ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలపై చౌక డీలర్లలో ఆందోళన
అసలు ఎంఎల్‌సీ గోడౌన్లపైనే నిఘా పెట్టాలని వినతి
విజయవాడ : అమ్మో ఈ-పాస్ విధానం అంటూ డీలర్లు బెంబేలెత్తుతున్నారు. ఈ విధానం ఆచరణలోకి వస్తే తమ పరిస్థితి అగమ్య గోచరమేనని చౌకధరల దుకాణాల డీలర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఈ-పాస్ డివైస్ పరికరం ద్వారా ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో రాష్ట్రంలో 6 వేల చౌక ధరల దుకాణాలకు కొత్త విధానాన్ని రూపొందించగా కృష్ణాజిల్లాలో 600 షాపుల్లో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో విజన్‌టెక్ సంస్థ ద్వారా పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే డీలర్లు కొత్త విధానంపై ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం హైదరాబాద్, విజయవాడల్లో డీలర్ల సంఘాలు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ భవిష్యత్ కార్యచరణపై కసరత్తులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో జిల్లాలో 2,200 మంది డీలర్లు, 1200 మంది కిరోసిన్ హాకర్లు ఉన్నారు. వీరు ప్రతి నెల బియ్యం, పంచదార, కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. బియ్యంపై కిలోకు 25 పైసలు, పంచదారపై 13 పైసలు, కిరోసిన్‌పై 25 పైసలు కమీషన్ ఇస్తున్నారు.
ఆ విధంగా నెలవారీ ఒక్కో డీలర్లకు రూ.2,500 లేదా 3,000లు కమీషన్ వస్తుంది. అయితే డీలర్లకు సరుకులు సరఫరా చేసే మండల్ లెవల్ మెయిన్ పాయింట్ల నుంచి వచ్చే సరుకులో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరుగుతోంది. దాదాపుగా అన్ని పాయింట్లలో 50 కేజీల బియ్యం బస్తాకు 2నుంచి 3 కేజీల బియాన్ని అక్కడి అధికారులు దిగమింగటం బహిరంగ రహస్యమే. అయితే ఆ తూకం నష్టాన్ని డీలర్లు ప్రజలపై రుద్దుతుంటారు. ఈ క్రమంలో కలెక్టర్ బాబు.ఎ రూపొందించిన కొత్త విధానం డీలర్లను ఆర్థికంగా నష్టానికి గురిచేస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌సి పాయింట్లలో భారీ మోసం జరుగుతోందని, ఎంఎల్‌సీ పాయింట్లలో ఎలక్ట్రానిక్ కాటాలు పెడితే తమకు ఇబ్బంది ఉండదని డీలర్ల అసోసియేషన్ నాయకులు చెపుతున్నారు.
వేతనాలు ఇవ్వాలి
కాగా డీలర్లకు కమీషన్ విధానం రద్దు చేసి నెలవారి వేతనాలు ఇస్తే ప్రజాపంపిణీ వ్యవస్థ పారదర్శకంగా ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పౌరసరఫరాల కమిషనర్‌ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించినట్లు వారు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారని జిల్లా ప్రతినిధులు సాక్షికి వివరించారు.
అమ్మో ‘ఈ-పాస్’
Published Sat, Feb 21 2015 1:01 AM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM
Advertisement