న్యూఢిల్లీ: యూరియా వినియోగం తగ్గించేందుకు, ఎరువుల వినియోగంలో సమతూకం పాటించే లక్ష్యంతో ఇకపై యూరియా బస్తాల్ని 50 కేజీలు కాకుండా 45 కేజీల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 45 కేజీల బస్తాల అమ్మకం మార్చి 1, 2018 నుంచే అమల్లోకి వచ్చిందని, అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న 50 కేజీల బస్తాల్ని వచ్చే రెండు నెలలు అమ్ముకునేందుకు అనుమతిస్తామని ఎరువుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
హెక్టారు పొలానికి బస్తాల లెక్కన యూరియాను రైతులు వాడుతున్నారని, వినియోగం తగ్గించమని చెప్పినా వినడం లేదని.. అందువల్లే 45 కేజీల బస్తాల్ని విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. పన్నులు జతచేయకుండా 45 కేజీల యూరియా బస్తాను రూ. 242కు విక్రయిస్తారని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. టన్ను యూరియాకు ప్రభుత్వం నిర్ణయించి న రూ. 5360 ధరకు అనుగుణంగా బస్తా రేటును నిర్ణయిస్తున్నారు. కాగా 25 కేజీలకు మించకుండా బస్తాల్ని విక్రయించేందుకు డీలర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ప్యాకింగ్ కోసం 2 కేజీల యూరియాకు రూ. 1.50, 5 కేజీలకు రూ.2.25, 10 కేజీలకు రూ. 3.50, 25 కేజీలకు రూ. 5లు డీలర్లు వసూలు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment