సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో రైతులకు యూరియా అందని ద్రాక్షగా మారింది. సాగువిస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయినా యూరియా మాత్రం రైతుల దరికి చేరడం లేదు. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు స్వామి భక్తి ప్రదర్శిస్తూ తెలుగుదేశం ఆధీనంలో ఉన్న సైటీలకు మాత్రమే యూరియా సరఫరా చేస్తున్నారు. దీంతో అవసరమైన రైతులకు యూరియా అందే పరిస్థితి లేకుండా పోయింది.
వ్యవసాయ సాగు అంతంత మాత్రంగా ఉన్న సీజన్‌లోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాగు వర్షాభావ పరిస్థితుల వల్ల సగానికి పడిపోయిన సంగతి తెలిసిందే.
వ్యవసాయ శాఖ అంచనాలతో చూసినా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. అలాంటప్పుడు ఎరువులు అందుబాటులో ఉండటం సహజం. కానీ జిల్లాలో ఇందుకు విరుద్దంగా జరుగుతోంది. పంటల సాగు తగ్గినా, రైతులకు అదనులో యూరియా దొరకడం లేదు. గత వారం రోజులుగా వరుణుడు కరుణిస్తున్నాడు. గత రెండు రోజులుగా జిల్లాలో సగటున 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. దీంతో పంటలను కాపాడుకోవడం కోసం రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు.
వ్యవసాయ శాఖ అవినీతి, ఎరువుల వ్యాపారుల దోపిడీతో రైతులకు అందని పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు తొమ్మిది కంపెనీల నుంచి ఎరువులు సరఫరా అవుతాయి. రైల్వే ర్యాకుల ద్వారా వచ్చే ఎరువులు మాత్రమే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా వెళ్తుండగా, రోడ్డు మార్గం గుండా వచ్చే ఎరువులకు లెక్క ఉండటం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు అడిటింగ్ చేసిన తర్వాతే రైతులకు ఎరువులు సరఫరా చేయాల్సి ఉండగా దీనికి భిన్నంగా జరుగుతోంది.
ఒంగోలులో డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 25 నుంచి 30 రూపాయలు ఎక్కువకు డీలర్లకు ఇవ్వడంతో దానిపై 50 రూపాయల వరకూ వేసుకుని అమ్ముతున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఒక్కో బస్తాపై 50 నుంచి వంద రూపాయల వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. మామూళ్ల మత్తులో కూరుకుపోయిన అధికారులు చోద్యం చూస్తున్నారు. మరోవైపు అధికారులు తమ స్వామిభక్తిని ప్రదర్శిస్తూ సొసైటీలకు ఎరువుల కేటాయింపుల్లో పక్షపాతం చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధ్యక్షులుగా ఉన్న సొసైటీలకు యూరియా కేటాయించకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్న సొసైటీలకు కేటాయిస్తున్నారు. దీనిపై నిరసన వెల్లువెత్తుతోంది. సహకార సంఘాలకు ప్రాధాన్యమిస్తూ ఎరువుల విక్రయాల కేటాయింపులు జరపాల్సిన వ్యవసాయ శాఖకు ఇవేమీ పట్టడం లేదు. జిల్లా వ్యవసాయ అధికారులను సంతృప్తి పరిచిన డీలర్లకు, అధికార పక్షానికి చెందిన డీలర్లకు మాత్రమే ఎరువులు అధికంగా కేటాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లారీకి రెండు వేల రూపాయల వరకూ డీలర్లు చెల్లించుకోవాల్సి వస్తోందని సమాచారం. నవంబర్‌లో 16,786 బస్తాల యూరియా అవసరం కాగా అసలు ఎంత స్టాక్ ఉందో వ్యవసాయ శాఖ అధికారులకే తెలియని పరిస్థితి. మరోవైపు యూరియా అక్రమాలపై డీలర్లు అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అయన వెంటనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులో మాట్లాడుతూ పద్దతి మార్చుకోకపోతే రైతుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
కురిచేడులో రైతుల పాట్లు
గత నెల రోజులుగా యూరియా జిల్లాకు రాకపోవటంతో రైతులు తల్లడిల్లిపోయారు. సోమవారం మండలంలోని కురిచేడు సొసైటీకి ఒక్క లారీ నాగార్జున యూరియా రావటంతో రైతులు ఎగబడ్డారు. వారిని అదుపు చేయటం అధికారులకు తలకుమించిన భారమైంది. మండలంలో 17 ఎరువుల కొట్లు,ఒక గ్రోమోర్ ఉన్నా మండల రైతులకు యూరియా అందించటంలో పూర్తిగా విఫలమయ్యాయి.దీంతో లారీ వచ్చిన సమయంలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపు చేయాల్సి వచ్చింది.
యూరియా....అంతా మాయ
Published Tue, Nov 11 2014 3:45 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement