తహసీల్దార్ కార్యాలయంలో యంత్రాలను పరిశీలిస్తున్న టెక్నీషియన్, డీలర్లు
‘‘ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. అందులో భాగంగానే రేషన్ దుకాణాల్లో ఈ పాస్ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ, అందులో నెలకొంటున్న సాంకేతిక సమస్యలను సత్వరం పరిష్కరించకపోవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.’’
జడ్చర్ల : ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబందించి ఈ–పాస్ విధానాన్ని అమలులోకి తేగా సాంకేతిక సమస్యలతోఅటు డీలర్లు ఇటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివైస్‌లకు సంబందించి గ్రామీణప్రాంతాలలో పూర్తి స్థాయిలో నెట్ రాకపోవడంతో పంపిణీలో ఆలస్యం చోటు చేసుకుం టుంది. దీనికి తోడు ఇటీవల డివైస్‌లలో సాఫ్ట్‌వేర్‌ను ఆకస్మికంగా మార్పు చేయడంతో ఈనెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ నిలిచిపోయింది. ఏమైంది అన్న విషయం అర్థం గాక మొదటి రోజు అటు అధికారులు ఇటు డీలర్లు తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. తీరా వయాసిస్ కంపెనీ తమ సాఫ్ట్‌వేర్ మార్పు చేసి ఆధార్ అనుసంధానంగా సర్వర్‌తో లింక్ చేసే కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి అమలు చేస్తుందని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తోనే..
ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ పూర్తి చేసే విధంగా అధికారులు విధివిధానాలను రూపొందించారు. 15వ తేదీ తర్వాత బియ్యం పంపిణీ ఉండదు. ఆ సమయంలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసే విధంగా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఆకస్మికంగా 1వ తేదీనుంచి అంటే బియ్యం పంపిణీ ప్రారంభంరోజు నుంచే సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేయడంతో సమస్య నెలకొందని అటు అధికారులు ఇటు రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తరచూ సమస్యలు
ఈ–పాస్ విధానంలో తరచు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేక పోవడంతో సమస్య నెలకొంటుందని అంటున్నారు. తమకు ఎయిర్‌టెట్, ఐడియా సిమ్‌లు జారీ చేశారని అయితే కొన్ని ప్రాంతాల్లో ఆయా సిమ్‌లు పనిచేయడం లేదన్నారు. ఒక వేళ పనిచేసినా నెట్ సిగ్నల్ సరిగ్గా లేక నెట్ నెమ్మదిగా ఉంటుందని.. దీంతో పొద్దస్తమానం సమయం వెచ్చించే పరిస్థితి ఉంద న్నారు. 4జీ నెట్ అందించే జియో సిమ్‌లను సరఫరా చేస్తే బాగుంటుందని వారు పేర్కొంటున్నారు. నెట్ స్పీడ్‌గా వస్తే పని కూడా సులువు అవుతుందని, బియ్యం పంపిణీని త్వరగా పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నా మని కొందరు డీలర్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేగాక మిషన్‌లలో సాంకేతిక సమస్య తలెత్తితే సదరు మిషన్‌ను తీసుకుని సంబందిత తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని టెక్నిషియన్ కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంటుందన్నారు. దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.
సమస్య పరిష్కారానికి చర్యలు
ఇటీవల డివైస్(మిషన్)లలో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఓ టెక్నీషియన్‌ను తమ కార్యాలయంలో అందుబాటులో ఉంచి సమస్యను సరిచేయిస్తున్నాం. దాదాపుగా సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి బియ్యం పంపిణీకి చర్యలు తీసుకున్నాం.
– లక్ష్మీనారాయణ, తహసీల్దార్, జడ్చర్ల
Comments
Please login to add a commentAdd a comment