ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి.
దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన
యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి.
దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు.
రైతులను మభ్యపెడుతూ..
యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment