యూరియా ‘లాక్‌’ | Urea imports faces a fresh hurdle | Sakshi
Sakshi News home page

యూరియా ‘లాక్‌’

Published Sun, Jul 26 2020 2:39 AM | Last Updated on Sun, Jul 26 2020 4:44 AM

Urea imports faces a fresh hurdle - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా... ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి రాష్ట్రంలోని వ్యవసాయ అవసరాలపై కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈ వైరస్‌ విజృంభిస్తున్న వేళ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనే కాదు స్థానికంగా ఏర్పడిన ‘లాక్‌డౌన్‌’పరిస్థితులు అడుగడుగునా రాష్ట్రంలోకి ఎరువుల రాకను అడ్డుకుంటున్నాయి. విదేశాల నుంచి యూరియాను తెచ్చే నౌకల గమ్యస్థానాలైన పోర్టుల నుంచి రాష్ట్రంలో ఉండే ర్యాక్‌ పాయింట్లు, గోదాముల వరకు అన్నిచోట్లా ఈ మాయదారి వైరస్‌ తన ప్రభావాన్ని చూపెడుతూనే ఉంది. దీంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌కు యూరియా ముప్పు పొంచి ఉందని, కరోనాకు తోడు తుపానులు కూడా యూరియా దిగుమతులకు అడ్డంకిగా మారాయని వ్యవసాయశాఖ ఓ నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్రంలో ఎరువుల వినియోగం గత నెల నుంచే ప్రారంభం కావడం, ఈ నెల నుంచి సెప్టెంబర్‌ వరకు గరిష్టంగా వినియోగం జరిగే అవకాశం ఉండడంతో ఏం చేయాలో కూడా ఆ శాఖ అధికారులకు పాలుపోవడం లేదు. మొత్తంమీద కరోనా ప్రభావం కారణంగా అవసరానికన్నా 2.5 లక్షల టన్నుల వరకు యూరియా కొరత ఏర్పడిందని, రాష్ట్రంలో ప్రస్తుతం 5.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులే అందుబాటులో ఉన్నాయని, అందులోనూ యూరియా కేవలం 1.89 లక్షల మెట్రిక్‌ టన్నులే ఉందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.

నాలుగు నెలలుగా సరఫరాలో జాప్యం 
వాస్తవానికి, రాష్ట్రంలో ప్రతి సీజన్‌కు సాగు చేసే పంటల విస్తీర్ణం ఆధారంగా తమకు ఎరువులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫర్టిలైజర్స్‌ శాఖకు ప్రతిపాదనలు పంపుతుంది. ఆ మేరకు ప్రతి సీజన్‌కు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫర్టిలైజర్స్‌ (డీవోఎఫ్‌) ఎరువులను కేటాయిస్తుంది. ఈ ఏడాది మొత్తం 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయనే అంచనాతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈసారి ఎరువుల కేటాయింపు ప్రతిపాదనలను భారీగానే పంపింది. దీనికి అనుగుణంగానే డీవోఎఫ్‌ కూడా ఈసారి మన రాష్ట్రానికి 10.50 లక్షల మెట్రిక్‌ టన్నులు (గత సంవత్సరాలతో పోలిస్తే 2 లక్షల మెట్రిక్‌ టన్నులు అధికంగా) యూరియాను కేటాయించింది. ఇందులో ఈనెల 31 నాటికి 6.13 లక్షల మెట్రిక్‌ టన్నులు రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఏప్రిల్, మే, జూన్, జులై మాసాల్లో కేవలం 3.70 లక్షల మెట్రిక్‌ టన్నులే వచ్చింది. ఇక మిగిలిన ఎరువులు కూడా కలిపి మొత్తం 22.50 లక్షల మెట్రిక్‌ టన్నులను కేంద్రం కేటాయించగా, అందులో జూలై వరకు రావాల్సిన దాంట్లో ఇప్పటివరకు 5 లక్షల టన్నుల మేర తక్కువ రావడం గమనార్హం.

మరో 37 వేల టన్నులు వచ్చే చాన్స్‌
ఇక వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం రాష్ట్రానికి ఈనెల 31 వరకు మరో 37 వేల టన్నులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఉన్న 8 ర్యాక్‌ పాయింట్ల నుంచి పలు ఫర్టిలైజర్‌ కంపెనీలు ఈ మేరకు ఎరువులు ఇస్తాయని ఆ శాఖ అంచనా వేస్తోంది. కానీ కోవిడ్‌ ప్రభావం కారణంగా అవి కూడా ఏ మేరకు వస్తాయన్నది సందేహాస్పదమే. దీంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో యూరియా కొరత ఏర్పడే అవకాశముందని వ్యవసాయ శాఖ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఈ కొరతను అధిగమించేందుకు గాను గత నెలల్లో తక్కువగా వచ్చిన ఎరువులనయినా రాష్ట్రానికి పంపాలని, రానున్న నెలల్లో కేటాయింపుల కంటే ఎక్కువ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ప్రతిపాదించారు.

ఇవీ అడ్డంకులు: 
►మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా అక్కడ లేబర్‌ సమస్య బాగా ఏర్పడింది. దీనికి తోడు ఆంఫా, నిసర్గా తుపానుల కారణంగా ఆ రాష్ట్రంలోని యూరియా ఉత్పత్తి కార్మాగారాల్లో పనులు నిలిచిపోయాయి.  
►మే నెలలోనే కృష్ణపట్నం పోర్టులో లేబర్‌ సమస్య రావడంతో సప్‌లై నెమ్మదించింది. ఇక, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్‌ 10 నుంచి 16 వరకు అక్కడ లోడింగ్‌ కార్యకలాపాలు నిలిపివేశారు. జూన్‌లో పారాదీప్‌ పోర్టుకు రావాల్సిన యూరియా నౌక ఇంకా చేరలేదు.  
►ఏప్రిల్, మే నెలల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న కారణంగా రాష్ట్రంలోని ర్యాక్‌ పాయింట్లలో కూడా లోడింగ్, అన్‌లోడింగ్‌ నిలిచిపోయింది. యూరియా రవాణా ఆగింది.  
►సనత్‌నగర్, ఆదిలాబాద్‌ ర్యాక్‌ పాయింట్లలో ఏప్రిల్‌ నెలలో, కరీంనగర్‌ పాయింట్‌లో ఏప్రిల్, మే నెలల్లో కరోనా కారణంగా అన్‌లోడింగ్‌కు అవాంతరాలు కలిగాయి.  
►ఇక నిజామాబాద్‌ ర్యాక్‌పాయింట్‌లో యూరియా అన్‌లోడింగ్‌ నెమ్మదిగా జరుగుతోంది. ఇక్కడ బియ్యం దిగుమతికి ప్రాధాన్యత ఇస్తుండడం, ప్లాంట్లు, పోర్టుల నుంచి యూరియా తెచ్చే ర్యాక్‌లు తక్కువగా లోడ్‌ అవుతుండడంతో ఇక్కడ కూడా ఆశించిన స్థాయిలో యూరియా దిగుమతి కావడం లేదు.  
►రవాణా లారీల్లో ఎక్కువగా మక్కలు వెళుతున్నాయి. దీనికి తోడు రబీలో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులతో గోదాములు నిండిపోవడంతో యూరియా నిల్వకు సమస్య ఏర్పడుతోంది.  
►మన రాష్ట్రానికి యూరియాను ఎక్కువగా సరఫరా చేసే కాకినాడలోని నాగార్జున ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌సీఎల్‌)ను ఈనెల మొదటివారం నుంచి షట్‌డౌన్‌ చేయడం ఈ ఆలస్యానికి మరింత కారణం అవుతోంది. చెన్నై, మహారాష్ట్రల్లోని యూరియా ప్లాంట్లు కూడా ఏప్రిల్‌ నుంచి మూతపడి ఉన్నాయి.  
►కోవిడ్, తుపానుల కారణంగా చైనా, వియాత్నాం, గల్ఫ్‌ దేశాల నుంచి రావాల్సిన యూరియా నౌకలు సమయానికి రావడం లేదు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement