సాగుకు సన్నద్ధం
5,40,450 హెక్టార్లలో సాగు అంచనా
- 14 లక్షల 56వేల ప్యాకెట్ల పత్తి విత్తనాలు సిద్ధం
- 34,415 టన్నుల యూరియా నిల్వ
- దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు
వరంగల్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సాగుకు రైతులతో పాటు వ్యవసాయ శాఖ కూడా సిద్ధమవుతోంది. అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాగు అంచనాలు రూపొందించి దానికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేశారు. రైతులు పొడిదుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. భూమిలో బలం పెంచేందుకు పెంట, చెరువు మన్ను పోసే పనుల్లో నిమగ్నమయ్యారు.
జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 5,40,450 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గత ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 5,29,061 హెక్టార్లుండగా ప్రస్తుతం 10వేల హెక్టార్ల మేరకు పెరుగుతుందని భావిస్తున్నారు.అందుబాటులో విత్తనాలు ప్రధానమైన పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. సకాలంలో మార్కెట్‌లోకి విత్తనాలు వచ్చే విధంగా విత్తన కంపెనీల ప్రతినిధులతో పాటు ప్రభుత్వ విత్తనోత్పత్తి సంస్థలతో జిల్లా కలెక్టర్ జి.కిషన్ సమీక్షించారు.
జిల్లాలో 14,56,200 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించారు. ఇక వరిసాగుకు అవసరమైన విత్తనాలు13వేల క్వింటాళ్ళు ఏపీ సీడ్స్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మొక్కజొన్న, వరి, జీలుగు విత్తనాలు సబ్సీడీపై అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కజొన్నకు సంబంధించి 5వేల క్వింటాళ్ళు, జీలుగు 4వేల క్వింటాళ్ళు, వేరుశనగ 3వేల క్వింటాళ్లు, మిరపకు 50వేల ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లాలో విత్తనాల కొరత లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఎరువుల నిల్వలు ఇలా..
ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో ఇప్పటికే 34,415 టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు జేడీఎ జి.రామారావు చెప్పారు. మార్క్‌ఫెడ్ వద్ద 14,570 టన్నులు, కంపెనీ గోదాంల్లో 7,264 టన్నులు, సహకార సంఘాల వద్ద 6,581 టన్నులు నిల్వ ఉన్నట్లు తెలిపారు. డీఎపీ 25,655 టన్నులు, కాంప్లెక్సు ఎరువులు 32,363 టన్నులు, పొటాష్ 2008 టన్నులు నిల్వలున్నట్లు వివరించారు. అదనంగా 5వేల టన్నుల ఎరువుల నిల్వ కోసం యత్నిస్తున్నట్లు చెప్పారు.