 రూపాయల సరుకులు పక్కదారి పడుతున్నాయన్నమాట. అదే ఏడాదిలెక్క కడితే ఆ విలువ రూ.1.35 కోట్లు. అదే జిల్లా మొత్తానికీ వర్తింపజేస్తే 59 మండలాల్లో కలిపి ఏడాదికి రూ.79.65 కోట్లు. అంటే జిల్లాలో ఉన్న అన్ని రేషన్ షాపుల డీలర్లు అక్రమాలకు పాల్పడతారన్నది వాస్తవం కాదు కానీ.. ఓ చోట ఎక్కువైనా, ఇంకో చోట తక్కువైనా... మరో చోట అసలు లేకపోయినా సగటున అన్ని కోట్ల రూపాయల నిత్యావసరాల సరుకులు పక్కదారి పడుతున్నాయన్నది వాస్తవం. -
అ‘భద్రత’ !
సాక్షి, ఖమ్మం: జనవరి చివరిలోగా నూతన ‘ఆహార భద్రత’ కార్డులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించినా జిల్లాలో కార్యరూపం దాల్చలేదు. సీఎం ఆదేశాలతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. గతంలో జిల్లాలో మొత్తం 6,60,495 కార్డులు ఉండగా, ఇందులో 6,08,187 తెల్లకార్డులు, 51,163 కార్డులు అంత్యోదయ అన్నయోజన, 1,145 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. ఆహార భద్రత పథకం కింద ప్రస్తుతం 7,29,720 కార్డుల జారీకి అర్హులను గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో 43,838 అంత్యోదయ అన్నయోజన కార్డులున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూపన్ల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్నారు. అయితే గతం కన్నా 69,225 కార్డులు పెరిగినట్లు అధికారులు చూపుతున్నా అనర్హుల పేరుతో వేలాది మంది అర్హులకు కోత పెట్టారు. ప్రధానంగా గతంలో అన్నపూర్ణ పథకం కింద 1,145 కార్డులుంటే వీరికి సరుకుల పంపిణీ నిలిపివేశారు. సాధారణ పంపిణీలో వీరిని కూడా అర్హులుగా చూపుతుండడం గమనార్హం. అలాగే అంత్యోదయ అర్హులను గతంతో పోల్చి తే ప్రస్తుతం 7,425 మందిని తొలగించారు. నిబంధనల పేరుతో లబ్ధిదారులకు సరుకుల పంపిణీ నిలిపివేయడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఆదాయ, భూ పరిమితి పెంచినా లబ్ధిదారుల సంఖ్య మాత్రం ఎక్కువగా పెరగలేదు. పింఛన్ల మాదిరిగానే ఆహార భద్రత కార్డుల సర్వే కూడా తప్పుల తడకగా సాగిందని లబ్ధిదారులు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. గతంలో రేషన్ అందేదని, ఇప్పుడు అసలు మూడు నెలలుగా కూపన్లు ఇవ్వడం లేదని లబ్ధిదారులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అరుుతే వారికి సమాధానం చెప్పేవారేలేరు. సరుకులకు కోత.. ఈ నెలలో ఉగాదితో పాటు శ్రీరామ నవమి పండుగలు వస్తున్నాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కింద బియ్యం, కిరోసిన్, చక్కెర, చింతపండు, గోధుమలు, పామోలిన్ పంపిణీ చేయాలి. ప్రతి కార్డు లబ్ధిదారునికి కేజీ వరకు పామోలిన్ ఇవ్వాలి. కానీ జనవరి నుంచి జిల్లాలో పామోలిన్ పంపిణీ నిలిచిపోయింది. అధికారులేమో ప్రభుత్వం నుంచి సరఫరా రావడం లేదని చేతులు దులిపేసుకుంటున్నారు. ఇక చింతపండు, కారం నాణ్యత లేకపోవడంతో లబ్ధిదారులు తీసుకోవడం లేదు. బహిరంగ మార్కెట్లో పామోలిన్, కారం, చింతపండు ధరలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం నుంచి పామోలిన్ సరఫరా లేక పోగా, సరఫరా అవుతున్న సరుకులు నాణ్యతగా లేకపోవడంతో లబ్ధిదారుల బాధ వర్ణనాతీతం. ఇదిలా ఉంటే కార్డుల పంపిణీ లేకపోవడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఆహార భద్రత కార్డుల పరిశీలనతో సంబంధం లేకుండా రేషన్ సరఫరా చేస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇలానే పింఛన్ దరఖాస్తుల సమయంలోనూ అధికారులు మాటలు చెప్పారని, ఆతర్వాత రెండు నెలలుగా పింఛన్ నిలిపివేశారని, ఇప్పుడు రేషన్ బియ్యం ఇలాగే పంపిణీ చేయరేమోనని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం అయినా కార్డులు పంపిణీ చేస్తారా..? అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా అనర్హతకు గురైన కొంతమంది లబ్ధిదారులకు కార్డులు ఇప్పిస్తామంటూ దళారులు జిల్లాలో దందా కొనసాగిస్తున్నారు. తమకు మండల స్థాయి అధికారులు పరిచయమంటూ రూ.2 వేల నుంచి 3 వేల వరకు వసూలు చేస్తూ దరఖాస్తులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. గతంలోనూ ఇలా ఆరోపణలు రావడంతో జిల్లా స్థాయి అధికారులు తీవ్రంగా హెచ్చరించినా పరిస్థితి మారలేదు. ఇప్పటి వరకు కూపన్లు అందని వారు ఈ రకంగా దళారులను నమ్మిమోసపోతున్నారు. -
ఈ-పాస్‌తో గుట్టు రట్టు
రేషన్ పంపిణీకి ఈ-పాస్ విధానం ⇒ మార్చి 1 నుంచి మున్సిపాలిటీల్లో అమలు ⇒ ఎంఎల్ఎస్ పాయింట్లలో ఇంకా స్కేల్ కాటాలే ⇒ కిరోసిన్‌కు ఈ-పాస్ ఇప్పట్లో లేనట్లే ⇒ ఆర్వోలు ఎవరు రాయాలో తెలియని సందిగ్ధత ⇒ కమీషన్ వ్యవహారంపై కోర్టుకు వెళ్లేందుకు రేషన్ డీలర్ల సన్నద్ధం ఒంగోలు: రేషన్ పంపిణీలో అక్రమాలకు ఈ-పాస్ విధానంతో అడ్డుకట్ట పడనుంది. ఇప్పటికే రేషన్‌కార్డులకు, డీలర్ల లెసైన్సులకు డీలర్ ఆధార్ అనుసంధానం చేయడంతో బినామీలకు చెక్ పడింది. ఈ-పాస్ విధానంతో రేషన్ డీలర్లకు మరింత ఇబ్బందులు తప్పేలా లేవు. ఏది ఏమైనా జిల్లాలోని మున్సిపాలిటీల్లో మార్చి 1వ తేదీ నుంచి ఈ-పాస్ విధానాన్ని అమలు చేయాల్సిందేన ని ప్రభుత్వం స్పష్టం చేయడంతో బినామీ డీలర్ల వ్యవహారం అధికారులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఆధార్‌తో అక్రమాలకు చెక్: రేషన్ సరుకులు అర్హులైన వారికే అందాలన్న ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం ఆధార్ ప్రక్రియను పౌరసరఫరాల శాఖలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కార్డులో ఎవరి పేర్లు ఉన్నాయో వారే వచ్చి ఈపాస్ మెషీన్లలో వేలిముద్ర ఉంచితే తప్ప డీలర్ సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉండదు. ఈ ప్రక్రియలో అక్రమాలు అరికట్టవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ వ్యవహారంలో కార్డుదారుల ఆధార్‌ను మాత్రమే ఇప్పటి వరకు ప్రభుత్వం అనుసంధానం చేస్తూ వచ్చింది. తాజాగా డీలర్ ఆధార్ కూడా తప్పనిసరి అని చెప్పడంతో వారినోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. తొలి విడతలో పది శాతం దుకాణాలకే ఈ-పాస్: ఇటీవల డీలర్లకు ఈ-పాస్ మెషీన్లు తప్పనిసరి చేశారు. వీటితో పాటు వేయింగ్ మెషీన్లను కూడా ఇస్తున్నారు. వాటితో పాటు కరెంటు లేకున్నా నాలుగు గంటల పాటు చార్జింగ్‌తో నడిచేలా వాటికి బ్యాటరీలు ఏర్పాటు చేశారు. జిల్లాకు దాదాపు 2,500 వరకు ఈ-పాస్ మెషీన్లు అవసరం కానున్నాయి. కేవలం బియ్యం డీలర్ల వరకు మాత్రమే పరిశీలిస్తే 2118 ఈపాస్ మెషీన్లు అవసరం. తొలి విడతలో జిల్లాకు 220 మెషీన్లు మంజూరయ్యాయి. అంటే పదోవంతు అన్నమాట. వీటిలో బుధవారం నాటికి జిల్లాకు చేరిన మెషీన్లు కేవలం 91. మిగిలిన 129 మెషీన్లు కూడా రెండు మూడురోజుల్లోనే రానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వచ్చిన వాటిని ఒంగోలు నగర పంచాయతీ, చీరాల, మార్కాపురం, కందుకూరు మున్సిపాలిటీలతోపాటు మరో రెండు నగర పంచాయతీలు లేదా మండలాల్లో అమర్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో స్కేల్ కాటాలే: రేషన్ డీలర్ల వద్ద ఈ వెయ్యింగ్ మెషీన్లు తప్పనిసరి అంటున్న ప్రభుత్వం, మండల్ లెవల్ స్టాక్ పాయింట్ల(ఎంఎల్ఎస్ పాయింట్లు) వద్ద మాత్రం స్కేల్ కాటాలే ఉంచడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటి వరకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు పంపిణీ అయ్యే సరుకులో చేతివాటం బాగా కనిపించేది. దీనిపై ప్రశ్నించే సాహసం చేయకుండా తమ వంతు చేతివాటం ప్రదర్శిస్తూ అనేకమంది డీలర్లు నెట్టుకొస్తున్నారు. కానీ తాజాగా రేషన్ డీలర్ తప్పనిసరిగా ఈ పాస్ మెషీన్ వినియోగించాల్సి రావడంతో వారు బెంబేలెత్తుతున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం లేకపోతే తాము ఎలా సక్రమంగా తూకం ఇవ్వగలమనేది వారి వాదన. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో సరిపోదని, డెలివరీ ఇచ్చే సమయంలో తమకు ప్రభుత్వం ఇచ్చిన ఈ వెయ్యింగ్ మెషీన్ మీద తూకం వేసుకొని సరుకు తీసుకోవాలని డీలర్లు భావిస్తున్నారు. ఇదే జరిగితే రేషన్ డీలర్లకు, ఎంఎల్ఎస్ పాయింట్ల అధికారులకు మధ్య చిచ్చు రగిలినట్లే. నామినీ పేరుతో నాటకాలు: రేషన్ డీలర్ లెసైన్స్‌లకు డీలర్ ఆధార్‌ను అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా ఈ-పాస్ మెషీన్లు ఏర్పాటు చేసేందుకు వెళ్లిన అధికారులకు పెద్ద చిక్కే వచ్చి పడింది. అసలు డీలర్ కనిపించకుండా అతని కుటుంబ సభ్యులు లేదా ఇతరులు ప్రత్యక్షం అవుతున్నారు. తప్పకుండా డీలర్ రావాల్సిందేనని, వారి ఆధార్ ఫీడ్ చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటు అతని వేలిముద్రను కూడా ఈపాస్ మెషీన్‌కు అనుసంధానం చేయాలని సూచిస్తున్నారు. బినామీ డీలర్లకు అడ్డుకట్ట వేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టారు. ఒంగోలు నగరంలోనే దాదాపు 15 మంది బినామీల చేతుల్లో డీలర్ షాపులున్నట్లు సమాచారం. అయితే అసలు డీలర్ ఎక్కడ ఉన్నారనేది అర్థం కాకుండా ఉంది. లెసైన్స్ పొందిన డీలర్ దానిని మరొకరికి ఎంతో కొంతకు విక్రయించేసి ఉండడమో లేక, అత ను మృత్యువాత పడడమో లేక మరో ఇతర కారణం చే తో అతనికి బదులుగా బినామీలు నడుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే నామినీగా చెప్పుకుంటున్న వాటిలో కూడా ఒక రేషన్ షాపునకు ప్రభుత్వ ఉద్యోగి పేరు ఉందనే ఆరోపణలు అధికారుల దృష్టికి చేరాయి. ఆ ఉద్యోగి ఏ డిపార్టుమెంట్లో పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. కిరోసిన్‌కు మాత్రం ఇప్పట్లో లేనట్లే: తొలి విడత కేవలం పది శాతం దుకాణాలకు మాత్రమే ఈ-పాస్ మెషీన్లను సప్లయ్ చేస్తున్నందున కిరోసిన్ హాకర్లకు సంబంధించి ఇప్పట్లో ఈ పాస్ లేనట్లే అని స్పష్టమవుతోంది. కిరోసిన్ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో దానిని కిరోసిన్ హాకర్లు క్యాష్ చేసుకుంటున్నారు. దీనికి కూడా ఈపాస్ ఏర్పాటుచేస్తే భారీ మొత్తంలోనే కిరోసిన్ విక్రయాలు పడిపోతాయి. లేదంటే హాకర్లు నేరుగా సంబంధిత కార్డుదారుడ్ని బతిమలాడుకొని అతని చేత వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం 90 శాతం సాధ్యం కాని పని. కమీషన్ వ్యవహారంపై కోర్టుకెళ్లే యోచనలో డీలర్లు: రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్న సరుకుల రకాలు తగ్గిపోయాయి. ఈ-పాస్ మెషీన్లంటూ రేషన్ డీలర్లను జవాబుదారీ చేస్తున్నారు. కానీ వారు కోరుతున్నట్లు కనీస వేతనాల సమస్యపై మాత్రం ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. దానికితోడు కమీషన్‌ను సైతం పెంచేందుకు ప్రభుత్వం దాటవేత వైఖరి ప్రదర్శిస్తోంది. తమకు నెలకు కనీస వేతనం కాదు కదా దుకాణం అద్దె, అందులో పనిచేసే హెల్పర్‌కు జీతాన్ని సైతం ఇచ్చే పరిస్థితి ఉండదని డీలర్లంటున్నారు. అందువల్ల ఈ పాస్ విధానం అమలు కాకముందే హైకోర్టును ఆశ్రయించాలని పలువురు డీలర్లు భావిస్తున్నారు. అయితే డీలర్ల సంఘం నుంచి దీనికి పూర్తిస్థాయిలో సంఘీభావం దక్కడం లేదు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా అటువంటి వ్యవహారాల జోలికి వెళ్లొద్దని...అదే జరిగితే డీలర్‌షిప్‌లు వదులుకోవాల్సిందే అంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్వోల వ్యవహారంపైనా కొనసాగుతున్న సందిగ్ధత: డీలర్లు డీడీలు కట్టగానే కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయానికి అలాట్మెంట్ ఉత్తర్వులు వస్తాయి. అవి రాగానే జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి తహ శీల్దారులకు మండలాల వారీగా అలాట్మెంట్ ఉత్తర్వులు రిలీజ్ చేస్తారు. వాటిని తహశీల్దారు డీలర్వారీగా కేటాయిస్తారు. ప్రస్తుతం ఈ పాస్ విధానం ప్రకారం తహ శీల్దారుకు సంబంధం లేకుండానే అంటే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే నేరుగా డీలర్‌కు సరుకు చేరాలి. అదే జరిగితే రిలీజింగ్ ఆర్డర్లు(ఆర్వో)లు ఎవరు రాయాలనే సందిగ్ధత ప్రస్తుతం నెలకొంది. ఎంఎల్ఎస్ పాయింట్లలోని అధికారులు ఆర్వోలు జారీ చేస్తారా లేక తహ శీల్దారులే వాటిని విడుదల చేయాలా అనేది అర్థంకాక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
పీడీఎస్ అక్రమాలకు అడ్డుకట్ట!
జనవరి నుంచి తెలంగాణలో అమల్లోకి కొత్త వ్యవస్థ ‘సప్లయ్ చైన్ మేనేజ్మెంట్’ విధానం అమలుకు కేంద్రం ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా సరుకుల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు ఇకపై అడ్డుకట్ట పడనుంది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పంపిణీ వ్యవస్థ(సప్లయ్ చైన్ మేనేజ్మెంట్) ద్వారా పీడీఎస్‌ను మరింత సమర్థంగా నిర్వహిం చేందుకు వీలు చిక్కనుంది. ఇప్పటికే ఈ-పీడీఎస్ విధానంతో 69 లక్షల మంది అనర్హులను తొలగించిన పౌరసరఫరాల శాఖ.. కేంద్రం ఆదేశాల మేరకు జనవరి నుంచి కొత్త పంపిణీ వ్యవస్థను అమలు చేసేం దుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో రేషన్ పంపిణీ అంతా మాన్యువల్‌గా జరుగుతుండటంతో అన్ని స్థాయిల్లో అక్రమాలు చోటుచేసుకున్నా యి. అధికారులు, డీలర్లు చేతివాటం చూపడంతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. బోగస్ కార్డుల ద్వారానే ఏటా 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అనర్హుల చేతుల్లోకి వెళ్లింది. కిరోసిన్ అక్రమ మళ్లింపుల ద్వారా ఏటా రూ.1800 కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని కేంద్రం తేల్చిం ది. లోపాలపుట్టగా మారిన పీడీఎస్ విధానాన్ని మార్చాల్సిన అవసరాన్ని కాగ్ తన నివేదికలో పేర్కొంది. కొత్త విధానంతో పూర్తి పారదర్శకం.. ఈ అక్రమాలను నిరోధించే క్రమంలో కేంద్రం కొత్తగా సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో మూడు నెలల కిందటే ఈ విధానాన్ని ప్రారంభించింది. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో జనవరి నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఎఫ్‌సీఐ నుంచి చౌక ధరల దుకాణం వరకు సరుకుల సరఫరా, పంపిణీకి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలి. సరుకు రవాణా చేసే ట్రక్కుల సమాచారం ఎమ్మార్వో మొదలు కిందిస్థాయి అధికారి, డీలర్, గ్రామ ఆహార సంఘం సభ్యుడి వరకు చేరేలా సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యాలయాలకూ సరుకు వివరాలు చేరుతాయి. దీంతో ఎక్కడా అక్రమాలకు తావుండదు. ఈ వ్యవస్థ అమలుకు వీలుగా రాష్ట్రంలోని 172 మండలస్థాయి స్టాక్ పాయింట్లలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. జిల్లాల అధికారులకు సైతం దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. -
త్వరలో అదనపు ఆధార్ కేంద్రాలు
సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అనంతగిరి: పాడేరు డివిజన్ లోని అన్ని మండలాల్లో అదనపు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. సోమవారం అనంతగిరి మండలంలో టోకురు, బొర్రా, అనంతగిరి ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆయనకు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఆధార్‌కార్డులు రాక చాలామంది గిరిజనులకు రేషన్ బియ్యం అందడం లేదన్న ఫిర్యాదుపై స్పందించారు. తక్షణమే కార్డులు ఉన్న వారి జాబితా వెంటనే ఇవ్వాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. బొర్రా, టోకురు గుమ్మ, అనంతగిరి, ఎగువశోభ పంచాయతీల్లో భూపట్టాలు పంపిణీ చేయాలని గిరిజన సంఘం నాయకులు కోరారు. పట్టాలు ఇచ్చేందుకు అనుకులంగా ఉన్నచోట పట్టాదార్ పాస్‌బుక్‌లు సిద్దంచేస్తే మళ్లీ అనంతగిరి వచ్చినప్పుడు పంపిణీ చేస్తానన్నారు. కివర్ల డీఆర్ డిపోలో రేషన్ పంపిణీ చేయాలని జీసీసీ మేనేజర్‌ను ఆదేశించారు. నాన్‌షెడ్యుల్డ్ పంచాయతీల్లో భూ ఆక్రమణలను ఆపాలని సబ్ కలేక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కబ్జాదారుల జాబితా తనకు అందజేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జెడ్పీ వైస్ చైర్మన్ కె.అప్పారావు. తహశీల్దార్ భాగ్యవతి, ఎంపీడీవో సాంబశివరావు, ఎంపీటీసీ, సర్పంచ్‌లు డి.గంగరాజు, ధర్మన్న మోష్యి నాగులు పాల్గొన్నారు. వైద్య సేవలు లోపిస్తే వేటు డుంబ్రిగుడ: గిరిజనులకు సేవల్లో వైద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని పాడేరు సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. సోమవారం డుంబ్రిగుడ తహశీల్దార్ కార్యాలయంలో ఆయన కుల గణన సర్వే నివేదికలను పరిశీలించారు. అనంతరం ఇక్కడి పీహెచ్సీలో వైద్యుల పనితీరును సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ చిన్న వయస్సుల్లోనే ఐఏఎస్ అధికారిగా నియమితుడినైన తాను మన్యంలో సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. పాడేరు డివిజన్ లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని తుంగలోకి తొక్కి గిరి భూముల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటానని చెప్పారు. డుంబ్రిగుడ మండలం అరకు సంత గ్రామంలో గిరిజనేతరులు చేపడుతున్న కట్టడాలపై దృష్టిసారించాలని తహాశీల్దార్‌ను ఆదేశించారు. -
'రేషన్ పంపిణీకి ఆధార్ లింక్ లేదు'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆధార్ కార్డులు జారీ చేసిన తరువాతే రేషన్ పంపిణీతో అనుసంధానం చేస్తామని పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. ప్రస్తుతానికి రేషన్ పంపిణీకి, ఆధార్ కు లింక్ లేదని తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సునీత.. రేషన్ డీలర్లు ఎవరైనా అక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ప్రతి జిల్లాలో ఉల్లిపాయ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సునీత పేర్కొన్నారు.ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. వంద రోజుల్లో లక్ష దీపం కనెక్షన్లు ఇస్తామన్నారు.