ఎరువు భారం 35 కోట్లు | Fertilizers Rates Hiked Due To Dollar Rate Increased | Sakshi
Sakshi News home page

ఎరువు భారం 35 కోట్లు

Published Sat, Sep 1 2018 11:19 AM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Fertilizers Rates Hiked Due To Dollar Rate Increased - Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ) : అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ ధర పెరగడంతో రైతుల పరిస్థితి ఢమాల్‌ అయ్యింది. డాలర్‌ ధర పెరగడం వల్ల కాంప్లెక్స్‌ ఎరువుల ముడిసరుకు ధరకు రెక్కలు తొడిగాయి. దీంతో మూడు నెలల వ్యవధిలో మరోసారి కాంప్లెక్స్‌ ఎరువుల ధర పెరిగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగులో యూరియాతో పాటు కాంప్లెక్స్‌ ఎరువులను రైతులు ఎక్కువగానే వినియోగిస్తున్నారు. పంటల దిగుబడి పెరగాలంటే కాంప్లెక్స్‌ ఎరువులను వినియోగించాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. అయితే ధరలు పెరగడం వల్ల పెట్టుబడులు అధికం అవుతున్నాయని వాపోతున్నారు.

మునుపెన్నడూ లేని విధంగా తక్కువ సమయంలోనే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలలో పెరుగుదల కనిపిస్తుండటంతో మూలిగే నక్కపై తాటికాయ పడిందనే చందంగా రైతుల పరిస్థితి తయారైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లో కాంప్లెక్స్‌ ఎరువుల ధర ఒక బస్తాపై రూ.100 నుంచి రూ.173 వరకు పెరిగింది. ఇప్పుడు మాత్రం ఒక బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగింది. గతంలో పెరిగిన ధరల వల్ల ఉమ్మడి జిల్లా రైతులపై ఏటా దాదాపు రూ.50 కోట్ల భారం ఏర్పడగా ఇప్పుడు మళ్లీ ధర పెరగడంతో మరో రూ.35 కోట్ల ఆర్థిక భారాన్ని రైతులు మోయాల్సి వస్తోంది.

కాంప్లెక్స్‌ ఎరువుల తయారీకి వినియోగించే ముడిసరుకును ఎరువుల ఉత్పత్తి కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. దిగుమతి సరుకుపై డాలర్‌ ప్రభావం పడుతుండటంతో కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఇఫ్‌కో ఉన్నతాధికారులు వెల్లడించారు. కాంప్లెక్స్‌ ఎరువుల ధర పెరగడం వల్ల ప్రతి రైతు ఒక హెక్టార్‌కు రూ.వెయ్యిని ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. నిజామాబాద్‌ జిల్లాలో 2.35 లక్షల హెక్టార్‌లలో, కామారెడ్డి జిల్లాలో 1.72 లక్షల హెక్టార్‌లలో పంటలను రైతులు సాగు చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ రైతులు కొంత మేర వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. వరి కంటే వాణిజ్య పంటలలోనే కాంప్లెక్స్‌ ఎరువులను రైతులు ఎక్కువగా వినియోగిస్తారు.

డీఏపీ రకం కాంప్లెక్స్‌ ఎరువు ధర గతంలో రూ.1,295 ఉండగా ఇప్పుడు రూ.1,345కు చేరింది. 20:20 రకం ఎరువు ధర రూ.960 నుంచి రూ.1,025కు చేరింది. 12:32:16 రకం ఎరువు రూ.1175 నుంచి రూ.1275 కు చేరింది. రైతులు ఎక్కువగా డీఏపీతో పాటు 20:20 రకాన్ని వినియోగిస్తున్నారు. డాలర్‌ ధరలో మార్పు లేక పోతే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలో తగ్గుదల కనిపించకపోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. డాలర్‌ ధరలు పెరిగినా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు మాత్రం పెరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

డాలర్‌ ధరలు పెరగడం వల్లనే..
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ ధర పెరగడం వల్లనే కాంప్లెక్స్‌ ఎరువుల ధరల్లో పెరుగుదల ఏర్పడింది. ముడిసరుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అందువల్లనే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌ ఒకటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి.
– మారుతి ప్రసాద్, ఇఫ్‌కో రాష్ట్ర మేనేజర్‌

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను నియంత్రించాలి
ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను నియంత్రించాలి. లేకుంటే రైతులు ఇంకా భారం మోయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను అదుపులో ఉంచాలి. ధరలు పెరగడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.     
– ఒల్లాడపు గంగారాం, రైతు, తిమ్మాపూర్‌

పెట్టుబడులు అధికం అవుతున్నాయి
కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరగడం వల్ల మాకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. రైతులు ఇప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఎరువుల ధరలు పెరగడం వల్ల మరింత ఇబ్బంది పడుతారు.     
– కొప్పుల భాజన్న, రైతు, మోర్తాడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement